Latest Posts

Content

Tuesday, September 13, 2022

బుల్లి సైనికుడు

‘సార్, ఈడికి నిన్నటికాణ్ణించి జొరం తగ్గిందంట! ఆళ్ల నాన్న చెప్మన్నాడు!’ ఓ చంటాణ్ణి ఎత్తుకుని లోపలికొచ్చాడు శీనుగాడు.

‘తగ్గడం సంగతి సరే, అసలు ఎప్పట్నించి జ్వరమో అడిగావా?’ అని అడుగుతున్నానోలేదో

‘మూర్రోలు కాణ్ణించి!’ అంటూ మూడువేళ్లు చూపించాడు ఐదేళ్ల ఆ చిన్నకుర్రాడు.

మా అందరికీ భలే నవ్వొచ్చింది.

పైన నీలంగళ్ల ఎర్రచొక్కా తొడిగారు. అడుగునేం లేదు. విప్పేసి తీసుకొచ్చారు. హైడ్రొసిల్ ఆపరేషన్ చెయ్యాలి వాడికి.

టేబుల్ మీద కూర్చుని పైన లైట్లనీ, బాయిల్ మెషీన్‌నీ పరిశీలనగా చూస్తున్నాడు. సాధారణంగా ఆ వయసు పిల్లలు మా దుంప తెంపేస్తారు. లోపలికి రావడం రావడమే అన్నీ తన్నేస్తూ, ఎత్తుకున్నవాళ్లని చేతులతో రక్కేస్తూ బీభత్సం సృష్టిస్తారు. అలాంటిది వీడేవిఁటో సరిహద్దు సైనికుడిలా చాలా ధైర్యంగా ఉన్నాడు.

‘ఏంపేర్రా చిన్నా?’

‘నాపేరూ మహెత్తు’

‘మహేషా? భలే పేర్రా! మహేష్‌బాబంటే ఇష్టమా?’

‘అఁ..ఆఁ... మహెస్ కాదు. మహెత్తు’ అన్నాడు బుర్ర అడ్డంగా ఊపుతూ

‘అదేలేరా, మహేష్! ఏంచదువుతున్నావ్?’

‘సార్, ఈడిపేరు మహిత్!’ అన్నాడు శీను కేస్‌షీట్ నా చేతికిస్తూ.

‘ఆ..ఆ.. మహెత్తు!’ అన్నాడు వాడు ఈసారి బుర్ర నిలువుగా ఊపుతూ

నాకు చాలా చాలా ముద్దొచ్చేశాడు. ఎంత ధైర్యంగా ఉన్నాడు వీడు!

‘అయితే మహిత్తూ, ఏం చదూతున్నావురా?’ అంటూ వాడి చేతిమీద నరాలవీ పరికించడం మొదలెట్టాను.

‘సూదెడతారా?’ అన్నాడు అకస్మాత్తుగా

ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. వార్నీ భడవా, వీడికెలా తెలుసిదీ?

‘సూదంటే?’ అన్నాను వాడి కళ్లల్లోకి చూస్తూ.

‘జొరమొస్తే ఎట్టారు కాదేటి? ఇల్లిదిగో ఇక్కడ..' అంటూ పాతగాయాన్ని చూపించాడు.

‘బంగారుకొండవిరా నువ్వు. ఏబీసీడీలొచ్చా? ఏ బడి నువ్వు చదివేది?’ నొప్పి తెలియకుండా కాన్యులా పెట్టేశాను.

‘ఉప్మాబడి!’

‘అదేం బడ్రోయ్? ఉప్మా పెడతారా రోజూ?’ అన్నాను నవ్వుతూ.

‘రోజూ ఎట్టరు’ అన్నాడు చేతికి పెట్టిన కాన్యులా చూసుకుంటూ. వాడసలు కిక్కురుమనలేదు అది పెడుతోంటే!

‘వాచీరా! బావుందికదా? ఇప్పుడు టీవీ చూస్తావా?' అంటూ మానిటర్ ఆన్ చేశాను.

‘అది టీవీయేటి?’ అన్నాడు హేళనగా.

ఇహ లాభంలేదు. వీడికన్నీ తెలుసు. మభ్యపెట్టాల్సిన అగత్యం లేదు. 

‘నీకు రామ్‌శెరణ్ ఇష్టమా, పవన్ కళ్యాణా?’ అన్నాను మందులవీ లోడ్ చేసుకుంటూ.

‘ఎన్టియార్’ అన్నాడు వాడు సిరంజివైపు పరిశీలనగా చూస్తూ.

‘ఎందుకూ?’ 

‘పుల్తోటి పైటింగ్ చేసాడు కాదేటి?’

‘అయితే ఆరార్ చూసేవా?' అన్నాను సిరంజి కనబడకుండా వెనక్కి దాస్తూ.

‘ఇండీసనేదీ?’ అన్నాడు తల కాస్త వంచి.

‘శీనూ, ఏవూర్రా వీడిది? ఇలాంటివాణ్ణి సైన్యంలోకి పంపాలి!' అంటూ నవ్వుతున్నాను.

‘ఇండీసనివ్వరా?’ అన్నాడు చేతిని చూపించి.

నేనిక చేసేదేంలేక సిరంజ్ ముందుకుతెచ్చి ‘సూదిలేని ఇండీసన్రోయ్! నొప్పే ఉండదు తెల్సా?’ అంటూ ఓ ట్వంటీ ఎం.జి. ఇచ్చాను.

‘అంకీలొచ్చునా నీకూ? చెప్పు?’ అన్నాను మృదువుగా వాడి తలమీద రాస్తూ.

‘ఒకటీ..రెండూ..మూడూ.. .... పదకొండూ... పన్న్...పన్..’ జారిపోయాడు మత్తులోకి!

మళ్లీ ఎప్పుడు కనబడాలి ఇలాంటి బుజ్జిసైనికుడు?

........కొచ్చెర్లకోట జగదీశ్

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive