#ఆంధ్రభూమి లో ప్రచురితమైన నా రచన:
“రండి, కూర్చోండి! చెప్పండీ!” అంటూ వేసుకున్న ఏప్రాన్ బొత్తాలవీ సరిగ్గా సర్దుకోవడం మొదలెట్టింది డాక్టర్ శైలజ.
“నమస్తే మేమ్! షలై వెయిట్ అవుట్సైడ్?” అంటున్న సుజీ భర్తని అవసరం లేదని కళ్లతోనే వారించి దంపతులిద్దర్నీ కూర్చోమంది.
“ఇప్పుడే స్కాన్ చేసి చూసానూ, నార్మల్ డెలివరీ అవుతుందనే అనుకున్నాం కదా? కానీ లైకర్ తక్కువగా వుంది...” ఇంకా వాక్యం పూర్తవ్వకుండానే గాల్లోనే పట్టుకున్నాడు వినీల్.
“లైకరంటే?” అన్నాడు భృకుటిని భృగుమహర్షిలా ముడేస్తూ
అడిగాడేగానీ అప్పటివరకూ టేబుల్ మీద రిలాక్సెడ్ గా పెట్టుకున్న చేతుల్ని అప్పటికే అతి లాఘవంగా కిందకి దించేసి మొబైల్లో విక్కీ చేసేసి ‘లైకర్’ అని కొట్టాడు. అయితే అతను కొట్టిన స్పెల్లింగ్ కి ‘ఎవడైతే అన్నింటినీ ఇష్టపడతాడో వాడే లైకర్ గాడు’ అన్న మీనింగ్ చూపించింది.
ఈలోగా డాక్టరమ్మ “ఆమ్నియాటిక్ ఫ్లూయిడంటాం! ఇంజన్లో ఇంజనాయిల్ వుంటుంది కదా, ల్యూబ్రికేషన్ కి? అచ్చం అలానే బేబీ ఫ్రీగా తిరగడానికి, ఇంకా ఆహారం అందడానికీ ఇది పనికొస్తుంది! అయితే అది కావలసినంత లేదు. బాగా తగ్గిపోయింది!” అని ముగించింది.
‘ఎంతబాగా ఎక్స్‌ప్లెయిన్ చేసావే శైలూ, అందుకే జనం నువ్వంటే పడిచచ్చేది...’ అని మనసులో అనుకుంది.
‘ఈ లైకరంతా పోతే మొత్తం ఎండిపోయి కొంతసేపటికి కురిడీలా అయిపోతుంది’ అనికూడా అందామనుకుంది కానీ ఈ సాఫ్ట్‌వేర్ కుర్ర కుంకలకి కురిడీలంటే తెలిసుండకపోవచ్చని ఊరుకుంది.
తన చిన్నతనాల్లో అప్పనపల్లి అమ్మమ్మగారింటికి వెళ్లినప్పుడు ప్రతీ ఇంటిముందూ బయట నులక మంచాల మీద వందలకొద్దీ కొబ్బరి కురిడీలు ఎండబెట్టి వుంచేవారు. ఎంత నూనొచ్చేదో? ఈ మీరాలు, పారాషూట్లూ అప్పుడెవరికైనా తెలుసునా అని? అందువల్లే కదా, నా జుట్టు ఇప్పటికీ ఇంత సాఫ్ట్‌గా వున్నది? ఆరోజులే వేరు.....అనుకుంటూ జడని మృదువుగా తడుముకుంటూ వుండగా
అప్పనపల్లి నుంచి ఆర్టీసీ బస్సెక్కించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేశాడు వినీల్.
“మేమ్, లైకర్ స్పెల్లింగ్ ఏంటి మేమ్?’ అడిగేశాడు దుర్మార్గుడు.
ఆదమరుపులో వున్న శైలజ “ఆఁ, కురిడీ...!” అనేసి, మళ్ళీ నాలుక్కరుచుకుని, “ఎందుకూ? గూగుల్ చేస్తున్నారా? సీ మిస్టర్...మీ పేరేంటన్నారూ?” అని చూపుడువేలు నుదుటిమీద కొట్టుకుంటూ ఆగింది
“వినీల్” అన్నాడు దొంగతనం చేస్తూ పట్టుబడిపోయినట్టు, పిల్లిలా చేతులు మళ్ళీ టేబుల్ మీద పెట్టి.
“యా, మిస్టర్ వినీల్, నే చెప్పింది నమ్మకపోతే స్కానింగ్ రిపోర్ట్ చూడండి. ఆప్షన్ మీకే వదిలేస్తున్నాను. ఆపరేషన్ వద్దు, నార్మల్ డెలివరీయే కావాలీ అంటూ అబ్ నార్మల్ నిర్ణయాలవీ తీసుకుంటే ఆనక మీరే బాధపడతారు! ఆలోచించి చెప్పండి, ఫరవాలేదు. మీట్ యూ లేటర్! నెక్స్ట్!” అంది స్టెతస్కోప్ పక్కన పెడుతూ.
“కురిడీ అనేదో అన్నారు...” అని మళ్ళీ వికీ చేద్దామనుకుని ఆగాడు
‘నా బొంద! వెధవింగ్లీషు చదువులు. ఎప్పుడూ ఎదుటివాళ్లని బురిడీ కొట్టించే తెలివితేటలే తప్ప కురిడీలంటే తెలీదు. ఇంకానయం, స్పెల్లింగడగలేదు!’ అని మనసులో అనుకుని
“ఏంలేదు. మీరాలోచించుకుని చెప్పండి. తొందరేం లేదు. సత్యవతీ, నెక్స్ట్ పేషెంటుని పంపించు!” అంటూ అరిచింది.
“ఇంకెవరూ లేరమ్మా!” అంటూ లోపలికొచ్చింది ఆయా సత్యవతి.
‘ఖర్మ, ఇలాంటప్పుడే ఎవరూ ఉండరు. ఎవరూ లేరంటే ఇప్పుడీ కుర్రాడు ఇక్కణ్ణుంచి కదలడు!’
“సరే మేమ్, మీయిష్ట ప్రకారమే కానివ్వండి! బట్ బీ కేర్ ఫుల్ మేమ్!” అన్నాడు సుజీ చేతిమీద ఆప్యాయంగా చెయ్యేసి.
తనెదురుగుండా కూర్చుని పెళ్లాల చేతులు పిసికే మగాళ్లంటే చిరాకు శైలజకి.
ఇలా కళ్లమ్మట నీళ్లెట్టుకోడాలు,
కౌగలించుకుని వదలకపోవడాలు,
ఆపరేషన్ థియేటర్లోకి నేనూ వస్తాననడాలు...
ఇత్యాదులన్నీ ఏ-వన్ కేటగిరీ దొంగవేషాలే అని ఓ పుస్తకం రాసేసుకుని, శ్రీ న్యూవెంకట్రామా ప్రెస్‌లో బైండింగ్ కూడా చేయించి అట్టే పెట్టుకుంది.
“ఇది నాయిష్టమో, మీయిష్టమో కాదు వినీత్, సైన్సిది. అబ్స్టట్రిక్స్!” అంది అసహనానికి ఆయింట్మెంట్ రాస్తూ.
“ఇట్సొకే, ఇట్సొకే మేమ్, ప్లీజ్..! బైదిబై, నాపేరు వినీత్ కాదు మేమ్, వినీల్” అన్నాడు రెండు అరచేతులూ ‘ఇకచాల’న్నట్టు గాల్లో పెట్టి!
మొత్తమ్మీద ఆపరేషన్ టేబులెక్కడానికి సిద్ధపడింది సుజీ!
బేబీ డెలివరీ ఎప్పుడవ్వాలో ముహూర్తం పెట్టించుకొస్తానంటూ బయల్దేరాడు సుజీ వాళ్ల నాన్న. తరతరాలుగా వాళ్లింట్లో అందరి పుట్టుకలు, సమర్తలు, అన్నప్రాసనలు, అన్నీ మునివేళ్ల మీద పెట్టుక్కూర్చున్న సింహాద్రి శాస్త్రి గారి దగ్గరకే వెళ్లాడు.
“శివరామకృష్ణగారు శీతకన్నేసేశారు మామీద!” అంటూ నిష్ఠూరమాడాడు సింహాద్రిశాస్త్రి కాసేపు. ఆనక వచ్చిన విషయం కనుక్కున్నాడు.
“దానికేం, భేషుగ్గా పెడతాను. సుజాత మగపిల్లాడిలా లాగూ చొక్కాలేసుకుని బళ్ళోకెళ్లడం గుర్తుంది నాకు. అప్పుడే అమ్మయిపోతోందేం?” అన్నాడాయన పెట్టెలోంచి కళ్లజోడు తీస్తూ.
“ఇప్పుడు ఆఫీసుకి కూడా లాగూచొక్కాలే వేసుకెడుతోందిలెండి!” అన్నాడాయన నవ్వుతూ.
“కాలం శివరామకృష్ణా! కాలం! మొన్నామధ్య బెంగుళూరు వెళ్లా మా పెద్దాడింటికి. అక్కడ ఎవరేఁవిటో తెలీలేదనుకో! మగపిల్లలేమో జులపాల జుట్లు, ఆడపిల్లలేమో జీన్సు పాంట్లు!” అంటూ కాసేపు గణించి
“ఆపరేషన్ థియేటర్లోకి ఆరూ ముప్ఫైరెండు తరవాత అడుగెట్టమని చెప్పండి, అదృష్టజాతకుడుద్భవిస్తాడు! శిరసోదయం మాత్రం సెవెన్ ఫోర్ తరవాతే జరగాలి!” అంటూ ఓ కాయితం మీద ముహూర్తం రాసి, దానిమీద అడ్డంగా చారెడు పసుపుతో స్వస్తిక్ వేసిచ్చాడు.
ఆయన దాన్ని అతి పవిత్రంగా పట్టుకొచ్చి డాక్టర్ శైలజకిచ్చాడు. ఆవిడకి కూడా నమ్మకాలున్నాయి. కానీ ఇలా ఓటీలోకి అడుగెట్టడానికి కూడా ముహూర్తాలంటే చిరాకు. అయితే ఆ సమయంలో ఎందుకులే అని బయటికేం చెప్పకుండా ‘సరేలెండ’ని తీసేసుకుంది.
మత్తు డాక్టర్ సుధీర్ వచ్చి హడావుడిగా అటూయిటూ తిరిగేస్తూ “ఇంకా పేషెంటునే షిఫ్ట్ చెయ్యలేదా? మరి నాకెందుకర్రా ఫోన్ చేసి విసిగించేశారు, ఎంత ట్రాఫిక్కో తెలుసా, ఎక్కడబడితే అక్కడ ఆగిపోడఁవే! ఈ నిమజ్జనాలొకటా? కార్ తియ్యాలంటేనే చిరాకేస్తోంది. త్వరగా తెమలండ్రా!” అంటూ మయసభలో దుర్యోధనుళ్లా అటూఇటూ తిరిగాడు కాసేపు. ఎందుకంటే, అక్కడొక పెద్ద అద్దం తప్ప అసలెవరూ లేరు. అతనెంత ఏడ్చి మొత్తుకున్నా ఎవరూ రాలేదు.
సరే ఏంచేస్తాం? అనుకుని ఓ సెల్ఫీ తీసుకుందామని మొదలెట్టాడు. ఎనిమిది ఫొటోలు తీసిన తరవాత ఒకటి పర్ఫెక్ట్ గా వచ్చింది. మిగతా వాటిలో ఓ రెండింట్లో తను నూనె మిల్లు కార్మికుళ్లాను, మరో మూడింట్లో ఫేక్ స్మైల్ తోను, మిగతావాటన్నింట్లో సిల్క్ స్మితలా అరమోడ్పు కన్నులతోను వున్నాడు.
ఈలోగా డాక్టర్ శైలజ వచ్చి “ఎంతసేపైంది వచ్చి?” అంది జుత్తు పైకి ముడేస్తూ.
‘నేను లాస్టియరే వచ్చాను మేడమ్!’ అందామనుకుని “యా, జస్టొక పావుగంటయింది!” అన్నాడు ఒక ఫేక్ స్మైలిచ్చి.
“వీళ్లేదో ముహూర్తాలూ అవీ అంటున్నారు డాక్టర్ గారూ! నాకు చిరాకు. పెట్టుకోవచ్చుగానీ, వీళ్ల చాదస్తం తగలెయ్యా, ఎనీమాకి కూడా ముహూర్తం చూసేలా వున్నారు. డిజ్గస్టింగ్ ఐసే!” అంది ప్లాస్టిక్ ఏప్రాన్ నడుముకి బిగించుకుంటూ!
అతను నిజమేనంటూ తలూపేసి, తలుపేసి బట్టలు మార్చుకుని బయటకొచ్చాడు. బయట సుజీ చాలా హడావిడి చేస్తోంది, భయంగా వుందంటూ! వినీల్ ఏదోలా ఒప్పించి, వాళ్లమ్మగారిని, అక్కనీ తోడుగా లోపలికి పంపించాడు. వాళ్లిద్దరూ చెరో రెక్కా పుచ్చుకుని లొంగిపోయిన మహిళా నక్సలైట్ ని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు.
సుధీర్ కాసేపు కుశలప్రశ్నలు, ఇంకాసేపు ఉద్యోగ వివరాలు, ఆ తరవాత అడగాల్సిన నాలుగూ అడిగేసి, బీపీ అదీ చూసి లోపలికి తెమ్మన్నాడు.
ఈలోగా వినీల్ వాళ్లక్క తను కూడా లోపలికొస్తానంది. అది విని సుధీర్ కి చిర్రెత్తుకొచ్చింది.
“ఇదేఁవన్నా ఆదిత్యా థియేటర్ అనుకున్నారా? ఆపరేషన్ థియేటరనుకున్నారా? ఎలా వస్తారు?” అంటూ ఆపేశాడు.
సుజీ చేతికి సూది పెట్టమని ఓటీలో పనిచేసే సుబ్రమణ్యానికి చెప్పింది శైలజ. గర్భిణీ అవడం వల్ల పిల్ల ఒళ్ళు చేసి, నరాలేవీ దొరకలేదతనికి. మొత్తమ్మీద కుడిచేతి మండమీద ఏదో లీలగా ఒక వెయిన్ కనబడితే అందులో పెట్టాడు.
శైలజ ఓటీ గౌను తొడుక్కుని లోపలికొచ్చి, మాస్కులవీ కట్టుకుంటూ బాటిల్ వంక చూసింది. అది పడట్లేదు.
“సుబ్బూ, ఎవరు పెట్టారు సూది?” అనరిచింది.
“నేనే మేడమ్, చెయ్యినిలా ముందుకి వంచితే ఎళ్తంది మేడమ్!” అంటూ అరచేతిని ముందుకి మడతెట్టాడు.
“కలిసివుంటే కలదుసుఖంలో ఎన్టీయార్ లా చెయ్యెప్పుడూ అలా వంచి వుంచలేదు కదరా? పైపెచ్చు మూడురోజులుండాలి ఈ సూది. ఒక్కపని తిన్నగా చేసేడవర్రా! పనిచేస్తే పాతిక వట్టం, తే ఇంకో కాన్యులా!” అంటూ మరోటి పెట్టింది.
ఈలోగా బయట సబ్బు, అయొడిన్లతో సుబ్బరంగా చేతులవీ కడుక్కుని లోపలికొచ్చాడు సుధీర్. వణికిపోతున్న సుజీకి ఎన్నో ధైర్యవచనాలు, సాంత్వన వాక్యాలు పలికాడు. నీకసలు ఏ ఇబ్బందీ కలక్కుండా చూసుకునే బాధ్యత నాదన్నాడు.
“నాకు మొత్తం మత్తు కావాలి డాక్టర్!” అంది గద్గదమైన స్వరంతో!
“పెద్ద మత్తా? ఇవ్వొచ్చనుకో! కానీ నీకిపుడు పుట్టబోయే బుజ్జిపాపాయిని పుట్టిన మరుక్షణం చూడాలనీ, ఆ బుల్లిబుల్లి ఏడుపదీ వెంటనే వినాలనీ నీకులేదా?” అంటూ ఫోర్ కె రిజల్యూషన్ లో సినిమా చూపించాడు. ఒక్కసారిగా సుజీ మనసు పరవశంతో నిండిపోయింది. వణుకు కూడా తగ్గి, “సరే, డాక్టర్! మీకేది సరనిపిస్తే అలానే చెయ్యండి!” అంది.
వెనక వీపంతా శుభ్రం చేసి, వస్త్రాలు కప్పి మత్తివ్వడానికి ఇలా సూది గుచ్చాడో లేదో ఒక్కసారిగా కదిలిపోయిందా పిల్ల. సరిగ్గా అదే సమయానికి ఆటోస్టాండ్ వినాయకుడి ఊరేగింపు వెళ్తోంది హాస్పిటల్ ముందునుంచి... ‘మెల్ కల్ తిరుగుతుంటె అమ్మాయో!’ అన్న పాట భూనభోంతరాలన్నీ ఏకమైపోయేంత బూస్టర్ బేస్ తో వినబడింది.
“నువ్వలా మెల్ కల్ తిరుగుతుంటె కష్టం అమ్మాయ్! సూది విరిగిపోతుంది. కాస్త కోపరేట్ చెయ్యాలి. సరిగ్గా రెండేరెండు నిమిషాల్లో అయిపోతుంది నువ్వు చెప్పినమాట వింటే!” అని మళ్లీ కౌన్సెలింగ్ చేసి మరోసారి ప్రయత్నించాడు.
మత్తిచ్చేటప్పటికి ఆరూ నలభై! అప్పటినుంచి ప్రతీ పనీ ‘సిరిమల్లె పువ్వా.. సిరిమల్లె పువ్వా!’ పాటలోలా స్లోమోషన్లో జరగడం చూసి సుధీర్ కి అనుమానం వచ్చింది. ఆమాటే అడిగాడు.
“బేబీ డెలివరీ ఏడూ నాలుక్కి అవ్వాల్ట డాక్టర్ గారూ! అందుకే ఇలా!” అని మెల్లిగా ఇన్సిషనదీ ఇచ్చింది శైలజ.
‘లేకపోతే ఈపాటికి ఈవిడ అనపర్తి స్టేషన్ రాగానే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వాడు కావాలని స్పీడు పెంచుతాడు చూడండీ, అలా దూసుకెళిపోతుందసలు!’ అనుకున్నాడు.
తీరా బేబీని తియ్యాల్సిన సమయానికి ఇంకా ఏడూ ఒకటే అయిందని మూడు నిమిషాలపాటూ అవీ ఇవీ అద్దుతూ కూర్చుంది. నర్సుపిల్లలు వాళ్ల మొబైల్స్ లో టైములు చూసి ఒక్కొక్కరూ ఒక్కోటి చెబుతున్నారు.
అలాక్కాదని బయటికెళ్లి వినీల్ మొబైల్ తీసుకురమ్మంది.
దానిలో సరిగ్గా ఏడూ మూడవ్వగానే గర్భసంచీ మీద గాటుపెట్టింది. రింగులు రింగులుగా నల్లటి ఒత్తైన జుత్తు కనబడింది. కాసేపట్లో తల బయటికొచ్చింది. ‘ఇదేదో బుజ్జితల్లిలా వుంది!’ అనుకున్నాడు సుధీర్.
సరిగ్గా ఏడూ నాలుక్కల్లా ఓటీ అంతా దద్దరిల్లిపోయేలా పెడబొబ్బలు పెడుతూ నాలుక్కేజీల బంగార్తల్లి బయటికొచ్చింది.
“పాప మేడం! పాప! పాపే కావాలంట వాళ్లాయనకి!” కేరింతలు కొడుతున్నారు నర్సులు.
ముక్కూ మూతీ అంతా సుజీనే! ఒకసారి ఆ పిల్ల కళ్లకున్న గంతలు తీసి, తన కూతుర్ని చూపించేసి బయటికి పట్టుకుపోయారు. సుజీ ఆనందానికి హద్దులేదు. కళ్లంట నీళ్లొచ్చేస్తున్నాయి. మళ్లీ పనిబడింది సుధీర్ కి. ఏవో కబుర్లలో పెట్టి, ఏడుపాపించి, సెడేట్ చేసేశాడు.
“కొడుకు పుడతాడన్నాడయ్యా శాస్త్రిగారు!” అన్నాడు శివరామకృష్ణ మనవరాల్ని చేతుల్లోకి తీసుకుంటూ!
“పోనీ కొడుకే అనుకోండి మావయ్యా! దీనిక్కూడా చిన్నప్పటి నుంచీ లాగూచొక్కాలే వేస్తే సరి!”
వినీల్ మాటలకి అక్కడంతా నవ్వుల పువ్వులు విరిశాయి.
బయట ‘గున్నా గున్నా మావిడీ!’ పాటకి డాన్స్ చేస్తున్నారు నిమజ్జనం బ్యాచంతా!
ఇక్కడందరి మనసులూ కూడా గున్నమావిడిలా గునగునలాడుతున్న బుజ్జిదాన్ని చూసి డ్యాన్స్ చేస్తున్నాయి.

0 comments:
Post a Comment