Latest Posts

Content

Monday, August 3, 2020

తేగల పాతర

‘కనకాంబరాలూ, కన్నకాసులూ! లేవాలిమరి! బడికి ఆలస్యమైపోతుంది!’ చిన్నప్పుడు నాన్నగారు మమ్మల్ని నిద్రలేపే పద్ధతి ఇదే! అయిదుగురికీ అయిదుపేర్లూ వున్నా ఏవో మారుపేర్లతోనే పిలిచేవారు. అప్పట్లో నాక్కొంచెం కోపం ఎక్కువుండేదని చెప్పి నన్నుమాత్రం ‘దుర్వాస మహర్షీ!’ అని సంబోధించేవారు.

చలికాలం పిల్లలందరం ఒకళ్లనొకళ్లు చుట్టేసుకుని పడుకునేవాళ్లం. నాన్నగారు పొద్దున్న లేపడానికొస్తే దుప్పట్ల మధ్య పాతబట్టల మూటలా కనబడేవాళ్లం. ఎవడిచెయ్యి ఎక్కడుందో, ఏ కాలుగోకితే ఎవరు కదులుతారో తెలియనంతగా!

మొత్తానికి ఏదోరకంగా లేపి పెరట్లోకి తీసుకొచ్చేవారు. బోల్డన్ని చెట్లుండడంవల్ల బాగా చలిగా వుండేది. నాన్నగారు మాత్రం అంత చల్లోనూ లుంగీ, బనీనుతోనే కింద కూర్చుని పొట్టుపొయ్యిలో పొట్టు కూరుతుండేవారు. ఓమూలగా రెండుమూడు పొట్టుబస్తాలుండేవి. ఎప్పుడైనా వర్షంపడితే పొట్టంతా తడిసిపోయేది. ఆ తడిపొట్టుగనక కూరారో, పొయ్యి అంటించినపుడు ఇల్లంతా పొగే! 

ఒక్కోసారి పొట్టు కూరడానికి పిల్లలం పోటీపడుతుండేవాళ్లం. కానీ మాకంత దట్టింపు వచ్చేదికాదు. నాన్నగారు అప్పుడు మొదలెడితే అందరికీ నీళ్లుకాగి, స్నానాలవీ చేయించేసరికి ఏడో ఎనిమిదో అయ్యేది. ఆఖర్న తనుమాత్రం నూతినీళ్లతోనే స్నానంచేసి, అయిపోయాక చెంబుడునీళ్లలో ఓ నాలుగు మందారాలు పడేసుకుని పూజకి కూర్చునేవారు.

ఈలోగా మేఁవందరం తడీపొడిగానే పౌడర్లు రాసేసుకుని, ఎవడికైనా మొహానికో, మెడకిందనో  కొంచెం ఎక్కువగా పౌడరు కనబడితే అదేదో పెద్ద జోకులా కిందపడి నవ్వేసుకుని, మళ్లీ చద్దన్నాల దగ్గరకూడా ఆ విషయం చెప్పుకుని మళ్లీ నవ్వేసుకుని, మధ్యమధ్యలో చేతనైనంత కొట్టేసుకుని బడికి బయల్దేరేవాళ్లం.

నాకూ చిన్నన్నయ్యకి రెండేళ్లే ఎడం. అందువల్ల మా బట్టలు దాదాపుగా ఒకే కొలతలతో ఏడిసేవి. పైపెచ్చు చొక్కాల రంగు మార్చినా నిక్కర్లు మాత్రం ఒకే గుడ్డతో కుట్టించేవారు. నేను ఎప్పుడూ తొండే! వాడి నిక్కరు నాదని అడ్డంగా వాదించి, పేచీలుపెట్టి, చిన్నవాణ్ణనే సింపతీ కార్డుపయోగించి మొత్తానికి సాధించేవాణ్ణి!

బంధువులెవరికైనా పరిచయం చేసేటప్పుడు మాత్రం ఎలక్షన్ల ముందు కలిసిపోయే కమ్యూనిస్టు పార్టీల్లా కలిసిమెలిసి చూడముచ్చటగా వుండేవాళ్లం. మళ్లీ చుట్టాలిలా వెళ్లగానే అచ్చం వాళ్లలాగే సిద్ధాంతపరంగా విడిపోయేవాళ్లం.

మమ్మల్నిద్దర్నీ చూసి ఎవరైనా అదేవిషయం పొగిడితే అమ్మ గర్వంగా నవ్వుకునేదే తప్ప ‘ఇంకానయం, మీరిలా వెళ్లగానే మళ్లీ వాలిసుగ్రీవుల్లా కిందపడి కొట్టేసుకుంటారు!’ అని చెప్పేదికాదు.

అప్పుడు నాకు కోపమొచ్చేది. వాళ్లు మమ్మల్నలా రామలక్ష్మణులతో పోలుస్తోంటే ‘శివశివా! కళ్లకు కనబడేదంతా నిజంకాదు! వీళ్లిద్దరూ నిజజీవితంలో వాలిసుగ్రీవులు!’ అని చెప్పాలా? ఎబ్బే!

ఇక కాఫీలకోసం కుంపటి అంటించడం కూడా జల్లికట్టు పోటీల్లా మహరంజుగా నిర్వహించబడేది. నేనంటే నేనని పంతంగా పైన బొగ్గులు కుంపట్నిండా పోసి, కాయితాలవీ అడుగున కుక్కి, అగ్గిపెట్టె పట్టుకుని వంతులవారీగా అంటిస్తుండేవాళ్లం. 

‘గాలివాటం ఎటుందో అటువైపు పెట్టండర్రా! విసరాల్సిన పనుండదు!’ అని అమ్మ వంటింట్లోంచి చెబుతున్నా సరే వినకుండా మేదర విసనకర్ర పట్టుకుని దానిమీద ప్రతాపమంతా చూపించి గాట్టిగా విసిరేవాళ్లం. కాసేపటికే బొగ్గులన్నీ ఎర్రగా కణకణలాడేవి. ఆ వేడివేడి నిప్పుకణికల్ని చూసి ఆకాడికి వాటిని మనఁవే తయారు చేశామన్నట్టు గొప్పగా ఫీలైపోయేవాళ్లం. 

నాన్నగారి కోసం తీసే కాఫీ డికాక్షన్ వాసన కుంపటి నుంచి వచ్చేటప్పుడు మరొక రకంగా ఉండేది. అదిప్పటికీ గుర్తే నాకు! గత మూడున్నర దశాబ్దాలుగా గ్యాస్‌స్టవ్ కాఫీ అలవాటయిపోయినా ‘ఆపాత’ పరిమళం మాత్రం నన్నింకా వదల్లేదు.

చిన్నపిల్లాణ్ణని దగ్గర్లో ఉన్న బళ్లో పడేద్దామనుకున్నారు అమ్మానాన్న. కానీ ఒక్కణ్ణీ బడికిపోవడం ఎంత దుఃఖాన్ని కలిగిస్తుందో నన్నడగండి. ఏ పిల్లలకైనా అంతే. తరాలు మారినా పిల్లల మనస్తత్వాలు మాత్రం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఒక్కటే! వాళ్లకి కావలసింది నాన్నలిచ్చే డబ్బులు, బొమ్మలు, తినిబండారాలు కాదు. కాసేపు వాళ్లతో ఆడుకోవడం, బోల్డు కబుర్లు, అప్పుడప్పుడు కథలు చెప్పడం, బయటికి తీసుకెళ్లి ఈ లోకపు వింతలన్నీ స్వయంగా వివరిస్తూ వారి విజ్ఞానాన్ని విస్తృతపరచడం.... ఇవే వారు కోరుకునేవి.

ఆ కారణంగానే నేను ఒంట్రెత్తుగా ఒక్కణ్ణీ ఇంటిదగ్గర్లో ఉన్న బడికి పోనని మారాంచేసి జి.జె.కాలేజీకే బయల్దేరాను అన్నయ్య తోడుంటాడని. అక్కడ ఆరునించి ఇంటర్ వరకూ వుండేవి. అన్నయ్య ఎనిమిదిలో చేరాడు. ఇంటిదగ్గర బయల్దేరి, నడుచుకుంటూ వెళితే ఆ కాలేజీ చాలాదూరం. అయినా తప్పదు. అందరు పిల్లలూ అలా నడిచే వెళ్లేవారు. 

టెన్త్ క్లాస్ పూర్తయిన పిల్లలు పుస్తకాల్ని భుజంమీద పెట్టుకుని ఒకచేత్తో పట్టుకు నడిచేవారు. కింద తరగతులవాళ్లు మాత్రం పుస్తకాల్ని చేత్తో పట్టుకుని నడుంపక్కగా పెట్టుకునే నడవాలి. ఎప్పుడైనా మాలాంటి పిల్లకాయలు పుస్తకాలు భుజమ్మీద పెట్టుకు నడిస్తే ‘ఏట్రోయ్, అప్పుడే కాలేజీకొచ్చీసాననుకుంటున్నావా? దించు దించు!’ అని కోప్పడేవారు. అదో సరదా!

సరస్వతీ ప్రెస్ లో పెన్సిళ్లు, రబ్బర్లు, నోట్‌బుక్స్ కొనుక్కునేవాళ్లం. అదేం రష్షో, ఎప్పుడూ ఖాళీ వుండేదికాదసలు. మనమాటే వినిపించుకునేవారు కాదు ఎవరూ! కొత్త పుస్తకాలు కొన్న రెండుమూడు రోజులవరకూ వాటి మధ్యపేజీలు తెరిచి ఆ వాసన చూడ్డంతోనే సరిపోయేది. ప్రతి పదినిమిషాలకీ చూసేవాణ్ణి. అంతిష్టం! మీకూ అంతేగా?

అదే కాలేజీలో మా పెద్దన్నయ్య ఇంటర్లో జాయినయ్యాడు. వాడిది సి.ఇ.సి. గ్రూపు. విపరీతంగా అల్లరి చేసేవాడు. తరగతిలో వున్న అమ్మాయిలందరికీ ఏవో మారుపేర్లు పెట్టి బాగా ఏడిపించేవారు వాడి బ్యాచంతా! క్లాసులోకి అమ్మాయిలిలా అడుగుపెడుతోంటే పాటందుకునేవారు.

అప్పట్లో మన సూపర్‌స్టార్ కృష్ణకి చాలా కొక్కిరాయి పాటలు రాసి, చిత్రీకరించి ఆకాలపు కుర్రాళ్లకి కావలసినంత సరంజామా చేకూర్చారు మన రచయితలు, దర్శకులు. ఇక బాలు లేతగళంలో ఆ పాటలన్నీ మరింత కమ్మగా కారప్పూస తింటున్నట్టుంటాయి.

కత్తుల రత్తయ్యలో ‘ఓహోహో చామంతి...’
అందరికీ మొనగాడులో ‘దారంట పోయేదానా...’
టక్కరిదొంగ చక్కనిచుక్కలో ‘నడకలు చూస్తే మనసవుతుందీ...’
నేనంటే నేనేలో ‘ఓ చిన్నదాన నన్ను విడిచి పోతావటే...’
దేవుడు చేసిన మనుషుల్లో ‘దోరవయసు చిన్నది...’

ఇవన్నీ సందర్భానుసారంగా పాడేసుకుంటూ ఆడపిల్లల్ని తెగ ఏడిపించేవారు. అలాగని ఆ అమ్మాయిలకి కోపాలవీ వచ్చేవి కావు మళ్లీ! వాళ్లూ చాలా గర్వంగా ఫీలయ్యేవారు. క్లాసయిపోయాక అందరూ సరదాగా మాటాడుకుంటూ కనబడేవారు. శ్రుతిమించని వ్యవహారాలే అవన్నీ! 

అన్నదమ్ముల అనుబంధం సినిమాలో ఎన్టీయార్, మురళీమోహన్, బాలకృష్ణ చాలా అరుదుగా కలుసుకుంటూ వుంటారు. గుర్తుందిగా? అచ్చం మేంకూడా అలానే అక్కడ చదివిన ఏడాదీ రెండేళ్లలో ఒకట్రెండుసార్లు మాత్రమే కాలేజీలో కలుసుకునివుంటాం. 

ఒకరోజు ఓ తమాషా జరిగింది....

“నిన్ను మైఖేల్ మేష్టారు రమ్మంటున్నారు!” అంటూ నానిబాబుగాడొచ్చి చెప్పేటప్పటికి నాకు కాళ్లూచేతులూ వణికాయి. ఎందుకు రమ్మన్నారో? 

మొన్న గ్రౌండ్లో రమణ్రావుకీ నాకూ అయిన ఫైటింగ్ గురించి తెలిసిపోయిందా? ఏదయితేనేం! ధైర్యంగా బయల్దేరాను. పక్క సెక్షన్లో క్లాస్ చెప్తున్నారు మేష్టారు. క్లాసు కిటకిటలాడుతోంది. అందరూ పదేళ్ల పిల్లలు. ఖాకీనిక్కర్లు, తెల్లచొక్కాలతో అబ్బాయిలు, ఖాకీ స్కర్ట్లు, తెల్లచొక్కాలతో అమ్మాయిలూ! అంతంత జడల్ని వదిలేస్తే ఇబ్బందని మడతలెట్టి తెల్ల రిబ్బన్లతో పైక్కట్టి పంపించారు వాళ్లమ్మలు. 

నేను ద్వారందగ్గరే నిలబడిపోతే మేష్టారు నన్ను లోపలికి పిలిచి “ఆఁ! రారా! ఈడే జగదీసంటే!” అన్నారో లేదో అంతా చప్పట్లు కొట్టేశారు. 

ఏదో అయింది. ఏఁవయిందీ?

ఇంతలో మేష్టారే చెప్పారు..క్వార్టర్లీలో నేను మొత్తం అన్ని సెక్షన్లకీ ఫస్టొచ్చానుట!

అప్పుడు వణుకు ఇంకా ఎక్కువైంది. మొత్తానికి ఆయన నన్ను మధ్యలో నిలబెట్టి పాతాళభైరవిలో ఎస్వీయార్లా ఏదో చాలా మాటాడారు. ఎలా చదవాలో, ఎలా బుద్ధిగావుండాలో చెబుతున్నారు!

మనకీ రమణారావుకీ అయిన ఫైటింగ్ విశేషాలు ఈయనకెవరూ చెప్పలేదని అర్ధమైపోయింది. రమణ్రావుగాడి అన్నయ్య టైలర్. వెంకునాయుడుపేట మొదట్లోనే కొట్టు. ఈ రమణ్రావుకి మాధవరావంటే ప్రాణం. మాధవని ఎవరైనా ఏదైనా అంటేచాలు మీదడిపోయేవాడు. 

ఒకసారిలాగే పి.టి. క్లాసులో మాధవని నేనేదో అన్నానని రమణ్రావుగాడు నామీదపడి పిడిగుద్దులు గుద్దేశాడు. గ్రౌండ్లో దొర్లుకుంటూ ఇద్దరం ఎన్టీయార్, రాజనాలల్లా తెగ కొట్టేసుకున్నాం. నేనేం తక్కువ తిన్లేదు. కత్తెరపట్టేసేశాను. కత్తెరపట్టంటే తెలుసుగా? మన కాళ్లు రెండూ అవతలివాడి నడుంచుట్టూ బిగించేసి కొండచిలువ లేడిని బంధించేసినట్టు కదలకుండా పట్టేసుకోవడం. దాంతో వాడు ఓడిపోయాడు. ఎంత బతిమాలినా నేనొదల్లేదు.

ఈలోగా మాకు పి.టి. చెప్పే బాస్టియన్ మేష్టారొచ్చి సైకిలుకేసే పైపు తాళంతో కుక్కల్ని కొట్టినట్టు కొట్టారు ఇద్దర్నీ! ఆ దెబ్బ మన జీవితంలో పెనుమార్పులే తీసుకువచ్చింది. ఏంటో అనేసుకుంటున్నారా? అదిమొదలు అసలు నేను గ్రౌండుకే వెళ్లలేదు. ఆరకంగా ఆటలనేవి నా జీవితంనుంచి మర్యాదగా తప్పుకున్నాయి.

ఇంతకీ క్లాసులో మర్యాదలవీ చేసేసిన తరవాత మైఖేల్ మేష్టారు ఏంచేశారో తెలుసా? నాకు ఒక దస్తా తెల్లకాయితాలిచ్చారు. ఒక నలభైదాకా సామాన్యశాస్త్రం ప్రశ్నలిచ్చారు. ఆ ప్రశ్నలన్నింటికీ విపులంగా, అందంగా సమాధానాలు రాసి ఒక మూడురోజుల్లో ఇచ్చెయ్యమన్నారు.

మరీ బక్కగా, అమాయకంగా, వెర్రివెధవలా కనబడితే అలానే చెప్పాలనిపిస్తుందేమో? నేనదేదో చాలా పెద్ద అవార్డులా ఫీలైపోయి రాత్రుళ్లు మెలకువగా కూర్చుని మరీ రాసిచ్చేశాను. ఆయన అదిచూసి మురిసి ముక్కలైపోయారు. వాటినే ఆయన క్లాసులో రన్నింగ్ నోట్సులా పిల్లలకి చెబుతూ వుండేవారు.

చాలాకాలం తరవాత ఆమధ్య ఆ కాలేజీ వార్షికోత్సవానికి మన పూరీ జగన్నాథ్ గారిని ఆహ్వానించారు. ఆయనది ఆవూరేగా? అంచేత. కానీ వారికి సమయం కుదరక రాలేనని కబురుపెడితే అక్కడ పనిచేసే ఒక ఉపాధ్యాయురాలికి నేను గుర్తొచ్చానుట! ఆవిడెవరో కాదు. ప్రస్తుతం నాతో పనిచేస్తున్న నా క్లాస్‌మేట్ కి సోదరి. అంచేత వారి కళాశాలకి రమ్మని ఆహ్వానించారు.

నేను కుటుంబసమేతంగా వెళ్లి అక్కడ స్పీచొకటి దంచాను. ఈకాలంలో సినిమాలు ఉపాధ్యాయ వృత్తిలో వున్నవారిని ఎంత నికృష్టంగా చూపెడుతున్నాయో, వారిమీద ఎంత దారుణమైన హాస్యాన్ని సృష్టిస్తున్నారో సోదాహరణంగా వివరిస్తూ, దయచేసి అటువంటి చిత్రాల్ని ప్రోత్సహించవద్దని ఆవేదనాభరితమైన, ఆవేశపూరితమైన సందేశాత్మక ఉపన్యాసం ఇచ్చి కళ్లూ, మొహమూ తుడుచుకుని వీడ్కోలు తీసుకుని తిరిగి బయల్దేరాను.

ఆనక కారెక్కిన తరవాత తను చెప్పింది...

నేను స్పీచిస్తున్నంతసేపూ మా రెండోవాడు ఎన్ని సినిమా డైలాగులు కొట్టాలో అన్నీ కొట్టాడని, వాడి వేషాలకి చుట్టుపక్కల పిల్లలంతా విపరీతంగా ఎంజాయ్ చేశారనీ!

ఖర్మరా బాబూ! ప్రహ్లాదుడి కడుపున హిరణ్యకశిపుడు పుట్టాడన్నమాట! అని నాకనిపించడంలో ఆశ్చర్యం లేదుకదూ?

......జగదీశ్ కొచ్చెర్లకోట

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive