Latest Posts

Content

0 comments

ప్రస్తుత ప్రసంగం

‘బయల్దేరుతున్నా బన్నీ!' నిలబడి షూస్ వేసుకోడానికి డాన్స్ చేస్తూ లోపలికి కేకపెట్టాను.

‘బాక్స్ పెట్టుకున్నావా?' వంటింటి వైపు బాల్కనీలోంచి వస్తూ అడిగింది. వంటిల్లన్నానని తనేదో పొద్దున్నే వంటలవీ చేసేస్తోందని ఓ.. జాలి పడిపోకండి. వంటమనిషుంది. ఆవిడకి ఎలా వండాలో కాకుండా ఎలా వండకూడదో చెప్తే చాలు. రుచి దానంతటదే వస్తుంది.

‘ఆఁ, పెట్టుకున్నా! ఏం పెట్టావు బాక్స్‌లో?’ అన్నాను లిఫ్ట్ బటన్ నొక్కుతూ.

‘నిన్న సాయంత్రం వలచీనానమ్మా పాట పాడుతూ మూడు దానిమ్మ పళ్ళు వలిచాను. బాక్స్ నిండా పెట్టాను. ఒంటిగంటవ్వగానే ఒక్క గింజకూడా కింద వంపుకోకుండా తిను!’ అంటూ చెయ్యి చాచింది.

షేక్‌హాండిస్తూ అన్నాను ‘భర్త బయటికెళ్లేముందు ఈ షేక్‌హా‌ండ్ ఇవ్వడాలవీ ఏంటి కొత్తగా? వాట్సప్‌లో చదివావా, లేక సుమన్ టీవీలో సుబ్బలక్ష్మెవరైనా చెప్పిందా?'

‘ఏదో ఒకటిలే, నీకేం నొప్పి ఇవ్వడానికి?' అనగానే తీగ తెగేలా ఉందని ఆపేశాను. సరిగ్గా అదే సమయానికి ఆపద్బాంధవిలా వచ్చిన లిఫ్ట్‌ నన్ను కిందకి తీసుకుపోయింది.

దానిమ్మగింజ ఒక్కటి కూడా కింద వొంపకుండా తినడం దాదాపుగా అసాధ్యం. అలాగే గదంతా పొడుం రాలకుండా, ఒళ్ళంతా పోసుకోకుండా మీలో ఎవరైనా ‘పఫ్’ తినగలరా?

అన్నట్టు ఈమధ్య మా వాచ్‌మన్ మారాడు. ఇంతకుముందతను రోజు విడిచి రోజు కారు తుడిచేవాడు. కొత్తతను డబల్. నాలుగురోజుల వరకూ ముట్టుకోడు. సర్లేనని చేసేదేంలేక లోపల కూర్చుని వైపర్స్ ఆన్ చేశాను.

వైపర్స్ అంటే గుర్తొచ్చింది. హాస్పిటల్‌కి నిన్న వైపర్ కాటేసి ఒకడొచ్చాడు. వాడొక్కడికే ముప్ఫైకి పైగా విరుగుడు ఇంజెక్షన్లు ఇచ్చేశారు. ఏఎస్‌వి అయిపోవచ్చాయని చెప్పాడు ఫార్మసిస్టు. ఇవాళ ఎలాగోలా సంపాయించాలి. 

కారు రింగ్‌రోడ్డు మీదకి రాగానే కాస్త స్పీడు పెంచాను. అల్లంత దూరంలో ఎందుకో బోల్డంతమంది జనం రోడ్డుమీదే బైకులూ, కార్లూ ఆపేసి గుమిగూడి కనబడ్డారు. చిన్నప్పుడు స్కూల్లో పిల్లలందరూ గుమిగూడి మాటాడుకుంటోంటే ప్రతీ టీచరూ అనే మాట ‘ఇది క్లాస్‌రూమా చేపల బజారా?’ 

మెడికల్ కాలేజీకొచ్చాక అదేమాట ఇంగ్లీషులో అనేవారు. ‘ఈజ్ దిస్ ఎ క్లాస్‌రూమ్ ఆర్ ఫిష్ మార్కెట్?’

నవ్వుకుంటూ ముందుకెళ్లి చూస్తే ఆశ్చర్యం... అది నిజంగా చేపల బజారే! ఓ.. తెగ కొనేస్తున్నారు.

ఇంత సత్తెకాలపు సత్తెయ్యని, నా కారు మీదే ఆర్‌టిఓ రికార్డుల్లో నాలుగైదు చలాన్లున్నాయి. ఈలెక్కన ఇక్కడ రోడ్డు మీద అడ్డదిడ్డంగా పార్క్ చేసిన ఎదవలందరికీ చలాన్లు వేస్తే వాటితో ఏకంగా ఒక ఫ్లై-ఓవరే కట్టేయొచ్చేమో? 

పాపం ఆఫీసులకి, స్కూళ్లకీ వెళ్లే జనానికి ఇలానే ఆలస్యాలయ్యేది. కానీ మనం ఈ కారణం చెప్తే నమ్మకపోగా ‘సమ్‌థింగ్ ఫిషీ’ అని సందేహిస్తారు కూడా!

హైవే మొదట్లో పెద్ద జంక్షనుంటుంది. అక్కడికి రాగానే చాలామంది బొబ్బిలి బ్యాచ్ అన్ని కార్లనీ లిఫ్ట్ అడుగుతూ నన్నూ ఆపారు. ఎందుకాపుతున్నారో అర్ధంకాక అద్దం దించాను.

‘బెదరూ, పురిటిపెంట దిగిపోతాను! ఎంతా?’ అనొకరు...

‘బాసూ, పార్తిపురం ఎల్తదా?’ అని ఇంకొకరు...

మరొకతను చాలా డైనమిక్. ఏకంగా డోర్ తీసే ప్రయత్నం చేస్తూ అరుస్తున్నాడు ‘గైపతినారం. డోర్ లాక్ తియ్ తమ్ముడూ!' అని...

వెంటనే ఒకేఒక్కడులో రఘువరన్‌లా నిర్దాక్షిణ్యంగా అద్దం పైకెత్తేసి గేరు మార్చాను. సితమ్ కాలేజి వరకూ రాగానే కాస్త సైడుకి కారాపి మొబైల్లో ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి నా మొహం చూసుకున్నాను. 

నేను డాక్టర్‌లా లేకపోవచ్చు. కానీ మరీ టాక్సీ అని ఎలా అనేసుకున్నారబ్బా? గ్యాంగ్‌లీడర్‌లో చిరంజీవిలా గెడ్డం కూడా పెంచుతున్నానే? ఉన్నంతలో స్టైల్ కూడా ఎలాగో మెయింటెయిన్ చేస్తాను. 

కారు దిగితే కదా మనం పొట్టి పకోడీ అని తెలిసేది?

ఆఁ, అదీ విషయం. బండికి డాక్టర్ స్టిక్కర్ లేదు. కొన్నప్పటినుంచి అనుకుంటున్నాను. కానీ కుదరట్లా! ఈ బట్టలు కూడా తెలుగు సీరియల్స్‌లో మిడిలేజ్డ్ ఫాదర్స్ రాజ్‌కుమార్, జాకీ వేసుకున్నట్టు ఇలా జింగిడి గింగిడిగా కాకుండా కాస్త డీసెంట్‌గా సితార సినిమాలో శరత్‌బాబులా వేసుకోవాలి. 

ఇదేమాట ఆమధ్య తనతో అంటే తనూ బలపరిచింది. 

’అవును, అందులో శరత్‌బాబు కూడా నీలాగే లోపల చిల్లులు పడిన బనీన్లు, బయట కోటూ వేసుకుంటూ ఉంటాడు.! తనంటే ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం డబ్బు లేకపోయినా అలా చేశాడు. నీకేవొఁచ్చింది? ఎంచక్కా మన రోడ్డు చివరున్న జాకీ షోరూముకెళ్లి ఓ అరడజను బనీన్లు కొనుక్కు తెచ్చుకోవచ్చుగా?' అంటూ ఘనమైన ముక్తాయింపునిచ్చింది.

ఖాళీ దొరకట్లేదసలు. ఒకవేళ అటువంటి పనులమీద ఏ కుసుమంచి వాళ్ల షాపులోనో దూరినా గంటకు పైగా షాపింగ్ చేసి ఓ మూడు చొక్కాలు కొనుక్కుని వచ్చేస్తాను. ఆనక ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ముందు అవన్నీ ట్రయల్ వేసుకోవడమనే ఒక పెరేడ్ నిర్వహిస్తూ ‘అయ్యో, బనీన్లు కొనడం మర్చిపోయాను!' అని నాలుక కొరుక్కోవడం సర్వసాధారణమైన అరాచకం. తత్కారణంగా ఓ వారంరోజులపాటు కారాలవీ తినకపోవడం మరొక ప్రహసనం.

హమ్మయ్య, ఇక్కణ్ణించి కాస్త ట్రాఫిక్ తగ్గుతుంది. రేడియోలో తాళ్ సినిమాలో పాటొస్తోంది.

‘..జో తేరా హాల్ హై...ఓ మేరా హాల్ హై
ఇస్ హాల్ సె హాల్ మిలా...!’ 

అంటే?

రంజనీ శివరంజనీ రెండు హాళ్లూ కలిపేసి ఒకటే హాలు చేశారని విన్నాను. ఇదేదో అలాంటిదే అయ్యుంటుంది. ఎవర్నడుగుతాం? మా కొలీగ్సందర్లోకీ కాస్త హిందీ బాగా వచ్చినవాణ్ణి నేనొక్కణ్ణే అంటే అర్ధం చేసుకోండి ఎంత విషమమైన పరిస్థితో!

మాకు ఒరిస్సా పేషెంట్లు వస్తుంటారు అప్పుడప్పుడు. అటువంటి సందర్భాల్లో వాళ్లని ఎదుర్కొమ్మని నన్ను ప్రవేశపెడుతుంటారు. 

నాకు హిందీ పాటల్లో లైన్లవీ కాస్త బానే గుర్తుండటం మూలాన వాళ్లతో అలాగే పొయెటిక్‌గా మాటాడేస్తాను. 

బెల్లంపల్లిలో చేసినప్పుడు ఒకసారిలాగే ఓ పేషెంటుకి బీపీ ఎక్కువగా ఉందని వరసగా ప్రశ్నలు వేస్తూ చివరిగా గుండెల్లో నొప్పి ఎప్పుడైనా వచ్చిందా అని హిందీలో అడగాలని ప్రయత్నించి భంగపడ్డాను.

‘....దిల్ మే దర్ద్ హై?...’ అనగానే పుష్ప సిస్టర్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న అందరూ నవ్వేశారు. ఆనక తనే చెప్పింది సీనే మే దర్ద్ అనాలని. ఆరోజందరికీ నా సీనేవిఁటో బోధపడిపోయింది.

అదే ఇప్పుడైతేనా, చెలరేగిపోతాను. 

రోడ్డుకి ఒకవైపంతా ఏవో ఫ్లెక్సీలు పెట్టారు. నిజశ్రావణం వచ్చేసిందిగా, మాకు కష్టకాలం దాపురించింది. ఇకనించి పెళ్లి ఊరేగింపులతో ఊరంతా నిండిపోతుంది.

కుర్రాడు బెస్తవాడిలా మేకప్ చేసుకుని ఒకచేత్తో చేప పట్టుకుని నోట్లో బీడీ కాలుస్తున్న స్టిల్ ఒకటి, సూటదీ వేసుకుని మోకాళ్లమీద నిలబడి పూలగుత్తి పట్టుకుని ‘విల్ యు మ్యారీ మీ?' అని ఆ పిల్లని దేబిరిస్తున్న, సారీ.. ప్రపోజ్ చేస్తున్న స్టిల్‌లో ఒకటి. సినిమా పిచ్చ ప్రతి ఒక్కరికీ! డొక్కచించితే అక్షరమ్ముక్క రానివాళ్లు సైతం ఊరంత ఫ్లెక్సీలు పెట్టించేస్తున్నారు. ఈమధ్య పెద్దకర్మ ఫ్లెక్సీలు కూడా ఎక్కువైపోయాయి. 

నెలివాడ చెరువు గట్టునున్న కాకా హొటలు ముందు పెసరట్టుప్మా జనాలు బానే ఉన్నారు. నేనెలాగూ ఇంట్లో తినేసే వస్తా కాబట్టి ఆగను. 

మా వంటామె కొత్తల్లో ‘పెసరొట్టెలు’ వేస్తూండేది. ఇలాక్కాదని ‘తను’ దగ్గరుండి ఆవిడచేత అట్లకాడపట్టించి అక్షరాలు దిద్దించినట్టు నేర్పగా నేర్పగా ఇప్పుడు అదరగొట్టేస్తోంది.

వర్షాలకి నెలివాడ చెరువు బాగా నిండుగా ఉంది. వెనకాల నీలంరంగులో కొండలు, పచ్చగా పొలాల మధ్య చెరువు ఉయ్యాలలా ఉంది. రెండు కొంగలు ఒంటికాలిమీద నిలబడి చేపల కోసం తాపత్రయపడుతూ అచ్చం ఉయ్యాల్లో పిల్లల్లా ఆడుకుంటున్నాయి. అంత ముదురాకుపచ్చ నేపథ్యంలో వెన్న రంగులో మెరిసిపోతున్న కొంగలు. ప్రకృతి సహజంగా వేసే పెయింటింగుల్ని ఎన్ని రంగులొలకబోస్తే పునఃసృష్టించగలం?

దగ్గరకొచ్చేశాను. మీకు తెలుసా? గత ఆర్నెల్లుగా మాకు ఎఫ్ఆర్ఎస్ పెట్టేశారు! అంటే ఏవిఁటా, నా మొహం!

అదొచ్చిన కొత్తల్లో ఒకరోజు నేనా యాప్ శీలాన్ని పరీక్షిస్తోంటే సడన్‌గా తనొచ్చింది.

‘అలా మాటిమాటికీ సెల్ఫీలు తీసుకోవడం ఒక మానసికరోగంట! తెలుసా?’

‘ఎవరు చెప్పారు? వాట్సప్‌లో చదివావా?'

‘ఎవరు చెప్తేనేం? నిజమే అయుంటుంది!’

‘ఆ సోదంతా సరేగానీ, ఇంతకీ ఇది సెల్ఫీయో, కుల్ఫీయో కాదు. ఎఫ్ఆర్ఎస్. అంటే అటెండెన్స్ యాప్'

‘ఓహో, అదా? నేనింకా ఎప్పట్లాగే సెల్ఫీలు తీసుకుంటున్నావనుకున్నాను! ఇంతకీ దీని కథేవిఁటి?’ అనడిగింది. నేను శౌనకాది మహామునులందరినీ తనలోనే ఆవాహన చేసుకుని మొదలెట్టాను:

దీనికోసం ఒక యాప్ ఉంటుంది. మన ఐడీ నెంబరదీ కొట్టగానే కెమెరా ఓపెనవుతుంది. దానివైపు కన్నార్పకుండా కాసేపు చూస్తే వెంటనే అటెండెన్సు పడిపోతుంది.

హాస్పిటల్ ఆమాత్రం దూరంలో ఉండగా కూడా ఇది పన్జేస్తుంది. ఒకవేళ మరీ దూరంలో ఉంటేమాత్రం ‘ఛిఛ్ఛీ, నీ మొహం నాకు చూపించకు!’ అని మెసేజొస్తుంది.

దానికిగల కారణాలు చూశావనుకో..

‘జగ్గూ, నువ్వేదో వేరే నియోజకవర్గంలో తిరుగుతున్నట్టున్నావు. అయినా తగుదునమ్మా అని తయారయ్యావు. ఛీ, ఫోరా!' అంటూ ముద్దుగా విసుక్కుంటుంది.
ఒకవేళ నువ్వు నిజాయితీగా ఆ చుట్టుపక్కలే ఉన్నావనుకో, వెంటనే నీ మొబైల్ స్క్రీన్ మీద ఓ విష్ణుచక్రం ప్రత్యక్షమవుతుంది. అచ్చం ద్రౌపదికి చీరలివ్వడం కోసం బాల్కనీలో కనబడే కృష్ణపరమాత్మలా సరిగ్గా ఆ చక్రం మధ్యలోకి నీ మొహం వచ్చేలా చూసుకోవాలి. వెంటనే చుట్టూ ఉండే నీలిరంగు కాస్తా ఆకుపచ్చగా మారుతుంది. ఒకవేళ నువ్వు ఆధార్‌కార్డు ఫొటోలోలా అడ్డదిడ్డంగా కనబడ్డావనుకో ఆ నీలిచక్రం కోపంతో నీవైపు ఎర్రగా చూస్తుంది.

అయిందా? అలా నీమొహాన్ని వాడికి చూపించగానే వాడు సంతృప్తి చెంది ఓ మెసేజ్ పడేస్తాడు. ఏవఁనీ?

నువ్వివాళ ఇన్ని ఘడియల ఇన్ని విఘడియలకి హాస్పిటల్లో కుడికాలు ముందెట్టి లోపలికొచ్చావని!

ఇదీ ఎఫ్ఆర్ఎస్ అంటే!’ 

‘ఎందుకడిగాన్రా వీణ్ణి?’ అనుకుని తను డాల్బీ సౌండులో లెంపలేసుకోవడం వినబడిందిగానీ నే పట్టించుకోలా!

వచ్చేశా! మా హాస్పిటల్ టర్నింగ్‌లో నిత్యం ఓ అయిదారేడు ఆటోలు ఆగివుంటాయి. ఎప్పట్లానే డ్రైవర్లుండరు. అంచేత మనం ఏడ్చి ప్రయోజనం లేదు. వైకుంఠపాళీలో పాము మింగేస్తే దిగిపోయినట్టు టోయ్ఁమంటూ బాగా దిగితే మా హాస్పిటల్ ముఖద్వారం వచ్చేస్తుంది. అక్కడ నాడుకి ఎదురుగా నేడుంటుంది. 

మనం వచ్చినట్టు సంకేతం పంపడానికి మొబైల్ తీశాను. పైడితల్లమ్మ దయవల్ల నా మొహాన్ని గుర్తుపట్టి హాజరు వేసేసింది. 

హాస్పిటల్ గేటు దగ్గర జనం బాగా ఉన్నారు. ‘ఇది హాస్పిటలా చేపల బజారా?’ అందామనుకున్నవాణ్ణే, ఒక చంటిదాన్ని చూసి ఆగిపోయాను. 

అది భూమికి మూడడుగులుంది. తట్టెడు కొబ్బర్నూని రాసి గట్టిగా వెనక్కిలాగి వేసిన పిలకలు రెండు, వాటికి కట్టిన ఎర్ర రిబ్బన్లు, చెరో పావుకేజీ బుగ్గలు. మంచి కళగల మొహం దానిది.  ఒక చేత లిటిల్ హార్ట్సూ, మరొక చేత మిరిండా బాటిలూ ధరించిన బాలాత్రిపురసుందరిలా ఉంది. దాని మొహం చూసేసరికి అంతవరకూ చేసిన ప్రయాణ బడలికా, ‌కాసేపట్లో మొదలవ్వబోయే పనివత్తిడీ ఏవీ గుర్తురాలేదు.

ఇవీ నా రొటీనేజ్ కబుర్లు!


......కొచ్చెర్లకోట జగదీశ్

0 comments

వినాయకచవితి

‘వినాయకచవితికి కొత్తబట్టలు ఎవరూ కొనుక్కోరు. నెలతిరగ్గానే దసరా వస్తుందిగా? అప్పుడెలాగూ కుట్టించుకోవాలి. ఉన్నవాటిలో కాస్త మంచివి తీసి వేసుకోండి! చాలు’

ఇక చేసేదేంలేదు. అమ్మ మానిఫెస్టోలో లేనివి అడగడం అనవసరం. ముదురు రంగు నిక్కర్ల మీదకి ఏ చొక్కా వేసుకున్నా బానేవుంటుంది. నలుగుర్లోనూ కాస్త ఆనతారు పిల్లలు. ఇవన్నీ అనుభవం నేర్పిన పాఠాలు. 

గళ్ళ బుష్కోట్లకీ, చారల చొక్కాలకీ కావలసిన తాను నాన్నగారు ఆప్కోలో కొనేవారు. గుడ్డ కాస్త మందంగా ఉండటాన బాగా మన్నేవి. అదే సమస్య. చిరిగిపోతేనే కదా కొత్తవొస్తాయి!

గూడెం నుంచి తెచ్చుకున్న నల్లరాయితో రాత్రే కొట్టి ఉంచుకున్న కుంకుడుకాయల్లో అరచెంబుడు వేణ్ణీళ్ళు పోస్తే పులుసు తయారైపోయేది. గింజలన్నీ ఏరేసి బాగా రసం పిండి అందరికీ తలలంటే పని నాన్నగారిది. ఆడపిల్లలకి అమ్మ పోసేది. 

మొత్తానికి నేరేడుపండు రంగో, నలుపో లేక తోపురంగుదో నిక్కర్లోకి కనకాంబరం రంగు గళ్ళ చొక్కాలు దోపేసుకుని పక్క పాపిళ్లతో మగపిల్లలు, పెద్దపెద్ద పువ్వులున్న లేతాకుపచ్చ గౌన్లతో ఆడపిల్లలు వెరసి అయిదుగురం తయారై బయటికొచ్చేవాళ్లం.

పిల్లలందరం ముందురోజు సాయంత్రం రిపబ్లిక్ పార్కులో చెట్లన్నీ దులిపి దులిపి ఏరుకొచ్చిన పత్రి మొత్తం ఓ పెద్ద స్టీలు బేసిన్లో పోసి ఉంచేవారు. పాలవెల్లికి కాస్త పసుపదీ రాసి వెలక్కాయలు, సీతాఫలాలు, నారింజలూ వేలాడదీసేసరికి ఎక్కడలేని అందమూ వచ్చేసేది. ఇక నాలుగుమూలలా నాలుగు మొక్కజొన్నపొత్తుల్ని కట్టేసరికి పూర్తి నిండుదనంతో కళకళలాడిపోయేది. 

మావిడాకులు తోరణాల్లా ఎలా మారతాయి, పాలవెల్లికి పచ్చికాయల్ని ఏ రకంగా అలంకరించాలి అనేది నాన్నగారు ఏరోజూ మాకు నేర్పలేదు. ఆయన కూర్చుని శ్రద్ధగా చేస్తోంటే జాగ్రత్తగా గమనించి నేర్చుకున్నదే! 

‘అదంతా ఆడవాళ్ల వ్యవహారం, మనం పూజ సమయానికి మహరాజులా వచ్చి కూర్చోవడమే!’ అనే సంస్కారం ఏనాడూ ఆయనలో గమనించలేదు. 

ఓ పెద్ద చార్టు మీద స్కెచ్ పెన్నులతోనో, రంగు పెన్సిళ్లతోనో వినాయకుడి బొమ్మ తప్పనిసరిగా గీసేవాణ్ణి. ఆ కలర్ కాంబినేషన్లవీ సరిగా తెలిసేవి కావు. ఒక్కోసారి వికారంగా తయారైనా దేవుడి బొమ్మ కదాని ఎవరూ ఏమీ అనేవారు కారు.

మనకి ఏ సబ్జెక్టు వీకో ఆ పుస్తకం తెచ్చి దేవుడి పక్కన పెట్టమనేవారు. నేను టెక్స్టు పుస్తకంతోపాటు నోట్సులూ పెడుతుండేవాణ్ణి. ఆ కారణంగా దొంతి పెద్దదిగా కనబడేది. అదిచూసి ‘ఏరా, అన్నీ కష్టంగానే ఉన్నాయా నీకు?’ అంటూ అన్నయ్య ఏడిపిస్తూ ఉండేవాడు.

వ్రతకల్పంలో పత్రుల పేర్లు ఒకరకంగా ఉంటే మనం తెచ్చినవాటి పేర్లు ఇంకోరకంగా ఉండేవి. అప్పటికింకా మేటనీలే తప్ప బోటనీలవీ తెలీవు. అంచేత మొక్కల బహునామావళదీ పరిచయంలేదు.

గండకీపత్రం, దూర్వారయుగ్మం అంటూ గాంధారీ ధృతరాష్ట్రుల  కొడుకుల పేర్లకుమల్లే ఉన్న ఆకులేవిఁటో మా చిన్నిబుర్రలకు అర్ధమయ్యేవి కావు. నాన్నగారు తనకు తెలిసినంతవరకూ కొన్నింటిని పరిచయం చేసేవారు. ఎప్పుడైనా బిల్వపత్రం పూజయామి అని చదవగానే గబగబా మూడూ కలిసివుండే మారేడుదళాల్ని వెదికి వెదికిమరీ తీసి దేవుడిమీద పడేసేవాళ్లం. ఆ క్షణం అదొక గర్వం, గొప్ప పనేదో చేసినట్టు.

పూజంతా అవ్వగానే కథ వినడం విధాయకమనే నిబంధన, ఒకవేళ వినకపోతే ఏం జరుగుతుందో తెలియజేసే సత్యనారాయణ వ్రతం విశేషాలూ బాగా నూరిపోసి ఉండటాన మొత్తం పిల్లలందరం నోరుమూసుకుని వినేవాళ్లం. 

మధ్యలో నోరలా వెళ్లబెట్టి రోజుకి వెయ్యి మణుగుల బంగారమంటే ఏవిఁటని, ఉయ్యాల్లో ఆడుకునే పిల్లకి ఆ మణిని ఇవ్వడమేవిఁటని, ఇరవై ఎనిమిది రోజులపాటు యుద్ధం చేస్తే ఆకలదీ వెయ్యదా అని, అయినా ఆ ఉయ్యాల్లో పాపాయినిచ్చి పెళ్లి చెయ్యడమేవిఁటని వంద సందేహాలతో కొట్టుకుంటుండేవాళ్లం.

అయితేనేం, సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడికి అలానే అవ్వాలని తీర్మానం చేసేసుకునేవాళ్లం. జాంబవంతుడి గుహ మొత్తం కళ్లముందు త్రీడీలో కనబడిపోయేది. కుమారస్వామి ఏ నది దగ్గరకెడితే ఆ నదిలో వినాయకుడు కనబడేవాడని చెబుతోంటే ఆ సూపర్‌పవర్‌కి మనకి గూస్‌బంప్స్ వచ్చేసేవి.‌

‘మనం కూడా స్కూలుకెళ్లకపోయినా క్లాసురూములో కూర్చునున్నట్టు మేష్టారికి కనబడే శక్తి మనకొచ్చేస్తే?’ అనే దుష్ట దుర్మార్గపు ఆలోచనలకు బీజం పడింది కూడా ఆ వయసులోనే! 

కాశీమజిలీ కథలవీ చదివేసి ఎగిరే గుర్రాల మీద ఎన్ని రాత్రుళ్లు ప్రయాణం చేసేవాణ్ణో? సరస్వతీ ప్రెస్‌కి పెన్ను కొనుక్కోవడానికి ఎగురుకుంటూ వెళ్తున్నట్టు కలొచ్చేది తరచుగా. అలాగే కృష్ణుడూ, వినాయకుడూ మనతోపాటు ఆడుకుంటున్నట్టు కూడా కలలొచ్చేసేవి. వాటికి హద్దా, అదుపా? ఫ్రీయేగా?

ఇంతటి ఊహాశక్తికీ కారణం.... అమాయకమైన బాల్యం. వేరే ఏ విధమైన లాజిక్కుల్నీ, తర్కవిచారణల్నీ పరిచయం చెయ్యని స్వచ్ఛమైన బాల్యం. అది సరైనదని కాదు నా అభిప్రాయం. కానీ ఎందుకో ఆ ఊహాలోకాలవీ బావుండేవనిపిస్తుంది. పాలసముద్రంలో విష్ణుమూర్తి కనబడగానే కళ్లు రెండూ పత్తికాయల్లా చేసుకుని దాదాపుగా వైకుంఠాన్ని కళ్లారా చూసేసినంత అనుభవం పొందేసేవాణ్ణి. మాంత్రికుల గుహల్లో కాళికామాత బొమ్మలూ, బలులిచ్చే రాతిదిమ్మలూ కూడా మనకు కావలసినంత కిక్కిచ్చేవి.

ఇప్పుడుమాత్రం ఏవిఁటటా? ఇంతంత శాస్త్రవిజ్ఞానమూ, తర్కమూ అభివృద్ధి చెంది, మన బుర్రల్లోకి సిలబస్సుల్ని ఎక్కించి, మన గుండెల్లో రైళ్లని పరుగెత్తిస్తున్న ఈ నవనాగరిక ప్రపంచంలో వస్తున్న కథలవీ చూసుకుంటే నా సామిరంగా!

ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన రాక్షసబల్లుల్నీ, మా విజీనారం జిల్లాంత సైజుండే గాడ్జిల్లాలనీ చూపిస్తున్నారు. 

సరే, కథలోంచి పిట్టకథకొచ్చేశాను. కథాక్షతలు వేసేసుకున్న మరుక్షణం పేద్ద గొంతులేసుకుని ‘ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదకీ దండుపంపూ...!’ అంటూ పాడేసేవాళ్లం. అది పాడితేనే పూజ పూర్తైనట్టు. పెరుగన్నం తినకండా భోజనం పూర్తవనట్టన్నమట!

సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూడటం, మాటిమాటికీ అమ్మ అనుమతి కోసం పీడించడం. కాస్తంత చీకట్లు పడగానే వీధిలో పిల్లలందరం కలిసి ఏడుగాని, తొమ్మిదిగాని వినాయకుళ్లని చూడాలంటూ కాలినడకన బయలుదేరేవాళ్లం. ఇంటి ఓనర్లనో, పక్కవాటాలో గుట్టుగా కాపరముండే సర్వేయరుగారినో తలుపు తియ్యమని బాది, ఆనక దేవుడిగదుల్లో దూరిపోయి గుంజిళ్లూ, లెంపలూ కానిచ్చేసి అప్పుడు వీధిన పడేవాళ్లం. 

అప్పుడిలా వీధికో వినాయకుడుండేవాడు కాడు. మనుషుల్లో ఐక్యతలవీ ఏడిసేవి. ఒక పేటకి ఒకడే దేవుడు. బాగా పెద్దవాడు. శుభ్రంగా తొమ్మిదో, ఇరవయ్యొకటో రోజులుండేవాడు. బోలెడన్ని ప్రసాదాలు పంచిపెట్టేవాడు. చివర్లో కాకినాడ బాబ్జీ ఆర్కెస్ట్రానో, సత్యనారాయణ మిమిక్రీనో పెట్టించేవాడు. పిల్లలకి పాటలపోటీలవీ జరిపించేవాడు. ఆ పందిళ్లలో జవజీవాలుండేవి. కళలు నాట్యమాడేవి. 

ఇప్పటికీ అటువంటి పందిళ్లు అక్కడక్కడ కనబడుతున్నాయి. కూచిపూడి నృత్యాలనూ, శాస్త్రీయ సంగీతాలనూ వేదికనెక్కిస్తున్న రసహృదయాలు తారసపడుతున్నాయి.

నిన్న మాయింట్లో పూజచేసేసుకుని, అపార్ట్‌మెంట్ గణపతినీ ఆరాధించి సాయంత్రం వీధి గణపతుల్ని చూసేందుకు బయల్దేరాం. అదృష్టవశాత్తు జీడిగింజలు, బుల్లెట్ బళ్ళూ వినబడలేదు. నవగ్రహాలనూ మంటపంలోకి ఆవాహన చెయ్యడంలో ఉన్న మర్మాన్ని విశదీకరిస్తున్న బ్రహ్మగారు ఒక పందిట్లో తారసపడితే, గోపికలంతా చేరి కృష్ణుడి లీలల్ని పాడే కోలాటాల నృత్యం మరొకచోట కనబడింది.

ఈ పండగలో అదే విశేషం. పదిమందినీ కలుపుతుంది. కళల్ని ప్రోత్సహిస్తుంది. స్నేహభావం పెంపొందేలా సరదా సంతోషాల్ని నింపుతుంది. మానవ సహజమైన అసూయల్నీ, చిన్నచిన్న విభేదాల్నీ పక్కనబెట్టేలా చేస్తుంది. ఏళ్లతరబడి మాటడుకోవడాలవీ మానేసిన కొందరు మిత్రుల్ని మళ్లీ ఏ పొరపొచ్చాలూ లేకుండా మాటాడేసుకునేలా చేస్తుంది.

వినాయచవితి సంబరమనేది కేవలం ఆ దేవుడికి మనం చేసే ఉత్సవం మాత్రమే కాదు. మనల్ని మనం సంస్కరించుకునేందుకు మనమే కల్పించుకునే అవకాశం. ఈ చిన్ని జీవితంలో నిజమైన కష్టాలనేవి ఏమిటో తెలియజేసేందుకు దేవుడు సునామీలని, హుద్‌హుదుల్ని, కరోనాలనీ పంపాడు. అప్పుడు పడగవిప్పిన మానవత్వం మళ్లీ కాస్త తెరిపిరాగానే కుంచించుకుని బుట్టలోకో, పుట్టలోకో పోతోంది. వీటన్నిటినుంచీ బయటపడిన స్వచ్ఛమైన మనసులతో నిండైన స్నేహాల్ని ఆస్వాదించండి. 




.........కొచ్చెర్లకోట జగదీశ్


0 comments

దసరా మామూళ్ళు

మా హాస్పిటల్లో దసరాలకి పదిరోజుల ముందునుంచి విపరీతంగా సెల్యూట్లు కొట్టడం మొదలెడతారు మా గార్డులు, ఇతర సిబ్బందీ. అందరికీ సమాధానం ఇవ్వలేక మెడనొప్పి కూడా వస్తుంది ఖర్మ. 

ఆ సాయంత్రానికల్లా ఓ అరడజనుమంది కలిసి రవ్వా అప్పలనరశింహులు & సన్సు వారి తొంభయ్యారు పేజీల రూళ్ల నోట్‌బుక్ ఒకటి పట్టుకునొస్తారు. అందులో పైన శ్రీరామ అని, కింద నా పేరుకెదురుగా ‘రూ|| 2,000/-’ అని రాసుంటుంది. నాపేరుకి పైన ఇంకో గైనికమ్మగారిచ్చిన అయిదొందల్ని అమెజాన్ వాడిలా కొట్టేసి రెండువేలుగా మార్చారన్న విషయం సుళువుగానే తెలిసిపోతూ వుంటుంది. అయినా ఏమీ అననని వాళ్లకి తెలుసు. 

ఈయేడూ అలానే వచ్చారు.

‘ఏంటర్రా ఏయేటికాయేడు పెంచుకుంటూ పోతున్నారు? ఇలా అందరికీ రెండేసివేలిచ్చుకుంటూ పోతే ఈ మామూళ్లకే పదిపన్నెండు వేలయ్యేలా ఉందే?’ అని పెన్ను కాప్ తీసి ఏమీ రాయకుండా చేతిలో నాట్యమాడిస్తూ ఏడుపులాంటి నవ్వొకటి నవ్వుతూ పుస్తకాన్ని వెనక్కి తోస్తున్నాను.

వాళ్లు అటువంటి భావోద్వేగాల్ని ఎన్నో ఏళ్లుగా చూసిచూసి ఉన్నమీదట నిరామయ నిర్వికార స్థితిలో నిబ్బరంగా నిలబడి నవ్వుతూ ‘సార్, మీరే అలగనేస్తే ఎలా సార్? సంవషానికొక్కసారే కద్సార్! రాసియండీ!' అంటూ పుస్తకాన్ని ముందుకి తోస్తున్నారు.

అలా పుస్తకాన్ని ముందుకీ వెనక్కీ తోసుకునే టెన్నిస్సాటలో అత్యంత నమ్రతను ప్రదర్శిస్తూ నవ్రతిలోవాలా చివరికి వాళ్లే గెలిచారు. నేనిక గెలవనని రూఢీ అయ్యాక ఫోన్‌పే తెరిచి డబ్బు బట్వాడా చేసిన వెంటనే ఆరుగురూ ముక్తకంఠంతో అందించే ధన్యవాదాల్ని నెత్తిమీదా, సెల్యూట్లని నా తలకాయమీదా వేసుకుని వాళ్లు వెళ్లగానే తలుపు బోల్టు పెట్టేసుకుని ‘ఎవరికి తెలుసు చితికిన మనసూ... చితిగా రగులుననీ..!’ అంటూ పాడుకుని సేదతీరుతున్నాను. 

అకస్మాత్తుగా తలుపు చప్పుడయింది. ‘ఎవరూ?' అంటూ భయంభయంగా ప్రశ్నించాను. సమాధానంగా మళ్లీ తలుపు తడతారే తప్ప మాటాడరే! తియ్యగానే ఇద్దరు నవయువకులు ఇంకో రవ్వా నోట్‌బుక్కేసుకుని కనబడ్డారు. వాళ్లిద్దరూ ప్లంబరు, ఎలక్ట్రీషియను. 

షర్మిలని ‘మీరువైఎస్సార్ సీపీలో లేరా?’ అనడిగినట్టు ‘మీరు వాళ్లతో లేరా?’ అని అమాయకంగా అడిగాను. 

‘ఆళ్లెవరూ మమ్మల్ని కలవనివ్వర్సార్! మా పని మాదే!’ అని పుస్తకాన్ని తెరిచారు. అందులో నా పేరుకెదురుగా వెయ్యి రూపాయలని ముందే రాసేసి ఉంది.

‘ఇద్దరికీ వెయ్యా? దిసీజ్ టూమచ్!’ అన్నానోలేదో, వెంటనే ఎలక్ట్రీషియనేమో కరెంట్ షాక్ కొట్టినట్టు ఆశ్చర్యపోయాడు. టాప్‌లోంచి నీళ్లు కారిపోతున్నట్టు ప్లంబరబ్బాయి కన్నీటి పర్యంతమయ్యాడు.

‘అసలాళ్లెవరికీ మేం మనుసుల్లా కనబడం సార్! పైగా మాకేటో పోజనీసి ఏడుస్తారు. మేవిఁద్దరం పన్చేసినట్టు ఇంకెవరు చేస్తార్సార్ ఈ ఆస్పటల్లో? మీరే చెప్పండి?' అంటూ గుమ్మడిలాంటి నాకు జడ్జి వేషం ఇచ్చారు. నేను తీర్పు చెప్పడం చేతగాక ‘సర్లే నాయనా! అలాగే కానివ్వండి!' అంటూ గుండెపట్టుకుని మరో వెయ్యి తొయ్యడం, వాళ్లిద్దరూ నన్ను కాసేపు మొయ్యడం అయ్యాయి.

అదుగో... అప్పుడు దిగాడు అంబులెన్స్ డ్రైవర్ అంజి. ‘ఒకడే ఒక్కడు మొనగాడూ...’ అనే పాటను బీజీఎమ్‌గా పెట్టుకుని క్లాస్‌మేట్ నోట్‌బుక్‌తో క్లాసీగా వచ్చాడు.

ఇది ఘనమైన క్లైమాక్స్. అతగాడి ప్రపంచమే వేరు. కురుక్షేత్ర యుద్దమప్పుడు అర్జునుడి రథం తోలిపెట్టిన కృష్ణుడు కూడా అంత పోజు కొట్టివుండడు. అసలీ హాస్పిటల్ ఇలా నడవడానికి కారణం నేను తోలే బండే అన్నంత ధీమాగా పుస్తకం నాముందు పడేశాడు. అందులో ఐదొందలు వేసేసుంది. ‘ఐనాక్స్‌లో పాపపుకార్న్....సారీ, పాప్‌కార్న్‌లా ఈ స్పెన్సర్ రేట్లేంట్రా అంజీ?’ అంటూ కాసేపు ఫోన్‌పేచీ పెట్టాను. అయితే అంజి ఎక్కువగా మాటాడ్డు. వాడి భయసెప్స్ మజిల్ చూస్తే వణుకొచ్చి మనమే ఇచ్చిపడేస్తాం.

సరిపోయింది. ఇప్పటికి మూడున్నరవేల ముడుపు చెల్లించాననుకుంటూ బయటపడి ఇంటిదారి పట్టాను. 

వచ్చేటపుడు కూరలు కొని తీసుకురమ్మని పొద్దున్న బయల్దేరేముందు సంచి ఒకటి నా మొహాన పడేసింది తను. 

‘ఏవండీ, వాక్కాయలు దొరుకుతాయేమో చూడండి. తిని చాలారోజులయింది!’ అంటూ సరదాపడింది. ఆ పులుపూ, ఆ వగరూ నాక్కూడా ఇష్టమే! మనోవాక్కాయకర్మలన్నీ వాక్కాయ పప్పుని మనసారా కోరుకుంటుండగా గొట్లాం జంక్షన్లో కూరలకొట్టు దగ్గర కారాపాను. 

ఓంప్రథమంగా కాకరకాయలు ఏరడం నా అలవాటు. ఇష్టమన్నమాట. ‘ఇంత స్వీట్‌బోయ్, మీకు కాకరకాయంటే ఇష్టమేంటండీ, ఏ బీట్‌రూటో అనుకున్నామే?’ అని అవాక్కదీ అవకండి. అన్నట్టు అవాక్కంటే గుర్తొచ్చింది... ‘బంగారమ్మా, వాక్కాయలున్నాయా?’ అన్నాను. తేవట్లేదని, అంతగా తినాలనుంటే ‘తెల్లారే’ లేచి బొంకులదిబ్బకి వెళ్లమని అనుచిత సలహా పడేసింది. ఈలోగా బెండ, బీర, వంకాయలవీ తలో అరకేజీ వచ్చిపడ్డాయి సంచిలోకి. కేజీ కేజీ పట్టుకెళ్లమంటుంది. 

‘ఇద్దరమే బంగారమ్మా! పిల్లలిద్దరికీ రెక్కలొచ్చేశాయి. మీ నగుమోమూ... పాడుకుంటూ తానూ నేనే ఉన్నాం ఇంటో. గుప్పెడు కూరచేసుకున్నా రాత్రికి ఇంత మిగిలిపోతోంది!’ అన్నాను బడిపంతుల్లా కళ్లజోడు సర్దుకుని, గొంతుని వణికిస్తూ. కానీ అది భాగ్యరాజా టైపు హాఫ్‌రిమ్ కళ్లజోడు. ఆ డైలాక్కది అస్సలు నప్పిచావదు. అంచేత బంగారమ్మ నావైపు చూసి నవ్వేసింది.

‘ఇంత ఎండలో ఇలా కష్టపడుతున్నావు, కొడుకుల్లేరా నీకు?’ అనడిగాను కరివేపాకు రెబ్బల్ని హాయిగా వాసనచూస్తూ.

‘అక్కడున్నాడు సూడండి.. ఆడే బాబూ నాకొడుకు. ఒక్కడే !’ అంటూ కుడివైపు షట్టర్ మూసేసివున్న ఒక ఆయిల్ దుకాణంవైపు చూపించింది. ఆ కొట్టుముందు కింద కటికనేలమీద కూర్చున్న ఓ పాతికేళ్ల కుర్రాడు నావైపు చూసి వెర్రిగా నవ్వాడు. నోట్లోంచి చొంగ కారుతోంది. ఒంటిమీద బట్టలైతే ఉన్నాయిగానీ ఎగుడుదిగుడుగా బొత్తాలు పెట్టుకుని నిలువెత్తు అమాయకంలా కనడుతున్నాడు. 

వాణ్ణి చూడగానే నా గుండెపట్టేసినట్టయింది. బర్త్ ఆస్ఫిక్సియా అయుంటుంది. కాన్పు ఆలస్యమై, కడుపులో బిడ్డకి ఆక్సిజన్ సరిగా అందకపోతే ఇలాంటి బ్రెయిన్‌లెస్ చైల్డే పుడతాడు. బంగారమ్మని అడిగితే అవునని నిర్ధారించింది. 

‘సూస్తా సూస్తా వదిలీలేం కద బాబూ, మూడుపూట్లా అన్నం తినిపిస్తే తినీసి అలా కూచుని ఆడుకుంటాడు. మన లోకంలో ఉండడు. తెల్లవారి స్తానం అదీ నేనే చేపిస్తాను. నడలేడు బాబూ. మోసుకెల్టవేఁ!'

‘అదిసరే, వాణ్ణలా నేలమీద కూర్చోబెట్టేశావు, మురికిపట్టేసి ఈగలవీ వాల్తున్నాయి చూడు..’

నామాట పూర్తవ్వకుండానే చెప్పింది ‘ఇంట్లో వదిలేస్తే ఏటి లాగుతాడోనని బయం బాబూ! ఇక్కడైతే నా కల్లముందుంటాడుగదా!'

నా కూరలబేరం పూర్తయింది. రెండు ఐదొందలిచ్చి బయల్దేరుతోంటే వెనకనుంచి బంగారమ్మ పిలుస్తోంది ‘బాబూ మూడూడెబ్బయ్యే అయింది. ఇంతోటిచ్చీసేరేటీ?’

‘దసరా మామూలు. ఉండనీ బంగారమ్మా!' అంటూ సంచులకంటే బరువైన గుండెతో కారెక్కేశాను



.......కొచ్చెర్లకోట జగదీశ్






0 comments

వర్షాతిరేకం

అంబరాన మబ్బుల్ని చూస్తే 
సంబరంగా అనిపించాలేగానీ
అంబరెల్లాల్ని వెతుక్కోకూడదు

మబ్బుల అంచుల్ని ముద్దాడే
కొబ్బరాకుల చిలిపి గిచ్చుళ్లతో
నిబ్బరంగా ఉన్న మేఘాలన్నీ
ఇబ్బడిముబ్బడిగా వర్షిస్తాయి

గుమ్మం దాటనివ్వని వర్షంలో
అమ్మ చేతిలో అరటికాయలన్నీ 
కమ్మనైన సెనగపిండితో కలిసి
నెమ్మదిగా బజ్జీలైపోతుంటాయి

ఆరుబయట సత్తుగిన్నెలన్నీ
నోరుతెరుచుకు చూస్తూ ఉంటే
చూరునించి జారే చుక్కలన్నీ
తీరని దాహం తీరుస్తాయి

కాయితాలన్నీ కత్తిపడవలుగా
కరెంటులేని కష్టాలు కాస్తా
కల్మషమెరుగని ఇష్టాలుగా
కాలానికి నిలిచే ఆటలవుతాయి

మండువా లోగిలిలో ఆరేసుకున్న 
కండువాలన్నీ  స్నానాలాడతాయి
నిండిపోతున్న గిన్నెల్లో నీరంతా
దండగైపోతూ కాలవల్ని వెదుకుతుంది

తడిసిముద్దైన మందారాన్ని చూస్తే
మడికట్టుకున్న అమ్మలా తోస్తుంది
జడివానకు జడిసిన చిట్టిపూలన్నీ
తడికొమ్మలమాటున దాక్కుంటాయి

వానకు ముందు ఆకాశమెపుడూ
దీనవదనలా దర్శనమిస్తుంది
చినుకులన్నీ జారవిడుచుకోగానే
వినీలంగా వికసిస్తుంది


......కొచ్చెర్లకోట జగదీశ్


















































0 comments

జగమే రామమయం

మేఘాలన్నీ నీ రంగు పులుముకున్నాయి. దారిపొడవునా చెట్లన్నీ పూలను నింపుకుని పులకింతల్లో తేలుతున్నాయి. ఆనందంతో ఊగిన ప్రతిసారీ జలజలా పూలు రాలుస్తున్నాయి. తారురోడ్డంతా జలతారులా మెత్తగా... బ్రతుకు పూలబాట కాదన్నాడు కవి. మరి ఇదేవిఁటోయి రామా?

అల్లంతదూరాన ఆలయశిఖరం బడినుంచి వచ్చే పిల్లాడికోసం ఎదురుచూసే అమ్మలా కనబడుతోంది. ఆత్రంగా ముఖద్వారాన్ని చేరాం. పండుముదుసలి రావిచెట్టొకటి ఒక కొమ్మతో ఆకుల్ని పైకెత్తుకుని ‘ఎవరదీ?’ అంటూ పలకరించింది.... అచ్చం ఇంటి అరుగున కూలబడి ఉండే అవ్వలా! ఒళ్లంతా పసుపు, మెడలో బోలెడన్ని ఆభరణాలు. పిల్లలు పుట్టాలనో, పుట్టిన వెధవలకి బుద్ధిరావాలనో... ఏవేవో మొక్కుతూ ఊరందరూ వేలాడేసిన దారాలన్నీ కంఠాన ధరించిందా రావిచెట్టు మామ్మ.

ప్రేమగా పలకరించి ఆప్యాయంగా ఆకుల్ని తాకి పాదరక్షల్ని కాసేపలా కాపలా కాయమని తనకే అప్పగించి లోపలికి అడుగుపెట్టాం. చల్లటిరాళ్లు పాదాలకు ప్రకృతి వైద్యం చేస్తున్నాయి. ప్రదక్షిణ చేస్తూ నీ నామాన్ని జపిస్తున్నాం. సహస్రనామ తత్తుల్యమైన నీ పేరు బహు సరళం, కడు మధురం కూడా.

మేఘాలతోను, మెరుపులతోను ఊసులాడుతున్న ధ్వజస్తంభం చంద్రుడి రాకకోసం ఎదురుచూస్తోంది. ముందున్న గుడిలో మూడడుగుల ముచ్చటైన కోతి ఆవునేతి అప్పాల్ని ఆరగిస్తూ నూనె వెలుగులో మాకు దొరికిపోయింది. మనస్కరించిన పిమ్మట స్వామి దర్శనం కావాలంటూ అనుమతి కోరి లోపలికడుగేశాం.

రాతిని నాతిగ చేసిన నీకు రాతితో గుడేవిఁటని? ఏ రాయిని ఎవ్విధాన దయతలచేవోనన్న ఆలోచనే నాకు. ప్రధాన మంటపం దాటగానే ఏడడుగులుగా నిండిన నిండైన మూర్తులు. నీవూ, మా తల్లి సీతమ్మా, ఆ పక్కనే నెమ్మదిగా తమ్మయ్యా!

ఎంత చల్లని చూపులవి! కరుణాంతరంగుడివి. శబరిని చూసినట్లే చూస్తున్నావు నావైపు. ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం అన్నందుకు అచ్చం అలానే చేశాడు ఆ శిల్పి ఎవరో? ఎదురుగా రాముడొచ్చి నిలబడినప్పటి రామదాసులా ఉంది నా మనస్థితి! 

‘అయ్యా, తమరి గోత్రనామాలు చెబుతారా?' అయ్యోరి పలకరింతకు పులకరింతనుంచి బయటపడ్డాను. 

‘....కాశ్యపస గోత్రం, అనంత వెంకట సూర్య....’

వేయినామాలవాడి ముందు నా పేర్లన్నీ ఏకరువు పెడుతోంటే నవ్వొచ్చింది. ఎంతకూ చూపు మరల్చనివ్వని రూపురేఖలతో మీ ముగ్గురూ గర్భగుడికి శోభనిస్తున్నారు. ఇత్తడి కుందుల్లో ధగధగలాడుతున్న దీపాలు నీ పాదాల్ని తాకాలని మునుముందుకు దూకుతున్నాయి. 

‘సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువమ్...’ నీ ఎదపైకి విసిరిన పూలన్నీ పాదాలపైబడి పరవశిస్తున్నాయి. సీతమ్మ చెవి లోలాకు చూడాలన్న నా కోరిక తీరనేలేదు. ముచ్చటైన నీ రూపమే మనసంతా నిండిపోయింది.

కొండంత దేవుడికి ఉండంత కర్పూరాన్ని మండించి వెలుగురేఖల్లో వేలుపుని చూపిస్తున్నారు. 

‘....నారాయణ పరోజ్యోతిరాత్మా నారాయణః పరః...’

ఘంటానాదం, నైవేద్యం, తీర్థం అంటూ కావలసినంత జాప్యం జరుగుతోంది. ఎంతసేపైనా విడిచి వెళ్లాలన్న ధ్యాసే లేదు మాకు.

అరచేతిలో గుప్పెడు శనగలు పోస్తుండగా పలకరించాను బ్రహ్మగారిని....

‘ఏవూరు స్వామీ మీది?'

ఏవూరైతేనేం? రాముడి సేవకై నియమితమైనవాడు. సుంకరమెట్టవాడైతే సుగ్రీవుడూ, విజయవాడనుంచైతే విభీషణుడూనూ!

చుట్టుముట్టిన నాగరికథల్లో కాస్తంత జాగా నీకోసం వదిలారంటే అదంతా నీ భక్తి సామ్రాజ్యమే! అల్లంతదూరాన జగదాంబా జంక్షన్ కనబడుతోంది. అంగుళానికొక అరలక్షగా ఆవరించేసుకున్న ఆక్రమణాసురుల అక్రమాల నడుమ నీకంటూ ఇంత చోటిచ్చిన ఆ భక్తవరేణ్యులెవరో వారికి పాదాభివందనం!

జగమే రామమయం!


........కొచ్చెర్లకోట జగదీశ్
0 comments

సూపర్నెంటు

‘సార్, నాలుగైపోయింది బయల్దేరరా?’ గదిలోకొచ్చి నే తాగిన టీకప్పు తీసుకెళుతూ అన్నాడు రాంబాబు.

‘ఇదిగో, బయల్దేరుతున్నా! ఏదో మెయిలొస్తే చూస్తున్నా!’ అంటూ టాబ్ క్లోజ్ చేసేసి మొబైల్లో ఫేస్ అటెండెన్స్ తెరిచాను. ఉదయంపు పంచు, మధ్యాహ్నపు పంచు, సాయంత్రపు పంచు... అంటూ ముప్పొద్దులా మా ముఖసౌందర్యాన్ని తప్పనిసరిగా చూపించాలి ఈ యాప్‌వాడికి.

ఆ క్రతువు పూర్తిచేసుకుని సూట్‌కేస్ పట్టుకుని బయటికొచ్చాను. నా క్యారియర్ బ్యాగ్ తను పట్టుకుని బయటికొచ్చి తాళం వేసేశాడు రాంబాబు. నా గది బయట సెక్యూరిటీ గార్డు వాసు నిలబడున్నాడు. బ్యాగ్, సూట్‌కేస్ తనకిమ్మంటూ గారంగా అడిగాడు. 

మాటిమాటికీ సూట్‌కేస్.. సూట్‌కేస్ అంటున్నానని అపోహలవీ పడకండి మీమొమం. అందులో మల్లెపూలూ గట్రా ఏం ఉండవు. అన్నీ ఎలక్ట్రానిక్ సామాన్లే! 

సరే, వాళ్లిద్దరూ ఏదో రాజీకొచ్చి చెరొకటీ పట్టుకుని కారు దగ్గరకొచ్చారు. నా పెట్టే, బ్యాగూ నే మోసుకుంటానన్నా వినరు వీళ్లు. 

ఈ సూపరింటెండెంట్లు కూడా గర్భిణీ స్త్రీలకుమల్లే బరువులవీ మొయ్యకూడదనుకుంటా! అటువంటి ప్రోటోకాలేవఁన్నా ఉందేమో జీవోలవీ చూడాలొకసారి.

నా పాతికేళ్ల సర్వీసులో సుమారు నలుగురైదుగురు సూపరింటెండెంట్లని చూశాను. మాకేదైనా ఆఫీసు పనుంటే వెళ్లి కాసేపలా మాటాడేసి వచ్చెయ్యడమేతప్ప వాళ్ల జీవనశైలిని గమనించిన పాపాన పోలేదు ఎప్పుడూ. అంచేత మనకిదంతా కొత్త. ‘నాక్కూడా కొత్తేనయ్యో...!’

ఇంతకుముందు నేను పనిచేసిన మహారాణి హాస్పిటల్‌కి సూపరింటెండెంటంటూ ఎవరూ ఉండేవారుకారు. మహారాజావారే రెండింటికీ వ్యవహర్త. అంచేత వానొచ్చేముందు మబ్బేసినట్టు, సినిమా రిలీజుకి ముందు ఆడియో ఫంక్షన్‌ జరిగినట్టు ఎప్పుడైనా సూపరింటెండెంట్‌గారొస్తున్నారంటే...

....ముందుగా మా హాస్పిటల్లో మంచాలమీద దుప్పట్లు మారిపోయేవి. 

....లాకర్లలో కుక్కేసిన ఏప్రాన్లవీ తీసి తొడుక్కుని మా డాక్టరమ్మలందరూ సెన్సోడైన్ అడ్వర్టైజ్‌మెంట్లో డెంటిస్టుల్లా తయారైపోయేవారు. 

....గదులన్నీ సెంటెడ్ ఫినాల్ వాసనేసేవి. 

....ఎప్పుడూ మనోరమలా అరుస్తుండే నర్సులందరూ మనోహరంగా నవ్వుతుండేవారు. 

ఇవన్నీ చూసి అనుమానంతో అడిగేవాణ్ణి... ఎవరైనా వస్తున్నారా? అని! 

ఎంచేతంటే మాదెప్పుడూ సేఫ్‌జోనే కదా? ఓటీల్లో పడుండడంవల్ల సమాచారం ఆలస్యంగా అందేది మాకు.

ఆపరేషన్ థియేటరనేది లయన్ సఫారీలాంటిది. సింహం బయట తిరుగుతోంటే మనం గదిలో భద్రంగా ఉండొచ్చుకదా? సూపర్నెంట్లూ వాళ్ళూ ఓటీలోకి రావాలంటే ముందుగా మనసు, బట్టలు, జోళ్ళు అన్నీ మార్చుకుని రావాలి. అంత ఓపిక ఉండొద్దూ? అంచేత స్టెరైల్ జోన్ సరిహద్దురేఖ వరకూ వచ్చి ‘మత్తు డాక్టరేడీ?’ అనడిగేవారు. మేం చేతిలో ఏ లారింగోస్కోపో పట్టుకుని మారేసంలో బయటికొచ్చి దర్శనమిచ్చేవాళ్లం. దాంతో ఆయన ‘అయ్యో బిజీగా ఉన్నట్టున్నారు, కేరియాన్ డాక్టర్‌గారూ...!’ అనేసి వెళిపోయేవారు.

ఈ అధికారుల్లో కొంతమంది భలే హడావుడి చేస్తారు. హుందా, ఠీవి, హోదా... ఇలా ఏవేవో కనబరుస్తూ వారి ఉనికిని అందరికీ తెలిసేలా మసలుకుంటారు. మనకస్సలు తెలియనిదే అది.

నేనేమో లైట్ కలర్ వాష్డ్ అవుట్ జీన్సు, వాటిమీద ముదురునీలం పువ్వుల హాఫ్ స్లీవ్స్ చొక్కా వేసుకుని ఎవరో డబ్బున్న పేషెంట్ తాలూకు మనిషిలా నడవాలోంచి వెళుతోంటే సైడివ్వకపోగా గుద్దుకుంటూ వెళిపోతారు మావూరి పైడ్రాజులు, అమ్మాజీలూ! 

‘ఏటమ్మా, సూపర్నెంట్ సారొస్తంటే కళ్లు కనిపించట్లేదేట్నీకు?' అంటూ నా వెనకాతలుండే సైన్యం ఆ డేరింగ్ & డాషింగ్ లేడీస్‌ని కోప్పడుతుంటారు. పాపం, వాళ్ల తప్పేముంది చెప్పండి?

మన యవ్వనంలో తీరని జీన్స్ సరదాలవీ ఇప్పుడు తీర్చుకుందామని, అప్పుడంతా డోరియోలు, గళ్ళ బుష్కోట్లకే పరిమితమైపోయిన మనసుని ఇప్పుడిలా ఫ్లోరల్ డిజైన్లతో ఊరడిద్దామని తపనపడే మాలాంటి ‘యంగ్ ఎట్ హార్ట్’ బ్యాచులకి ఇటువంటి అవమానాలవీ తప్పవు మరి!

కాకపోతే వారానికొకసారి రెడ్డీ ల్యాబ్స్ వాళ్ల యూనిఫారంలా నేవీ బ్లూ పాంటూ, స్కై బ్లూ షర్టూ వేసుకుని వెడుతుంటాను. అయితే శ్రీనాథుడు ఆఖర్రోజుల్లో భుజాలమీద గుదిబండ మోసినట్టు ఆరోజంతా ఏదో తెలియని బాధ్యత, హోదా, హుందా, నా బొందా మోస్తున్నట్టు ఇరుకిరుగ్గా ఫీలవుతాను. 

ఆమర్నాడు పూలసొక్కా మళ్లా మామూలే!

ఇక స్టాఫందరూ మనతో సరదాగా ఉంటే బావుంటుందని ఆమధ్య పిక్నిక్ ఒకటి వేశాను. ‘అందరమూ ఆ దేవుని బిడ్డలమే, మీరు మిమ్ములను, మీతోటివారినీ సమానముగా ప్రేమింపుడి’ అంటూ కరుణామయుడు విజయచందర్‌లా చెబ్దామని ప్రయత్నించానా? 

తీరాజేసి ఏమయిందీ? అదేదో బంతాట ఆడుతోంటే ముందుగా నన్ను వెయ్యమని ఇవ్వడం, అంత్యాక్షరీలో ఓంప్రథమంగా నన్ను పాడమనడం, అన్నాలప్పుడు నన్ను క్యూలో నిలబడొద్దని, మీకు ప్లేటు తెచ్చిస్తామని, కావాలంటే కలిపి నోట్లో పెడతామనడం... ఇలా కొన్ని బ్యాచులు తయారయ్యాయి. 

ఏడిసినట్టుంది. ‘తల్లీతోడు, పిల్లామేక, ఆలూమగలు, అత్తాకోడలు, బాసూబంటూ ఒకటేనంటు కలవడం... భోజనం వనభోజనం...’ అంటూ ఆరుద్రగారన్నమాట మర్చిపోతే ఎలాగు?

అంచేత అందర్నీ కసిరేసి ‘నేనూ మీలాంటివాడినే! కావాలంటే చూడండి మీలోనూ నాలోనూ ఒకటే రక్తం ప్రవహిస్తోంది’ అంటూ అదేదో సినిమాలో నానాపటేకర్‌లా నా అరచేతిని బాదంకాయలు చితగ్గొట్టినట్టు ఓ రాయట్టుకుని కొట్టేసుకుందామనుకున్నాను. కానీ మళ్లీ మత్తివ్వడం కష్టమవుతుందని మానేశాను.

అయితే మనం ఈ పదవిలోకి పరకాయప్రవేశం చేసి ఎనిమిది పూర్తయి తొమ్మిదోనెలలోకి అడుగెట్టాను. ఇప్పుడిప్పుడే సన్నగా నొప్పులవీ మొదలవుతున్నాయి. అయినా నవ్వుతూనే భరిస్తున్నాను. 

ఆపరేషన్ థియేటర్‌లో పేషెంట్ల లాలన, ఆఫీసులో పరిపాలన. అంటే హాస్పిటల్లో ఏమూల ఏంజరిగినా కనిపెట్టుకునుండడం, ఉద్యోగుల మధ్య గట్టు పంచాయితీలు తీర్చడం, ఫై‘నాన్సెన్స్', ఇక చీటికీమాటికీ జూమ్ మీటింగులు... ఇదీ వరస. క్షణం తీరికలేని వ్యవహారం. 

అప్పుడప్పుడు రాజకీయనాయకులు వస్తుంటారు. ‘మీరెప్పుడూ కూల్‌గా, నవ్వుతూ నెట్టుకొచ్చేస్తుంటారు డాక్టర్‌గారూ!' అంటూ ఇద్దరుముగ్గురు నా ముఖం మీదే చెప్పేశారు.  వాళ్లేదో ముఖస్తుతికి అలా అంటున్నారని కొత్తలో అపోహపడ్డాను. కానీ మునుపు చేసినవాళ్లతో పోలిస్తే నేను కాస్త సాఫ్ట్ అని వాళ్లందరూ కనిపెట్టేశారని బోధపడింది. చిన్నప్పటినుంచీ మనదంతా బొమ్మలు, పాటలూ బ్యాచ్. ఈ సున్ని‘తత్త్వాన్ని’ సున్నిపిండితో కలిపి రాసివుంటుంది మా అమ్మ! 

అలాగని మరీ వదిలేసినట్టు కాకుండా ఉద్యోగులమీద కాస్తంత గ్రిప్పదీ ఉండాలని ఈమధ్యే తెలుసుకున్నాను. అంచేత అప్పుడప్పుడు కారం తిన్న కృష్ణంరాజులా కళ్లెర్రజేయడం ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ వాళ్ల కంటికి మాత్రం నేను భక్తకన్నప్పలో కృష్ణంరాజులానే కనబడుతున్నానని అర్ధమైంది.

ఏంచేస్తాం? లక్షణమనేది జన్మతః వచ్చేది. నేర్చుకుని ప్రదర్శిస్తే రాహుల్‌గాంధీ విభూతి రాసుకున్నట్టుంటుంది. 😎


.....కొచ్చెర్లకోట జగదీశ్




0 comments

మావూరు అనకాపల్లి

ఊరనగా ఎంతా, ఆమూల గాంధీనగరంలో నడవటం మొదలెడితే సత్యనారాయణ థియేటర్ చేరేసరికి ఇరవైనిముషాలు పట్టేది. ఇప్పట్లా బరువనీ, పరువనీ ఇబ్బందులు లేని వయసాయె. 

నేను ఎనిమిదీ తొమ్మిదీ తరగతుల్లో ఉండగా ఊరికి నడిమధ్యలో ఉండే నరసింగరావుపేటనించి బ్రాహ్మలెక్కువగా ఉండే గాంధీనగరానికి మకాం మార్చారు నాన్నగారు. ఆ ఇంటి గురించి ఇదివరకు చెప్పుకున్నాం, ఇంటిముందు పున్నాగపూల చెట్టూ, ఇంటి పంపరపనస చెట్టూ ఉండేవని. నాకైతే ఆ ఇంటితో చాలా జ్ఞాపకాలున్నాయి. వీధంతా అచ్చుపోసినట్టు శుభ్రంగా ఉండేది ఎప్పుడూ. ఇంటికెదురుగా మా జువాలజీ లెక్చరర్‌గారిల్లు, ఇంటిపక్కనే పేద్ద మఱ్ఱిచెట్టూ ఉండేవి.పున్నాగపూల ముందుకెడితే వీధి మొదట్లోనే కుముదవల్లి టీచరుగారిల్లు. ఆవిడంటే మాకందరికీ విపరీతమైన అభిమానం. నాకు ఈమాత్రం తెలుగదీ వచ్చిందీ అంటే అటువంటి పంతులమ్మల దయే! వాళ్ల పిల్లలు మా అన్నయ్యకీ నాకూ సరి ఈడువాళ్లే అయినా వాళ్లంతా వేరే ప్రైవేట్ స్కూల్లో చదివేవారు. 

నా టెన్త్‌ అవగానే మళ్లీ ఊళ్లోకి కాపరం మార్చేశారు నాన్నగారు. ఈమారు కాస్త ఎత్తరుగులిల్లు. ముందున్న గదులు మూడూ దాటి వెనక్కి వెడితే కాస్తంత ఖాళీ జాగా, ఆ తరవాత వంటగదీ ఉండేవి. వర్షం పడిందంటే తడుస్తూ వెళ్లాలన్నమాట. అవోరకం ఇళ్లు! ఇంటిపక్కనే సర్వకామదాంబ పార్కుండేది. అక్కడికి అన్నిపత్రికలూ వచ్చేవి. ముఖ్యంగా అన్ని దినపత్రికలతో పాటు స్క్రీన్ అనే మాగజైన్ వచ్చేది గుర్తుందా? ఇప్పటి వార్తాపత్రికలకన్నా చాలా పెద్ద పేజీలుండేవి. సినీబ్లిట్జ్ అంటూ మరొకటి. ఇక రంగురంగుల విజయచిత్ర, జ్యోతి మాసపత్రిక వచ్చేవి. యువ సరేసరి, అది మన ఫేవరెట్టనుకోండి. అందులో కథలన్నిటికీ ఒక స్థాయి ఉండేది. శ్రీయుతులు ఇచ్ఛాపురపు జగన్నాథరావు, రామచంద్రరావు, అవసరాలవారు... ఇలా అద్భుతమైన రచయితల కథలన్నీ చదివి వాటిద్వారా అక్షర రమ్యతను, వాక్యనిర్మాణాన్ని, కథను ఎత్తుకొనే విధానాలను శ్రద్ధగా అధ్యయనం చెయ్యగలిగాను. 

అయితే సర్వకామదాంబ పార్కుకి ఇంకో విశేషం ఉంది. పొడుగాటి అశోకవృక్షాలు, ఇంకా బోల్డన్ని క్రోటన్స్ మధ్యలో విశాలమైన పెంకుటింటి లైబ్రరీ అది. అక్కడ సిమెంటు బెంచీలమీద ప్రతి సాయంకాలం చేతికర్రలు, తెల్ల లాల్చీపైజమాలు, తాడుకట్టిన కళ్లజోళ్లవాళ్లందరూ చేరేవారు. అందరికీ తుప్పు సోలతో శనక్కాయలు కొలిచేవాడు కూడా నాతోపాటు నిత్యం హాజరేయించుకునే విద్యార్ధే. చీకటిపడుతుండగా మైకులోంచి ప్రాంతీయ వార్తలు వినిపించేవి. అవి పూర్తవగానే పొలం పనులు. వేరుసెనగ పంటలో సస్యరక్షణా అదీ ఇదీ అంటూ అన్నీ వినేవాణ్ణి. ఆ మాట్లాడే తీరు, కులాసాగా కబుర్లాడుతూనే పంటల్ని కాపాడుకునే విధానాన్ని బోధించడం, ఇవన్నీ అలవోకగా చేసిపడేసే ఆ రేడియో కళాకారులంటే ఎంతో మమకారం ఏర్పడిపోయింది.

ఇక మా హైస్కూలు గ్రౌండు దాటగానే చిన్న మలుపొస్తుంది. అక్కడుండేది శారదా గ్రంథాలయం. అనకాపల్లి వర్తకసంఘం వారి దాతృత్వంతో నడపబడే ఆ లైబ్రరీలో చాలా గదులుండేవి. నేను వారంలో కనీసం రెండు మూడుసార్లయినా అక్కడికి వెళ్లేవాణ్ణి. నాలుగైదు మెట్లు ఎక్కగానే ఒక ఊహాలోకంలోకి స్వాగతం పలుకుతూ అద్దాల తలుపులున్న హాలొకటి దర్శనమిస్తుంది. అందులో ఏడాదిపొడవునా వచ్చిన చందమామలు, బొమ్మరిల్లులు, బాలమిత్రలు బైండ్ చేసి ఉంచేవారు. జనవరి నుంచి డిసెంబరు వరకూ సంవత్సరాల వారీగా క్రమపద్ధతిలో పెట్టే ఆ పుస్తకాలు తెరిస్తే నా ఉనికి అనకాపల్లిలో కాదు. ధర్మవరం అనే గ్రామానికో, రాకాసిలోయలోకో, కురుక్షేత్ర యుద్ధం జరిగేచోటుకో వెళిపోయేవాణ్ణి. అంతలా కట్టిపడేసే సరళమైన కథలు, వాటికి తగ్గట్టుగా రంగురంగుల బొమ్మలు చూస్తూ ఎంతలా పరవశించిపోయేవాణ్ణో!

ఇక లోపలుండే హాలు బాగా విశాలమైనది. అక్కడన్నీ దినపత్రికలు, రీడర్స్ డైజెస్ట్, కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ, సైన్స్ టుడేలు ఇంకా సోవియట్ లాండ్, స్పుత్నిక్‌లాంటి అనేక పత్రికలుండేవి. తెలుగులో యువలు, జ్యోతులు మామూలే! 

అట్నించి ఎడమవైపుకి తిరిగితే ఏవో గదులుండేవిగానీ మేం చిన్నపిల్లలమని లోపలికి రానిచ్చేవారుకారు.

ఏదైతేనేం, ఈ శారదా లైబ్రరీ అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా మేడమీద గదుల్లో ఇంగ్లీష్ గ్రామర్ క్లాసులు, హిందీ శిక్షణాతరగతులు, సంగీతపాఠాలూ కూడా నిర్వహించేది. 

ఇదంతా ఇప్పుడెందుకంటే నా జీవితంలో భాషపట్ల మమకారం, గౌరవం, కాస్తంత పట్టూ ఏర్పడటానికి అనకాపల్లిలో ఈ ప్రదేశాలు, వ్యక్తులు ఎంత దోహదపడిందీ చెప్పడానికే!

దాదాపు నలభయ్యేళ్ల తరవాత మొన్నాదివారం నాకు మళ్లీ అనకాపల్లి వెళ్లాలనిపించింది. తనతో చెప్పగానే వెంటనే ఒప్పుకుంది. కాస్తంత పులిహోరా, దద్దోజనం కలిపి క్యారియర్ సిద్ధంచేసి పదమంది. పిక్నిక్కన్నమాట.

వెళుతూ వెళుతూ దారిలో మా చెల్లినీ వెంటబెట్టుకుని ఊరు చేరాం. ముందుగా నూకాలమ్మ దర్శనం చేసుకుని అట్నించటే గాంధీనగరానికి వెళిపోయాం. 

అదిగో, అప్పట్నుంచి మాకు షాకులు మొదలయ్యాయి. నలభయ్యేళ్లకు పూర్వం మేమున్న ఆ ఇల్లు ఇప్పటికీ అలానే ఉంది. ఇంట్లో అద్దెకున్నవారి అనుమతితో లోపలికెళ్లి చూస్తే ఆదిత్య 369 సినిమాలోలా టైమ్ మెషీన్ ఎక్కి మేవుఁన్న కాలానికి వెళిపోయాం. అవే తలుపులు, అదే బావి. ఆఖరికి గదిమధ్యలో చెక్కుచెదరకుండా పడున్న భోషాణంతో సహా! పెరట్లో పంపరపనస చెట్టు మాత్రం లేదు. అయ్యో అనిపించింది. పురుగు పట్టేసిందని తీసేశార్ట. అరటి, మారేడు మాత్రం కనబడ్డాయి. 

ఆయింటిని చూడగానే నిక్కరేసుకుని ఇల్లంతా కలియదిరిగే పదిహేనేళ్ల బక్కపిల్లాడొకడు కనబడ్డాడు. 

....టెన్త్‌క్లాసు రిజల్ట్స్ పేపర్లో ఫస్ట్‌క్లాసని చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడుతూ మొట్టమొదట అమ్మకే చెప్పినవాడు. 

....ఇంటిచూరులో ఒక పెంకుకి బదులు అమర్చిన అద్దంలోంచి పడే ఎండకిరణాలకి భూతద్దం అడ్డుపెట్టి సినిమా వేసినవాడు. 

....పంపరపనస తొనల్ని బళ్లోకి పట్టుకెళ్లి స్నేహితులందరికీ పంచిపెట్టినవాడు. 

........ఏదో సన్నటి కన్నీటిపొర నా కంట్లో! అదేం రోగమో, గతమంటే నాకింతలా మమకారం! 

మాయింటిని ఆనుకుని ఉండే సరిపల్లివారింటి తలుపు కొట్టాం. ఇప్పుడు మరొక షాకు. ఆ మనుషులందరూ వరసగా కనబడి ఆప్యాయంగా పలకరించారు. పెద్దన్నయ్య, అక్క గురించి ప్రశ్నించారు. అమ్మానాన్నల వివరాలడిగారు. మాతో కలిసి ఇంటికెదురుగా ఉండే రాజా కాలేజీకి వచ్చి అన్నీ చూపించారు. అప్పటి కబుర్లు, ఆడుకున్న ఆటలు, ఆఖరికి వాళ్లింటి పెరట్లో ఉండే పెద్ద పుట్టా, అందులో ఒకసారి మాకు కనబడిన పడగవిప్పిన త్రాచు గురించి కూడా మాటాడేసుకున్నాం. 

మాయింటి ముందుండే బోలెడంత జాగాని మాత్రం ఇళ్లతో నింపేశారు. అంచేత వేపా, పున్నాగలవీ మాయమయ్యాయి. ఏదైతేనేం, నా ఊహల్లో పదిలంగా ఉన్న ఆయిల్లు మాత్రం అలాగే కనబడేసరికి దుఃఖం తన్నుకొచ్చేసింది. అవే గుమ్మాలూ, అవే దూలాలూనూ!

భారమైన హృదయంతో బయటపడి మా చిన్నతనాలప్పటి పిక్నిక్ స్పాట్ బొజ్జన్నకొండకు వెళ్లాం. అప్పుడంతా మట్టిరోడ్డుమీద, రాయీరప్పా దాటుకుంటూ నానా యాతనా పడేవాళ్లం అక్కడికి చేరడానికి. పదిహేనేళ్లక్రితం ఆర్కియలాజికల్ సర్వేవారి దృష్టిపడి కాస్తంత అభివృద్ధి చెందింది. రాతిమెట్లదారి. వందలకొద్దీ శిలల్ని స్థూపాలుగాను, శివలింగాకృతుల్లోను మలిచారు. ఎన్నో వేల సంవత్సరాల చరిత్రకలిగిన ఈ కొండను మరింత అభివృద్ది మాత్రం చెయ్యాల్సివుంది.

తరవాత సర్వకామదాంబ పార్కు సమీపంలోని ఇంటికెళ్లాం. అందులో ఒక లాయరుగారున్నారు. వెనకాలంతా పెనుమార్పులు చెయ్యడంవల్ల నాకెటువంటి ఉత్సుకతా కలగలేదు. పార్కు కూడా పూర్వ వైభవం కోల్పోయి బోసిగా కనబడింది. అయినా నా పిచ్చగానీ, ఇప్పుడెవరుటా పార్కుకొచ్చి పత్రికలు చదివీ, ప్రాంతీయవార్తలు వినేది? 

సరే, ఇక అసలైనదీ, ఆత్మీయమైనదీ నా సాహితీపయనానికి బాటలు పరిచినదీ అయిన శారదా లైబ్రరీకి బయల్దేరాం. అయితే మాకొక సందేహం కలిగింది... అసలిప్పుడు ఆ లైబ్రరీ ఉందాలేదా అని!

వెంటనే మన మిత్రులు, విజయవాడలో వైద్యులు, అనకాపల్లి వారే అయిన శ్రీ గ్రంధి వెంకటరమణమూర్తిగారికి ఫోన్ చేసి అడిగాను. అదృష్టవశాత్తూ గ్రంథాలయ నిర్వాహకులు ఆయన సోదరులేనని, తప్పకుండా వెళ్లి కలవమని చెప్పారు. ఆరకంగా హైస్కూలు గ్రౌండు పక్కనున్న సందులోకి కారుని తిప్పి ఎదురుగా చూస్తే ఇంకేముందీ, గుమ్మంలో తెల్లటి సఫారీలో ఆరడుగుల ఎత్తున్న నిండైన మూర్తి శ్రీ కోరుకొండ బుచ్చిరాజుగారు మాకోసం ఎదురుచూస్తూ కనబడ్డారు.

అవే మెట్లు, అదే బోర్డు. మళ్లీ చిన్నపిల్లాణ్ణయిపోయాను. లోపలికడుగు పెట్టగానే ఆత్మీయంగా ఆహ్వానించారు. నా చందమామల అద్దాల బీరువాలన్నీ ఖాళీగా కనబడ్డాయి. భవనం మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది. అప్పటినుండి ఇప్పటివరకూ నిత్యం పూలమాలతో అలంకరించే బోసినవ్వుల గాంధీతాత బొమ్మ హాలు మధ్యలో దర్శనమిచ్చింది. వెనకాల వర్తకసంఘం వ్యవస్థాపకులు, స్కూలు, కాలేజీ, లైబ్రరీ, సంగీతకళా పరిషత్ మొదలైన ఎన్నో సామాజిక సంస్థల రూపకర్తా అయిన కోరుకొండ లింగమూర్తిగారి చిత్రపటం ఉన్నాయి.

ఎంతో శ్రద్ధగా మొత్తం అన్ని గదులూ తిప్పి చూపించారు. చిన్నపిల్లాణ్ణని లోపలికి రానివ్వని గదుల్లోకి సైతం ఇప్పుడొక హోదాలో ప్రవేశించి అక్కడున్న అపారమైన పుస్తకసంపదను కళ్లారా చూసి చేతులారా తడిమి ఆనందించాను. ఏడాదికొక బౌండు చొప్పున భారతి సంచికలన్నిటినీ లక్షణంగా భద్రపరిచారు. ఇక పద్దెనిమిదివందల తొంభైనాటి పుస్తకాల్ని సైతం చూసి నోళ్లు వెళ్లబెట్టాం. 

రచన పత్రికలు, రవీంద్రుని సాహిత్యం, భరాగో నూటపదహార్లు, మరో నూటపదహార్లు, వందేళ్ల తెలుగుకథ... ఇలా ఒకటీరెండూ కాదు మహప్రభో వేలకొద్దీ  పుస్తకాలు. 

ఇప్పుడెలా నడుస్తోందని ప్రశ్నించాను. ఆ భవనం కట్టింది పంతొమ్మిదివందల ముప్పైలోట. దాదాపు శతాబ్ది వయసున్నట్టే అనిపించలేదు నాకైతే! ఎంతో బలంగా, మరొక శతాబ్దమైనా చూసేటంతటి ధీశాలిలా నిలబడుంది. కానీ ఇంజనీరింగ్ నిపుణుల సలహామేరకు ఆ భవంతిని పడగొట్టి అదేచోట మరొక నిర్మాణం చేపట్టే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. నిధులకొరత ఏమీలేదని, ఎందరో దాతలు తమ ఉదారభావంతో బోలెడంత డబ్బు పంపుతుంటారని కూడా చెప్పారు. కాలానుగుణంగా సంభవించిన ఎన్నో మార్పులు అక్కడా చోటుచేసుకున్నాయి. కేవలం గ్రంథాలయాలనే నమ్ముకుని పోటీపరీక్షలకు తయారయ్యే విద్యార్థులు ఇప్పుడంతలా ఎక్కడుంటారు? అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు, వాటిలో కావలసినంత సమాచారం పుష్కలంగా లభిస్తోంటే ఇటువంటి పురాతన లైబ్రరీల మెట్లు నాలాంటి నోస్టాల్జియాగాళ్ల పాదాల చప్పుళ్లకై ఎదురుచూస్తున్నాయి. పుస్తకాన్ని రెండుచేతుల్లోకీ తీసుకుని దుమ్ముదులిపి వాటి సహజ సౌందర్యాన్ని తిలకించమంటూ కోరుకుంటున్నాయి. 

కాసేపు అక్కడున్న విలువైన పుస్తకాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట వారి ఆత్మీయమైన సత్కారానికి కృతజ్ఞతగా నమస్కరించి సెలవుతీసుకుని ఇంటిదారిపట్టాం.

గతంలోకి ప్రయాణం ఎప్పుడూ బావుంటుంది. అయితే అప్పటి జ్ఞాపకాలన్నీ దాదాపు అలాగే ఎదురొచ్చి పలకరిస్తే మరింత మధురంగా ఉంటుంది. అదే భావన నా మనసంతా!


.......కొచ్చెర్లకోట జగదీశ్







 
0 comments

మెడికోలాహలం

‘ఎప్పుడూ చదువేనా?’ అనిపించి కాసేపలా బయటపడి సాయంకాలాల్లో సాగరకన్యతో సరసాలాడ్డానికి హాస్టల్ గదులు తెరుచుకునేవి. ఇద్దరుంటే మూడోవాడిని అవాయిడ్ చేసే ‘బాయిడ్’గాళ్లు చెప్పాపెట్టకుండా చెట్టపట్టాలేసుకుని జిల్లాపరిషత్ బజ్జీల బండి దగ్గరకెళిపోయేవారు. 

అట్నించి రాగానే వాళ్లిద్దరూ మాయాబజార్లో శర్మా శాస్త్రుల్లా వంకాయ బజ్జీ రుచిని వర్ణిస్తోంటే మాకు నోట్లోంచీ, కళ్లలోంచీ నీళ్లు కారిపోయేవి. నన్ను తీసుకెళ్లకుండా పోయిన ఆ ‘కన్నింగ్’హామ్‌గాళ్ల మీద కోపం మిర్చి బజ్జీలో కంటే ఎక్కువగా మండిపోయేది. వంకాయని చీరేసినట్టు నిలువునా చీరెయ్యాలనిపించేది. 

ఈలోగా నాలుగో నెంబరున్న ఎదుటిగది ‘గుడ్‌’మన్ గిల్‌మన్ ఒకడు వేడివేడి న్యూస్‌పేపర్ శంఖమొకటి నా చేతిలో పెట్టేవాడు. దాన్నిండా నోరు కాలేన్ని పకోడీలు, మనసు నిండిపోయేంత ప్రేమా ఉండేవి.

‘తిను జగదీష్, నాకూ ఉన్నాయిలే!’ అన్న మాటకి తినకుండానే కడుపు నిండిపోయేది. వేణువూదే అలవాటున్న ఆ సీనియరన్నయ్య ఇలాగే పాటతోను, మాటతోను మమ్మల్ని కట్టిపడేసేవాడు. 

అప్పుడప్పుడు చదువుతున్న గైటన్ మూసి టైటన్ వాచీలమ్మే నాగరాజ్ & కో మెట్ల దగ్గర ప్రత్యక్షమయ్యేవాళ్లం. మన దగ్గర డబ్బులు తీసుకోవడానికి సైతం తీరికలేనంత ఉత్సాహం ఆ బండి దగ్గర. కమ్మగా సెనగపిండి వాసన ఆ చుట్టూతా! 

దేవుడి ప్రభల్లా నిలువుగా నిలబడివున్న వెడల్పాటి అరటికాయ చీలికలు చూస్తూ ఉండగానే వస్తాదుల్లా బయటపడి, అలా సెనగపిండిని ఒళ్లంతా పట్టించుకుని సెగలపొగల నూనెలోకి జారుకునేవి. 

వేసేదాకా కంగారు, తీసేదాకా కంగారు. ‘నాకంటే నా’కంటూ ఎగబడి ఎగరేసుకుపోయే బజ్జీలన్నీ ఉక్కపోతల్ని కాసేపలా మరపించేసేవి. ఉప్ఫూ ఉప్ఫూల్ని వినిపించేసేవి.

పదిమందీ కలిసి ఇంకా ఏ బాధ్యతలూ లేని భుజాలమీద చేతులేసుకుని నవ్వుకుంటూ కెజిహెచ్ డౌన్ దిగిపోయేవాళ్లం. 

దిగేకొద్దీ మీదకొచ్చేసేలా కనబడే సముద్రాన్ని చూస్తే కోపం వచ్చినప్పుడు అమ్మలా కనబడేది. ఏం చెయ్యదన్న నమ్మకం... అచ్చం అమ్మలానే! 

ఇంకా ఏ ఒక్కడిలోనూ బట్టతలల జీన్సవీ నిద్రలేవకపోవడాన ఎగురుతున్న జుట్టునలా వెనక్కి నెడుతూ ఎదురుగాలికి ఎదురేగేవాళ్లం. 

గాలిలో చెమ్మ, గుండెల్లో ధీమా సమతుల్యంగా ఉండడాన కబుర్లలో నిజాయితీ వినబడేది. కాలుష్యం అప్పుడప్పుడే నిద్రలేచి ఇంకా తన కోరల్ని కోల్గేట్‌తో క్లీన్ చేసుకుంటూ ఉన్న రోజులవి. 

సెల్సవీ రానందున శరీరంలో కణజాలమంతా స్నేహాలనే సైటోప్లాజాన్నీ, రూమ్మేట్లనే రైబోజోముల్నీ నింపుకుని ఉండేవి. కరెంటు పోతే బల్లల మీద దరువేస్తూ పాటలు పాడే సరదాల మైటోకాండ్రియాలే మాకు నిజమైన ఊపిరి. 

రాతికట్టడాల ఉమన్స్ కాలేజీ ముందునుంచి వెళుతూ రాతిగుండె అమ్మాయిల్ని దొంగచాటుగా చూడడం, తీరని సరదాలతో గుండె రాయిచేసుకు బతకడం కూడా అప్పుడే అలవాటయ్యాయి.

రామకృష్ణ మిషన్‌లో వివేకానందుడి పుస్తకాలు కొని చదివేసి, మర్నాటినుంచీ తెల్లారే నాలుక్కల్లా లేచేసి, కసరత్తులు చేసెయ్యాలని కఠోరమైన నిర్ణయం తీసేసుకునేవాణ్ణి. తీరా ఏడింటికి మావాడు లేపగా లేపగా స్నానమైనా చెయ్యకుండా పెసరత్తులు తిని కాలేజీకి బయల్దేరేవాణ్ణి. 

ఆ పరమహంస పటాన్ని చూసిన ప్రతిసారీ ఆయన మమ్మల్ని చూసే నవ్వుతున్నాడని అనిపించేది. కాళీమాత ఆలయంలో ఖాళీజాగా దొరికితే ప్రసాదం తింటూ ఎదురుగా కెరటాల్ని చూడటం ఒక దివ్యదర్శనం. 

ఒడ్డుని కోసేస్తున్న సముద్రం మమ్మల్ని మాత్రం ఏమీ అనేదికాదు. నాచుపట్టిన రాళ్లన్నీ మా పాదాల తాకిడికోసం ఎదురుచూస్తాయనిపించేది. అక్కడ చేరి చెప్పుకునే డిస్సెక్షన్ హాలు కబుర్లు, ఫిజియాలజీ లాబుల్లో ఎగిరిపడిన కప్పల తిప్పలు మాతోపాటు ఆ రాళ్లూ వినేవనిపిస్తుంది. ఎంతసేపూ చిప్పమొహాలన్నీ చేరి ‘నీకళ్లు ఆల్చిప్పల’నీ, ‘నీ పెదాలు దొండపళ్ల’నీ పొద్దుపోయేదాకా చెప్పుకునే అబద్ధాలు వినీవినీ విసుగెత్తి బండరాళ్లైపోయి ఉంటాయి. 

మళ్ళీ ఆ అసత్యాల నీడల జాడల్లోంచి వెలుగులోపడి, ఈ రాళ్లమీంచే దూకేసిన ఎన్నో అబల హృదయాల్ని చూసిన అలసట కూడా అయివుండాలి. 

సముద్రం చాలా కథలు చెప్తుంది. అలా నోరెట్టుకు పడిపోతుందిగానీ ఆ అలల గలగలల్ని ఎవరైనా డీకోడ్ చేస్తే ఎన్నో రహస్యాలు, ప్రమాణాలు, శుష్క వాగ్దానాలు, ఒప్పించడాలు, ఆనక నొప్పించడాలు... ఇవన్నీ బయటపెడుతుందనిపిస్తుంది.

చీకటడ్డాక రూములకి బయలుదేరే మెడి‘కోలకళ్ల’ చిన్నోళ్లంతా చెదిరిన క్రాపుల్నీ, ఇసకంటిన చొక్కాలనీ సర్దుకుంటూ దులుపుకుంటూ పిడతకింద పప్పు తింటూ కెజిహెచ్ అప్పెక్కేవారు. ఆయాసాలు, నీరసాలూ అంటని గుండెలవి. ఉద్వేగంతో ‘లవ్’ అనే తప్ప ‘డబ్బ’ని కొట్టుకోవడం ఎరగని గుండెలే అవింకా! 

ఏదైనా మా విశాఖ సాగరతీరం రూపు మార్చుకుంది. రాతికట్టడాలన్నీ కనుమరుగయ్యేలా ఐబాకోలు, ఐనాక్సులూ వచ్చి చేరాయి. పల్లీలు పంచుకున్న షేక్‌హాండ్ల స్నేహాలన్నీ థిక్ షేక్ ఫ్యాక్టరీల్లో మగ్గులు మగ్గులుగా కొవ్వెక్కిన బంధాలైపోతున్నాయి.

అన్నమయ్య విగ్రహం ఎదుట కచేరీలన్నీ ఆరింటికి సీరియళ్లుగా అనాధ్యాత్మికాలైపోయాయి. 

పొడవాటి తీరమంతా కుర్కురే కవర్లతో కర్కశంగా కనబడుతోంది. 

నన్ను దూరంనుంచి చూడండి. మిమ్మల్ని దగ్గరుండి చూసుకుంటానంటుంది బంగారమంటి బంగాళాఖాతం. కానీ అమ్మాయిల్నీ, అవనినీ అంగుళాల్లో కొలిచే మానవ నైజం ఇసకలోనూ ఇటుకల్ని పాతేస్తోంది. సముద్రానికి వీధరుగు లేకుండా చేసేస్తోంది. తన గోడంతా ఏ గోడకేసి తలబాదుకుని చెప్పాలో తెలియక రోదిస్తోంది. 

మా మెడికోలంతా ఇప్పుడు గుండెల్నీ, మెదళ్లనీ చీల్చేంత పెద్ద సర్జన్లైపోయారు. వారెవరికీ ఈ అనుభూతులు మరపురావు. అయితే నాలాంటి చాదస్తంగాడెవడో ఫోర్‌సెప్స్‌తో కెలకాలి. అప్పుడు ఫిజియాలజీ కప్పల్లా ఒకడొకడూ ఎగిరెగిరి బోలెడన్ని కబుర్లు చెబుతాడు. 

ఎంచేతంటే.. అవన్నీ సముద్రపు ఉప్పూ, బజ్జీల కారం శరీరాలే కాబట్టి!

.........జగదీశ్ కొచ్చెర్లకోట

గైటన్.... ఫిజియాలజీ టెక్స్ట్‌బుక్
బాయిడ్....పెథాలజీ టెక్స్ట్‌బుక్
గుడ్‌మన్ & గిల్‌మన్... ఫార్మకాలజీ
కన్నింగ్‌హామ్‌.... అనాటమీ డిసెక్షన్ మాన్యువల్
0 comments

జోలపాట

‘అంత దవ్వునుంచే అయ్యడుగులు తెలిసేనా...
ఓసీ వేలెడేసిలేవు బోసినవ్వులదానా...!’

తన్మయత్వాన్ని గొంతులో పలికిస్తూ సుతారంగా ఊయలూపుతోంది కావేరి. మూడునెలల ముద్దబంతి పిల్ల మిణుగురు కళ్లేసుకుని పాలుతాగిన ఇంటి ఫాల్స్ సీలింగుని చూస్తోంది. దానికి నిద్రరావడంలా! ఊరికే గుణుస్తోంది. లేకపోతే అమ్మ పాట పాడదుగా?

తియ్యని స్వరాలు నిశ్శబ్ద మందిరంలాంటి ఆ గదిగోడల్ని తాకుతున్నాయి. లేతరంగుల్ని సంతరించుకున్న ఆ ఇల్లంతా కనులకి చల్లగా ఉంది.  

కావేరిది మధురమైన గాత్రం. 

‘...మూసే నీకనులా ఎటులా పూసేనె నిదురా...!’ అంటూ ఉయ్యాల కమ్ముల్ని పట్టుకుని లోపలికి తొంగిచూసింది. లేతపెదాలు తడుపుకుంటూ పైనున్న దీపాల్ని చూస్తున్న పిల్లది కాస్తా అమ్మ ముఖాన్ని చూడగానే మీటనొక్కితే వెలిగే దీపంలా నవ్వింది. ఆ బోసినవ్వే చాలు. దోసెడు మల్లెలు!

ఈలోగా తలుపు తట్టినట్లయింది. వచ్చినట్టున్నాడు వీళ్ల నాన్న. ఉయ్యాలనొదిలి భర్తకు స్వాగతం పలికింది. 

ఆ చరణం మళ్లీ అందుకుంది...

‘అంత దవ్వునుంచే అయ్యడుగులు తెలిసేనా...
ఓసీ వేలెడేసిలేవు బోసినవ్వులదానా...!’

చిరునవ్వు నవ్వుతూ ఉయ్యాల దగ్గరకొచ్చి లోపలికి చూశాడు. ఇతనూ తెలిసినవాడే! రోజూ అరచేతుల్లో ఎత్తుకుని అల్లరల్లరి చేస్తూ వేగంగా ఇల్లంతా తిప్పుతూ వింతవింత శోభలన్నీ పరిచయం చేస్తాడు. ఎన్నో రంగులు, సాంబ్రాణి ధూపాలు, మనోహరమైన స్వరాలతో ఎంత బావుందీ లోకం! అమ్మ ఒడీ, నాన్న వడీ భలేభలే!

‘దీనికి నిద్దర్రావట్లా మూర్తీ! ఊరికే దొంగవేషం. నాకవతల బోల్డంత పనుంది. ఇదేమో పాటలు మరిగింది. పాడినంతసేపూ వినేసి, ఆడేస్తుంది. నిద్రపోదు.

ఆ దొంగ కలవరేకుల్లో తుమ్మెదలాడేనా....’ మళ్లీ అందుకుంది.

కాళ్లూచేతులూ ఉద్రేకంగా ఊపేస్తూ మరింత ఊపందుకుంది పాపాయి. ఉంగాలు, ఓవోలూ గోడదాటేస్తున్నాయి. ఎదురింటావిడ మొన్న అడగనే అడిగింది... ‘మీ పాపకి నోరు పెద్దదే!’ అంటూ!

‘అమ్మను బులిపించీ నీ అయ్యను మరిపించావే..
కానీ చిట్టితమ్ముడొకడూ నీ తొట్టిలోకి రానీ...!’ అంటూ అందుకున్నాడు మూర్తి.

‘ఈ రాక్షసితోనే నిద్దరుండట్లేదు నాకు. అప్పుడే మరొకడా నా ప్రాణానికి? ఏవేఁ, నువ్వు రాక్షసివే కదూ?’ తమకంతో గుండెలకి హత్తుకుంటూ ముద్దాడింది చంటిదాన్ని. ఇల్లంతా ఒలకబోసేసింది బోసినవ్వుల్ని. ఎందుకంత ఇష్టం అమ్మంటే? 

సుతిమెత్తగా తొడుగుతుంది పొట్టి పొట్టి గౌనుల్ని. ఎక్కడ కాలూచెయ్యీ ఇరుక్కుంటాయో, ఆ గులాబీల దొంతర ఎక్కడ కందిపోతుందో అన్నంత సుతారం. లలితమనోహరం ఆ సేవలన్నీ! చేసే కావేరికీ, చేయించుకునే కమలాక్షికీ!

లోపలికెళ్లిన మూర్తి కాసేపటికే కాళ్లూచేతులూ కడుక్కుని బట్టలు మార్చుకొచ్చి కూర్చున్నాడు.

‘నీ దగ్గరే తాగుతోందా లేక పేచీలు పెడుతోందా?’ అన్న మూర్తి మాటలు విని ఆ శబ్దం వచ్చినవైపు తల వెనక్కంటూ పైకెత్తి చూసింది చంటిది. ఇద్దరికీ భలే నవ్వొచ్చింది ఆ చేష్టకి!

‘ఏంటే? నీమీద పితూరీలేం చెప్పకూడదా? నోరుమూసుకుని పాలుతాగి పడుండు. లేకపోతే నీకిక తొడపాశాలే!’ అంటూ వేలు చూపించాడు మూర్తి.

మళ్లీ నవ్వింది. కేరింత కొడుతూ గట్టిగా అరిచింది.

ఆ భాషే వేరు. అర్ధాలు, అనర్ధాలు, అపార్ధాలంటూ ఏవీలేని దేవభాష! మనకెలా నచ్చితే అలా అన్వయాలు తీసేసుకోదగ్గంత సరళసుందరం.

పెళ్లికాకముందు అక్క పిల్లల్ని భలే ఆడించేది తను. శ్యామల పిన్ని అంటూండేది ‘వాళ్లమ్మని పిలుస్తున్నాడు, కనబడగానే ఆ వేళ్లు చూడండి ఎలా ఆడిస్తాడో?’ అంటూ!

ఆవిడదో మైకం. బొడ్డూడని గుంటల చేతివూపులకి సైతం ఓ నిఘంటువుని తయారుచేసేస్తుంది. ప్రతీ చేష్టకీ ఓ సరికొత్త అర్ధంతో అదంతా తనకి అర్ధమైపోయిందన్న తరహాలో సాగుతుంది ఆ ప్రహసనం.

సన్నగా ముసురుపట్టినట్టు ఏడుపులోకి దిగుతోంది పిల్ల. నిద్దరో ఆకలో! 

‘అమ్మలు కన్నుల్లూ తమ్మీపూవుల్లూ
తమ్మీపువ్వులు పూయు తలిరూ వెన్నెల్లూ...

ఆ వెన్నెలను మూసేనె కన్నీటి జల్లూ...’

ఉయ్యాలకి మల్లే లయబద్ధంగా సాగుతోంది పాట. అరచేత్తో మృదువైన గుల్లదెబ్బలు వేస్తోంది నిద్రపుచ్చేందుకు. ఆ లయ ఎక్కడో పరిచయం తనకి? మరే, అమ్మ కడుపులో. నిత్యం పైగదిలోంచి వినబడే జతిస్వరమది. అదివింటూనే నిద్రలోకి జారుకునేది ఎప్పుడూ. 

ఒక్కొక్క దీపాన్నీ మెల్లిగా ఆపుతూ మరింత చీకటి చేసేసింది కావేరి. సంజచీకట్లలో సూర్యబింబంలా మెరుస్తోంది చిట్టితల్లి మోము. అరమోడ్పులవుతున్న కళ్లను ఆపలేక, మూయలేక అవస్థపడుతోంది. 

‘హాయమ్మ హాయీ నా పాపాయి
మాయింటి దీపానివే...

ఓ ముద్దు చిలుకా
ముత్యాల మొలకా...’

ముద్దులొలికే ముత్యాల మొలక ముచ్చటగా నిదరోయింది.
మూసివున్న కనురెప్పల సోయగాన్ని మురిపెంగా చూసుకుంటూ ముద్దుపెట్టుకోబోయింది.

‘అలా నిద్రపోతున్నప్పుడు ముద్దెట్టుకోకూడదు..’ అమ్మమ్మ మాట గుర్తుకొచ్చి ఆగిపోయింది.

‘ఆడుకొని ఆడుకొని అలసిపోతివా...
ఆడుకొని ఆడుకొని అలసిపోతివా...
అలుపు తీర బజ్జోమా అందాల బొమ్మ..’

ఎంత పాడినా తనివితీరదు కావేరికి!

.......జగదీశ్ కొచ్చెర్లకోట
0 comments

నా బండికథ

‘నాకైతే రాయల్ ఎన్‌‌ఫీల్డే కొనుక్కోవాలనుంది. నా యవ్వనమంతా సిటీబస్సులు, స్కూటీ పెప్పులతో గడిచిపోయింది. ఇప్పటికైనా బుల్లెట్ మీద అమ్మనెక్కించుకుని అలా ఆచ్చెళ్లాలని అనిపించకూడదా? ‘ఎంతసేపూ ఫేస్‌బుక్‌లో లైకులే తప్ప బైకుల గురించి ఏ ఆలోచనా రాదా నీకూ?’ అని పోరుపెడుతోంది మీ అమ్మ ఎప్పట్నుంచో!’

ఆపై ఇక మాటరాక గొంతు గద్గదమై ఆగిపోయాను. కొడుకులిద్దరూ ఏదో చర్చలో పడ్డారు. బయటికి వినబడకుండా గొణుక్కోవడం తెలుస్తోంది. మధ్యలో ‘ఓవరేక్షన్’ అన్న మాటేదో గుసగుసగా వినబడి తలెత్తాను. ఇద్దరూ నవ్వాపుకుంటున్నారని అర్ధమవుతోంది. ‘ఏంట్రా అంటున్నారూ?’ అని అడిగినా ఎలాగూ చెప్పరు. నాకుతెలుసు. 

కాసేపటికి పెద్దాడు అందుకున్నాడు.

‘ఎన్‌ఫీల్డ్ గురించైతే చూడక్కర్లేదు నానా! చాలా మంచి బండి. నే చెప్పేది ఈ వయసులో అంత బరువున్న బండిని వెనక్కిలాగడం అదీ కష్టంకదా అని! బోన్స్‌లో కాల్షియం డిప్లీషన్ ఉంటుంది కదా? పార్కింగ్ దగ్గర ఎప్పుడైనా ఏ మోకాళ్లో పట్టేశాయనుకో...?’ అంటూ సగంలో ఆపేశాడు. 

చరణొచ్చి చిరంజీవిని వెక్కిరించడమంటే ఇదే! ఈ జూడాగాడు నాకు కాల్షియం గురించి చెప్తాడు! అయినా వాళ్లతో వాదించదలచుకోలేదు. ఎందుకంటే మా ఇంట్లో నేను స్పీకర్ సపోర్ట్ లేని ప్రతిపక్షంలాంటివాణ్ణి. తనెప్పుడూ వాళ్లనే సమర్ధిస్తుంది.

అంచేత కాస్త సంయమనం పాటించి వెంటనే ఆ దృశ్యాన్ని కళ్లముందు కలర్లో ఊహించుకున్నాను. 

మా హాస్పిటల్ వెనకాల చెట్లకింద ‘నో పార్కింగ్’ బోర్డు ముందునించి నా బండి స్టాండ్ తీయబోతోంటే అది నామీదకి వాలిపోతున్నట్టు...

అప్పుడే సెల్ మాటాడుకుంటూ అటుగా వెళుతున్న ఇద్దరు కుర్రాళ్లు నాకు సాయం చేసినట్టు...

అదిచూసి మా నర్సులందరూ నవ్వినట్టూ... 

నేను అవమానభారంతో ‘పాంచాలీ పంచభర్తృకా!’ అంటూ ఇత్తడి చెంబొకటి విసిరేసినట్టూ...

శివశివా! ఇక చాలు!

ఆ కలని టైటిల్స్ స్టేజ్‌లోనే ఆపేసి దిగులుగా మొహం పెట్టాను.

‘అన్నయ్య చెప్పింది కూడా పాయింటే! వాడిమాట విని ఏ హీరో బండో తీసేస్కో నానా! ఎందుకొచ్చిన బుల్లెట్టు?’ అని మా రెండోవాడు లాప్‌టాపులో దూరిపోయాడు. 

ఇంతకుమునుపెన్నడూ బైక్ నడిపిందిలేదు. ఎప్పుడూ స్కూటీ, హోండా యాక్టివా.. అంటూ నాజూకు బళ్లే తోలాను. మనకి హెల్మెట్ పట్టదన్న సంగతి మీకు తెలుసుగా? ఒకవేళ ఆ కథంతా తెలియకపోతే ఆనక మళ్లీ చెప్పుకుందాం.

కానీ మావూళ్లో ఎంత ఉక్కపోస్తున్నా నల్లటి జర్కినేసుకుని..., 
కళ్లు సరిగ్గా కనబడకపోయినా నల్లటి గాగుల్స్ పెట్టుకుని..., 
తలకి పట్టకపోయినా హెల్మెట్టొకటి పెట్టుకుని...,

సాహోలో ప్రభాస్‌లా బుల్లెట్ బండెక్కి హైవే మీద అరసవిల్లి వెళ్లాలని కోరిక. 

‘ఇదేం కోరికండీ బాబూ, ఏ అరకో వెళ్లాలని అనుకోకుండా అరసవిల్లేవిఁటీ?’ అంటూ ఈపాటికే అవాక్కదీ అయిపోయి ఉంటారు. ఎందుకంటే అరసవిల్లి రోడ్డు బావుంటుంది. గేరు మార్చాల్సిన పనుండదు. పైగా పుణ్యక్షేత్రం కదూ, పుణ్యం ‘పురుషా’ర్ధం కూడా కలిసొస్తాయని!

అయినా నా సరదా తీరుద్దామని పిల్లలిద్దరూ ముందుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూముకే తీసుకెళ్లారు. రిసెప్షన్లో ఇద్దరమ్మాయిలు కూర్చున్నారు. ఒక పిల్ల పేరు నిరాశ, ఇంకొకామె నిస్పృహ. మేనేజర్ నేమ్‌ప్లేట్ మీద నిర్వేద్ అనుంది. నేననుకోవడం మేం ముగ్గురం కొనే బేరం కాదని ముందే ఊహించడంవల్ల వాళ్లంత ఉత్సాహంగా లేరనుకుంటా! అందుకే ఆ పేర్లు పెట్టుకున్నారు.

‘బండి ఎవరికోసం తీసుకుంటున్నారు?’ అన్నాడు ఓకుర్రాడు నన్ను పైనుంచి కిందదాకా పరీక్షగా చూస్తూ. మావాళ్లిద్దరూ నన్ను చూపించారు. అయితే అతనిపేరు శల్యుడు! అతగాడు మమ్మల్ని సాధ్యమైనంత నిరుత్సాహపరుస్తూ, నా బులపాటం మీద బిస్లరీ వాటర్ చల్లుతూ చివరికి మాచేతే ‘సర్లే, వద్దులే బాబూ!’ అనిపించేశాడు.

పెద్దలమాట చద్దిమూటయితే పిల్లల మాట పిజ్జామూటని సామెత! ఇంకెందుకని ఇంకొక షోరూముకి బయల్దేరాం. 

కాస్త ఖాళీగానే ఉంది ఈ షాపు. హండ్రెడ్ సీసీవి, వన్‌ఫిఫ్టీ సీసీవి బళ్లు చూపిస్తున్నాడు షాపబ్బాయి. 

ఒక మోడలేదో కాస్త హైట్ తక్కువగా ఉన్నట్టనిపించి దానిగురించి వివరాలు చెప్పమన్నాం. నేను ఆ బండిగురించే ఎందుకడిగానో కారణం మీకు తెలుసు. కేవలం ఆ మాటదగ్గరే ఆగిపోయి కామెంట్లవీ పెట్టెయ్యకుండా ముందు పోస్టంతా చదవండి మీమొమం!

సరే, అతగాడేమో మెల్లిగా మా దగ్గరకొచ్చి బండి సీటు మీద ప్రేమగా రాస్తూ ‘ఈజీగా త్రిబుల్స్ ఎలిపోవచ్చు సార్! పికాప్ అదిరిపోద్ది!’ అన్నాడు.

నేను వెంటనే రెండుచేతులతో రెండు చెవులూ మూసేసుకుని ‘శివశివా!’ అంటూ ఆర్తనాదం చేశాను. అతను ఉలిక్కిపడి బండిమీంచి చెయ్యి తీసేశాడు.

వెంటనే మా పెద్దాడు అందుకున్నాడు....

‘అపరిచితుడు సినిమాలో రూల్స్ రామానుజం మాలూమ్ హై తేరెకూ? మా డాడీ అదే టైపు. పైపెచ్చు విక్రమ్ పుట్టిన సంవత్సరమే, అదే నక్షత్రంలో పుట్టారు. రోడ్డుమీద డ్రైవ్ చేస్తూ మొబైల్ మాటాడేవాళ్లని ముక్కచివాట్లు పెట్టడం, రాంగ్ సైడ్ వచ్చేవాళ్లని రాచిరంపాన పెట్టడం అంటే ఆయనకి చాలాచాలా ఇష్టం. అటువంటి మా నాన్నతో త్రిబుల్స్ వెళిపోవచ్చంటావా? ఇంకో విషయం... అది త్రిబుల్స్ కాదు. ట్రిపుల్స్!’ అని ఊపిరి తీసుకోవడానికి ఆగాడు.

అప్పుడు నేను చెవులమీంచి చేతులు మెల్లిగా తీసి ‘మైలేజ్ ఎంతొస్తుందో?’ అన్నాను.

అతనీసారి పెట్రోల్ టాంక్ మీద ఆప్యాయంగా నిమురుతూ ‘కంపినీవోడు సెవెంటీ అంటాడుగానండీ మనకి రణింగ్‌లో యాఫై వరకు ఈజీగా వచ్చేస్తద్సార్!’ అన్నాడు.

ఈ కుర్రాడు ఇంతకుముందు అచ్యుతాపురం సంతలో ఆవులవీ అమ్మేవాడనుకుంటాను. వాళ్లుకూడా ఇలాగే, అమ్మకానికి తీసుకొచ్చిన దూడలమీద ఇంత మమకారమూ చూపిస్తూ, ఇలాగే గంగడోలదీ రాస్తూ ఉంటారు.

ఇంకాసేపట్లో మేంగనక ఆ బండిని ఖాయం చేసి తీసుకుంటామనే క్షణాల్లో దాన్ని వదల్లేక ఇతగాడు ఏకంగా కళ్లనీళ్ల పర్యంతమైపోతాడేమో అనిపించింది. 

కానీ మావాళ్లిద్దరికీ ఆ బండి డిజైనదీ నచ్చలేదు. మరీ ప్లెయిన్‌గా ఉందిట! ఒంపుసొంపులేమీ లేవుట! ఎదుగుతున్నారుగా? సరే, సరదాపడనీ!

సరేలెమ్మని బయల్దేరబోతూండగా ఆ కుర్రాడు ‘కొత్తమోడలొకటుంది చూద్దురు రండి!’ అంటూ లోపలి వరండాలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక్కత్తీ ఒంట్రెత్తుగా పార్క్ చేసివున్న నల్లటి నిగనిగలాడే బండిని చూపించాడు. దీన్నైతే ఏకంగా కౌగలించుకుని మాటాడ్డం మొదలెట్టాడు. వీడి దుంపతెగా! తిన్నగా నిలబడలేడా ఏం? అనుకుని మనసులోనే నవ్వుకున్నాను. 

ఆ బండి నాలాంటి బాధ్యతాయుతమైన అంకుళ్ల కోసం తయారైంది కాదు. కాలేజీలో చేరిన మర్నాడే నాన్నని సతాయించి కొనిపించుకుని, తీరా స్టిక్కరింగ్ మాత్రం ‘డాడ్స్ గిఫ్ట్’ అని చేయించుకునే యూత్ కోసం తయారుచేసిన స్టైలిష్ బండది!

సడన్‌గా ఆ బండిని చూసి మావాళ్లిద్దరూ నవ్వుకోవడం కనబడింది నాకు. ‘చెప్పండ్రా!’ అంటే ఏంలేదంటారు. వాళ్లల్లోవాళ్లు గుసగుసగా ‘ఇలియానాలా ఉంద’ని అనుకోవడం వినబడింది. సరే, కుర్రాళ్లు కదా? సిగ్గుపడుతున్నారు. ఎక్కువ రొక్కించకుండా వదిలెయ్యడం మంచిది.

ఎందుకో ఆ షాపులో మనకు ఏదీ నప్పక కాస్తదూరంలోనే ఉన్న ఇంకొక షోరూముకి వెళదామని బయటికొస్తోంటే ఎంట్రన్స్ దగ్గర ఎవరో ఒకాయనకి మేమిందాక మొట్టమొదట చూసిన బండినే చూపిస్తూ ‘ఈజీగా త్రిబుల్స్ ఎలిపోవచ్చు సార్! పికాప్ అదిరిపోద్ది!’ అంటున్నాడు ఆ కుర్రాడు మళ్లీ!

ఆయన మాస్క్ తీసి నవ్వుతూ ‘నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ని తమ్ముడూ!’ అన్నాడు. ఇక అక్కడ నిలబడ్డం అనవసరమని బయటికొచ్చేశాం. 

ఇహ ఈ జన్మలో మారడు వీడు!

ఈ రెండో షాపువాళ్లు చాలా బిజీగా ఉన్నారు. మేం ముగ్గురం గుమ్మంలో అప్పుడే ప్రత్యక్షమైన బ్రహ్మవిష్ణుమహేశ్వరుల్లా పావుగంటపాటు కదలకుండా నిలబడే ఉన్నా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. 

‘పదండ్రా వెళిపోదాం!’ అన్నాను మోహన్‌బాబులా కోపంగా. అయితే మా మనోజ్‌గాడే సర్దిచెప్పి, ఒకబ్బాయిని బలవంతంగా ఆపి మాట్లాడాడు. 

అతను మమ్మల్ని మేడమీదకి వెళ్లి బండి డిజైన్ సెలెక్ట్ చేసుకుని కిందకొచ్చేస్తే బిల్ చేయించేస్తానన్నాడు. 

‘ఇంత స్పీడుగా ఉన్నారేంటి నాన్నా వీళ్లూ? మనకి నచ్చడంతో సంబంధం లేదా?’ అంటూ ఆశ్చర్యపోయాడు విష్ణుగాడు.

‘సర్లేరా, వాళ్లకలా సాగుతోంది. అవసరం మనది, పదండి డాబామీదకి!’ అని బయల్దేరదీశాను.

మొత్తానికి మా ముగ్గురికీ నచ్చిన బండిని సెలెక్ట్ చేసుకుని కిందకొచ్చాం.

వెంటనే ఒకబ్బాయి పెన్నూ, పేపరూ పట్టుకుని ఎదురుగా కూర్చుని ఇన్స్టాల్‌మెంటదీ ఎంతెంత పడుతుందీ లెక్కలు కట్టడం మొదలెట్టాడు. నేనదేదీ వద్దని వారించాను. 

‘ఏట్సార్, ఫైనాన్స్ ఒద్దా?’ అన్నాడు ఆశ్చర్యంగా! ఆ మాట వినగానే షాపులో తలొంచి ఏవేవో పనులు చేసుకుంటూ బిజీగా ఉన్న పదిపదిహేనుమంది ఒకేసారి ఆశ్చర్యంతో తలెత్తి చూశారు.

‘అవసరంలేద’ని చెప్పగానే ఆ కుర్రాడు బ్రతిమాలడం మొదలెట్టాడు.

కాస్సేపయ్యాక గోముగా అడిగాడు. 

చివరికి అలిగి వెళిపోయాడు. 

మళ్లీవచ్చి నిష్ఠూరాలడాడు. 

ఇహ శాపనార్ధాల్లోకి దిగుతాడేమో అని అనుకునే సమయానికి మేనేజర్ వచ్చాడు. 

‘సార్ వద్దంటంటే ఎందుకురా వెంకటీ, అన్నిసార్లడుగుతావు? కొందరంతే!’ అన్నాడు.

ఈ ‘కొందరంతే’ అంటే ఏమిటో? దానికన్నా తిట్టడమే నయంలా ఉందికదూ? సరే, నా మాట ఇంట్లో కాకపోయినా కనీసం ఇలాంటిచోటయినా నెగ్గించుకోవాలి కదా?😝 అంచేత పట్టుబట్టి ఏ ఫైనాన్సూ లేకుండానే ఓ బండివాణ్ణయ్యాను.

నాకు మా పెద్దాడే నేర్పించాడు బైక్ ఎలా నడపాలో. కేవలం ఒక్కరోజులోనే అలవాటైపోయింది. ఇప్పుడైతే చిన్న చిన్న ప్రయోగాలు సైతం చేసేంత తెగింపు వచ్చేసింది కూడా! కానీ చెయ్యట్లేదులెండి. 

బండిమీద నన్ను చూసిన మా చంటిగాడు బుల్లెట్ ఎందుకు తీసుకోలేదని నిలదీశాడు. పోన్లెండ్సార్, మంచిపని చేశారు, పెట్రోలు రేట్లు పెరీపోయాయి కాబట్టి ఇదే బెటరంటూ చివరికి కన్విన్సయ్యాడు. 

మొదటిసారి తనని బండిమీద ఎక్కించుకున్న తరవాత ‘ఎలా ఉన్నాంరా, గులాబీలో పాట గుర్తొస్తోందా?’ అనడిగాను మావాళ్లని.

‘లేదు నాన్నా, రాఘవన్‌లో పాట గుర్తొస్తోంది!’ అన్నాడు మావాడు.

అట్లుంటది వాళ్లతోని! ఇదీ నా బండికథ!

.....జగదీశ్ కొచ్చెర్లకోట
0 comments

వడియం

‘ఇవాళ సాంబారు పెడుతున్నావా లేక ముక్కలపులుసా?’ వంటింట్లోకొచ్చి అడిగాడు కామేశ్వర్రావు. పార్వతి స్టవ్ మీద చామదుంపలు వేపుతోంది. 

‘సాంబారు కోసమే ముక్కలన్నీ తరిగుంచమన్నాను రాజ్యాన్ని. పన్నెండింటికల్లా అన్నం పెట్టేస్తాను. కాసేపలా టీవీ చూడండి!’ అంది భర్తని వంటింట్లోంచి ఎలాగైనా పంపించెయ్యాలని.

చెక్కబీరువా తలుపులు తెరిచి పాత బోర్నవిటా సీసాలోంచి నిమ్మబద్దొకటి తీసుకుని నోట్లో వేసుకున్నాడు. ఆ పులుపుకి కన్నొకటి మూసేస్తూ ‘సాంబారంటున్నావు మరి వడియాలున్నాయా?’ అన్నాడు అనుమానంగా.

‘ఎప్పుడు కావాలంటే అప్పుడు ఊడిపడతాయా వడియాలూ? ఉన్నా వాటిని ఉండనివ్వరుకదా? పెట్టిన వారంలోపే పటపటలాడించేస్తారు!’ అంది నిష్ఠూరంగా. అలా అందేగాని ఆయన సరదా చూసి మనసులో కాస్తంత బాధపడింది పార్వతి.

పిచ్చిమనిషి. ఈ తిండియావ తప్ప వేరే దురలవాట్లూ, అవలక్షణాలూ లేవు. ఎంత సాయమైనా చేస్తాడు బంగారుతండ్రి. చుట్టుపక్కల పిల్లలందరి పుస్తకాలకి అట్టలెయ్యడాలు, వీధిలో వాళ్లతో కలిసి చలివేంద్రాల్లో మజ్జిగలు, మంచినీళ్లూ పంచడాలు, వంటింట్లో తనకి కూరలన్నీ తరిగిపెట్టడాలు... ఒకటేమిటి, సమస్తమూ సేవానిరతితో చేసేంత హనుమజ్జాతకం కామేశ్వర్రావుది. 

ఒక్కక్షణం కాలునిలవదు. ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకం. వీధిలో సమస్యలన్నీ తనవిగానే భావిస్తాడు. తెల్లారగానే ఓ నలుగురైదుగురు తయారవుతారు గుమ్మంలో!

‘కావేఁస్సర్రావుగారు లేరామ్మా?’ అంటూ!

వీధి కుళాయిల లీకులనో, కాలవలు పొంగిపోడాలో, వరసలో ఏదో ఒక వీధిదీపం వెలగట్లేదనో రోజూ సమస్యలతో వస్తారు. ఈయనే పరిష్కారం. పనయ్యేదాకా పడుకోడు. ఖాళీగా ఉన్నా గుడికెళ్లి కూర్చోడు. మానవసేవకే ఎక్కువ మొగ్గుచూపుతాడు.

వంటింట్లోంచి తొంగిచూసింది పార్వతి. సోఫాలో అసహనంగా కూర్చుని టీవీ చూస్తున్నాడాయన.

‘....ఈ సంఘటణపై స్పందిస్తూ విద్యాశాకా మంత్రి ఇళా అన్నారు...’

తెలుగు మాస్టారిగా పనిచేసి రిటైరైన కామేశ్వర్రావుకి ఆ వార్తలు చదివే పిల్లని చెడామడా తిట్టాలనిపించింది. పక్క ఛానల్ మార్చాడు. పాత పాటొకటి వస్తోంది..

‘బిడియమేలా ఓ చెలీ... పిలిచె నిన్నే కౌగిలీ...!’

బిడియం అని వినగానే మళ్లీ వడియం గుర్తొచ్చిందాయనకి. వెంటనే టీవీ కట్టేసి లేచాడు.

‘ఇదిగో, నేనలా బొంకులదిబ్బదాకా వెళ్లొస్తా!’ చొక్కా బొత్తాలు పెట్టుకుంటూ లోపలికొచ్చాడు కామేశ్వర్రావు.

‘హాయిగా ఇంటిపట్టున కూర్చోక ఎందుకా తిరుగుళ్లు?’ అంది నవ్వుతూనే. ఆయనా ఓ నవ్వు నవ్వేసి బయటపడ్డాడు. ఇద్దరికీ సర్వసాధారణమే అదంతా!

బొంకులదిబ్బంతా కూరలతో నిండిపోయింది. ఎటుచూసినా పచ్చగా మెరిసిపోతూ ఆనపకాయలు, బీరకాయలు, దొండాబెండ! నిండా పరచుకున్న కాయగూరల మధ్య కాషాయవర్ణంలో కేరట్లు. గాఢత నిండిన రంగులంటే అమిత ఇష్టమున్న చిత్రకారుడి చేతిలోంచి బయటపడిన పెద్దసైజు కేన్వాస్‌లా ఉంది ఆ దిబ్బంతా! 

మొన్న పెద్దపండక్కి పార్వతికి కొన్న చెంగావిరంగు చీర, దానికున్న ఆకుపచ్చంచూ జ్ఞాపకం వచ్చాయి ఆయనకి. చేతిసంచితో నడుచుకుంటూ ఎవరు పిలిచినా పలక్కుండా వెళ్తున్నాడు.

డెబ్భయ్యేళ్ల వయసులోనూ ఎండకి కూర్చుని పొట్లకాయలమ్మే అచ్చియమ్మ దగ్గరకే మొట్టమొదట వెళతాడు కామేశ్వర్రావు.

‘ఏటి పంతులుగోరూ, మొన్నట్టుకెల్లిన కాయిలన్నీ తినీసేవేటప్పుడే? ఆయమ్మెలా వేగుతుందో నీతోని! ఏటి, ఇమ్మంతరా ఓ అరకేజీ?’ అంది లేతగా నవనవలాడే రెండు కాయల్ని పటుక్కు పటుక్కుమనిపిస్తూ.

‘నీ దిష్టే తగిలింది అచ్చియమ్మా నాకు! నిన్నంతా కడుపుబ్బరం. ఇంత మజ్జిగాన్నం తప్ప ఇంకేం తిన్లేదు తెలుసా?’ అన్నాడు పొట్లకాయల్ని సంచిలో పడేసుకుని.

‘మాతండ్రే! నువు సల్లంగుండాల! నీలా తినీవోల్లిప్పుడెవరూ నేరు బావూ!  ఇంద పట్టు!’ అంటూ మరో కాయ కొసరు పడేసింది. అది అభిమానంతో ఇచ్చిన కాయ. దాని రుచి వేరు.

ఆకుకూరలూ, దోసకాయలు, మావిడికాయలూ కొనేశాడు. ఆయన కళ్లు దేనికోసమో వెదుకుతున్నాయి. మొత్తం కలియదిరిగాడు. బాగా ముందుకి, ఈవార మెయిన్‌రోడ్డు ముందువరకూ వచ్చాక కనబడ్డాడు నాయుడు. 

అతని దగ్గరుంటుంది తనకి కావలసిన సరుకు. బుజ్జిగా గునగునలాడుతూ ఒళ్లంతా విభూతి పూసుకున్న శివలింగంలా చిన్న బూడిదగుమ్మడి కాయను చూడగానే ఆయన మనసు కేరింత కొట్టింది. 

ఉద్యోగంలో పదోన్నతులు, పిల్లల వృద్ధీ, మనసుకు హత్తుకునే సినిమా.. ఇలా జీవితాన మైలురాళ్లన్నింటికీ ఎంతెంత సంబరపడతాడో ఇలా కూరల్ని చూసినా అంతే ఉబలాట పడిపోతాడు. దాచుకోలేనంత అల్పసంతోషి!

‘పట్టండి మేషారూ! పిల్లలెలా ఉన్నారు? పండక్కొచ్చారా?' బుల్లి గుమ్మడికాయని శుభ్రంగా తుడిచి ఆయన సంచిలో పడేస్తూ కుశలం అడిగాడు నాయుడు.

‘ఆ వచ్చారు. కొడుకొస్తే కోడలు రాలేదు, కూతురొస్తే మనవలు రాలేదు. ఎవరికీ ఖాళీల్లేవు నాయుడూ! రోజూ ఆ వీడియోల్లో చూసుకుంటూ గంటలు గంటలు మాటాడేసుకుంటారు. ఇవాళ మాకు వర్షం పడిందని, నేనిందాక పకోడీలేశానని, పొద్దున్న బాత్రూములో బల్లిని చంపేశాను, ఫరవాలేదా? అనీ.. ఒకటికాదు‌. అన్ని కబుర్లూ చెప్పేసుకుంటారు. ఇహ రాకపోతే మాత్రం బెంగెందుకూ?’ అన్నాడాయన గుక్కతిప్పుకోకుండా.

‘ఎక్కడుంటే ఏట్లెండి, తగూల్లేకుండా ఉంటే అదే మేలు!' అన్నాడు నాయుడు తియ్యగుమ్మడి బద్దలు రెండు సంచిలో వేస్తూ. అవీ అభిమానపు తీపి గుమ్మడే! పాతసినిమాల్లో గుమ్మడిలా మమకారాన్ని పంచేదే!

ఇంటికి రాగానే కూరలసంచీ ఓమూలగా పెట్టి అందులోంచి బుజ్జి శివలింగాన్ని బయటికి తీశాడు. పిల్లిలా అడుగులేస్తూ వంటింట్లోకెళ్లి పార్వతికి కనబడేలా మంచినీళ్ల బిందెపక్కన పెట్టేసి మళ్లీ వచ్చి సోఫాలో కూర్చున్నాడు కామేశ్వర్రావు.

బయట బాల్కనీలో తువ్వాళ్లారేసి లోపలికొచ్చిన పార్వతికి బూడిదగుమ్మడి కనబడింది. అంత చిన్నకాయను చూడగానే నవ్వొచ్చింది. కానీ బెట్టుగా మూతి బిగించి హాల్లోకొచ్చి ‘ఎవరి ముక్కులోకిటా అంత చిన్నకాయ?’ అంది.

‘మరీ ఎక్కువంటే నీకు కష్టమని చిన్నదట్టుకొచ్చా! పిండి ఉందికదా?’ అన్నాడు గొణుగుతున్నట్టు.

‘సర్లెండి, మీమటుక్కు ఓ పదిపదిహేను వడియాలు వస్తాయేమో! మళ్లా వారందాకా అడక్కండి!’ అనేసి ఫ్రిజ్‌లోంచి మినప్పిండి తీసింది.

పక్కకి తిరిగి చూస్తే ఇంకేముంది? చక్కగా సన్నటి పొడుగాటి ముక్కలు తరుగుతూ కనబడ్డాడు భర్త.

‘చిన్న గంటుపెట్టేసి వెళిపోతే నే తరుక్కుంటా కదా? మీకెందుకివన్నీ?' అంది అభిమానంతో.

‘తినేది నేనేగా? సర్లే, నీకూ ఓ రెండిస్తాలే!’ అని చిరునవ్వు నవ్వుతూ ముక్కలన్నీ మూటగట్టి ఆ మూటమీద చిన్న రాతిపొత్రాన్ని పెట్టాడు.

మర్నాడు ఉదయానికల్లా ముక్కల్లో నీరంతా దిగిపోగానే పిండిలో ఇంగువ, పచ్చిమిరపకాయలూ ముద్దచేసుకుని కలిపి, అందులో ఈ ముక్కలు కలిపేసింది. ఈలోగా ఆయన కొట్టుగదిలోంచి పెద్దపీట తీసుకొచ్చేశాడప్పుడే! దానిమీద వడియాలు పెట్టేశాడు. ఇద్దరూ కలిసి సాయంపట్టి పీటని ఎండలో పెట్టేశారు.

అదిమొదలు. ఇక వాటిచుట్టూనే తిరుగుతున్నాడు కామేశ్వర్రావు. ఈ వడియాలకోసం తప్పిస్తే అంతటి ఎండల్ని ఎవరుమాత్రం ఇష్టపడతారు? లోపలికొస్తాడు, మళ్లీ పదినిముషాలకే బయటకెళతాడు. పార్వతి అదంతా గమనిస్తూనే ఉంది. 

నిన్నటిది కాకుండా మళ్లీ మరింత ఘుమఘుమలాడే సాంబారు పెట్టింది. ప్రతిక్షణమూ ఆయన ఇష్టాన్నే తలుచుకుంటూ వేసే ప్రతి పదార్ధాన్నీ ఆత్మీయంగా వేస్తూ చేస్తుంది వంట.

భోజనాలవేళ ఆ పీటమీంచి ఓ అరడజను వడియాలు తీసి మూకుట్లో వేపింది. ఇంకా కాస్త పచ్చి మిగిలేవున్నా ఆయనకలా కూడా ఇష్టం.

వేడివేడి అన్నం మంచుతో చేసిన శివలింగంలా పొగలు కక్కుతోంది. దానికి నేతితో అభిషేకం చేశాడు. అటుపిమ్మట ఒకటొకటిగా ఆదరువులన్నీ అందులో ఐక్యమైపోతూంటే తన్మయత్వంతో తడిబారిన కళ్లతో తృప్తిగా భోంచేస్తున్నాడు. 

వడియాల్ని రంగరించి పులుసన్నం ముద్దలు ఆబగా తింటున్నాడు. పొలమారి ఉక్కిరిబిక్కిరి అయితే మృదువుగా కోప్పడింది పార్వతి.

‘ఎక్కడికి పోతాయి ఆ వడియాలూ? నిమ్మళంగా తినండి!’ అంది మంచినీళ్లందిస్తూ.

‘ఇంద్రుడు తలుచుకుంటున్నాడే నా భాగ్యాన్ని చూసి! అక్కడ ఇవన్నీ ఉండవుగా? నే వెళ్లేటప్పుడు పట్టుకెళ్లాలి!’

‘ఛ నట్టింట్లో కూర్చుని ఏమ్మాటలవి! కమ్మగా తినండి. మీ మంచిమనసే మీకు శ్రీరామరక్ష!’ అంటూ ఆయన చూడకుండా కళ్లు తుడుచుకుంది పార్వతి.

......జగదీశ్ కొచ్చెర్లకోట

0 comments

రోజూ ఇంతే

‘ఏండీ, టిపిన్ రెడీ అయిందా? అప్పుడే ఎమ్దింపావూ!’ స్నానంచేసి బయటికొచ్చి వంటింట్లో ఉన్న వంటావిడకి వినబడేలా అరిచాను.

‘నువ్వెళ్లి బట్టలేసుకుని రా! ఈలోగా రెడీ చేస్తారు! అరగంటదాకా అవ్వదుగా నీ మేకప్పు?’ అంది సోఫాలో కూర్చుని రామకోటి రాసుకుంటున్న మా ఆవిడ. 

పాత సినిమాల్లో ప్లీడరు గుమాస్తాలా జారిపోయే కళ్లజోడులోంచి పైకిచూస్తూ నవ్వొకటీ!

అమ్మనీ.. ఎంతమాటనేసింది! లాభంలేదు. కాస్త క్లుప్తంగా ముగించి, ఇవాళ ఎలాగైనా ఇరవైతొమ్మిది నిమిషాలకే బయటపడిపోవాలి. ఇంత వయసొచ్చి అద్దం ముందు అలంకారాల విషయంలో మాటపడటం కంటే అవమానమేముంటుంది?

స్నానానంతరం గదిలోకి రాగానే మొత్తం లైట్లన్నీ వేసేస్తాను ఎప్పుడూ. 

‘సిఎమ్ఆర్ షాపింగ్ మాల్‌లా మొత్తం అన్ని లైట్లూ వేసెయ్యాలా? డ్రెస్సింగ్ టేబుల్ ముందున్న లైటొక్కటి చాలదా?’

అని అశరీరవాణి పలికింది. అటువంటి మాటలకి భయపడ్డానికి నేనేమన్నా కంసుణ్ణా? ఇగ్నోర్ ఐసే!

బ్లూటూత్ స్పీకర్‌లో అదేదో పాటొస్తోంది... ‘సూర్యూ...డివో, చంద్రూ...డివో’ అంటూ! 

పాటకి సింకవుతుందని డియో కొట్టేసుకున్నాను. ఆనక పౌడర్ డబ్బాలోంచి ఉధృతంగా పడుతున్న పౌడర్ అలా ధారాళంగా జారి, నాచేతిలోకంటే మా విజయనగరం నియోజకవర్గంలోనే ఎక్కువగా పడింది. 

కంప్యూటర్ స్క్రీన్‌మీద, నా రెండు ఫోన్లమీద, బీరువాలో పెడదామనుకుని వారంరోజులుగా బద్ధకిస్తున్న ఇస్త్రీ బట్టలమీద, మావూరి గంటస్థంభంమీద... ఇలా విశ్వాంతరాళాలయందూ పౌడరంతా వ్యాప్తిచెంది గది మొత్తం అఘోరాల అడ్డాలా తయారైంది.

నేనేమో తను కనిపెట్టడానికి కూడా ఆస్కారం లేనట్టుగా శుభ్రంగా తుడిచేద్దామని ఆ పక్కనేవున్న చున్నీతో ఇలా మొదలెట్టానోలేదో...

అదిగో, ఆ దుర్ముహూర్తంలోనే తలుపు తట్టింది తను. మనకేమో దుస్తులు మార్చుకునే సమయంలో ‘పూర్తి’ స్వేచ్ఛ కావాలి. ఇలా మధ్యలో ఇంట్రబెల్సవీ ఉంటే చిరాకు. అయినా ఖచ్చితంగా వస్తుంది తను. ఎందుకంటే తనకి ఆ సమయంలోనే కొన్ని జీవితకాలపు కీలక నిర్ణయాలకు సంబంధించిన విషయాలు జ్ఞాపకం వస్తాయి.

నేను సితార సినిమాలో భానుప్రియలా తలుపు సగమే తీసి, తల మాత్రమే బయటపెట్టి ‘ఏంకావాలి?’ అనడిగాను.

‘నీతో మాటాడాలి. తలుపు తియ్!' అంటూ తనే తీసుకుని.. సారీ, తోసుకుని లోపలికొచ్చేసింది.

గదిలోకొస్తూనే ‘కెవ్....!’ అనే ఆర్తనాదస్వరం వినిపించింది.

‘ఏంటిదంతా? పౌడరుందా ఖాళీ చేసేశావా? నువ్వు రాసుకున్న దానికంటే బట్టలమీదా పెట్టెలమీదా పోసిందే ఎక్కువుంది!’ అంటూ అటూఇటూ చూస్తోంది. 

‘ఏంకావాలి బన్నీ?’ అనడిగాను.

‘నువ్వు వెనకాల దాచిన చున్నీ!’ అంటూ తీసుకుంది.

అది అశోకా శాండల్ పౌడర్ వాసనేసింది. 

‘దీంతో తుడిచావా?’ 

కోర్టులో జడ్జిగారు ‘ఈ కత్తితోనే పొడిచావా?’ అని అడిగినట్టు అడిగితే ఏంచెప్తాం? అవునంటూ అటికి పిడతలా బుర్రూపాను.

సరే, తనూ ఇహ చేసేదేంలేక ఆ మెత్తటి, వెచ్చటి పొడి చున్నీతోనే అదంతా తుడవడం మొదలెట్టింది.

‘ఏదో మాటాడాలని చొరబడింది ఇవన్నీ తుడవడానికా?' అంటూ నీళ్లని న్యూట్రిన్ చాక్లెట్లా నముల్తూ ప్రశ్నించాను.

‘అవును, మర్చేపోయాను. ఏంటి క్లియర్‌గా చెప్పు జగదీషూ, మనం ఇల్లు కట్టుకుందామా వద్దా?’

‘నేను పదినిమిషాల్లో గీత చేసిన ఇడ్లీలు తినేసి బండెక్కకపోతే హాస్పిటలుకి చేరుకోలేను. మా బయోమెట్రిక్ పద్ధతంతా ఇప్పుడు మారిపోయింది. తొమ్మిది దాటి ఫింగర్ వేసేవాళ్లని అందరూ నేరంనాదికాదు ఆకలిది సినిమాలో ప్రభని చూసినట్టు చూస్తున్నారు. 

మా ఆర్.ఎమ్.ఓ. మేడమయితే అటెండెన్స్ రిజిస్టర్లో ఆకుపచ్చింకు పెన్నుతో గుండ్రంగా, అందమైన చుక్కలు పెట్టేస్తున్నారు. పోయిన సంక్రాంతికి అవన్నీ కలిపి మంచి ముగ్గొకటి పెట్టించాను ఆవిడచేత. ఇంత సంక్లిష్టమైన సందర్భాలలో ఇటువంటి అనుచితమైన చర్చలవీ అసంగతమని నా అభిప్రాయం! ఏమంటావు?’ అంటూ తలకాయ దువ్వుకోడం మొదలెట్టాను.

నా భాషకి నాకే భయమేసింది. మరీ పరవస్తు చిన్నయసూరిలా తయారవుతున్నాను ఈమధ్య!

‘నీ తలకాయ్!' అనేసి బయటికెళిపోయింది.

అవును. నా తలకాయేగా దువ్వుకుంటున్నానూ?

పళ్లెం ముందేసుకుని కూర్చున్నాను. ఇడ్లీ కుక్కరు మూతనిలా తియ్యగానే వైకుంఠలోకం టైపులో పొగలు వ్యాపించాయి. 

ఆవిరికుడుముని ఆర్టిస్టిక్‌గా కొయ్యడంలో అందెవేసిన చెయ్యి తనది. ఇలాంటివాళ్లు ఆస్తుల పంపకాలవీ ఎంచక్కా చెయ్యగలరు. తూకమేసి చూసినా ఓ ముక్క ఎక్కువా రాదు, ఇంకొకటి తక్కువా కాదు. తనని సర్‌ప్రైజ్ చేద్దామని అదే పని నేనొకసారి చేశాను.

రామాపురం అను గ్రామంలో ధర్మయ్య నలుగురు కొడుకులూ ఆస్తి తగాదాలతో కొట్టుకుచచ్చేలా వచ్చాయి ముక్కలన్నీ! అప్పట్నించి ఇక ఈ కటింగులవీ మనకనవసరమని మానుకున్నాను. 

చెట్నీలేం చేసిందీ? వేరుశనగా, అల్లం ఎలాగూ రొటీను. కాస్త పుల్లపుల్లగా, కారంకారంగా తగిల్తే బావుంటుంది కదా? 

వెంటనే ‘మాగాయలోన పెరుగేసుకుంటా...!’ అంటూ ఎలుగెత్తి పాడగానే చిన్న కప్పులోకి ‘ఇంత’ మాగాయ తీసుకుని దాంట్లో ‘అంత’ పెరుగేసి కలిపిచ్చింది వంటావిడ.

ఇటువంటి హడావిడిలో కొత్తిమీర గురించి అడగడం అనవసరమని ఊరుకున్నాను. మామూలుగా అయితే పాపం సేమ్యా పాయసంలో తప్ప అన్నిట్లోనూ వేస్తుంది మా కొత్తిమీరా జాస్మిన్!

అల్లప్పచ్చట్లో బెల్లంకంటే అల్లమెక్కువై కల్లల్లోంచి నీల్లొచ్చేసి తల్లడిల్లిపోయాను. సాయంత్రం వచ్చాక దాన్ని పునఃప్రక్షాళన చెయ్యమని ఆర్డరేశాను.

అల్పాహారం అనల్పంగా తీసుకోవాలి. లేకపోతే నాలుగింటివరకూ ఉండడం కష్టమవుతోంది. మధ్యలో ఓటీలోంచి బయటికొచ్చి ఓ టీ తాగుతానంతే! పన్నెండయ్యేసరికి ఆత్మారాముడు అగ్గిరాముడై కూర్చుంటున్నాడు. 

‘అక్కడ నీలం మూత డబ్బాలో జంతికలున్నాయి. కవర్లో వేసి పట్టుకెళ్లు. మరీ నాలుగుదాకా అంటే ఉండడం కష్టం’ అంటూ రామకోటి పుస్తకాన్ని రాములవారి పాదాల దగ్గరుంచి నాదగ్గరకొచ్చింది.

‘జంతికలంటే గుర్తొచ్చింది, ‘ఒకపరి’ పాట చూశావా బన్నీ?’ అంటూ జనాంతికంగా అడిగాను.

‘నీకివన్నీ మాటాడ్డానికి టైముందేం?’ అంటూ కథ నచ్చని హీరో రచయితని అవమానించినట్టు స్టోరీ సిట్టింగ్ మధ్యలోనే లేచెళిపోయింది.

ఇక చేసేదేముంది? కథని సంచిలో పడేసుకుని హాస్పిటల్‌బాట పట్టాడీ రచయిత!

ఇవి ప్రతిపొద్దు ముచ్చట్లు.

.......కొచ్చెర్లకోట జగదీశ్
0 comments

పూర్ణా హాలు

‘ప్లీజ్‌రా, ఒక్కణ్ణీ వెళ్లడానికి మనసొప్పడంలేదు. రావచ్చుగా? తొమ్మిది పాటల్రా! అన్నీ సూపర్‌హిట్టే! వాణిశ్రీని చూడాలంటే బ్లాకండ్ వైట్ సినిమాల్లోనే చూడాలి. రారా! అప్పుడే పావుతక్కువ తొమ్మిదైపోయింది...’

ఇహ వీడు వదలడు. పూర్ణాలో ఆత్మీయులు సినిమా ఆడుతోందని ఏవిఎన్ బస్టాప్ దగ్గర పోస్టర్ చూసి తెలుసుకున్నాడు మావాడు.‌

అదేం విడ్డూరమో ఆ సినిమా ఎప్పుడొచ్చినా కొత్తగా మళ్ళీ పోస్టర్లు ప్రింట్ చేసేవారనుకుంటా, నాగేశ్వరరావు, వాణిశ్రీ అందంగా రంగుల్లో నవయవ్వనంతో మిసమిసలాడుతున్నారు. 

బద్ధకంగా లేచి, కట్టుకున్న లుంగీ దండెం మీద పడేసి పాంటూచొక్కాల్లో దూరాను. హవాయి చెప్పులు చాల్లే పూర్ణాకి. ఆవులింతలొస్తున్నా ఆపుకుంటూ హాస్టల్ బయటికొచ్చాను. 

వాడేదో బండికోసం ప్రయత్నం చేశాడుగానీ దొరకలేదల్లే ఉంది. దేభ్యం మొహవేఁసుకుని వచ్చాడు.

‘సారీరా, నడిచిపోదాం. ఎంతా, గట్టిగా పావుగంటలో వెళిపోవచ్చు. అంతా డౌనేగా?’ అన్నాడు కాస్త దూరంలో నిలబడి. తంతానని భయం.

‘ఇట్నించి డౌనేరా, అట్నించి వచ్చేటప్పుడు తీరిపోతుంది!’

‘రేపు సెలవేకదరా? వచ్చి పడుకోడమేగా? పదపద, లేటవుతోంది!’ పరుగులు తీయించాడు.

మేం లోపలికి అడుగుపెట్టేటప్పటికి సారథీ స్టూడియోస్ అన్న పేరు పడింది తెరమీద. గబగబా కూర్చుండిపోయాం. ఒక్క రీలు కూడా మిస్సవ్వకుండా చూస్తేనే చూసిన తృప్తి. లేకపోతే ఏదో బెంగగా ఉంటుంది.

వాతావరణం చల్లగానే ఉన్నా ఫ్యాన్ల గాలి సరిపోవట్లేదు. హాలు పరిసరాలు మాత్రం విశాలంగా ఉంటాయి. చుట్టూ పెద్ద ప్రాంగణం. 

బాగా ఈ చివర సీట్లలో కూర్చున్నాం ఇద్దరం. హాల్లో అక్కడక్కడా ఉన్నారు జనం. వాళ్లందరూ పాటల కోసం వచ్చినవాళ్లే. అవన్నీ అయిపోగానే వెళిపోతారు. 

పేర్లు అవుతుండగా వాడు బయటికెళ్లి వేరుశనక్కాయల పొట్లాలు రెండు పట్టుకొచ్చాడు. కుర్చీ చేతులమీద టిక్కూటిక్కూమని కొట్టుకుంటూ నింపాదిగా తింటున్నాం.

హొటల్లో సర్వర్‌గా చేస్తూ చెల్లెల్ని పెంచే కుర్రాడు కాస్తా నాగేశ్వర్రావుగా ఎదిగాడు. చెల్లెలు చంద్రకళలొలుకుతూ అణకువగా ఒదిగింది.

‘బియ్యే ఫస్టున ప్యాసైనావా? మరి ఈ కప్పులూ ప్లేట్ల ఉద్యోగం నీకెందుకు సూర్యం?' అని ఓనర్ చెబుతున్నా వినకుండా చేస్తూనే ఉన్నాడు.

విజయనిర్మలని కాపాడ్డానికి ప్రభాకర్రెడ్డిని కొట్టేసి పొట్టిచొక్కా పీక్కుంటున్నాడు నాగేశ్వర్రావు. 

ఈలోగా అదేదో పాట మొదలైంది... ఈరోజుల్లో పడుచుకుర్రాళ్ల గురించి.

సరిగ్గా అప్పుడు ఒకతనెవరో హాల్లోకొచ్చి మొత్తం తలుపులన్నీ తీసేశాడు. 

బయట విశాలమైన ప్రాంగణంలో పదిపదిహేను కొబ్బరిచెట్లు. బయట వరసగా ఉండే ట్యూబ్‌లైట్లన్నీ ఆపేశాడు. 

హాయిగా ఎక్కణ్ణించో చల్లటి గాలి! కొబ్బరాకులు అలా ఊగుతోంటే ఆ ప్రాకృతికమైన ఏసీలో సినిమా చూస్తున్నాం.

పంచదార తీగపాకంలా సుశీల గొంతులో ‘మదిలో వీణలు మోగే...’

బ్లాక్ సూట్‌లో ఆకర్షణీయంగా అక్కినేని, చూపు తిప్పుకోలేనంత అందంతో వాణిశ్రీ కలిసి ‘స్వాగతం.. ఓహో చిలిపినవ్వుల శ్రీవారూ..’

రాజేశ్వరరావు సంగీతంలో మరింత మత్తుగా ‘చామంతీ ఏమిటే ఈవింతా..’

ఒక్కోపాటనీ అంతలా ఎప్పుడూ అనుభవించలేదు. 

ఇప్పుడు ఏసీ హాల్లో చూస్తున్నా రాని హాయి ఆరోజు ఎందుకంత కలిగిందో చెప్పలేను.

సినిమా అయిపోయిన తరవాత శ్రమ తెలియకుండా కబుర్లు చెప్పుకుంటూ రూముకొచ్చి సుఖంగా నిద్రపోయాం.

ఇప్పుడు live the movie అని మల్టిప్లెక్స్‌లో చూస్తే అనిపిస్తుంది...

పూర్ణాలో సినిమాని నిజంగానే అనుభవించేవాళ్లం. 

.......కొచ్చెర్లకోట జగదీశ్
0 comments

బుల్లి సైనికుడు

‘సార్, ఈడికి నిన్నటికాణ్ణించి జొరం తగ్గిందంట! ఆళ్ల నాన్న చెప్మన్నాడు!’ ఓ చంటాణ్ణి ఎత్తుకుని లోపలికొచ్చాడు శీనుగాడు.

‘తగ్గడం సంగతి సరే, అసలు ఎప్పట్నించి జ్వరమో అడిగావా?’ అని అడుగుతున్నానోలేదో

‘మూర్రోలు కాణ్ణించి!’ అంటూ మూడువేళ్లు చూపించాడు ఐదేళ్ల ఆ చిన్నకుర్రాడు.

మా అందరికీ భలే నవ్వొచ్చింది.

పైన నీలంగళ్ల ఎర్రచొక్కా తొడిగారు. అడుగునేం లేదు. విప్పేసి తీసుకొచ్చారు. హైడ్రొసిల్ ఆపరేషన్ చెయ్యాలి వాడికి.

టేబుల్ మీద కూర్చుని పైన లైట్లనీ, బాయిల్ మెషీన్‌నీ పరిశీలనగా చూస్తున్నాడు. సాధారణంగా ఆ వయసు పిల్లలు మా దుంప తెంపేస్తారు. లోపలికి రావడం రావడమే అన్నీ తన్నేస్తూ, ఎత్తుకున్నవాళ్లని చేతులతో రక్కేస్తూ బీభత్సం సృష్టిస్తారు. అలాంటిది వీడేవిఁటో సరిహద్దు సైనికుడిలా చాలా ధైర్యంగా ఉన్నాడు.

‘ఏంపేర్రా చిన్నా?’

‘నాపేరూ మహెత్తు’

‘మహేషా? భలే పేర్రా! మహేష్‌బాబంటే ఇష్టమా?’

‘అఁ..ఆఁ... మహెస్ కాదు. మహెత్తు’ అన్నాడు బుర్ర అడ్డంగా ఊపుతూ

‘అదేలేరా, మహేష్! ఏంచదువుతున్నావ్?’

‘సార్, ఈడిపేరు మహిత్!’ అన్నాడు శీను కేస్‌షీట్ నా చేతికిస్తూ.

‘ఆ..ఆ.. మహెత్తు!’ అన్నాడు వాడు ఈసారి బుర్ర నిలువుగా ఊపుతూ

నాకు చాలా చాలా ముద్దొచ్చేశాడు. ఎంత ధైర్యంగా ఉన్నాడు వీడు!

‘అయితే మహిత్తూ, ఏం చదూతున్నావురా?’ అంటూ వాడి చేతిమీద నరాలవీ పరికించడం మొదలెట్టాను.

‘సూదెడతారా?’ అన్నాడు అకస్మాత్తుగా

ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. వార్నీ భడవా, వీడికెలా తెలుసిదీ?

‘సూదంటే?’ అన్నాను వాడి కళ్లల్లోకి చూస్తూ.

‘జొరమొస్తే ఎట్టారు కాదేటి? ఇల్లిదిగో ఇక్కడ..' అంటూ పాతగాయాన్ని చూపించాడు.

‘బంగారుకొండవిరా నువ్వు. ఏబీసీడీలొచ్చా? ఏ బడి నువ్వు చదివేది?’ నొప్పి తెలియకుండా కాన్యులా పెట్టేశాను.

‘ఉప్మాబడి!’

‘అదేం బడ్రోయ్? ఉప్మా పెడతారా రోజూ?’ అన్నాను నవ్వుతూ.

‘రోజూ ఎట్టరు’ అన్నాడు చేతికి పెట్టిన కాన్యులా చూసుకుంటూ. వాడసలు కిక్కురుమనలేదు అది పెడుతోంటే!

‘వాచీరా! బావుందికదా? ఇప్పుడు టీవీ చూస్తావా?' అంటూ మానిటర్ ఆన్ చేశాను.

‘అది టీవీయేటి?’ అన్నాడు హేళనగా.

ఇహ లాభంలేదు. వీడికన్నీ తెలుసు. మభ్యపెట్టాల్సిన అగత్యం లేదు. 

‘నీకు రామ్‌శెరణ్ ఇష్టమా, పవన్ కళ్యాణా?’ అన్నాను మందులవీ లోడ్ చేసుకుంటూ.

‘ఎన్టియార్’ అన్నాడు వాడు సిరంజివైపు పరిశీలనగా చూస్తూ.

‘ఎందుకూ?’ 

‘పుల్తోటి పైటింగ్ చేసాడు కాదేటి?’

‘అయితే ఆరార్ చూసేవా?' అన్నాను సిరంజి కనబడకుండా వెనక్కి దాస్తూ.

‘ఇండీసనేదీ?’ అన్నాడు తల కాస్త వంచి.

‘శీనూ, ఏవూర్రా వీడిది? ఇలాంటివాణ్ణి సైన్యంలోకి పంపాలి!' అంటూ నవ్వుతున్నాను.

‘ఇండీసనివ్వరా?’ అన్నాడు చేతిని చూపించి.

నేనిక చేసేదేంలేక సిరంజ్ ముందుకుతెచ్చి ‘సూదిలేని ఇండీసన్రోయ్! నొప్పే ఉండదు తెల్సా?’ అంటూ ఓ ట్వంటీ ఎం.జి. ఇచ్చాను.

‘అంకీలొచ్చునా నీకూ? చెప్పు?’ అన్నాను మృదువుగా వాడి తలమీద రాస్తూ.

‘ఒకటీ..రెండూ..మూడూ.. .... పదకొండూ... పన్న్...పన్..’ జారిపోయాడు మత్తులోకి!

మళ్లీ ఎప్పుడు కనబడాలి ఇలాంటి బుజ్జిసైనికుడు?

........కొచ్చెర్లకోట జగదీశ్
0 comments

ఇష్టమైన ప్రయాణం

‘ఉండిపోడం కుదరదా?’

‘ఇప్పటికే అటెండెన్స్ తక్కువైందని తిడుతున్నారు మా ప్రొఫెసర్. పరీక్షకి కూర్చోనివ్వనంటూ బెదిరించారు కూడా!’

‘చదువు పూర్తవ్వకుండా పెళ్లిచేసుకోమని ఎవడు చెప్పాడు? సరే, బయల్దేరు. జాగర్త. బస్సులో శుభ్రంగా నిద్రపో. ఊరికే నాగురించి ఆలోచిస్తూ కూర్చోక!’

‘అలాగే మేడమ్! అయ్యాయా, ఇంకా ఏమన్నా ఉన్నాయా చెప్పాల్సినవి?'

‘టేప్ రికార్డర్ కావాలన్నావు? తీసివ్వనా?’

‘అవునవును, మర్చేపోయాను. కేసెట్లున్నాయి మావాడి దగ్గర. తీసుకురా!’

‘నీ పాటలపిచ్చితో వింటూ కూర్చోకు. ఇంకెంతా, మూడునెలల్లో పరీక్ష! కష్టపడి చదువు!’

‘సరే!’

ఫిలిప్స్ టూ ఇన్ వన్ తీసుకొచ్చి చందనా బ్రదర్స్ వాళ్ల కర్రల సంచిలో పెట్టింది. నీలం రంగు బ్యాగ్‌లో రెండు పుస్తకాలు, జతబట్టలు, తువ్వాలు, ఓ లుంగీ. అంతే లగేజ్.

అప్పుడే పదిన్నర. పదకొండింటికల్లా తీసేస్తాడు బస్సు. బయటికొచ్చి ఆటో ఎక్కాను. ఆర్టీసీ బస్టాండు నిర్మానుష్యంగా ఉంది. కాకినాడ అనే అక్షరాలు ఆటోలోంచే కనబడుతున్నాయి బస్సు ముందు.

లోపలికెళ్లి కూర్చుని సీటు కిందకి రెండు సంచులూ తోసేశాను. చంటిపిల్లాడు నిద్రపోయిన తరవాత తల్లికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అచ్చం అలానే ఉంటుంది ఈ లగేజి సర్దేసుకున్న తరవాత ఫీలింగ్.

బస్సులో జనం అక్కడక్కడా ఉన్నారు. ఇంత రాత్రివేళ చలిలో ప్రయాణాలంటే కష్టమే! కాసేపటికి డ్రైవరొచ్చి బస్సుకి కుడివైపునుంచి చిన్న తలుపు తెరుచుకుని బస్సెక్కాడు. మరుక్షణమే బయల్దేరిపోయింది బస్సు.

గాజువాక కూడా రాకుండానే మొత్తం లైట్లన్నీ ఆపేశాడు. ఇక చేసేదేంలేక చదువుతున్న పుస్తకం మూసేసి బ్యాగ్‌లో పెట్టేశాను. బస్సులో అందరూ సుఖంగా నిద్రపోతున్నారు, నేనుతప్ప. బస్సులో కిటికీపక్క సీటు దొరకడంలో ఉన్న ఆనందం పీజీ సీటు దొరికినప్పుడు కూడా ఉండదనిపిస్తుంది. 

వీస్తున్నదంతా చల్లగాలే నావరకూ. నా పక్కన ఎవరూ లేరు. వెనకాల కూర్చున్నతనికి మాత్రం అది చలిగాలి. కిటికీలు మూసెయ్యమంటాడు. ఇలా బస్సెక్కగానే కిటికీలు మూసెయ్యమంటే జోస్యం చెప్పే చిలక ఇలా బోనులోకెళ్లగానే టప్పని తలుపు మూసేసినట్టనిపిస్తుంది.

ఏకాంతంలో ఇలా ఒంటరిగా కూర్చోగానే ఆలోచనలన్నీ పావురాల్లా వచ్చి వాలిపోయాయి.

ఎన్ని ఉత్తరాలు! ఎంత భావుకత! ఇన్నినాళ్ల మోహాన్నీ అక్షరాలుగా చేసి ఒంపేశాను. రంగులద్దుకున్న కాయితాలన్నీ పూలరెక్కల్లా ఎగురుతోంటే మొత్తం అన్నీ కలిపి దారంతో కుట్టింది తను. గాలి, ఆలోచనలూ కలిపి ఒళ్లంతా పట్టేసినట్టనిపిస్తోంది... ఈథర్ పీల్చుకున్నట్టు బరువుగా, చల్లగా...

ఎక్కడినుంచో మెల్లిగా పాట వినబడుతోంది. చాలా శ్రద్ధగా విన్నాక తెలిసింది అదేంపాటో?

‘హసీనా... ఓ హసీనా... నీకై ఎంత ఎంత...’

ఒక్కసారిగా నాలో ఉత్సాహం నిద్రలేచి నిద్రను చెడగొట్టింది. ఇలా ఏకాంతంలో పాటలు వినడమంటే భలే ఇష్టం నాకు. ఆ తరవాత వరసగా మంచి మంచి పాటలన్నీ వినబడుతూనే ఉన్నాయి చాలాసేపు.

కాసేపటికి అర్ధమైంది అవి కండక్టర్ పెట్టిన కేసెట్లోంచని! డ్రైవర్‌కి నిద్ర రాకుండా ఏవో కబుర్లు చెబుతున్నాడతను. ఇద్దరూ కలిసి ఆ పాటల వివరాలు మాటాడుకుంటూ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఆ కండక్టర్‌కి వేళ్లలో ఏదో మహత్తుంది. ప్రతీపాటకీ చక్కగా దరువేస్తున్నాడు. పాటనీ, అందులో సాహిత్యాన్ని ఇంతలా ఆస్వాదించేవాళ్లంటే నాకు విపరీతమైన ఇష్టం.

ఎటువంటి విసుగూ చూపించకుండా ఇలా రాత్రివేళ ఉద్యోగాలు చెయ్యడం సాధారణమైన విషయం కాదు. వాళ్లని చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. పైగా ఇద్దరి అభిరుచీ ఒకటే కావడం కూడా భలే బావుంది. జీవితంలో స్నేహాలనేవి ఎక్కువకాలం నిలబడాలంటే ఇలాంటి దృశ్యం ఒకటైనా మనకి ఎదురవాలనిపించింది.

ఆ పాటల మత్తుకి మధ్యలో ఎప్పుడు నిద్రపట్టేసిందో తెలీదు. అకస్మాత్తుగా ఒకదగ్గర టీ కోసం బస్సుని ఆపితే మెలకువొచ్చింది. పాటలింకా వస్తూనే ఉన్నాయి. అవన్నీ నా లిస్టులో ఉండేవే! కావలసిన పాటలన్నీ ఎప్పుడూ కాగితం మీద రాసుకుని ‘గానం మ్యూజికల్స్‌’లో రికార్డింగ్ చేయించుకుంటూ ఉండేవాణ్ణి! నా లిస్టేమన్నా ఇతనికి దొరికిందేమోనన్న అనుమానం కలిగింది ఒక్కక్షణం!

టీలు, ఇతరత్రాలు ముగించుకుని మళ్లీ అంతా బస్సెక్కారు. ఎవరో డ్రైవర్‌తో మాట్లాడటం కనబడింది నాకు. ఏదో చెబుతున్నారు. ఏమై ఉంటుందబ్బా?

కాసేపటికి బస్సు బయల్దేరాక అర్ధమైంది అదేమిటో. పాటలు ఆపెయ్యమని చెప్పారు. అయితే కండక్టర్ మాత్రం మరింత తక్కువ సౌండుతో పాటలు నడుపుతూనే ఉన్నాడు.

నేను లేచివెళ్లి డ్రైవర్‌ని అడిగాను, సౌండెందుకు తగ్గించారని. అసలుకే ఆపెయ్యమన్నారని, కానీ వాళ్లిద్దరికీ మొత్తం ప్రయాణంలో పాతపాటలు ఉండాల్సిందేననీ చెప్పారు. కాసేపు నేనూ వాళ్లతోపాటు ఆ పాటల కబుర్లు చెప్పాను.

సరిగ్గా మూడింటికి కాకినాడ బస్టాండుకి చేరింది బస్సు. అదే ఆఖరి మజిలీ దానికి. అందరూ దిగిన తరవాత చివర్లో దిగి కాస్తంత దూరంలో కనబడిన రిక్షాతాతని పిలిచాను.

‘జన్రలాస్పటల్‌కి వస్తావా?’

‘ఆస్పత్రాండే, లేక ఎనకాలీదిలో ఏదైనా ఇల్లా?’ అడిగాడు తాత.

నిజానికి మా పీజీ హాస్టల్ జనరల్ హాస్పిటల్ ఎదురుగానే ఉండేది. ఎవరికైనా హాస్పిటల్ అంటేనే తెలుస్తుంది. అందుకే అలా చెప్పాను.

మొత్తానికి బస్టాండులో చిన్నచిన్న సందళ్లు, కూలీల గురకలు, ధగధగమంటూ మెరిసే లైట్లనుంచి నిశ్శబ్దంలోకి, నిశీధిలోకి ప్రయాణమైంది నేనెక్కిన రిక్షా.

పగలంతా మొగుడికి భయపడిన పెళ్లాంలా అణిగిమణిగి ఉండే రోడ్లు రాత్రివేళ స్వేచ్ఛగా ఊపిరితీసుకుంటున్నట్టనిపించింది. వీధిదీపాలు మాత్రం నిద్రపోకుండా నిటారుగా నిలబడ్డ సైనికుల్లా కనబడుతున్నాయి దారంతా!

కాకినాడ బావుంటుంది. ఏ వీధికావీధే ప్రత్యేకంగా ఉంటాయి ఆవూళ్లో. వచ్చి కొంతకాలమే అయినా ఇలా ఇళ్లమీదా, ఊళ్లమీదా మమకారం పెంచేసుకునే దురలవాటుంది నాకు. 

రిక్షాతాత మెల్లిగా తొక్కుతున్నాడు. చలీగిలీ ఎలావుంటుంది అంత కష్టపడుతోంటే? నాకైతే ఆమాత్రం చలంటే భలే ఇష్టం. వీధిమలుపు తిరుగుతోండగా ఒక టీస్టాల్ కనబడింది. బండాపించి ఇద్దరం వేడివేడిగా టీతాగాం. 

టీకొట్టు పక్కన తడికెమీద పాతసినిమా వాల్‌పోస్టర్ చూడగానే నాకా బస్సులో పాటలు మళ్లీ గుర్తుకొచ్చాయి. ఒక్కక్షణం మెరుపులాంటి ఆలోచన తట్టింది. 

తిరిగి రిక్షా ఎక్కగానే కర్రలసంచిలోంచి టూ ఇన్ వన్ బయటికి తీశాను. నా అదృష్టం కొద్దీ అందులో బ్యాటరీలున్నాయి. కేసెట్ కూడా ఏదో ఉందే? ప్లే బటన్ నొక్కగానే ‘అయినదేమో అయినదీ ప్రియగానమేలే...’ అంటూ ఘంటసాల అందుకున్నాడు. ఒక్కసారిగా పురవీధుల్లో నిశ్శబ్దం మొత్తం పటాపంచలైంది. కాస్తంత వాల్యూమ్ తగ్గించి వరసగా వింటూంటే ప్రయాణం భలే హాయిగా అనిపించింది. 

అవన్నీ విజయావారి హిట్స్. మాయాబజార్, పాతాళభైరవి అంటూ క్లాసిక్సే అన్నీ! తాతలో ఉత్సాహం కనబడింది నాకు. హుషారుగా తొక్కుతున్నాడనిపించి అడిగాను...

‘పాతపాటలంటే ఇష్టమా తాతా?’

‘చానా ఇష్టం బాబూ! ఇంతరాత్రేళ మీకాడ రేడియోలో అలాగెలా వచ్చేయండే పాటలు?’

‘ఇది టేప్‌రికార్డర్ తాతా! బ్యాటరీలు కూడా ఉండటం మూలాన పాటలు పెట్టగలిగాను’

‘ఇట్టావుంటే ఎంతదూరం తొక్కినా కట్టం తెలీదు బాబూ!'

అవును. నీ కష్టం నాకు తెలీదు.

అయితే నీ కష్టం నీక్కూడా తెలియకూడదనే పాటలు పెట్టాను. 

దిగులుపడటం తప్ప దిగి నడవలేను. నా గదికి చేరగానే సామ్యవాదం గురించి మహత్తరమైన కవిత మాత్రం రాయగలను. 

నానారకాల ఆలోచనలూ, నాలుగైదు పాటలూ అయ్యేసరికి మా హాస్టలొచ్చేసింది. 

........కొచ్చెర్లకోట జగదీశ్

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive