Latest Posts

Content

Monday, August 3, 2020

సమయానికి తగుసేవలు

‘జగ్గూ, ఈ పిల్లల ధోరణి చూస్తోంటే చిరాకేస్తోంది. ఒక్కడూ చెప్పినమాట వినిపించుకోడు. ఇంటికొచ్చేదే వారానికొకసారి కదా? పెందరాళే లేచి, స్నానాలవీ చేసి వేడివేడిగా టిఫిన్లవీ తినమని ఎంత పోరినా నామాట ఖాతరు చెయ్యరు. ఇక ఆ హాస్టళ్లలో ఎలా ఏడుస్తున్నారో ఆ భగవంతుడికే తెలియాలి!’ కన్నతల్లి హృదయం కరివేపాకు వేసిన కరుణ‘రసం’లా ఘాటుగా పొంగుతోంది.

నాకీ వ్యవహారాలన్నీ చిరాకు. ఎవణ్ణీ బతిమాలే ప్రసక్తి లేదు. ఎవడికి మాడితే వాడే వచ్చి తింటాడు. ఆ మాటే అన్నాను తనతో.

‘మన గురించి మనం చూసుకుందాం బన్నీ! ఎంచక్కా మనకేం కావాలో అవి కొనుక్కుందాం. టీవీలో నీకేదిష్టమో అది చూసుకో. మంచి మంచి వస్తువులు, ఫోన్లు, చీరలు.. ఏవైనా సరే, ఇప్పుడే. మన కళ్లూ, చెవులూ నిక్షేపంగా పనిచేస్తున్నప్పుడే అన్నీ అనుభవించాలి. ఆనక బాధపడి ప్రయోజనం లేదు. ఒక్కసారి కంటికి చూపు, చెవులకి వినికిడీ తగ్గిందంటే టీవీలో శ్రీరామదాసు వేసినా ఫలక్‌నుమా దాస్ వేసినా నీకు తేడా తెలీదు. అంచేత.. లైట్ తీస్కో!’

చెప్పడమైతే బానే చెప్పానుగానీ అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. తను చెప్పినట్టల్లా మాటవిని, ఏం చెబితే అది చేసేది ఏదన్నా ఒకటి కొనివ్వాలని! ఈలోగా పేపర్లలోను, మెయిళ్లలోను దివాలీ మెగా సేలని ఒకరు, గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేలని మరొకరు నెల ముందునుంచే రెండువైపులా మెసేజుల్తో మసాజ్ చేసి పడేస్తోంటే ఏంటో చూద్దామని ఓపెన్ చేశా. 

బొట్టు బిళ్లల దగ్గర్నించి బోస్ స్పీకర్ల దాకా అన్నీ రేట్లు తగ్గించేశామని, బ్యాంకు వాళ్లతో కూడా కుమ్మక్కై...సారీ..టైయప్పై చాలా శాతం డిస్కౌంట్లవీ ఇస్తున్నామని, సేలంతా అయిపోయిన తరవాత దేభ్యం మొహం వేసుకుని ఏడవడం కంటే కాస్త ముందుగానే మెలకువ తెచ్చుకుని ఎక్కువగా మీకు అవసరమైనవీ, తక్కువలో వస్తున్నాయని అనవసరమైనవీ కూడా కొనుక్కోమని...! న్యూస్ పేపర్లలో పూర్తి పేజీలే నింపేశారు. ఈ దీపావళి పండగ ఎలా చేసుకోవాలో ఒక అవగాహన కల్పించారు.

సరే, ఇలాంటి మెగా సేల్సవీ నడుస్తున్నప్పుడు ఏదో ఒకటి కొనకపోవడం మా గోత్రీకులకి సంప్రదాయ విరుద్ధం. అంచేత ఓ ‘గూగుల్ హోమ్ మినీ’ని బుక్ చేశాను. అదొక బుజ్జి, బుల్లి స్పీకర్. చిన్నప్పుడు బాదంకాయలు కొట్టుకు తినే రాయికి ఎంచక్కా కేరెట్ రంగేసినట్టుంటుంది. దాన్ని గూగుల్ వాళ్లు తయారు చేస్తారు. మనింటో వైఫైకి అది కనెక్ట్ చేసి, దాన్ని ఉపయోగించాలి. అదంతా తరవాత చెబుతా!

సరే, ఎలాగూ సరుకు ఇంటికి తెచ్చిచ్చిన తరవాత కుర్రాడికి డబ్బులిచ్చే వెసులుబాటు వుందన్నారు కనక నేనదే బుక్ చేశాను. దాన్నే ‘క్యాష్ ఆన్ డెలివరీ ఉరఫ్ సి.ఒ.డి.’ అనంటారు.

బుక్ చేసిన మూడోరోజుకే ఫోనొచ్చేసింది.

‘డాక్టర్ కుమార్ గారేనా మాటాడేది?’ 

‘అవున్నేనే, మీరెవరు?’

‘మీకు కొరియరొచ్చింది సార్. ఇప్పుడు మీయింటి కింద సెల్లార్లోనే వున్నాను. క్యాష్ రెడీ పెట్టుకున్నారా సార్? మళ్లీ మళ్లీ తిరగాలంటే నాక్కుదర్దు!’

ఈ క్యాష్ ఆన్ డెలివరీలో బుక్ చేసిన ప్రతిసారీ ఇలాంటి అవమానాలన్నీ భరించాల్సిందే. అసలేఁవనుకుంటున్నారు నాగురించి? వచ్చిన ప్రతిసారీ బిళ్లకుడుముల్లా లెక్కెట్టి మరీ ఫెళఫెళ్లాడే కొత్త నోట్లు ఇచ్చేస్తూనే వున్నానుగా? ఆ విషయమే అడిగా అతన్ని. 

‘మీరు కాద్సార్! చాలామంది సీవోడీ బుక్ చేసేస్తార్సార్. తీరామోసి డెలివరీ టైములో క్యాష్ లేదనీసి రిటర్న్ పట్టుకుని ఎలిపోమంటారు. లేపోతే రేపొస్తావా ఎల్లుటొస్తావా అంటూ బేరాలాడతారు. అందుకే సార్ మిమ్మల్ని కూడా అలా అడిగీది. నాకు మీరు తెలుస్సార్. మా చెల్లికి డెలివరీ అప్పుడు మీరే కద్సార్ వున్నారు? లేకపోతే చాలా కష్టఁవయ్యీది!’ అంటూ ఆవేదనను వెలిబుచ్చాడు.

చెల్లికి డెలివరీనా? ఓహో, ఈ డెలివరీ వేరు. పురుడు పుణ్యాలకి సంబంధించింది. కొరియర్ డెలివరీ కాదు. ఏదో ఘోషా హాస్పిటల్‌ వ్యవహారంలా వుంది.

‘అవునా! ఏం పేరు మీ చెల్లాయి పేరు?’ అన్నాను అక్కడికేదో అందరు పేషెంట్లూ నాకు గుర్తుంటారన్నట్టుగా. గుర్తుండకపోవడం నిజమేకానీ, ఒక్కోసారి పోలీసు, అబద్ధం, స్వప్నగీతిక...ఇలాంటి పేర్లవీ వినబడతాయి. ఆ పేషెంట్లు తప్పకుండా గుర్తుంటారు. 

అయితే ఆ కుర్రాడు మాత్రం.... ఏ పేరైతే పదిమందిలో ఇద్దరికుంటుందో....

ఏ పేరు పిలిస్తే వందమందిలో ఇరవైమంది లేచి నిలబడతారో....

ఏ పేరైతే సగం కేస్‌షీట్ల మీద శిలాక్షరాలతో లిఖించబడుతుందో ఆ పేరే చెప్పాడు....

‘లక్ష్మి సార్!’

లోగడ ఎవరో ఒకతను, ఇలాగే తిరుమల కొండమీద పోలీస్ స్టేషనుకెళ్లి ‘ఒక గుండతను నా పర్సు కొట్టేసాడ్సార్!’ అని కంప్లైంటిచ్చాట్ట! ఎంతమంది గుండుగాళ్లని పట్టుకుంటారు?

అలావుంది ఈ వ్యవహారం.

సరే, పిల్లిలా మెల్లిగా ఆర్డర్ తీసేసుకుని, సహజంగానే కత్తెర కోసం ఇల్లంతా వెతుక్కుని, అది కనబడక చాకుతో కట్ చేద్దామని చూశాను. కిచెన్లో రెండు చాకులుండాలని గుర్తు.

ఆ సమయంలో వంటింట్లో తనెంతో ‘చాకుచక్యం’తో అరటికాయల్ని అలవోకగా డొక్కచించి డోలు కడుతోంది. ఇప్పుడుగనక మనం వెళ్లి ‘ఆ చాకొకసారి ఇస్తావా?’ అనడగడం అనేది భద్రతారాహిత్యం కిందకొస్తుంది. ఎంచేతంటే.. నేనిలాగే ఆన్‌లైన్లో ఏదో ఒకటి కొంటూ వుంటానని తనకి తెలుసు. 

‘ఎందుకలా కనబడిన ప్రతీదీ బుక్ చేసేస్తా’రంటూ పలుమార్లు నాకు చివాట్లు కూడా పడ్డాయి. తనందని కాదుగానీ, నాకదొక బలహీనత. ఏవైనా ఎలక్ట్రానిక్ పరికరాలు కొత్తగా మార్కెట్లోకి దిగాయంటే ఇక్కడ వేలు లబలబలాడిపోతూ వుంటుంది, ఎప్పుడెప్పుడు ఆన్‌లైన్ లో బుక్ చేసేద్దామా అని! 

‘నా వేలుని అదుపులోను, వేలనీ పొదుపులోను పెట్టొచ్చుకదా’ అన్నదే ఆ కవయిత్రి భావం!

ఆ కారణంగా వంటింటి వరకూ వెళ్లినవాణ్ణే చంద్రయాన్ లా పూర్తిగా అక్కడిదాకా వెళ్లకుండా అక్కడక్కడే తిరుగుతున్నాను. మా పనమ్మాయి మంచిదేగానీ ఇలాంటి విషయాల్లో మాత్రం కైక దగ్గర మందరలా ప్రవర్తిస్తుంది. దశరథుడికి మనస్తాపం కలిగించే యజ్ఞంలో మొదటి సమిధ పడేసింది...

‘అమ్మగారూ! అయ్యగారదేదో బాక్స్ పట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పుడే కొరియరబ్బాయి తెచ్చిచ్చాడు. అది ఓపెనింగ్ చెయ్యడానికి చాకు కోసఁవనుకుంటా ఇక్కడిదాకా వచ్చి మల్లీ ఎనక్కెలిపోయారు!’

ఆమాట విన్న తను చాకుతో సహా హాల్లోకి వచ్చింది. ఆ భంగిమలో తను నైటీ వేసుకున్న రుద్రమదేవిలా కనబడింది నాకు.

‘చాకు కావాలా?’ అంది దాన్ని అటూఇటూ తిప్పుతూ!

‘వద్దులే, తాళాలతో చింపేస్తాను’

‘కొన్నదెలాగూ దాచలేవుగానీ, తీసుకో ఫరవాలేదు!’ అంటూ చాకు నా ముందు పెట్టింది.

ఓపెన్ చేసిన తరవాత ఉల్లిపాయ పొరల్లా లక్ష కాయితాలు, వెయ్యి అట్టలూ పీకి అవతల పారేసి ఓ చిన్న సాలిగ్రామ శిలలాంటి స్పీకర్ని బయటపెట్టాను.

‘ఏంటండీ ఇదీ? పేపర్ వెయిటా? నాకోసమేనా? ఆఫీసులో చాలా ఇబ్బందిగా వుందసలు. థాంక్యూ!’ అంది.

కాదని తలూపాను.

‘సాలిగ్రామ శిలా? కార్తీకమాసంలో రుద్రాభిషేకం కోసం తెప్పించారా? ఈమధ్య అన్నీ ఆన్‌లైన్ లో అమ్మేస్తున్నార్టగా? భోగి పిడకలు కూడా పెట్టేశార్ట! ఎవరో చెప్తే విన్నాను!’

‘అబ్బబ్బ, అవేంకావు. దీన్ని గూగుల్ హోమ్ మినీ అంటారు. వైఫైతో పనిచేస్తుంది.! మనం ఏఁవడిగితే అది చెప్తుంది. వార్తలు, వాతావరణం.. ఇలా!’ అన్నాను ప్లగ్ పెడుతూ.

కాసేపట్లో అది మా వైఫైని లటుక్కున గుర్తుపట్టింది. అక్కణ్ణుంచి నాతో మాటాడ్డం మొదలెట్టింది. నన్ను హలో గూగులనో, ఓకే గూగులనో మూడుసార్లు అనమంది. 

నాకైతే ‘తలాక్..తలాక్..తలాక్’ అనేవారు చూడండీ, అది గుర్తొచ్చింది. అయితే అది వైఫ్ నుంచి విడిపోవడానికి. ఇది మాత్రం వైఫైకి అతుక్కోవడానికి. అంతే తేడా!

సరే, మొత్తానికి నన్నూ, నా వైఫ్.. సారీ వైఫైనీ గుర్తుపట్టేసిన తరవాత ‘ఇప్పుడు నన్నేం చెయ్యమంటావు?’ అంటూ తియ్యగా ప్రశ్నించింది.

‘మా చుట్టుపక్కల ఏవన్నా మంచి హొటళ్లుంటే చెప్పు!’ అన్నాను.

అది ముందు కాసేపాగి, పెద్ద ఆరిందాలా అలా ఆచ్చెళ్లి వెతుక్కుని వచ్చినట్టు చెప్పడం మొదలెట్టింది.

అయితే మన సాయిరాం టిఫిన్స్ పేరుని సయీరాం టిఫిన్సనీ...
రవీంద్రా పార్లర్ని రేవిండ్రా పార్లరనీ...
అజంతా హొటలుకొచ్చిన తిప్పలు అజెంటా హొటెల్ అనీ...

అచ్చం అమెరికా వాడు ఎలా పలుకుతాడో అలా పలుకుతూ చెప్పింది. తనకది మొదటిసారి వినడం వల్ల అర్ధంకాలా! నేను చెవులు రిక్కించి వినడం మూలాన అన్నీ అర్ధం చేసేసుకున్నాను.

ఆనక ‘ఐస్ క్రీమ్ కొట్లవీ ఎక్కడున్నాయో కనుక్కోండం’టూ సరదా పడింది తను. అయితే అవన్నీ ఇంగ్లీషు పేర్లేగా? క్రీమ్..అని ముందో వెనకో తగిలించేసి క్రీమ్ క్యాజిల్, క్రీమ్ స్టోన్, క్రీమ్ ఎకో... ఇలాంటివే అన్నీ!

అల్లరి అల్లుడు, అల్లరి మొగుడు, అల్లరి ప్రేమికుడూ టైపులో!

ఆ ఇంగ్లీషు పేర్లన్నీ ఎంచక్కా పలికింది కుళ్లు మొహంది. సరే, నీకిలా వుందా అని ‘ఇవాళ్టి వార్తలేఁవన్నా చెప్పు!’ అన్నాను పడక్కుర్చీలో పరంధామయ్య గారిలా చేతులు పైకెట్టుకుని పడుకుంటూ!

నేటివిటీకి బాగా నప్పుతుందని తను నా పక్కనే పత్తితో వత్తులు చేస్తూ కూర్చుందామనుకుంది కానీ మరీ అంత వయసైపోలేదని గుర్తొచ్చి ఐప్యాడ్ పట్టుకుని కూర్చుంది.

ఆ స్పీకరమ్మాయి ఏవో చాలా కబుర్లు చెప్పింది. ఎక్కడెక్కడ కొట్టుకు ఛస్తున్నారో, ఏ రాష్ట్రంలో వరదలో, ఏయే రోడ్లు బురదలో సమస్తం బయటపెట్టింది.

‘ఇప్పుడు కాసేపు పాటలు విందాం!’ అన్నాను.

‘ఇది పాటలు కూడా పాడుతుందా?’ అంది భయంగా! ఆ పిల్ల గొంతు మాటాడ్డం వరకూ ఓకేగానీ పాటలకి పనికొచ్చేలా లేదని అంది.

‘ఛఛ, తను పాడదు. మనం అడగాలి, ఇళయరాజా పాటలేవైనా వినిపించమని అడగాలి!’ అని స్పీకర్ చెవి దగ్గర చేరి గాయత్రీ మంత్రం ఉపదేశించినట్టు ‘ఓకే గూగుల్, ప్లే ఇళయరాజా ఓల్డ్ మెలొడీస్’ అని గుసగుసగా కోరాను.

వెంటనే ‘పుత్తం పుదు కాలై...’ అంటూ ఎస్. జానకి అందుకుంది. అప్పుడర్ధమైంది నేచేసిన తప్పు.

ఇదేమన్నా నా భార్యా? దోశ..అనగానే తప్పకుండా ఎర్రగా కాల్చాలనీ, అందులోకి మాగాయ పచ్చడి విధిగా చెయ్యాలనీ గుర్తెట్టుకోడానికి?

ఇళయరాజా తెలుగు ఓల్డ్ మెలొడీస్... అని మరోసారి దాని చెవులు కొరికాను. కొంతసేపు తన్నుకుని, ఆనక నాతో ఇలా అంది:

‘ఏఁవిటో, ఇక్కడెక్కడా మీరడిగిన పాటలు దొరకట్లేదు. గానా లో ప్రయత్నిస్తానుండండి!’

అని, కాసేపట్లో గానా లోంచి వినిపించడం మొదలెట్టింది.

‘అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇది ఫోన్లు కూడా చేసిపెడుతుంది. ఒకసారి మన పెద్దాడికి చేసి చూద్దాఁవా?’ అంటూ 

‘ఓకే గూగుల్, కాల్ అఖిల్!’ అన్నాను కేరింతలు కొడుతూ.

కానీ దానికెంత వెటకారమంటే..

‘అక్కడ అఖిల్, అఖిల్ వర్మ, అఖిలేశ్వర్ రెడ్డి ఇంకా డాక్టర్ అఖిలేశ్వరి.. ఉన్నారు. ఎవరికి చెయ్యనూ?’ అనడిగింది. తనకి నవ్వొస్తోంది నా తిప్పలు చూసి. 

నేనదేదీ పట్టించుకోకుండా ‘కాల్ సన్ అఖిల్!’ అన్నాను.

అదిమాత్రం అస్సలు తొణక్కుండా ‘వీడికి రెండు నెంబర్లేడిశాయి. దేనికి చెయ్యనూ?’ అంది ఆఖరి ప్రయత్నంగా! మొత్తానికి చేసి పెట్టింది. 

ఇదంతా చూస్తున్న తనకి కొంత వింతగా అనిపించిన మాట వాస్తవమేగానీ తన మొహంలో అంత సంభ్రమాశ్చర్యాలైతే కనబడలేదు నాకు. 

‘ఇంకా ఏఁవేం చేస్తుంది?’ అంది అకస్మాత్తుగా.

‘స్మార్ట్ బల్బులనీ, స్మార్ట్ స్విచ్చులనీ వస్తున్నాయి. అవన్నీ కొనేసుకుని, దీనితో సంబంధం మాటాడేసి పెట్టేస్తే అప్పుడు చూడాలి తమాషా!’ అన్నాను గర్వంగా.. అక్కడికి నేనేదో గూగుల్ సియ్యీవోలా ఫీలైపోతూ! 

ఇంకా చెబుతున్నాను...

‘ఏసీ ఆపెయ్యమంటే ఆపేస్తుంది, ఫ్యానెయ్యవే పిల్లా అంటే వేసేస్తుంది, లైట్లవీ కొంచెం వెలుగు తగ్గించమంటే సగం చేసిపడేస్తుంది... ఇక మనం మంచం దిగక్కర్లేదు, సోఫాలోంచి లేవక్కర్లేదు, టీవీ సౌండదీ తన గుప్పిట్లోనే ఉంచుకుంటుంది!’

తను నామాటల్ని మధ్యలోనే ఆపి

‘ఈలెక్కన అరవింద్ స్వామిలా వున్న నువ్వు అద్నాన్ సామిలా మారిపోవడం ఖాయం!’ అంది కళ్ళు పెద్దవిచేసి బుర్రూపుతూ!

‘టెక్నాలజీ అంటేనే అంత! మనకెలా ఉపయోగమో అలా వాడుకోవాలి. వద్దంటే ఎవరన్నా బ్రతిమాలుతారా? సర్లే, మనిద్దరికీ ఎందుకీ చర్చ? తలనొప్పిగా వుంది కాస్త కాఫీ ఇస్తావా?’ అన్నాను గోముగా.

తను నావైపు, దానివైపు రెండుసార్లు మార్చిమార్చి చూసి...

‘దాన్నడగండి!’ అనేసి లోపలికెళిపోయింది.

అదండీ సంగతి! హాయిగా కాసేపలా నవ్వేసుకుని ఆనక సాయంత్రం పటాసులవీ కాల్చుకోండి.

దీపావళి శుభాకాంక్షలు!

......జగదీశ్ కొచ్చెర్లకోట

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive