Latest Posts

Content

Monday, August 3, 2020

శుభోదయం

పలకమీద ఓనమాలు దిద్దిన 
ఆనవాలులా బొద్దుగా వుంది దారంతా! 

తరవాణీ కుండలో రాత్రినుంచీ బయటికొస్తున్న 
నురగలా మెల్లమెల్లగా బయటపడ్డాడు సూర్యుడు. 

సుప్రభాతం వినగానే ఆ ‘నారాయణుడి’కి ‘చైతన్యం’ వచ్చి 
స్కూలు పిల్లాడల్లే తెమిలిపోతున్నాడు.

అందరినీ కాపాడే దేవుడికి కాపలాగా వున్న సెక్యూరిటీ సత్తిబాబు 
బద్ధకాన్ని గొంగళిలా కప్పుకుని నిద్రపోతున్నాడు.

నిబద్ధతకు నిదర్శనమైన అతని కుక్క మాత్రం 
ముందుకాళ్లు బారచాపి ‘డాగాసనాలు’ వేస్తోంది. 

తెల్లారే టీతాగి, టీషర్టేసుకుని ఫార్టీలవాళ్లంతా 
పడకలొదిలి నడకలు మొదలెట్టారు.

సిమెంటు రోడ్డునే వాకిలిగా భావిస్తూ 
అపార్ట్‌మెంట్ల పనిమనుషులంతా 
కళ్లాపిజల్లి ముగ్గొకటి ‘పడే’స్తున్నారు.

మనవికాని పువ్వుల్ని మనసారా కోసేసుకునే 
అర్ధరాత్రి స్వతంత్ర్యోద్యమకారులు 
చెట్లన్నిటినీ ఆంగ్లేయుల్లా కొల్లగొట్టేశారు.

వే‘కువకువ’లతో అలసిపోయిన పావురాలన్నీ 
‘ఇకచాల్లే’ అంటూ గుడిగోపురంలో నిశ్శబ్దంగా నిద్రపోతున్నాయి.

బ్రష్షూ పేస్టులుగా రూపాంతరం చెందిన 
పందుంపుల్లలు వేపచెట్లకే వేలాడుతున్నాయి.

ఇస్త్రీబండివాడు నిప్పుల్నీ
ఇలాచీ టీవాడు కప్పుల్నీ
సిద్ధం చేసుకుంటున్నారు.

రాత్రంతా ఓ ‘వెలుగు’ వెలిగిన వీధిదీపాలు 
సూర్యుణ్ణి చూసి సిగ్గుపడుతున్నాయి.

పే‘పరుల’ వార్తల కోసం ఎదురుచూసే మానవ నైజం 
దొంతరలుగా సైకిళ్లమీద తిరుగుతోంది.

మరోరోజిలా తెల్లారింది.

.........జగదీశ్ కొచ్చెర్లకోట

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive