#ఆంధ్రభూమిలో ప్రచురితమైన నా రచన....
ఠాప్ మని తలుపు మీద ఎవరో కొట్టినట్టు చప్పుడైతే వెళ్లి చూశాను. పేపరబ్బాయి ‘హస్త లాఘవేంద్రరావు’ పేపర్ని లిఫ్ట్ డోర్ దగ్గర్నుంచే విసురుతాడు రోజూ! అవడానికి మా పేపరేగానీ, అతని విసురుడుకి అది మా తలుపుకి తగిలి ఎదురింటి గుమ్మం ముందు పడుతుంది. ఎవరైనా చూస్తే అప్రదిష్ట కూడానూ, దొంగతనంగా వాళ్ల పేపరట్టుకొచ్చేస్తున్నానని! హవ్వ!
ఏంరాశార్ట పేపర్లో?
‘చంద్రుడి మీద దిగాలని పంపింది దిగలేదని దిగాలు పడిన శాస్త్రవేత్తలు’
మా కొలీగ్ ఒకతను కూడా అచ్చం ఇలాగే, హాస్పిటల్ కక్ష్యలోనే తిరుగుతూ వుంటాడు తప్ప హాస్పిటల్‌లో అడుగెట్టడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా పక్కనే వున్నానంటాడుగానీ ఎంతకీ రాడు. ఎందుకో చప్పున గుర్తొచ్చాడతను.
మిగతావన్నీ సాదాసీదా వార్తలే! ఏడేళ్ల పిల్లని చంపేశారని, డెబ్భయ్యేళ్లావిడకి పిల్లలు పుట్టారనీ! ఇవాళ్టికివి చాలు.
లేచి బ్రష్ చేసి, పన్లోపనిగా స్నానం కూడా చేసేశా. టవల్ తో గదిలోకొచ్చేటప్పటికి పక్కన గుళ్లో గంట మోగిన శబ్దం వినబడింది. రోజూ సుప్రభాతం సీ.డీ. పెట్టి, పువ్వులవీ కోసుకునే పంతులుగారు ఒక్కోరోజు మాత్రం స్వయంగా పాడతారు. ‘శ్రీ వెంకటా......... చలపతే తవ సుప్రభాతం!’ అంటూ తీరిగ్గా వినబడుతోంది. వెంకటా..... తరవాత అంతలా సాగుతోంటే ‘పాపం ఇంకాసేపు నిద్రపోయి రావలసిందిగా?’ అనిపిస్తుంది.
ఇంటెదురుగా పెట్టిన వినాయక విగ్రహానికి కాపలా వున్న కుర్రాడు నిద్ర లేస్తూనే ‘లేలే బాబా నిద్దుర లేవయ్యా’ పాట పెట్టాడు. ఆ పాట విన్న గణనాథుడు సందిగ్ధంలో పడ్డాడు, ‘ఇదేదో నాది కాని వ్యవహారంలా వుంది. ఇప్పుడు లేవాలా ఇంకాసేపు పడుకోవచ్చా?’ అని!
ఇవాళేంటో ప్రోగ్రాం? మొన్న అదేదో ఆర్కెస్ట్రా పెట్టారు. ఎంచక్కా మా రోడ్డుకడ్డంగా పేద్ద స్టేజేసి కార్లనీ, బళ్లనీ, ఆటోలనీ అటో, ఇటో, ఎటోఅటు.. మీ దిక్కున్నచోటుకి పొమ్మని సలహాలిస్తూ బ్యాడ్జీలు కట్టుకున్న కమెటీ వాళ్లు చాలా సాయంచేశారు. లేకపోతే ఎంతకష్టం?
ఇంకా పూర్తిగా తెల్లారలేదు.
కారు అన్ లాక్ చేసి, ఎక్కి కూర్చున్న తరవాతే గుర్తొస్తుంది రోజూ.... సర్వీసింగ్ చేయించాలని! వెనకాలేఁవిటో అట్టపెట్టెలవీ చాలా వున్నాయి. మరీ కొరియర్ వ్యాన్ లా తయారైంది. థూ! అరే, డీజిల్ రిజర్వులో వుందే? సరేలెమ్మని కారు బంకు వైపు తిప్పాను.
బంకులో కుర్రాడితో ‘గాలి కూడా కొట్టాలి’ అన్నాను.
అతను నావైపు ‘ఏంసార్, రాత్రిదింకా దిగలేదా?’ అన్నట్టు చూసి ‘ఇంత పొద్దున్నేనా? గాలి కుర్రాడు తొమ్మిదింటికి వస్తాడ్సార్! అప్పుడు రండి గాలికి!’ అన్నాడు డీజిల్ క్యాప్ తెరుస్తూ. ఉచిత సలహాలకేం, బానే ఇస్తారు. నాకు ఒళ్లుమండి ‘ఇంతపొద్దున్నే డీజిలెందుకు కొడుతున్నావు మరి?’ అన్నాను ఇక నా ప్రశ్నకు తిరుగులేదన్నట్టు మొహం పెట్టి. ‘అదేట్సార్, పెట్రోలుకీ, దానికీ లింకేటి?’ అన్నాడు.
ఇప్పుడు నేను వెళ్లాల్సిన ఆపరేషన్లు ఆపి మరీ వాణ్ణి ఉద్ధరించాల్సిన అవసరం కనబడక, అలాగని ఆవేశాన్నీ అణుచుకోలేక ‘మీకు పుణ్యం వుంటుంది తమ్ముడూ, ఆ గాలిక్కూడా చక్రానికి పదో పదిహేనో తీసేసుకోండి. మాకెప్పుడు కావాలంటే అప్పుడు కొట్టండి. అంతేగానీ ఫ్రీ కదాని ఇలాంటి కారణాలు చెప్పకండి!’ అంటూ విసుగ్గా అక్కణ్ణుంచి బయటపడ్డాను.
మెత్తటి తారురోడ్డు మీద నిశ్శబ్దంగా సాగిపోతోంది కారు. ఏదేమైనా, మనుషులెవరూ నిద్రలేవక ముందుండే అందమే అందం. రోడ్లన్నీ ఆరేసిన నల్లచీరల్లా స్వేచ్ఛగా పడున్నాయి. అక్కడక్కడ టీకొట్ల ముందు మాత్రం బళ్లవీ చీరకి పెట్టుకునే పిన్నీసుల్లా అడ్డదిడ్డంగా పెట్టి వున్నాయి.
కాఫీ తాగుదామని ఓపక్కగా కారాపాను. కుర్రాణ్ణి పిలిచి, చక్కెర తక్కువ, పొడెం ఎక్కువ వేస్తానని అతనిచేత నాలుగుసార్లు ఒట్టేయించుకుని, అప్పుడొదిలాను అతని చెయ్యి. లేకపోతే ఆ మధురానుభూతి రోజంతా వెంటాడేస్తుంది. కాకరకాయ తిన్నా తగ్గనంత తీపి చేసేస్తాడు కాఫీని వాడి దుంపతెగ!
ఎదురుగా నలుగురు నడివయసువాళ్లు కూర్చుని టీ తాగుతున్నారు. అందులో ఒకతను తప్ప మిగతావాళ్లంతా ఫిట్ గా కనబడ్డారు. ఆ ముగ్గురూ అసలేం మాట్లాడట్లేదు. ఇతను మాత్రం ఓ...లొడలొడా తెగ మాటాడేస్తున్నాడు. ఎంతో హాయిగా, కమ్మటి కాఫీ తాగుతూ ఆస్వాదిస్తున్న ఈ ఉదయాన్ని, ఈ నిశ్శబ్ద సౌందర్యాన్ని అంతలా కలుషితం చెయ్యాలన్న అతని ఆలోచన నాకు చాలా ఆవేదన కలిగించింది. అతనికి ‘వాక్’ చాతుర్యం కన్నా వాక్చాతుర్యం ఎక్కువని చెప్పకనే చెబుతున్నట్టనిపించింది. గత్యంతరం లేక నా కాఫీ గబగబా తాగేసి మళ్లీ కారెక్కాను.
హాస్పిటల్‌కి వెళ్లే దారిలో ఓ రెండు కిలోమీటర్ల వరకు సీరియల్ లైట్లవీ పెట్టి దారంతా రంగులమయం చేసేశారు. దాని అంతేదో చూద్దామని మెల్లిగా నడుపుతూ పోతోంటే పోలీస్ స్టేషన్ పక్కనేవున్న ఓ ఇంటిముందు ఆగింది. అయితే అక్కడింకా హడావుడిగా వుంది. పెద్దపెద్ద ఫ్లెక్సీల మీద ఓ పదిపదకొండేళ్ల పిల్ల ఫొటోలు కనబడ్డాయి. పద్మంలోంచి పైకొస్తున్నట్టు, గెడ్డం కింద రెండుచేతులూ పెట్టి చీకి కళ్లతో నవ్వుతున్నట్టు, జడ ముందుకేసుకుని వెనక్కి తిరిగి వెర్రిచూపులు చూస్తున్నట్టు... రకరకాల ఫొటోలు! దేవుడా! ఈపిల్ల పెద్దదైనట్టుంది! పిల్లపేరు ‘ధన’లక్ష్మి అయ్యుంటుంది. నే సరిగా చదవలేదు. ఈ వేడుకకి ఎంత తగలేశాడో వాళ్ల నాన్న! నోట్లరద్దుకీ వీటికీ సంబంధమేం లేదు. రోజురోజుకీ జనం ఎంత ‘మెచ్యూర్డ్’గా ఆలోచిస్తున్నారో అనిపించింది.
ఆపరేషన్ వ్యవహారాలు పూర్తయిపోయాక మళ్లీ తిరిగి ఇంటిముఖం పట్టాను. ఆహా, ఇప్పుడు కదా రోడ్లు వాటి నిజస్వరూపాన్ని ‘సంత’రించుకున్నవి! ఎక్కడ చూసినా సంతలా జనం. జంక్షన్ దగ్గర ఓ నాయకుడేమో కుడివైపు, అతనికి వ్యతిరేక నాయకుడేమో ఎడమవైపు చేతులు చూపిస్తున్న విగ్రహాలు పక్కపక్కనే వుంటాయి.... అచ్చం వాళ్ల మానిఫెస్టోల్లానే!
అక్కడొక ఇరవైదాకా ఆటోలు జిగ్సా పజిల్లా అటూఇటూ ఆపేసి వుంటాయి. ఇంకా అద్భుతం ఏమిటంటే వాటిలో కొన్నింట్లో డ్రైవర్లుండరు. మనం హారన్లవీ కొట్టకుండా సంయమనం పాటించి, ఓ పావుగంటాగితే అవే కదులుతాయి. అదంతా ఆ క్షణాన మన బీపీ ఎంతుందో అనేది ఎటువంటి పరికరమూ లేకుండా చెప్పే యంత్రాంగం. అదీ ఉచితంగా!
ఇంటికొచ్చే దారిలో స్కూళ్లకెళ్లే పిల్లలతో చాలా హడావుడిగా వుంటుంది ప్రతిరోజూ! బా...గా చదువుకున్న తండ్రులు, అనుభవసారంతో తలపండిపోయిన తాతయ్యలు, వాట్సప్ లో నిత్యం నీతివాక్యాలు ఫార్వర్డ్ చేసే తల్లులు వాళ్ల పిల్లల్ని స్కూటర్ల మీద కూర్చోబెట్టుకుని రాంగ్ డైరెక్షన్లో వస్తున్నారు. అక్రమ మార్గాన పయనించడమనేది అలా చిన్నతనం నుంచీ రంగరించి పోస్తేనే కదా పిల్లలకి వంటపట్టేది!
వారందరినీ తప్పించుకుని, మళ్లీ మరోసారి ఫ్రీగా బీపీ చూపించుకుని కొంపచేరాను. ఆరిడ్లీలు, అల్లప్పచ్చడీ అనే అనల్పాహారం కానిచ్చి, మళ్లీ కారెక్కాను.
తొమ్మిదవ్వగానే కుడికాలు ముందెట్టి హాస్పిటల్‌లోకి, చూపుడువేలు ముందెట్టి ‘భయో’మెట్రిక్ లోకి నేనొచ్చినట్టు ‘ఆధారాలు’ చూపించేశాను. నాదంటూ ఓ గది, దానికో బాత్రూము, ఆ బాత్రూముకో తలుపూ... వుండడమైతే వున్నాయి. కానీ ఆ బాత్రూమ్ తలుపుకి గడియలవీ అచ్చిరాలేదు. ఆ గడియతో సమస్యేఁవిటంటే... అది పట్టినట్టు అనిపిస్తుంది. అదే సమస్య!
రోజూలాగే ఓటీ కుర్రాణ్ణి ముచ్చటగా మూడొందలొకటో సారి పిలిచాను....
‘ఆ బాత్రూమ్ తలుపు పట్టట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా మీకెవరికీ పట్టట్లేదు!’ అంటూ చివాట్లేశాను.
పోనీ లోపలికెళ్లి పాటందుకుందామంటే అందరికీ పాటలు రావాలని లేదుకదా? కొంతమందైతే మరీ ఘోరం! లోపలున్నట్టు తెలియడానికి కనీసం కూనిరాగఁవైనా తియ్యొచ్చు కదా మన ప్రాణం తియ్యకపోతే? అదికూడా చెయ్యరు. ఎప్పుడూ మౌనరాగమే!
మొన్నటికి మొన్న నేను ‘పాట’ పాడదాఁవని, అరమోడ్పు కళ్లతో, హుషారుగా ‘‘మనసు పాడింది సన్నాయి పాట కనులు ముకుళించగా..’’ అని పాడుకుంటూ బాత్రూమ్ తలుపు తోశానో లేదో మా జూనియర్ కుర్రాడెవరో వున్నాడు లోపల. పెద్ద ఆర్తనాదం చేసి నానా బీభత్సం చేసేశాడు.
ఇన్ఛార్జి కుర్రాణ్ణి పిలిచి ‘కాస్త ఇవాళెలాగైనా ఆ తలుపు గడియ బాగుచేయించు రాజూ!’ అంటూ రెండుచేతులూ గుప్పెటలా చేసి, గెడ్డంకింద పెట్టుకుని మరీ బతిమాలాను.
ఏవేవో కారణాలు చెప్తాడు తప్ప పనిమాత్రం జరగదు. బడ్జెట్ లేదని, కార్పెంటర్ రావట్లేదని, నాకస్సలు ఖాళీ వుండట్లేదని, ఈ రూమెప్పుడూ బిజీయే అని,
ఆఖరికి ఒకరోజు తెగించి గవర్నమెంట్ మారిపోవడం వల్లే ఇదంతా అనికూడా అనేశాడు. కొంపదీసి ఈ తలుపు సంగతి మానిఫెస్టోలో లేదంటాడా ఏఁవిటి వెధవ ఖర్మ? అవును, నిజమే, వీడు మొన్నటిదాకా ఎలక్షన్లంటూ తిరిగాడు.
ఈలోగా నర్సుపిల్లలు ఆరేడు కేస్ షీట్లు పట్టుకునొచ్చారు. అవన్నీ ఎమర్జెన్సీ ఆపరేషన్లకిట! సరే, ఆ చివరి గదిలో కూర్చోబెట్టమని డ్రెస్సదీ మార్చుకుని అక్కడికెళ్లాను. ఆ గదిలో ఏసీ కింద నాలుగైదు బక్కెట్లు పెట్టి వున్నాయి. ఏసీలోంచి నీళ్లు కారుతున్నాయిట.
‘ఓ పన్చెయ్యండ్రా, నే డబ్బులిస్తాను. ఓ పెద్ద సిమెంటు గోలెం ఒకటి కొని పట్టుకొచ్చి దీనికింద పెట్టండి. అందులో కొత్తిమీరా, ఉల్లికాడలూ, నాలుగైదు ఆక్కూరలూ వెయ్యండి. ఈ నీళ్ల బలాన అవి ఎంచక్కా చేతికొస్తాయి. ఓ వారం మీరూ, మరోవారం నేనూ ఇంటికి పట్టుకెళ్దాం!’
నా జోక్కి వాళ్లు హాయిగా నవ్వేశారు. డైలీ ఇరిటేషన్లని ఇంతకంటే హాయిగా ఇంకెవరూ తీసుకోలేరేమో? సమస్యల్లేనిదెక్కడ? హాయిగా నవ్వుతో జయించేద్దాం!
ఏఁవంటారు?

0 comments:
Post a Comment