Latest Posts

Content

Monday, August 3, 2020

ఇళయరాజా

‘ఓం శివోహం...ఓం శివోహం...రుద్రనామం భజేహం భజేహం!’ నమక చమక సంహితమైన శివస్తుతి ఎలుగెత్తి పాడుతున్నాడు కార్తీక్. సహగాయకులు వారి శక్తి మేరకు మంత్రోచ్చారణతో గానాన్ని, సభను రక్తికట్టిస్తున్నారు.

తదేకంగా చూస్తున్న నాకు శరీరమంతా ఉద్విగ్నతకు లోనయింది. దీనికి కారణం

లయబద్ధమైన గానమహిమో, 
లయకారుని మంత్రపటిమో... 
లేక ఆ వాద్యగోష్టి నిర్వహిస్తున్న ఇ‘ళయ’రాజా అసమాన ప్రతిభాపాటవమో తెలియలేదు!

అదే మొదలు ఆపాట వినడం. నిజానికి ‘బాల’ దర్శకత్వంలో వచ్చిన నాన్ కడవుల్(నేను దేవుడ్ని) చిత్రంలో ఆపాట కార్తీక్ పాడలేదు. విజయ్ ప్రకాష్ ఆలపించాడు.

ఎన్నో ఏళ్ల విరామం తరవాత నేను విన్న ఇళయరాజా ఈ చిత్రమంతా వినిపించిన మెలాంకలీ నాకెంతో దుఃఖాన్ని కలిగించింది. 

తెలియని బాధ. ఏడుపు తన్నుకొచ్చేంత విచారం.

పండిన పండు అన్నివైపులా పరిపూర్ణమైన రంగుని, రుచిని సంతరించుకుని ఎటువంటి భావాన్నైతే కలుగచేస్తుందో అచ్చం అలానే సంగీతామృతాంబుధిలో నిత్యం మునకలేసే ఆ అయ్యను చూసినా అలానే అనిపించింది.

నలభయ్యైదేళ్లకు పూర్వం అన్నకిళ్లి పాటల్ని విన్న తమిళ ప్రజలందరూ ఎవరితనంటూ తలెత్తి చూసి, చెవులారా విన్నారు. దేశవాళీ వాయిద్య పరికరాలతో పల్లె పదాల్లోకి ప్రాణాలూది గలగల పారే నదులకీ, కిలకిలమనే పక్షులకీ, జలజలా రాలే ఆకులకీ సంగీతాన్ని అనుసంధానం చేశాడు.

పక్క రాష్ట్రమైన మన సినిమా వాళ్లకి కూడా అప్పుడు మెడ్రాసే ఎడ్రస్సవడం వల్ల కొందరు నిర్మాతలు అక్కడి విజయాలన్నిటినీ డబ్ చేస్తూ డబ్బు చేసుకునేవారు.

ఉదయం ఆటలుగా ఏడాదీ రెండేళ్లు నడిచిన కొన్ని సినిమాలు తెలుసు నాకు. దాదాపుగా వాటన్నిటినీ తన పాటలతో ఇతగాడే నిలబెట్టాడు. సాహిత్య పరంగా కొంత ఇబ్బందిపడే నాలాంటి చాదస్తుల్ని తప్పిస్తే స్వరాలు మాత్రం నూటికి నూరుమందినీ మెప్పించేవి.

ఎక్కడ విన్నా అవే పాటలు. ఆకాశవాణి వాళ్లకీ, రేడియో శ్రీలంక తెలుగు స్టేషన్ వాళ్లకి కూడా ఇతగాడి పాటలే ముందుగా చేతికొచ్చేవి! తద్వారా అవన్నీ మన నోటికొచ్చేవి!

ఇంత ప్రతిభా ‘పాట’వాన్ని తెలుగువాడెలా వదులుతాడు? అది మొదలు మనదైన సాహిత్యం, మనసైన పదవిన్యాసం ఇతని స్వరాలలో కలిసి ఉప్పూ మావిడికాయకి మల్లే ఊరింది. ఊరించింది. ఉరకలెత్తించి ఉద్రేకపరిచింది. 

అక్కడ మొదలైన ప్రయాణం...అలుపు, అదుపూ ఎరగకుండా సాగించాడు ఇళయరాజా!

వేటూరి పదాలన్నిటికీ వెలకట్టలేనంత విలువనాపాదించాడు

ఆత్రేయ అక్షరాలనూ అవలీలగా స్వరాక్షితలుగా మార్చేశాడు

సిరివెన్నెలకు పక్షాలేమిటని ఎన్నో ఏళ్లుగా కురిపిస్తూ వున్నాడు

పదహారేళ్ల వయసులో మనవూరి చెరువుగట్టున ఉయ్యాలూగుతూన్న అనుభూతి ఎన్నేళ్లయినా పొందాలనిపిస్తుంది కదా? ‘సిరిమల్లె పువ్వా...నావాడెవరే’ అంటూ పువ్వుల్నీ, గువ్వల్నీ ప్రశ్నించే ఆ లయబద్ధమైన తూగుటుయ్యాలలాంటి గీతంతో పడుచు గుండెల్లో గుబులు పుట్టించాడు. 

ఆ గుబులేమిటో.... నాసామిరంగా, పెళ్లయ్యీ, సంసారాలు చేసుకుంటూ, పిల్లామేకా వున్నవాళ్లకు కూడా ఇప్పటికీ తగ్గనంత గుబులు! అదంతా ఇసైజ్ఞాని చేసిన అరాచకమే!! 

ఇతగాడి చేతబడితే....

మాటరాని మౌనం సైతం స్వరబద్ధంగా వినిపిస్తుంది.

ఆ స్వరాల తోటలో విహారం చేస్తూంటే తన దరికి రాని వనాల కోసం ఆ వసంతమే తరలి వచ్చిందనిపిస్తుంది. 

బంతీ చామంతీ ముద్దాడుకోవడం మనకు కనిపిస్తుంది. 

నింగీనేలా ఏకమయ్యేలా ఈ క్షణమిలా ఆగిందనీ అనిపిస్తుంది.

మన తెలుగింటి పిల్లలకి కాళ్లమీద పడుకోబెట్టుకుని, వెచ్చవెచ్చని బొబ్బలు పోస్తూ, ఒళ్లంతా నలిపి స్నానం చేయిస్తే సరిపోదు! మన రాజావారి లాలిపాట పాడాల్సిందే! 

అప్పుడు కదా కళ్లు మత్తుగా సోలి, మెత్తటి పక్కపై హాయిగా వాలి కంటినిండా నిదరోయేది!!

వర్షమొచ్చిన ప్రతిసారీ రెండుచేతుల్నీ చూరుకింద అల్లాడిస్తూ గీతాంజలిలా మారిపోని అమ్మాయిలుంటారా? 

వానదేవుడే కళ్లాపి చల్లాడని, 
వాయుదేవుడు ముగ్గేసి వెళ్లాడని పాడుకుంటాం! 

ఈ స్వరాల దేవుడే ఆ పాటని వర్షమున్నంత కాలం ఈ భూమ్మీద నిలిచేలా చేశాడని కూడా కలిపి మనమే మరో కొత్తవరస కలిపి పాడుకోవాలి! 

ఓంనమఃశివాయ.... అనే శివపంచాక్షరీ మంత్రంలో వున్న అక్షరానికో మల్లెల సరాన్ని ఆ సీతారామశాస్త్రి గారందిస్తే ఆ సరాలన్నిటినీ సుస్వరాలుగా మార్చి స్వర్ణకమలాన్ని అలంకరించాడు మన రాజా!

ఉదయ రవికిరణం తాకగానే లలిత ప్రియ కమలాన మెరిసే మంచు బిందువుల్ని లెక్కించగలమా? అలానే ఆ పాటంతా పరుచుకున్న పొడుగాటి సాహిత్యాన్ని ఒకసారి పరికించండి. 

గాయనీ గాయకులకు నిజమైన వ్యాయామం! గళాల్ని జోడుగా పరుగెత్తిస్తూ మనందరికీ నిరవధికమైన ఆనందాన్ని కలుగజేసిన జేసుదాస్, చిత్రల స్వరాభిషేకానికి మన కన్నుల కొలనులోంచి బాష్పాలు జాలువారక మానవు!

అటువంటి పాటల్ని జనరంజకంగా తయారుచెయ్యడానికి సంగీత జ్ఞానమూ, మేధస్సూ ఉంటే చాలవు. మనందరి మీదా ఎనలేని ప్రేమ కూడా వుండాలి. 

అదెంతటిదంటే...

తన పిల్లల ఆకలిని గమనించిన తల్లి ‘వీళ్ల కోసం ఏదో ఒకటి రుచిగా చేసిపెట్టాలి!’ అనుకునేంత ప్రేమ! 

అప్పుడు మాత్రమే అటువంటి పాట బయటికొస్తుంది!

ఎవరి విద్వత్తుకైనా కాస్తంత వ్యవధినిచ్చి, కావలసిన సమయం తీసుకొమ్మని ఆనక వారినుంచి మనకు రావలసింది రాబట్టుకుంటే అది ఖచ్చితంగా అత్యంత విలువైనదవుతుంది. అంతేగాని దొరికాడు కదాని అదేపనిగా వెంటపడి వేధిస్తే టిప్పుటాపు లుక్కు..లిప్పు మీద కిక్కులు, పైన కోకొనట్టూ..లోన చాకొలెట్టూ... ఇలాంటి చెత్త పాటలే మిగులుతాయి.

ఇళయరాజాకి వయసుతో నిమిత్తం లేదు. అతడిది సంగీతానికున్నంత ఆయుష్షు. కళామతల్లి ఒడిలో ఇప్పటికీ ఆడుకునే పసిబిడ్డ! 

ఏడున్నర దశాబ్దాల ఈ మహాజ్ఞాని సంగీత సామ్రాజ్యం క్షీరాబ్ధిని మించినంత! ఆ పాలకడలిలో మనందరం ఈదులాడదాం!

పెరుగులూ, జున్నులూ, మీగడలూ, వెన్నలూ...

దక్కినవారికి దక్కినంత కమ్మదనం!

జన్మదిన శుభాకాంక్షలు రాజా సార్!

మీ పాటంటే పిచ్చెక్కినంత ఇష్టమున్న కోట్లాదిమందిలో ఒకణ్ణి....

కొచ్చెర్లకోట జగదీశుణ్ణి!

.....జగదీశ్ కొచ్చెర్లకోట

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive