రోజూ ఇలాగే రాత్రి పదిన్నరా పదకొండయిపోతోంది. ఆఖరి కేసు కుట్లేస్తోండగా నోట్సులన్నీ రాసేసి గదిలోకెళ్లి బట్టలు మార్చుకున్నాను. కిటికీలోంచి బయటికి చూశాను. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. చర్చివాళ్లు కొత్త బోర్డు చేయించినట్టున్నారు. ధగధగలాడిపోతోంది వీధంతా! క్రిస్మస్ వస్తోందిగా?
కారు దగ్గరకి రాగానే టైర్ కింద పడుకున్న కుక్క బయటికొచ్చి నన్ను గుర్తుపట్టింది. నాకూ దానిలాగే ఆకలేస్తోంది. చేసేదేంలేదు. అది తోకూపుతోంటే నేను బుర్రూపుతూ కారెక్కేశాను.
సీట్లో కూర్చుని ఇంజన్ స్టార్ట్ చెయ్యగానే బ్లూటూత్ నా ఫోన్‌ని గుర్తుపట్టింది...అచ్చం కుక్కలానే!
బయల్దేరినట్టు తనకి ఫోన్ చెయ్యడం అనవసరం. మూడో కల కంటూ ఉంటుందీపాటికి. అలా నిద్రలో లేపితే పాపం కూడానూ! ఆమాట నాన్నగారనేవారు. కానీ నన్ను మాత్రం ఉదయాన్నే ‘మహేశా పాపవినాశా, లేవరా, మమ్ముగావరా!’ అంటూ నానా అల్లరీ చేసి లేపేసేవారు.
చలికాలంలో రాత్రిపూట ప్రయాణం ఎంత చిన్నదైనా గిలిగింతలుగానే ఉంటుంది. దానికి తగ్గట్టే పాట కూడా బావుంది.
‘ప్రేమజీవన నాదం... పంచమం ఈ వేదం...’
వైశాలిలోది ఈపాట. ఋష్యశృంగుడి కథ. మలయాళ దర్శకుడు భరతన్ దృశ్యకావ్యం. రాజ్యంలో అనావృష్టి కోణంనుంచి కాకుండా వేశ్యల కోణంనుంచి తీశాడు సినిమాని. ఎప్పుడో మెడిసిన్ సెకండియర్లో చూసిన గుర్తు. అయితే మా కుర్రాళ్లం కూడా వేశ్యల కోసమే చూశాం సినిమాని. ఇప్పుడు చూస్తే అందులో అతగాడి మానవతా దృక్కోణం గోచరిస్తుంది. సర్వీసైపోయిందిగా? 😂😂
దాని తరవాత పెళ్లిపుస్తకంలో ‘ప..ప..పప్పు దప్పళం..’ పాట మొదలై అణచుకుంటున్న ఆకలిమీద ఆజ్యం పోసింది. ఇంతరాత్రివేళ తిండేం తింటాం? మిడ్‌నైట్ బిర్యానీలవీ మావూరికింకా రాలేదు. వైజాగ్‌లో మాత్రం చూసినట్టు జ్ఞాపకం.
ఇలా రాత్రుళ్లు లభించే తిళ్లతో నేనే ఓ స్టార్టప్ పెట్టేస్తే ఎలావుంటుంది? చాలారోజులుగా అనుకుంటున్నాను ఏదైనా యాపారం చేద్దామని. రెండు పేర్లు కూడా ఇప్పటికిప్పుడే తట్టేశాయి కూడా!
మొదటిది: ‘అర్ధరాత్రి అన్నాలు’
రెండోది: ‘దెయ్యం తిండి’
ఎలావున్నాయి పేర్లు?
ఇంటిముందు హారన్ ఎంత మోగించినా వాచ్‌మన్ లేచి గేటు తియ్యలేదు. ఎదురుగా కనబడుతూనే ఉన్నాడు మంచమ్మీద! దుప్పటి ముసుగులో చిన్నపాటి కదలికైనా లేదు.
వీడు తాగడే? మరి లేవడేంటబ్బా? ‘ఋష్యశృంగా!’ అని వైశాలి సినిమాలో విభాండకుడు అడవిలో అరిచినట్టు గట్టిగా అరిచాను. అయినా లేవలేదు.
‘సర్లే, రేపుదయం కోటింగిద్దాం కుర్రాడికి’ అనుకుని గేటు తీసుకుని లోపలికొచ్చాను.
మినీ స్నానమాచరించి ఏదో ఒకటి కతుకుదామని ఫ్రిజ్ తెరిచి చూశాను. ఏదో పెద్ద గిన్నె ఒకటి శాసనసభాపతిలా సగం జాగా ఆక్రమించేసుకుని కూర్చుంది. దానిచుట్టూ నూటయాభైదాకా చిన్నగిన్నెలు ఎంఎల్ఏల్లా కనబడుతున్నాయి. ఫ్రిజ్ మొత్తం ఒరిస్సావైపు వెళ్లే జనరల్ కంపార్ట్‌మెంటులా కిక్కిరిసి ఉంది. అచ్చం అలానే డోర్ దగ్గర కూడా చాలా వేలాడుతున్నాయి!
ఆ మూల వాయవ్య దిక్కునున్న వెడల్పు మూత గిన్నెలో దానిమ్మ గింజలుండాలని గుర్తు.
మొన్న సాయంత్రం తను సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ‘వలచీనానమ్మా... హమ్మా హమ్మా!’ అని పాటపాడుతూ మూడుపళ్లు వలిచినట్టు జ్ఞాపకం.
‘ఓరాత్రివేళ వస్తే తినండి. ప్రతిసారీ ఇలా ఒలవడం, పారబొయ్యడం అవుతోంది!' అంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది.
కానీ ఆ గిన్నెకి మోడీ చుట్టూ ఉన్నట్టుగా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చాలా ఉంది. దాన్ని బయటికి లాగాలంటే ముందు అల్లప్పచ్చడి, టమాటా పచ్చడి, పీనట్ బట్టర్ సీసా, తరిగిపెట్టుకున్న కేరట్ ముక్కల గిన్నే... వీటన్నిటినీ ఎదిరించి లోపలికెళ్లాలి.
ఇంకేం ఉన్నాయి? ఇటు ఆగ్నేయాన ఓ గిన్నెమీద మూత తీసి చూశాను. కొరివికారం!!! దానిపక్కనే డైజీన్ సీసా కూడా ఉంది. ఆ జంటని చూడగానే నవ్వొచ్చింది ఒక్కసారి.
ఆ వీధిచివర షాపింగ్ కాంప్లెక్స్‌లో కూడా అంతే!
కింద గోపీ స్వీట్స్, సరిగ్గా దాని మేడమీద సుగర్ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యం క్లినిక్ ఉంటాయి.
ఆ బస్టాండు దగ్గరో? ‘గాస్ట్రిక్, కడుపులో మంట, పులితేనుపులకు ప్రత్యేక వైద్యము’ అంటూ కడుపులో కిచ్‌కిచ్ డాక్టర్ సురేష్ కుమార్ హాస్పిటలూ, దాని ఎదురుగానే శ్రీ పోలమాంబ మిర్చిబజ్జీ షాపూ! దానిముందున్న ఎలక్ట్రిక్ స్తంభానికి ‘పాణీపూరి లబించును’ అన్న బోర్డు కూడా తిరగేసి వేలాడుతూ ఉంటుంది.
కాంట్రాస్ట్స్ ఇన్ లైఫ్!
మొత్తానికి చిన్నగిన్నెలన్నిటినీ చిన్నాభిన్నం చేసేసి దానిమ్మగింజల్ని దక్కించుకున్నాను. టీవీలో తీన్‌మార్ వార్తలు, జోర్‌దార్ వార్తలు, హల్‌చల్ న్యూసులూ వస్తున్నాయి. ‘ఆ మూడు పిచ్చిపదాలకీ అర్ధమేమిటో చెప్పగలరా?’ అంటూ రేపు ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాలని అనుకుంటూ టాటాస్కైనుంచి ప్రైమలోకానికి షిఫ్టయ్యాను.
అదేదో డ్రాక్యులా సినిమా చూస్తూ దానిమ్మ గింజలన్నీ తినేశాను. గిన్నెపడేసి చెయ్యి కడుక్కోడానికి వాష్‌బేసిన్ దగ్గరకెళ్లి చూస్తే అద్దంలో డ్రాక్యులా కనబడింది. తీరాజేసి తేరుకుని చూస్తే అది నేనే! దానిమ్మ గింజలవల్ల నోరు ఎర్రబారి అలా కనబడుతోంది.
వంటింటివైపు బాల్కనీ అవతల ఏదో అలికిడైతే తలుపు తీసి చూశాను. నేను దేన్నైతే ఎదిరించాలని చూస్తున్నానో అదే కనబడింది. దేవుడా!
గుడి ప్రాంగణంలో పెద్దపెద్ద గుండిగలు, పాత్రలతో ఓ పదిమంది వంటలు చేస్తూ కనబడ్డారు. ఓహో, రేపు ద్వాదశికదూ! ఊరంతా అన్నసంతర్పణ చేస్తారు వీళ్లు.
ప్రతియేటా జరిగే ఈ కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఎనిమిదింటికి మొదలెట్టి తెల్లార్లూ వండుతారు. మా డాబామీంచి ఎంచక్కా కనబడుతూ ఉంటాయి అవన్నీ!
నేను కూడా ప్రతియేడూ ఖచ్చితంగా చూస్తాను ఆ తతంగాన్ని!
వంటమాస్టర్ పెద్ద గరిటెతో అన్నాన్ని కలుపుతూ, చేతిలో రెండు మెతుకులు వేసుకుని పలుకు చూస్తున్నాడు. మధ్యమధ్యలో పొగకి కళ్లుమూసుకుంటున్నాడు. కట్టెలపొయ్యే వాడతారు అన్నిటికీ!
ఆ చివర పెద్ద గిన్నెలో సలసలలాడుతున్న పులుసులోకి అప్పుడే తరిగి తెచ్చిన కూరగాయ ముక్కల్ని ఒడుపుగా ఒక్కముక్కా కిందపడకుండా, ఒక్క చుక్కా మీదపడకుండా ఒంపేసింది ఒకమ్మాయి. అదే నేనైతే ఈపాటికి తకిటతధిమి తకిటతధిమి తందానా డాన్స్ చేసి, ఒళ్లంతా బొబ్బలెక్కించుకునేవాణ్ణి! ఎవడి విద్య వాడికుంటుంది!
కమ్మటి పులుసు వాసన పైదాకా పాకి, మూడో అంతస్తులో ఉన్న నా దగ్గరకొచ్చి, రాజ్‌కపూర్ సినిమాలో ఏదో పనిమీద సిమ్లా వెళ్లిన హీరోని తగులుకున్న లంబాడీ పిల్లలా నన్ను పట్టేసింది. ఇహక్కణ్ణించి కదలాలనిపించలేదు.
క్యాబేజీ కొబ్బరి కూర చేస్తున్నారు. అది ఉడికేలోగా వాళ్లందరూ అలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. నే గమనించిందేమిటంటే వాళ్లెవరూ సిగరెట్లు, బీడీలవీ కాల్చట్లేదు. చాలా నిష్ఠగా ఉన్నారు.
ఈలోగా ఒకతను పేద్ద తువ్వాలుతో ఉడుకులెత్తుతోన్న అన్నం గిన్నెని ఓపక్కకి వాల్చి, గంజి మొత్తం వార్చేసి, అన్నాన్ని బుట్టలోకెత్తేశాడు. పొగలుకక్కుతున్న అన్నాన్ని చూడగానే మళ్లీ ఆకలి అలారం మోగించినట్టయింది. అలాంటి వేడివేడన్నంలో దబ్బకాయేసుకు తింటే ఉంటుందీ నాసామిరంగా!
ఇంకా ఇక్కడే ఉంటే క్రిష్ - త్రీ లా కిందకి దూకేసి ఆ పులుసుగిన్నె ముందు వాలినా వాలతానేమో? ఎందుకొచ్చిన రిస్కని లోపలికొచ్చి పడుకుని ఫేస్‌బుక్ తెరిచాను.
‘ఇవాళ మా తోడికోడలి పుట్టినరోజని చేసాను. బాగున్నాయా ఫ్రెండ్స్?’ అని ఆవిడెవరో మినపసున్నుండల ఫొటో పెట్టారు. ఆరిపోతున్న మంట మీద ఆవునెయ్యి పొయ్యడమంటే ఇదే!
అయినా తోడికోడలితో సఖ్యంగా ఉండడమేంటో, మరీ విడ్డూరంగా?😝
వెంటనే అది మూసేసి ఈసారి యూట్యూబ్‌లో నా అదృష్టాన్ని వెతుక్కుంటూ బయల్దేరాను.
‘అరిసెలెలా వండుతారో తెలిస్తే మీ గుండాగి ఛస్తారు...
సాయంకాలం స్నాక్స్ కోసం ఇవి చేస్తే మీపిల్లలు పిచ్చెక్కిపోవడం కాయం.. (ఖాయం కాదు)...
చిట్టి కాజాలెలా చెయ్యాలీ... ?’ అంటూ రకరకాల థంబ్ నెయిల్స్ కనబడ్డాయి.
ఎందుకిలా జరుగుతోంది? ఈ యూట్యూబ్ ఫామిలీ షేరింగ్ అకౌంట్ అవ్వడంతో తన అల్గోరిథం అలా పయనిస్తోందన్న సంగతి అర్ధమైంది. అవన్నీ ఆవిడగారు చూస్తూ నన్నిలా ‘విస్మయా’నికి గురిచేస్తూ ఉంటుంది.
ఈ ‘ఆకలి’రాజ్యం సినిమా అవ్వదా?
విస్మయ్‌గాడి గొంతు వినగానే తను నిద్రలోనే కళ్లుతెరిచి నావైపు చూసి చిన్మయంగా నవ్వి, మళ్లీ పడుకుండిపోయింది.
నేనొక స్లీపర్ ‘సెల్’ అన్న విషయం తనకి తెలుసు!
ఇప్పుడు లేచెళ్లి ఆ కాంటినెంటల్ కాఫీ కలుపుకు తాగితే కానీ మెంటల్ తగ్గేలా లేదు.
ఆవిధంగా చేతిలో కాఫీ మగ్గుతో మళ్లీ బాల్కనీ దగ్గర చేరాడు జగ్గు!
.......జగదీశ్ కొచ్చెర్లకోట

0 comments:
Post a Comment