Latest Posts

Content

Monday, August 3, 2020

అన్నదమ్ముల అనుబంధం

అప్పుడే రెండున్నర! బయట చాలా ఎండగా ఉందన్న విషయం మొబైల్లో చూసి తెలుసుకోవలసిందే! 

డ్రెస్ మార్చుకుని, సూట్ కేస్ తీసుకుని మా గదిలోంచి బయటపడ్డాను. డ్యూటీ అనెస్తటిస్టు అప్పుడే వచ్చినట్టున్నాడు. అటూఇటూ తెగ తిరిగేస్తున్నాడు.

ఫేస్‌వాష్ చేసుకున్న మొహం తేటగా నిగనిగలాడుతోంది. ఇప్పుడు హుషారుగానే ఉంటాడు. సాయంత్రం ఆరూ ఏడయ్యేటప్పటికి సగం పిండేసిన చెరుకురసం మావిడిపండులా అయిపోతాడు కుర్రాడు. 

తిరపతి కొండమీద పవళింపు సేవకీ, సుప్రభాతానికీ మధ్య ఓ మూడుగంటలైనా స్వామివారికి విశ్రాంతిని ప్రసాదిస్తారు భక్తులు. మాకైతే అదీలేదు. ఆఖరి కేసంటూ ఉండదు మా ఓటీలో! డ్యూటీ నుంచి వెళ్లేముందు అప్పగింతల కోసం రూములోకి పిలిచి, అతనికోసం మధ్యాహ్నానికి అట్టేపెట్టిన కేసుల జాతకచక్రాలన్నీ చదివి వినిపించడం మొదలెట్టాను.

ఎవరికి బీపీ ఎక్కువగా ఉంది, ఎవరికి రక్తం తక్కువగా ఉంది, ఎవరికి నిజంగా ఇబ్బందుంది, ఎవరి వెనకాల హాస్పిటల్ సిబ్బందుంది.. ఇలా టీవీ నైన్ సమాచార స్రవంతిలా గబగబా చదివి వినిపించేసి కారెక్కేశాను. బ్లాస్ట్ ఫర్నేస్ పక్కన కుర్చీ వేసుక్కూచున్నట్టుంది కార్లో! 

మెయిన్ గేటు చేరే లోపల రోడ్డుకటూ ఇటూ చెట్లకింద కూర్చున్న అమ్మమ్మలు, వాళ్ల మనవలూ చాలామంది కనబడ్డారు. ఎంతమంది పుడతార్రా బాబూ! 

ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. వేగంగా కారు నడపడం ఇష్టముండదు నాకు. నిదానంగా, పాటలు వింటూ వెళ్లాలనిపిస్తుంది. రేడియోలో కూడా పురుళ్ల పాటలే. ఘంటసాల గొంతులో మార్దవంగా వినబడుతోంది... ‘అమ్మా అనిపించుకొనుటె స్త్రీమూర్తికి గౌరవం!’

ఇంటికి రాగానే సదాచార సంపన్నుడైన శంకరశాస్త్రివలె దుస్తులు మార్చుకొని, నీళ్లగదికిఁబోయి, తలస్నానమొనరించి, శుభ్రమైన వస్త్రములు ధరించి భోజనమునకై బల్లయొద్దకుఁజేరితిని.

కరోనా కాలంలో అందరూ సదాచార సంపన్నులే! జబ్బుని సబ్బుతో ఎదుర్కుంటున్నాం. ఆలోచనల్లోనే మూడు రొట్టెలూ తినేశాను. పిల్లలిద్దరూ టీవీలో ఏదో సినిమా చూస్తున్నారు. కాసేపు నేనుకూడా వెళ్లి కూర్చున్నాను. 

‘చక్క చివంతవనం’ట సినిమా పేరు. మణిరత్నం గారి కళాఖండం. ‘బావుంటుంది చూడం’టూ చివరంటా చూపించాడు మా చిన్నాడు. ఆఖర్లో వాణ్ణెక్కడ కొడతానో అని భయమేసి, నన్ను నేను సంబాళించుకుని గదిలోకి వెళిపోయాను.

ఆధిపత్యం కోసం తండ్రినే చంపాలనుకునే కొడుకులు,
 
తనకి అడ్డొస్తాడేమోనని డ్రగ్స్ కేసులో సోదరుణ్ణి ఇరికించేవాళ్లు,
 
సొంత వాళ్లనందరినీ చంపేసే మనుషులు... 

వీళ్లంతా ‘మణి’ద్వీపే ‘రత్న’ఖండేలో ఉంటారేమోగానీ జంబూద్వీపే భరతఖండేలో మాత్రం ఉండరు!

ఒక్కటంటే ఒక్క పాత్ర కూడా సరిగ్గా లేదు. ఈలోకం అంత ఘోరంగా ఉందా అన్న ఆలోచన మనకు రాకమానదు. అన్నదమ్ములై ఉండీ అంతంత స్వార్ధంగా ఉంటారా? అటువంటి కుటుంబాలు ఉన్నాయా? ఒకవేళ ఉన్నాయనే అనుకుందాం. ఈ సినిమా ద్వారా ఏంచెప్పదలిచాడుట? అచ్చం నా మొహంలా ఉందా సినిమా. అనవసరంగా తలనొప్పి. అన్నదమ్ములు కలిసి చూడాల్సిన సినిమా అసలు కాదు. 

ఏదన్నా చదివినా, చూసినా మనలో కాస్తంత ఆహ్లాదం కలగకపోయినా ఫరవాలేదు. అలజడి మాత్రం రేగకూడదు. ఈ సన్నాసులిద్దరికీ అటువంటి బుద్ధులు పుట్టకూడదని అనుకుంటూ కళ్లుమూసుకుని పడుకున్నానో లేదో నిద్రపట్టేసింది.

మనకంతటి అదృష్టం పట్టడం ప్రకృతి విరుద్ధం. అంచేత అరగంటలోనే స్పీకర్ చించుకుని ఫోను మోగింది. ఒక నర్సింగ్ హోమ్‌లో ఎమర్జెన్సీ సర్జరీ ఉంది రమ్మనమని. నామీద నేనే మరొకసారి జాలిపడి బయల్దేరాను.

ఆపరేషన్ మొదలెట్టే ముందు టేబుల్ మీద పడుకున్న పేషెంటుతో పదినిముషాల పాటు సంభాషించడం నాకలవాటు. అందులో మా మత్తుకి సంబంధించిన యవ్వారాలే కాకుండా సామాజికాంశాలు, ఆర్ధిక స్థితిగతులు, తెలివితేటల ఉజ్జాయింపు, భయపడొద్దంటూ బుజ్జగింపు ఇత్యాదులన్నీ చుట్టేస్తాను.  

ఎన్నో కాన్పని అడిగాను. తన సమాధానం విన్న నాకు ఆశ్చర్యం కలిగింది.

నాలుగోదిట! ఈరోజుల్లో నాలుగోదేఁవిటే తల్లీ?

‘ముందెవరు? ఆడపిల్లలా?’ అనడిగాను. సహజంగా అదే జరుగుతుంది ఎప్పుడూ. ఇద్దరాడపిల్లలు పుట్టినవాళ్లు మూడోదాని కోసం చూస్తారు. ఈసారి మొగపిల్లాడు పుడితే సరేసరి. లేకపోతే అప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసెయ్యమంటారు. 

కానీ ఆ అమ్మాయి చెప్పిన విషయాలు వినేకొద్దీ నాకు నోటమాట కరువైంది.

తనకి మొట్టమొదట ఒక మొగపిల్లాడు మామూలుగా పుట్టి పోయాట్ట. ఆనక రెండు సార్లు ఆపరేషన్లు చేసి ఇద్దరాడపిల్లల్ని తీశార్ట. ఆ ఇద్దరూ చక్కగా ఉన్నారు. ఇక చాలని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేసుకున్నారుట.

అప్పుడు వాళ్ల కుటుంబంలో ఒక పెద్ద సమస్య వచ్చిపడింది. 

ఈ పిల్ల తోడికోడలికి మూర్ఛ వ్యాధి ఉందిట. పైగా పిల్లలు కలిగే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారుట. దాంతో ఈ అమ్మాయి భర్త తన అన్నగారికి ఎటువంటి పుత్రకామేష్టి యాగమూ చెయ్యనవసరం లేకుండా బిడ్డలు లభించే మార్గమొకటి కనిపెట్టాడు. 

తన భార్యను ఒప్పించి, విశాఖపట్నం తీసుకువెళ్లి, కత్తిరించేసిన ట్యూబుల్ని మళ్లీ అతికించే ఆపరేషన్ చేయించి తీసుకొచ్చాడు. దాన్ని ‘ట్యూబల్ రీకేనలైజేషన్’ అనంటారు.

‘ఎలాగైనా అన్నావదినలకి మనం ఒక బిడ్డను కని, పెంపకానికి ఇవ్వాలి! మనం తప్ప వాళ్లకింకెవరున్నారు?’ ఇదీ స్లోగన్. పాపం ఆ పిల్ల కూడా ఆడ మనసుతో సరేనంది. ఆ రీకేనలైజేషన్ ఆపరేషన్ సఫలమైన కారణంగా రెండునెలల్లోనే ఆ అమ్మాయి మళ్లీ గర్భవతయింది.

ఇదే ఆ కానుపు. 

‘అంటే ఇప్పుడు పుట్టబోయే బిడ్డను శాశ్వతంగా నీ తోడికోడలి చేతిలో పెట్టబోతున్నావన్నమాట! అవునా?’ అని అడిగిన నావైపు గర్వంగా చూసి ఔనంటూ తలాడించింది. తీరా మత్తదీ ఇచ్చిన తరవాత నాకొక ధర్మసందేహం కలిగింది. 

ఒకవేళ ఇప్పుడు కనుక ఓ మగపిల్లాడు పుడితే వీళ్ల పరిస్థితేమిటని! చూస్తూ చూస్తూ వాణ్ణీ ఇవ్వలేరు, రెండేళ్లుగా పెంచుకుంటున్న ఆ బుజ్జిదాన్నీ ఇవ్వలేరు. ఇందాక బయట ఆడుకుంటోంటే చూశాను. బుగ్గలబూరిది ఒకర్తి రెండు పిలకలేసుకుని అటూఇటూ పరుగులు పెట్టేస్తోంది . దాన్ని చూస్తే నాకే ముద్దొచ్చేస్తోంది. ఇక వీళ్లెలా వదులుతారుట? 

ఆ పిల్లని ఈ ప్రశ్న అడిగి, అనవసరంగా తనకి లేని ఆలోచన కలిగించడమెందుకని నోరు మూసుక్కూర్చున్నాను. 

కానీ నేననుకున్నంతా అయింది. గుండ్రంగా గునగునలాడుతూ మూడున్నర కేజీల మొగపిల్లాడు బయటపడ్డాడు. వాడు అరుపులు, కేకలతో గోలెట్టేస్తూ థియేటరంతా ఠారెత్తించేస్తున్నాడు. ఆ పిల్ల అడగనే అడిగింది ఎవరని!

‘బాబు పుట్టాడు. ఇప్పుడెవర్ని ఇస్తారు మీ బావగారూ వాళ్లకి?’ అంటూ కుతూహలం ఆపుకోలేక అడిగింది డాక్టరమ్మ.

‘మా ఆయనిష్టం మేడమ్. అన్నదమ్ములిద్దరూ ఆలోచించుకుంటార్లెండి!’ అనేస్తూ నవ్వేసింది.

నాకెందుకో హఠాత్తుగా మధ్యాహ్నం చూసిన సినిమా గుర్తొచ్చింది. 

........జగదీశ్ కొచ్చెర్లకోట

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive