Latest Posts

Content

Monday, August 3, 2020

సీరియాలిటీ

#ఆంధ్రభూమి లో ప్రచురితమైన నా రచన

‘‘నువ్వీ క్షణం మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసులే! నేనెంత త్వరగా ఆఫీసుకెళ్తే అంత త్వరగా ఫేస్‌బుక్‌లో పోస్టు రాసుకుందామని చూస్తున్నావు!’’ అన్నట్టు చూస్తూ, కనుబొమ్మల్ని మా స్విఫ్ట్ కారు వైపర్స్ లా అటూ ఇటూ వూపుతూ, కాఫీ ఇచ్చింది తను.

‘‘నేను నిన్నెంత నమ్మించాలని ప్రయత్నించినా నువ్వు నన్ను నమ్మవుకదా! అందుకే ఎక్కువ మాటాడకుండా నాపనేదో నే చూసుకుంటున్నాను!’’ అన్న భావం బయటికి కనబడకుండా మొహాన్ని మాడిపోయిన మొక్కజొన్న పొత్తులా పెట్టుకుని కాఫీ అందుకున్నాను.

‘‘కరెంట్ బిల్ టీవీ దగ్గర పెట్టాను. కాస్తెలాగైనా ఇవాళలోపు కట్టెయ్! లేకపోతే డిస్కనెక్ట్ చేసేస్తాడు!’’ అంది గదిలోంచి బయటకెళ్లే ముందు. 

నేను కాసేపు మాట్లాడకుండా తన మొహంలోకి చూస్తూ వుండిపోయాను.

‘‘నీతలకాయ్! ప్రతిసారీ నీకిలాగే చెప్పడం, మళ్లీ నేనే కరెంటాఫీసులో పెనాల్టీతో కట్టడం! ఇది మనకేం కొత్తా?’’ అన్నట్టుంది తన మొహం.

కానీ నేనదేం గమనించనట్టు పైకి మాత్రం ‘‘అలాగే! ఎంత?’’ అన్నాను కాఫీ తాగుతూ. 

‘‘అందులో వుంటుంది కదా? సర్వీస్ నెంబర్ కొడితే అదే చూపిస్తుంది ఆన్లైన్ లో!’’ అంది కానీ ‘‘ఆమాత్రం కూడా తెలీదు, పేద్ద రచయితలా పోజు మళ్లీ!’’ అని మనసులో అనుకుంటూ నేను ఖాళీ చేసిన గ్లాసందుకోబోయింది.

‘‘నామీద అంత నమ్మకం లేనిదానివి అవన్నీ నువ్వే చూసుకోవచ్చుగా? ఆమాత్రం దానికి ఎందుకీ బిల్డప్పు?’’ అన్న అర్ధం వచ్చేలా ఓ తీక్షణమైన చూపు విసిరి, తను చూడకుండా ముసిముసి నవ్వులు రెండు నవ్వుకున్నాను గ్లాసు తనకివ్వనని మొరాయిస్తూ!

‘‘నవ్వెందుకొస్తోంది?’’ అంది విసురుగా నాచేతిలోంచి గ్లాసు లాక్కుంటూ!

‘‘నవ్వితే నవ్వానంటావు. నవ్వకపోతే...  ‘నువ్వలా సీరియస్‌గా వుంటే చూళ్లేను జగ్గూ!’ అంటావు. పోనీ ఎలావుండాలో నువ్వేచెప్పు!’’ అన్నాను రెండు చేతులూ కట్టుకుని వినయంగా!

‘‘మస్తు యాక్షన్ జేస్తున్నవ్ రా! యాడ నేర్సినవ్ ఇయన్నీ?’’ అన్నట్టు ఒక చూపు విసిరేసి అక్కణ్ణుంచి రుసరుసా వెళిపోయింది.

...................

“అబ్బబ్బా, ఆపండి సార్ మీ గోల! మీరు చెప్తున్న దాంట్లో నిజం డైలాగులేవీ, బ్యాక్‌గ్రౌండ్ డైలాగులేవి?” అని విసుక్కోవాలనిపిస్తోందా మీకు?

న్యాయమైన విషయమే! అసలు సంగతేంటంటే... ఇదంత సీరియస్ మేటర్ కాదు.  సీరియల్స్ మేటర్! మనిళ్లలో అలా వుంటే ఎలావుంటుందీ అనేదానికి శాంపిలన్న మాట!

మొన్నామధ్య అదేదో సీరియల్ కి మాటలవీ రాయమని అడిగార్ట మావాణ్ణి! స్క్రిప్టదీ చూసుకున్న తరవాత డైలాగుల విషయం చర్చకి వచ్చిందిట.

అయితే వాళ్లన్నార్టా....

పాత్రలు మాటాడుకునే వాటికన్నా వెనకనుంచి వస్తూంటాయి చూడండీ, మనసులో అనుకునే కుళ్లు ఆలోచనలవీనూ, అవే ఎక్కువగా రాయాలన్నార్ట!

ఉదాహరణకి:

‘అత్తయ్యగారూ, కాఫీ తీస్కోండి చల్లారిపోతే మళ్లీ బాగోదు!’ 

ఇది ఒరిజినల్ డైలాగైతే...

‘నీ కంఠంలో ప్రాణం వుండగా నా మోచేతి నీళ్లు తాగనని మొండికేసావ్ కదత్తయ్యా? నిన్ను నాయింటి గుమ్మం ముందు కుక్కలా కట్టేసి, నేను పోస్తే తప్ప నీకు గుక్కెడు కాఫీనీళ్లకి కూడా గతిలేకుండా చేసాను చూసావా? దటీజ్ గాయత్రి!’....

ఇది వెనకనుంచి వచ్చేదిట! 

ఈ డైలాగవుతున్నంత సేపూ ఆ కోడలుపిల్ల కళ్లని కారు స్టీరింగ్ తిప్పినట్టు తిప్పుతూ వుండాల్ట! ఇహ కనుబొమ్మలైతే... వర్షం పడినప్పుడు వస్తాయి చూడూ బిందెపాములనీ.. వాటిలా మెలికలు మెలికలు తిరిగేయాల్ట! ఒరిజినల్ డైలాక్కన్నా ఈ బ్యాక్‌గ్రౌండ్ డైలాగులకే యాక్షన్ ఎక్కువ చెయ్యాలిట!

వాడు చెప్పిందంతా విన్న తరవాత ఓ నెలరోజులపాటు కదలకుండా సీరియల్సన్నీ వాడు చూడటమే కాకుండా మమ్మల్నీ చూడమని ఆర్డరేశాడు. ‘మేఁవెందుకురా చూడాలీ?’ అనడిగాను. దానికి వాడిచ్చిన సమాధానం... వాడికి సలహాలివ్వడానికిట! సలహాల మాట దేవుడెరుగు ఎప్పుడూ బెంగాలీ స్వీట్స్ లా తియ్యగా వుండే మా ఇద్దరి మనసులూ బే ఆఫ్ బెంగాల్లో పడవల్లా అల్లకల్లోలమైపోయాయనుకోండి!

మా పెద్ద టీవీలో హెచ్.డి.లో సీరియల్ నటులు ఒక్కొక్కరి మొహాలూ బాగా దగ్గరగా చూస్తోంటే మావి ఎంత భావరహితమైన మొహాలో అనిపించేసింది. ఇళ్లు కూడానూ! అత్యంత వైభవోపేతంగా అలంకరించిన ఆ కొంపలవీ చూసిన తరవాత ‘ఏదో సాదాసీదా ఇళ్లలో ఇన్నాళ్ళూ కాలక్షేపం చేసేస్తున్నామా?’ అని మామీద మాకే జాలేసేసింది.

ఇహ తుపాకులు!

వంటిమీదకి ఏభయ్యేళ్లొచ్చి పడ్డాయి. పెళ్లయి పాతికేళ్లయింది. ఈ ఉద్యోగంలో చేరి ఇరవయ్యేళ్ల పైమాటే! అయినా ఇంతవరకూ ఒక్క గన్ కూడా కొనుక్కోలేకపోయాను. ఎప్పుడూ ఫోర్ జీబీ ర్యామ్, సిక్స్టీఫోర్ జీబీ మెమరీ..  అంటూ సెల్ ఫోన్ల గోలే తప్ప నా బెడ్రూములో మంచం పక్క అరలో ఎప్పుడూ ఓ తుపాకీ పెట్టుకు పడుకుందామన్న ధ్యాసే లేదు నాకు!

‘చాముండేశ్వరీ దేవీ! ఇక నీ ఆటలు కట్టిపెట్టు!’ అని ఒక్కరుపు అరిచి ఎర్రజీరల కళ్లతో మా అత్తగారిని బెదిరిద్దామంటే ఆవిడేమో కాశీలో ఆవుల కన్నా సాధుజంతువు. పోనీ ఆవిడ పేరైనా చాముండేశ్వరీ దేవి, రాజేశ్వరీదేవి, వైజయంతీ దేవి టైపులో ఘనంగా పలికే పేరా అంటే అదీకాదు! ఊహూఁ! అస్సలు లాభంలేదు. మమ్మల్నసలు పల్లెత్తు మాటనదు. ఆవిడసలు ఇంట్లో వున్నారో, ఊరెళ్లారో కూడా తెలీదు. అంత సైలెంట్ అత్తగారు ఆమధ్యదేదో సినిమాలో చూశా! తరవాత ఈవిడే!

ఇక మా అత్తగారికి వచ్చిన నలుగురు అల్లుళ్లూ కూడా ఎప్పుడు చూసినా ‘సూపర్‌గుడ్ ఫిలింస్’ వారి సినిమాల్లో హీరోల్లా అతి మంచితనాలే తప్ప ఒక్కరంటే ఒక్కరిక్కూడా పాజిటివ్ షేడ్స్ వున్న నెగటివ్ కేరెక్టర్స్ లేవు. 

ఇప్పటివరకూ ఒక్కసారి కూడా మా నలుగుర్లో ఏ ఒక్కరైనా వారి భార్యల్ని ‘ఏంటే వాగుతున్నావ్! ఎప్పుడూ కుక్కిన పేనులా పడుండేదానివి? ఓ! పుట్టింటి వాళ్లని చూడగానే నోరు లేస్తోందే?’ అన్న పాపాన పోలేదు. 

మా పనమ్మాయి పొద్దున్నే నాలుగైదు ఇళ్లలో చకచకా పనులవీ కానిచ్చేసి, ఆనక మాయింటికొస్తుంది. ఉన్నంతలో శుభ్రంగానే వుంటుందనుకోండి! అలాగని ఉప్పాడ చీరలవీ కట్టుకుని వంట చెయ్యడం, గెడ్డం మీద మూడు చుక్కల బొట్టు పెట్టుకోవడం లాంటివేవీ వుండవు.

‘సెప్పండమ్మగోరూ! మీకు సికెన్ బిర్యానీ, దొండకాయ్ కూరా సేసాను. అయ్ గారికేం సెయ్యమంటే అదే సేస్తాను!’ ఇలా ఎప్పుడూ మాట్లాడెరగదు. ఎంతో స్పష్టంగా, తనకి వచ్చింది వచ్చినట్టే మాటాడుతుంది. పనివాళ్లన్న తరవాత వాళ్లూ మనలాగే మాట్లాడేస్తే ఎలా? తనసలు సీరియల్సవీ చూడదనుకుంటా?

క్రిందటి నెలలో పెళ్లయిన మా బంధువుల పిల్లలు హనీమూన్ కోసం సింగపూర్ వెళ్లారు. కానీ అదేంటో వారం రోజులపాటు అన్నీ చక్కగా చూసేసి వచ్చేశారు. వాళ్లకి తెలియకుండా అదే హొటల్లో దిగిన ఇద్దరు అగంతకులు వారిని కనిపెడుతూ వుండాలా? అలాంటిదేమీ లేకుండానే వచ్చేశారు. ‘కోడలంటే ఇదీ!’ సీరియల్లో ఏంజరుగుతోందో మీరెరుగుదురుగా?

చాలాకాలంగా ఎందరో ఇళ్లలో చూస్తున్నా,  రాత్రుళ్లు ఏవో నైటీలవీ వేసుకునే కనబడుతుంటారు తప్ప ఒక్కనాడన్నా మంచి పట్టుచీరదీ కట్టుకుని, లిప్ స్టిక్కేసుకుని, గంపెడు నగలు, తట్టెడు పూలు పెట్టుకుని ఏ ఒక్క ఇల్లాలూ కనబళ్లేదు నాకు. 

పైగా మాయింటికి బంధువులో స్నేహితులో వస్తే ఎప్పుడూ సోఫాల్లో కూర్చుని మాటాడుకోడాలే! అంత పెద్ద హాలు కదా మాది? ‘కుంకం బొట్టు-నీమీదొట్టు’ సీరియల్లో లాగ మొత్తం ఇంట్లోవాళ్లందరం తలోచోటా నిలబడి గంటలు గంటలు మాటాడుకోవచ్చు కదా? కోము! 

ఇక ఆప్యాయతలూ, ఆవకాయల సంగతి చూసుకుంటే...

మా పెద్ద వదినగారేమన్నా పేద్ధ కంచంలో ఆవకాయన్నం కలిపి, ఎద్దుల్లా వున్న మరుదులందరికీ తలో ముద్దా తినిపిస్తుందా అంటే, అసలావిడ ఇంట్లో వంటే చెయ్యదు. ఎప్పుడూ అవేవో పొట్లాలొచ్చేస్తూ వుంటాయి మూడుపూట్లా!

అంచేత ఆ ఆప్యాయతకీ నోచుకోలేని అభాగ్య మరుదులం మేమందరం!

ఇక మా చుట్టుపక్కల అన్నీ స్కూళ్లే! పొద్దున్న లేస్తే రోడ్డంతా ఆటోలు, స్కూలు బస్సుల్తో నిండిపోతుందనుకోండి! ఎంచక్కా పిల్లలందరూ సుబ్బరంగా తయారై వెళ్లినవాళ్లు సాయంత్రం అయ్యేటప్పటికి టంఛనుగా ఇంటికొచ్చేస్తారు. ఇన్నేళ్లలో ఒక్కడంటే ఒక్కడన్నా కిడ్నాపే అవ్వలా! ఆ ‘ముంతమామిడి పువ్వు’ సీరియల్లో చూశారా, వారానికొకరు కిడ్నాప్ అయిపోతుంటారు. 

ఏంటో, ఏ ఇబ్బందీ లేని జీవితాలైపోయాయి! ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ, కబుర్లు చెప్పుకునే మనుషులే కనబడితే జీడిపప్పు లేని పాయసంలా వుంటోంది బతుకు! అపార్ట్‌మెంట్ లో అందరూ ఒకరిమీద ఇంకొకరు కుట్రలో, మర్డర్లో ప్లాన్ చేసి అందరం గుసగుసగా మాటాడుకునేలా చేసి మసాలా దట్టించొచ్చు కదా?

అసలు పాలలో కలపడానికి ‘పాయిజన్’ అని రాసున్న బాటిల్ దొరుకుతుందేమో ఒకసారి మా వీధి చివర మెడికల్ షాపువాణ్ణి అడగాలి. 

అహ, ఎవరికైనా ఇద్దామని కాదూ, అసలు దొరుకుతుందో లేదో చూద్దామని!

మొన్నీమధ్య మా బంధువులతను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఏదో బాగా తెలిసిన వాళ్లని, దగ్గర బంధువుల్నీ తప్ప ఎవర్నీ పిలవలేదనుకోండీ! పాపం, పిల్లలు చిన్నవాళ్లు. ఆ మొదటి భార్యకి ఏదో విషజ్వరం వచ్చి తీసుకుపోయింది.

నా బెంగేఁవిటంటే ఆమధ్య మూడేళ్లపాటూ వచ్చిందే, అదే, ఆ ‘కిటకిట తలుపులు’ సీరియల్లో చనిపోయిన శివాంగిలా మళ్లీ అతని మొదటి భార్య ఏడాత్తరవాత తిరిగొచ్చేస్తేనో? అని. 

ఆ మాటే మా ఆవిడతో అంటే ‘మీరు కాసేపు....!’ అని మిగతాది మనసులో అనుకుంది.

అయినా నా పిచ్చిగానీ, ఆ మొదటావిడ పోయినప్పుడు డాక్టర్ని నేనేగా ఇంటికెళ్లి పరీక్ష చేసి చెప్పిందీ, ప్రాణం లేదని! 

అందువల్ల నే చెప్పొచ్చేదేంటంటే... పనస లేకుండా తద్దినం, పస లేకుండా జీవనం వృధా అని! ఎంతో ప్రశాంతంగా బ్రతికేస్తున్న మనకి చుట్టూ ప్రపంచం కూడా అలానే వుందన్న భ్రమ తప్పకుండా వుంటుంది. అదిలాగే చప్పగా వుంటుంది.

అదండీ మేటరు!

......జగదీశ్ కొచ్చెర్లకోట

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive