తెల్లారే పడిన వానకు ఊరంతా తడిసి నీళ్లోడుతోంది. స్నానం చేసిన తరవాత తుడుచుకోకుండా నిలబడినట్టున్నాయి చెట్లన్నీ. ఆకుపచ్చ చీరలు కాస్తా తడిసి ఒంటికంటుకున్నట్టు సిగ్గుతో చూస్తున్నాయి గిరికాంతలు. ఈ రోడ్డంతా ఇలానే ఉంటుంది. చుట్టూ కొండలు, దారిపొడవునా పొడవాటి చెట్లూనూ!
తను బయల్దేరానని వెలుగుతో వర్తమానం పంపాడు బాలభానుడు! తూర్పున ఆ కాస్తమేరా స్వాగత సూచకంగా ఎర్ర తివాచీ పరిచి ఉంచాయి మేఘాలు.
మెత్తగా సాగిపోతోంది కారు. అంతకంటే మెత్తగా జారుతోంది బాలు గొంతులోంచి పాట...
‘కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలె...’
విరగకాచిన వెన్నెల్లో మరిగిపోయే విరహగీతం. ఇటువంటి పాటల్లో సందర్భానికి తగ్గట్టుగా నటించడం కష్టమే! కానీ తెల్లచీరలో, మల్లెపూల పొట్లంలా ఆ ‘ప్రభ’ అలా వెలిగిపోతూ పక్కనుంటే ‘రంగనాథుడి’ ముఖాన ఆ భావాలు పలకడం అసాధ్యమేమీ కాదు.
కానీ చెవులకు పెద్దపెద్ద హెడ్ ఫోన్స్ తగిలించుకుని, ఎదురుగా ఉన్న మైకులో పాడుతూ స్వరంలో అంత మైకాన్ని పలికించడం మాత్రం గాయకుడికి అనుకున్నంత సులభమేమీ కాదు.
‘వలపే మన సొంతం.. ప్రతి మలుపూ రసవంతం’ అంటూ కాగే విరహాన్ని కంఠంలోంచి ఒంపుతోంటే మన ఒంట్లోంచి సెగలు కాంచనగంగా శిఖరమంత ఎత్తుకు లేస్తాయి. అలా పాడగలిగే ప్రావీణ్యం సాధనవల్ల సాధ్యమయే విద్య కాదు.
బాలు!
ఆయన పాట కోసం పుట్టలేదు. పాటలే ఆయన కోసం పుట్టాయి. అవన్నీ ఆ గొంతులో చేరి మరింత సొగసుగా బయటపడ్డాయి.
బాలు గొంతు దాదాపు ఐదున్నర దశాబ్దాలుగా మనందరికీ ప్రతినిత్యం శివస్తుతులతో మొదలవుతుంది.
కాసేపటికి శివాలెత్తించే పాటల మీదుగా సాగుతుంది.
సాయంసంధ్య వేళకి పలుకు రాగమధురంగా మారిపోతుంది.
పక్కచేరేటప్పటికి పులకింతల తొలిచూలు పుత్రికలా మనపక్కన చేరుతుంది.
ఆనక నిదురపోయేవేళ కథగా, కల్పనగా ఒక లాలిపాటగా ఆగుతుంది.
ప్రతి సందర్భానికీ ఒక పాటతో స్వరప్రస్తారం సాగించిన ఈ డెబ్భైనాలుగేళ్ల నవయువకుడికి గెలుపు తప్ప అలుపన్నదే లేదు.
ఆపాట పాడేది ఒక ‘కుర్రాడనుకుని’ మీరు మోసపోయే ప్రమాదముంది.
ఆ గొంతు వింటే ‘నిలవదే మది నిలవదే’ అని అనిపించే అవకాశముంది.
ఆ మాధుర్యం అలవాటైతే ‘ఇదే ఇదే నేను కోరుకుందీ’ అనిపించేస్తుంది.
ఆ ‘పాట’గాడికి ‘ఈ కోవెల నీకై వెలసినదీ’ అంటూ నీగుండెను చూపాలనిపిస్తుంది.
సహజసిద్ధమైన ‘మగ’ గొంతు బాలూది. అతని పాట అతనే పాడాలి, లేకుంటే వేరెవరైనా అతనిలానే పాడాలి తప్ప అంతకంటే బాగా పాడటం కుదరని పని.
ఆ గొంతు మనిళ్లలో రేడియోల కాలంలో లేతగా మొదలయింది.
‘చెదిరిన ముంగురులూ కాటుకలూ..
నుదురంతా పాకేటి కుంకుమలూ..!’
అంటూ సుతిమెత్తగా సుదతిని వర్ణించే అలతి పదాలను మరింత లలితంగా కొబ్బరినీళ్లంత తియ్యగా తన గళంనుంచి జాలువార్చేవాడు
రికార్డింగ్ అయిన రోజు అది విన్న రచయితలు ఇంటికెళ్లి తన రచనకు సార్ధకత చేకూరిందన్న సంతోషంలో చిరునవ్వుతో హాయిగా నిదురించేవారు.
‘చినుఃకులల్లో వాఃనవిల్లే.. నేఃలకిల్లా జారెల్లే!....’ అన్న పాటను విన్నవాడు సాధ్యమైనంత త్వరగా అక్కణ్ణుంచి జాఃరుకుంటాడు. ‘తన రచనకు ఏ గతి పట్టిందిరా భగవంతుడా!’ అని కంటనీరు కనబడనీయకుండా గొంతులోనే బాధను నొక్కేస్తాడు.
అక్షరం బయటపడాలంటే కవికి మేధోమథనం జరగాలి. ఆలోచనలనే హలంతో నిరంతరం దున్నుతూ ఉండాలి. కాసేపటికి ఒక ఆకారం వస్తుంది. అప్పుడు మనసు స్పందించి, పులకింతల జల్లు కురుస్తుంది. ఆ ఝరిలో ఈ అక్షరాలు మొలకెత్తుతాయి. చిగురులు తొడిగిన ఆ చిన్ని మొక్కలు మహావృక్షాలై తరతరాలకు నిలబడి నిలిచే మానుల్లా స్థిరపడిపోతాయి.
‘ఎంత మబ్బు మూసినా ఎంత గాలి వీచినా
నీలినీలి ఆకాశం అల్లాగే ఉంటుంది
ఎంత ఏడుపొచ్చినా ఎంత గుండె నొచ్చినా
నీలోపలి ఉద్దేశం అల్లాగె ఉండాలి’
ఈ అక్షరాలన్నీ నిరక్షరాస్యులకి సైతం నిబ్బరాన్నిచ్చే నిగూఢ తత్త్వాలు. కనుచూపు మేరలో కనబడని ఆశల్ని తన పాట ద్వారా తిరిగి తీసుకొచ్చి తన దోసిట్లో ముత్యాలుగా ఒంపే భావనల భాండాగారాలు ఇటువంటి స్ఫూర్తిదాయకమైన గీతాలు.
ఇంతటి భావానికీ అంతకు సరిజోడుగా సంగీతం సమకూరితే ఆవకాయ కోసం అంబటి సుబ్బన్న నువ్వుల నూనె దొరికిందన్న మాటేగా? సరే, ఈ రెండూ అమిరాయి.
మరి ఎవరు పాడితే ఈ పాట గుండె నిండా గుడిగంటల్ని మోగిస్తుంది?
ఎవరి గొంతు ఈ అనర్ఘరత్నాల్ని అలవోకగా మనకు దగ్గరచేసేది?
ఎవరి గళాన వింటే విఫలమైన ఆశలకు కొత్తగా రెక్కలొచ్చేలా చేసేది?
అతగాడే బాలు! ఆవకాయకు వెల్లుల్లిలా ఒక కొత్త పరిమళాన్ని అద్దుతుంది ఆ గొంతు. పాట మనిళ్లలో నిలవుండిపోతుంది. మన ముంగిళ్లలో నిలబడిపోతుంది కూడా!
ఒకటికాదు, రెండుకాదు. ఏకంగా నలభైవేల పాటలు పాడిన ఈ గొంతు చేసిన ఇంద్రజాలం అంతాయింతా కాదు.
‘పంచామృత స్నానం సమర్పయామి!' అని ఆదేవుడికి మనందరం దధిక్షీరాదుల్ని అర్పిస్తాం. ఆ స్నానంలో పొందిన ఆనందాన్ని మనకి ఏదేవుడూ వివరించలేదు.
ఈసుబ్రహ్మణ్యం మనందరికీ తనపాటతో పంచామృతాలనీ పంచిపెట్టాడు...
జుర్రుకుంటారో, మునిగితేలతారో మీయిష్టమంటూ!
ఆపాట ఆబాలగోపాలాన్నీ అలరించింది.
ముత్యాల ముగ్గుల్లో గొబ్బిళ్ళనీ
ఆకాశమంత పందిట్లో పెళ్ళిళ్ళనీ
సరికొత్త చీరల్లో సొగసుల్నీ
సామజవరగమనాది కృతుల్నీ....
ఒకటేమిటి?
‘ఏరాగమో...ఇది ఏతాళమో' అన్న భేదంలేదు.
ఆ సరాగానికి అలుపులేదు. ఆనోటికి తాళంలేదు.
బాల్ లేకుండా క్రికెట్టు వుందేమోగానీ
బాలు లేకుండా తెలుగుసినిమా లేదు
‘మామా చందమామ' విన్నా
‘మల్లికా నవమల్లికా' అన్నా
మన పుణ్యంకొద్దీ ఈ పురుషుడనిపిస్తుంది. మారువేషంలో తిరిగే గంధర్వుడనిపిస్తుంది.
ఆగొంతు నిదురమబ్బుల్ని కలలు రేపుతుంది
ఆస్వరం నిదరోయే నదుల్ని సైతం కదిలిస్తుంది
‘చిన్నారి పొన్నారి కిట్టయ్య'ల్ని ఊరడించాలన్నా
‘చిన్నదాన నన్నువిడిచి పో'వద్దని ఊరించాలన్నా
‘చిలకమ్మ పలికిందన్నా చిగురాకు కులికింద'న్నా
‘చిత్రం భళారే విచిత్ర'మంటూ చిత్తగించవలసిందే!
అలవాటుపడిన కిషోర్, రఫీలమధ్య ’తేరె మేరె బీచ్ మే!' అంటూ బాలుణ్ణి హిందీలో వింటే బూందీ తిన్నంత కమ్మగా అనిపించిందో ఏమో, వాళ్లందరికీ మరికొంచెం కావాలనిపించింది.
సన్నగా వానపడుతోంటే కరకరలాడే కారప్పూసలా బాలు పాటలు ఉత్తరాదివారిని ఉరకలెత్తించాయి.
‘ముత్యాలూ వస్తావా!' అని అల్లు రామలింగడికీ
‘మనఁవాడిన గుజ్జనగూళ్ళే' అంటూ అతని మనవడికీ..
మధ్య మూడుపదుల వయోభేదం బాలుడికి
మాధుర్యంలో తేడా తెలిసిందా ఏ ఒక్కరికీ?
‘కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళ'ని అందమైన అనుభవాన్ని పంచాడు.
‘కుర్రాడు'గా మారి మళ్ళీ ముప్ఫయ్యేళ్ళకి మరోసారి వెర్రెక్కించాడు.
కుడికన్ను కొట్టే పాటలూ,
కుడికన్ను అదిరే పాటలూ
కుశలమా అంటూ పలకరింపులూ
కుకుకూ..! అంటూ పులకరింపులు
ఈ పాటగాడి ప్రతిభా ‘పాట'వాలకి
‘పాట'కజనమైనా పరవశించిపోవలసిందే!
ఇతనిగురించి రాయమంటే నాకు
‘ప్రతిరాత్రీ వసంతరాత్రే!'
ఈ ‘నేలమీది జాబిలి'కి
నేనర్పించే నూలుపోగు!
‘మాబాలు పుట్టినరోజు
మరపురాని పండగరోజు'
శుభాకాంక్షలు!

0 comments:
Post a Comment