ఏదీ మరియొకసారీ...
డామిట్! ఈ వర్షం వొకటి, మనం ఏదన్నా ముఖ్యమైన పనిమీద బయటపడేటప్పుడే మొదలవుతుంది. ఇందాక బొంకులదిబ్బ మీదుగా వస్తోంటే ఆకాశం నిండా మావూరి గౌడవీధి గేదెల్లా నల్లటి మబ్బులు కమ్మేశాయి. ఎలాగూ పొయ్యేది ఇంటికేగదా, తనకిష్టంకదా కాసిన్ని పట్టుకెడదాం అని మిరపకాయ్ బజ్జీల బండి దగ్గర ఆగేనో లేదో ఇట్ వజ్ రెయినింగ్ కేట్స్ అండ్ డాగ్స్.
చెప్పొద్దూ, వొళ్లు మండుకొచ్చింది. ‘త్వరగా ప్యాక్ చెయ్యవాయ్, మాయావిడ ఈపాటికే లొట్టలెయ్యడానికి నాలిక మడతేసుకుని కూర్చునుంటుందీ!’ అంటూ బజ్జీల సుబ్బయ్యని గాభరా పెట్టేశాను.
అసలీ సుబ్బయ్య దగ్గర బజ్జీలు వొక వ్యసనం. ఎవడైనా పొరుగూర్నుంచి పనిగట్టుకుని విజినారం వెళిపొచ్చేడంటే సుబ్బయ్య కొట్లో బజ్జీలకోసఁవేనని నా నమ్మకం. కాదని ఏ కుంకైనా కూసేడో, వాడికి రుచీగిచీ తెలీదన్నమాటే!
వాడమ్మ సిగదరగా, ఏం కూరతాడువాయ్ అందులో? మనం ఇంట్లో చేసుకుందాఁవనీసి ఒహమారు ప్రయత్నం కూడా చేసేం. కానీ అవి బజ్జీల్లా కాకుండా కోడిరామ్మూర్తికి సమవుజ్జీల్లా ఏడిచ్చచ్చేయ్. వాటిని కుదురుగా మింగాలేక, తనకెదురుగా కక్కాలేక గుక్కపట్టి ఏడ్చినంత పనైందనుకో!
అంచాత, ఎవడిపని వాడే చెయ్యాలివై! సుబ్బయ్యనొచ్చి మా ఆస్పత్రిలో మత్తిమ్మంటే ఇవ్వగలడూ? లేక మాయావిళ్లా కరెంటాఫీసులో లెక్కాడొక్కా చూడగల్డా చెప్పూ?
ఎలాగయితేనేం ఒక డజను బజ్జీలు ఉప్ఫూ ఉప్ఫూమని ఊదుకుంటూ ఇంటికి పట్టుకొచ్చేను.
ఇలాంటి పన్లు చేసినప్పుడు మనం కాస్తంత బెట్టూగట్రా చెయ్యాలోయ్. శీకృష్ణుడేఁవన్నాడు? చేసేపనికి చమత్కారం జోడించమన్నాడు.
అంచాత మనం తెచ్చింది వెనకాల దాచుంచి గుమ్మంలో నిలబడి, ఓ దొరనవ్వో, దోరనవ్వో నవ్వేను. అది చూడగానే తనకి అర్ధమైపోయింది.
‘వీడేదో పెద్దసైజు టోపీ పట్టుకొచ్చేడూ, నా నెత్తినపెట్టి మంచు ప్రసన్నలాంటి నన్ను ప్రసన్నం చేసీసుకోడానికి ఏదో ఎత్తువేసేడూ!’ అనీసుకుని తనూ ఓ నవ్వు నవ్వీసింది.
‘ఏంటండీ? ఏదో దాస్తున్నారూ? బజ్జీలా ఏఁవిటి?’ అనీసింది.
తను చాలా అల్పసంతోషివాయ్. ఎంతసేపూ నోట్లో వేసుకునేవాటినే ఆశిస్తుందితప్ప మెళ్లో వేసుకునేవాటికోసం అడగేఅడగదు.
ఇక దాపరికం ఏముందీ? కోట జంక్షన్లో నిలబడి బట్టలు కట్టుకుంటున్నట్టు అంతా తెలిసిపోయినాక?
‘అలా వొస్తోంటే వర్షం మొదలయింది. నువ్విలాంటి సమయంలో ఏం కోరుకుంటావో తెలుసును కదా? అందుకని నీకోసం...’ అంటూ పేకెట్టు చేతికిచ్చేను.
‘మనసెరిగినవాడూ మా దేవుడూ...’ అని పాడుతుందనీసి అనీసుకున్నానుగానీ.. ఎబ్బే! పాడలేదుగానీ ఓ చూపు విసిరింది.
దాన్ని డీకోడ్ చేసుకుందావనీసి ఇందాకట్నుంచీ కుస్తీలు పట్టీపట్టీ చివరికి చేస్సేను.
‘నీకు ఓ నలభై మార్కులు వేస్తున్నాను. ఇలా నా మనసెరిగి చేస్తూపోతూ వుంటే ఎప్పటికో వందచేరుకుంటావు!’ అని మీనింగొచ్చింది.
అంచాత ఇంతకీ నే చెప్పొచ్చేదేఁవిటంటే, నువ్విప్పట్నుంచీ ఇలాంటి కిటుకులూ గట్రా నాదగ్గర ట్యూషను పెట్టించుకుని నేర్చుకో! యలాగూ నీకొక నాలుగైదేళ్లలో పెళ్లి వయసొచ్చేస్తుంది. ఈ మోడ్రన్ మహాలక్ష్ములతో నువ్వు పళ్లేవు. వాళ్లిలా పాతకాలం కోరికలు కోరతారనీసుకోకు.
వాళ్ల టేస్టులూ, డిస్టేస్టులూ తెలుసుకోవడం నీ బాధ్యత. ఎప్పుడేనా సాయంత్రం పూట మొహం వేలాడేసిందంటే దానర్ధం వంటా గింటా ఏంలేదూ, హొటలికి పోదాఁవనీ! అది నువ్వు డోంట్ కేరంటూ ఇగ్నోర్ చేసేవో తరవాత క్యారుమంటూ ఏడుస్తావు.
తనకీ రెస్టూగిస్టూ కావాలిగా? మంత్లీ వొన్స్ వంటిల్లు వదిలి నొవోటెల్లుకి రమ్మని లాక్కెడుతూ వుండు.
స్మాల్ యాస్పిరేషన్సే నీ లైఫులో ఇన్స్పిరేషన్స్! ప్లీజ్ అండర్లైన్ దిస్ మైడియర్ కిడ్!
వాళ్లది చాలా చిన్న ప్రపంచం. కాస్తంత హేపీనెస్సూ, బోల్డంత బోల్డ్ నెస్సూ ఎక్స్‌పెక్ట్ చేస్తారువాయ్ నీదగ్గర్నుంచి వాళ్లెప్పుడూ!
ఆల్వేజ్ కీప్ దెమ్ హేపీ!
దసరాలకీ, దీపావళికీ ఇంట్లో వుండకుండా పేకాటకనీ, డ్రింకుపార్టీలనీ ఎస్కేపైపోయావనుకో, నీ పని భోగిమంటే! తప్పుకదూ?
కలిసిచేసుకునేదే పండగ. అసలు కలిసుండడఁవే పెద్దపండగ.
ఇలాంటి సుఖసంసారానికి సుళువైన సూత్రాలు చాలా వున్నాయి నా దగ్గిర. సమరంగారివి వేరు. అవన్నీ అర్ధరాత్రి చెబుతూవుంటారు. ఇప్పుడు నేను కూడా పదింటికే చెబుతున్నాననీసి అలాంటివేనేమో అని చదవడం మానీకు.
గుడ్ నైట్ మైడియర్ చైల్డ్! మరోమారు సమ్ మోర్ సెషన్స్!

0 comments:
Post a Comment