స్నానం చేసి, బాల్కనీలో టవల్ ఆరేసి కిచెన్లోకి తొంగిచూస్తూ పేపర్ బాయ్ పేపర్ విసిరేసి పారిపోయినట్టు ‘టిఫిన్ చేసేశావా? టైమవుతోంది నాకు!’ అనేసి వచ్చెయ్యబోయాను.
కానీ తను వెంటనే అందుకుంది. ‘పిల్లల్ని కూడా లేపు. అందరికీ ఒకేసారి చేస్తా టిఫిన్. ఒక్కొక్కరికీ తలోసారీ అంటే కుదరదు నాకు!’
ఇలా అందరికీ ఒకసారే విధించడానికి అదేమన్నా నిర్భయ ఉరిశిక్షా? ఉప్మాశిక్ష!
వాళ్లందరినీ నిద్రల్లేపి, బాత్రూముల్లో నిలబెట్టి రావలసిన బాధ్యత నాదేనన్నట్టు, ‘ఒకవేళ ఎవరూ లేవకపోతే నీ టిఫినే ఆలస్యమవుతుంది’ అన్నంత హెచ్చరిక దాగివుంది అందులో! అజ్ఞాతవాసంలో బయటపడిపోతే మళ్లీ పధ్నాలుగేళ్లు అరణ్యవాసం చెయ్యాలని బెదిరించినట్టే అనిపిస్తుంది నాకైతే!
దీనికంతటికీ కారణం కరోనా!
ఈ కరోనా కపూర్ మన జీవితాల్లో ఎడంకాలెట్టి ప్రవేశించకముందు మాకొక వంటావిడ ఉండేది. గడచిన ఆరేడేళ్లుగా బానే చేస్తోంది. కాకపోతే నాలుగైదు చోట్ల వంటలవీ చేసొస్తారన్న కారణాన కొన్నాళ్ళపాటు రావద్దని, జీతం మాత్రం ఇచ్చేస్తామని చెప్పేశాం.
ప్రస్తుతం సర్వం‘తాళ’మయం కదా.. అదేనండీ, లాక్‌డౌన్! అంచేత మొత్తం కుటుంబమంతా నలభైరోజులుగా ఒకే ఇంట్లో ‘మొబైల్లో’ తలదాచుకుని జీవిస్తున్నాం.
తనని ఆఫీసువాళ్లు రోజు విడిచి రోజు రమ్మన్నారు. నన్నలా రమ్మని చెప్పడం ఈ జన్మలో జరగని పని. అంచేత రోజూ వెళ్లాల్సిందే! పాపం, తనసలే ఆఫీసుకెళ్లే హడావుడిలో ఉండగా అదనపు ఆకర్షణగా ఈ వంటొకటి వచ్చి చేరింది.
తెల్లారే నీళ్లు పట్టడాలవీ నేనింట్లో ఉంటే సాయం చేస్తాను. ఉదయం పూట మనకేదన్నా ఎమర్జెన్సీ కేసులవీ ఉంటే అదీ ఉండదు. మా వీధి చివరనున్న కోడి కూసే వేళకి బయటికెళ్లి మళ్లీ మా కింది వాటావాళ్లు కోడి కోసే వేళకి తిరిగొస్తాను.
అద్దెకొంపలో ఉండడమనేది పరకాయ ప్రవేశం లాంటిది. మనదైనదీ, మనసైనదీ ఒక ఇల్లంటూ కట్టేసుకుంటే మళ్లీ మన శరీరంలోకి వచ్చేసినంత ఆనందం. అందుకే ఏడేళ్లక్రితం మనసుపడి కాస్తంత విశాలంగా ఇల్లు కట్టుకున్న వెంటనే పిల్లలిద్దరూ చదువుల కోసం పొరుగూళ్లు వెళిపోయారు. దాదాపు ఆరేడేళ్ల నుంచి బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్, అంజలీదేవిల్లా ఇద్దరమే ఉంటున్నాం.
సాయంత్రం కాగానే ‘నా కళ్లజోడెక్కడైనా చూశావటోయ్?’ అని నేను..
‘ఏవండీ, హరిద్వార్, రుషీకేశ్ ఎప్పుడు తీసుకెడతారు?’ అంటూ తనూ..
ఇంకా రాని పెద్దరికాన్ని మీదేసుకుని ఇప్పట్నుంచీ ప్రాక్టీస్ చేస్తున్నాం. జుత్తంతా నల్లగా నిగనిగలాడిపోతూ, జీన్ ప్యాంట్లూ, డార్క్ కలర్ చొక్కాలూ వేసుకుంటూ అలా మాటాడితే ఎబ్బెట్టుగా ఉంటుందని తెలుసు. అందుకే అప్పుడప్పుడు ‘హే బేబ్స్!’ అనో, ‘మేడమ్!’ అనో పిలుస్తూ బ్యాలెన్స్ చేసుకొస్తున్నాను.
పిల్లలు సెలవులప్పుడు ఇంటికొస్తే మాత్రం నానా అల్లరీ చేసేస్తాం ముగ్గురం! కలిసి భోజనాలు, టిఫిన్లు చెయ్యడాలవీ మామూలే! అలాగని మరీ ‘వదినమ్మ’ సీరియల్లోలా ఒకే కంచంలో కలిపి ముద్దలు మింగడాలూ గట్రా ఉండవులెండి. ఇన్నిరోజులకి మళ్లీ ఈ లాక్‌డౌన్ పుణ్యమాని కుటుంబం మొత్తం ప్రతిరోజూ బ్రహ్మోత్సవం జరుపుకుంటున్నాం.
ఈ నిర్బంధానికి ముందు కొన్నాళ్లు అన్నయ్యలిద్దరితోనూ సరదాగా గడుపుదామని మా అన్నయ్య కూతురు మాయింటికొచ్చింది. అదొచ్చిన నక్షత్రం బాలేదనుకుంటా వెంటనే లాక్‌డౌన్ ప్రకటించేశారు. దాంతో మాకు ఆడపిల్లని, అదీ పద్దెనిమిదేళ్ల ఆడపిల్లని పెంచడంలో ఉండే కష్టసుఖాలేఁవిటో బోధపడ్డాయి.
తనకి ఎప్పటికైనా యుఎస్ వెళ్లాలనే కోరిక. అందుకని ఇప్పటినుంచే అక్కడి నిద్ర అలవాట్లవీ ప్రాక్టీసు చేసుకుంటోంది. తెల్లారే నాలుగూ, నాలుగున్నరకల్లా పడుకుండిపోతుంది. మళ్లీ మధ్యాహ్నం పన్నెండయేటప్పటికి ఠంచనుగా లేచిపోతుంది. ఒకవేళ ఈ కరోనాలవీ తగ్గిన తరవాత అక్కడికెళ్లినా, మొదటి నాలుగైదురోజులూ జెట్ లాగ్ అనేది ఉండకుండా బానే ఉపయోగపడుతుందేమో కదా ఈ అలవాటు?
ఇక మావాళ్లు:
మనందరం సాధారణంగా వేసవిలో జిల్లుజిల్లుమనే చన్నీళ్లతోనేగా స్నానం చేస్తాం? కానీ మా రెండోవాడు మాత్రం ఎర్రటి ఎండలో కూడా వేణ్ణీళ్లే పోసుకుంటాడు. వాడి స్నానం అయి, బాత్రూములోంచి బయటికొచ్చేటప్పుడు దట్టమైన పొగలమధ్యనుంచి నడిచొచ్చే నారదుళ్లా ఉంటాడు. ఆ తరవాత మనంగానీ బాత్రూములోకెళితే పావుగంట వరకు ఏవస్తువూ కనబడదు. అద్దం గురించైతే మర్చిపోవడం మంచిది. అదసలు ఎటువైపుందో కూడా తెలీనంత మసకబారిపోతుంది. కాసేపు సంయమనం పాటిస్తేనే మన ఉనికి మనకి తెలిసేది.
వంటయిన వెంటనే తను భోజనాలకి రమ్మని పిలిచేదాకా ముగ్గురూ బెడ్రూములోనే కబుర్లేవీ ‘చెప్పుకోకుండా’ ఎవరి మొబైల్ వాళ్లు చూసుకుంటూ కూచుంటారు. ‘పిలిస్తేగానీ రారేఁవిటి జగదీషూ? ఆకళ్లుండవా?’ అంటూ ప్రతిరోజూ ఆశ్చర్యపోతూ ఉంటుంది తను.
‘అంతంత ఆకళ్లెయ్యడానికి వాళ్లేమన్నా వలస కార్మికులా? గంటగంటకీ ఏదో ఒకటి మేపుతూనే ఉంటావుగా?’ అని సర్దిచెబుతాను. కానీ తనకున్న సమయం స్వల్పమవడంతో పిలుస్తూనే ఉంటుంది.
ఫస్ట్, సెకండ్ బెల్స్ ఎప్పుడూ శ్రవణ ప్రధానమైనవి.
ఫస్ట్ బెల్లంటే ముందుగా ఒక కేక.
రెండో బెల్ అనేది ముగ్గురిలో ఎవరో ఒకరికి ఫోన్ చేసి ‘కంచాల్లో వడ్డించిన తరవాత కూడా రారేఁవర్రా?’ అంటూ ఆవేదన.
ఇహ మూడోది భౌతికం. తనొచ్చి ఫ్యాను, లైటు ఆపేసే ప్రక్రియ.
అయినా రారు. ఎంచేతంటే వాళ్ల చేతుల్లో ఉన్న వాటికి లైట్ల అవసరం లేదుగా? ఎట్టకేలకు నాలోని నాన్న బద్ధకంగా ఒళ్లు విరుచుకుని, మొబైల్ పక్కనబెట్టి, ఎక్కడలేని కోపాన్నీ కళ్లలోకి తెచ్చుకుని, కటకటాల రుద్రయ్యలా కన్నెర్రజెయ్యాలని ప్రయత్నించి, విఫలమై, చివరికి ధర్మాత్ముడులో కృష్ణంరాజు గెటప్ కి సెటిలైపోతాను.
వెంటనే వాళ్ల దగ్గరకెళ్లి ‘అసలు అమ్మకెంత పనో తెలుసా, పాపం ఆఫీసుకెళ్లడం, వంట చెయ్యడంతోనే సరిపోతుంది. మీరిలా పనితెమల్చకపోతే ఎలా?’ అంటూ కటింగుల్లేని కారణంగా రెల్లు దుబ్బుల్లా పెరిగిన జుట్లమీద ప్రేమగా నిమురుతూ వెధవలిద్దరినీ బయటికి తోలుకొస్తాను.
తీరా హాల్లోకొచ్చాక ప్రేమగా మాటాడుకుంటూ తిందామని అనుకుంటామా? వాళ్లేమో ప్రైమ్ లో క్రైమ్ సినిమా చూస్తూ తినడానికి సిద్ధపడి వుంటారు.
‘భోజనాలప్పుడు కూడా ఆ వికారాలన్నీ అవసరమారా? ఆ స్టార్‌వార్స్ సినిమాల్లో జబానీ, యోడానీ చూస్తూ అన్నం తినడానికి మీకు నోరెలా వస్తోందర్రా?’ అంటూ ఆపాలని ప్రయత్నిస్తాను. పైపెచ్చు ఆ హాలీవుడ్ సన్నాసులకి ఎంత ఓపికంటే ఈ స్టార్‌వార్స్ పదకొండు భాగాలు తీసేడిశారు. వాళ్లు తీస్తే తీశారు. వీళ్లవన్నీ భాగవత సప్తాహాల్లా రోజుకొక భాగం చూసేస్తున్నారు. ఆఖర్రోజున ఉద్యాపన కూడా ఏదో ఘనంగా ప్లాన్ చేసుకున్నట్టున్నారు. ఆ సినిమాల్లో వీళ్లకన్నీ గుర్తే! ఏ సీన్ ఏ భాగంలోదో ఇట్టే చెప్పేస్తారు.
‘అలా ఎలా చెప్పేస్తార్రా?’ అని ఆశ్చర్యం ప్రకటిస్తాను.
‘ఏం, నువ్వు ముత్యాలముగ్గుకీ, గోరంతదీపానికీ తేడాలు ఇట్టే చెప్పట్లేదూ? అలానే ఇదీనూ!’ అని పెద్దాడనగానే
‘అంతేకాదురా, పెళ్లిపుస్తకాన్నీ, మిస్టర్ పెళ్లాన్నీ కూడా ఇట్టే కనిపెట్టేస్తారు నాన్న!’ అంటూ రెండోవాడు పావుకేజీ దుర్గానెయ్యి పేకెట్టు చింపి అగ్నికి ఆజ్యం పోస్తూ ఉంటాడు.
సరే, ఏంచేస్తాం? ‘ఉగ్గులనాడు బిడ్డలుగానీ పెగ్గులనాడు బిడ్డలా?’ అని సామెత!
అసలీ స్టార్‌వార్స్ నాకు పదహారేళ్లప్పుడే పరిచయమయ్యాయి. నేను ఇంటర్లో ఉండగా మొట్టమొదటిసారి విశాఖపట్నం వచ్చాను. మా బోటనీ అగ్గిబరాటా మాస్టారు మమ్మల్నందర్నీ జగదాంబ థియేటర్‌లో ‘ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్’ సినిమాకి తీసుకెళ్లారు. అనకాపల్లి బ్యాచ్ కదా మనం! ఒక్క ముక్క అర్ధమైతే కరోనా చెప్పుతో కొట్టండి! అర్ధం కాకపోతే పోయిందిగానీ, జగదాంబ హాల్లో ఎర్ర కార్పెట్‌నీ, ఆ ఏసీనీ, సౌండ్‌నీ ఎంచక్కా ఆస్వాదించేసి వచ్చాం.
ఆ సినిమాల్లో జెడై అనేవాళ్లు ఎర్రది, ఆకుపచ్చది, నీలంరంగుదీ ట్యూబ్ లైట్లు పట్టుకు తిరుగుతూంటారు. వాటితోనే కొట్టుకుచస్తారు కూడా. మళ్లీ ఈమధ్య రోజూ అర్ధరాత్రి రోడ్డుమీద చూస్తున్నాను అవన్నీ. నేను రాత్రుళ్లు ఎమర్జెన్సీ కేసులకని బయటికొచ్చిన ప్రతిసారీ పోలీసులు ఆ ఎర్రవీ, పచ్చవీ లైట్లు చూపించి ఆగమంటూ ఊపుతూ కనబడతారు. ఆ రకంగా నాకు ఇంటాబయటా కూడా ఆ రంగురంగుల ట్యూబ్ లైట్ల గోల తప్పట్లేదు.
సరే, ఎక్కడున్నాం? టీవీలో సినిమాలు.
ఈమధ్య అన్నీ మలయాళం సినిమాలే చూడాలని అదేదో జీవో వచ్చిందిట కదా? దాంతో మేం ఇంటిల్లిపాదీ ఈ సెలవుల్లో ఓ పదిపదిహేను వరకు మలయాళ చిత్రాలు చూసేశాం. ఎవరో అన్నారని కాదుగానీ అవన్నీ నిజంగానే చాలా నచ్చేశాయి.
ఇదివరకు మేం చదివుకునే రోజుల్లో ‘మలయాళం’ అన్న మాటే చాలా రహస్యంగా అనేవాళ్లం. ఆ సినిమాలకి చిల్లు కొట్టారం, రతి నిర్వేదం అంటూ ఏవో టెంప్టింగ్ పేర్లవీ పెట్టేవారు. అవేవీ చూసిందీ లేదు, ఏడుపూ లేదుగానీ విషయ పరిజ్ఞానం మాత్రం ఉండేది. మా క్లాస్‌మేట్లలో కొంతమంది పాతసినిమాల్లో రేపిస్టులు గిరిబాబు, సత్యేంద్రకుమార్ టైపు. అదేంటో వాళ్లకన్నీ అలాంటి సినిమాలే నచ్చేవి. ఊరికి ఉత్తరాన, జనసమ్మర్ధం అంతగాలేని ప్రదేశాల్లో ఓ హాలుంటుంది ప్రతీ వూళ్లోనూ! అందులో ఆడేవారు అవన్నీ!
ఏదైతేనేం, ఇన్నాళ్లకి మనందరం మలయాళ సినిమా చూశామంటూ గర్వంగా పోస్టులు పెట్టుకోగలుగుతున్నాం.
ఇక వంటల విషయానికొస్తే ఈ లాక్‌డౌన్ రెండునెలల్లోనూ మాయింట్లో రకరకాల విన్యాసాలు జరిగాయి. యూట్యూబులో చూసి ఒక కేక్ తయారుచేసే దుర్మార్గానికి ఒడిగట్టారు పిల్లలు. అదేంటో సెర్చ్ లో కేక్ తయారీ అని కొడితే ‘హౌ టు మేక్ ఎ కేక్ ఇన్ లాక్‌డౌన్’ అనొచ్చింది. ఇంకా నయం, ఆ పద్ధతిలో లాక్‌డౌన్ తరవాత ఆ కేక్ చేస్తే ఏమవుతుందో ఏంటో?
ఎలాగైతేనేం, ఒక ముదురు గోధుమరంగు పాషాణాన్ని తయారుచేశారు. అదనుచూసి దానిమీద దాడికని వెళ్లిన రెండు చాకులు పదును కోల్పోయాయి. మూడు ఫోర్కులైతే విచిత్రంగా వంగిపోయి దుర్గామాత చేతిలో పేరు తెలీని ఆయుధాల్లా తయారయ్యాయి. ఇహ లాభంలేదని చివరికి నేను జగదేకవీరుని కథలో అయిదుగురు ఎన్టీఆరుల్లా విడిపోయి శివశంకరీ పాట పాడి, దాన్ని కరిగించాల్సొచ్చింది.
ఒకవేళ ఆ కేక్ బాగా కుదిరినట్టైతే సగం ప్యాక్ చేసి, మా వీధి చివర నిరంతరాయంగా కోవిడ్ డ్యూటీలు చేస్తున్న పోలీసులకి పట్టుకెళ్లి ఇద్దామనుకున్నాను. ఇంకానయం, ఇచ్చుంటే నామీద ఏ సైకిల్ దొంగతనం కేసో పెట్టి లోపల పడేసుండేవారు. అంచేత అదేమీ అనుకున్నంత ‘కేక్ వాక్’ కాదని నిర్ణయించుకుని ఆ ఆలోచన విరమించుకున్నాను. కానీ, చూడ్డానికెలా ఉన్నా తినడానికి బానేవుందిలెండి!
ఆ మర్నాడు పావ్ బాజీ అనేదేదో చేశారు. అది బావుందండోయ్! అయితే కావలసిన పదార్ధములు అన్నీ చదివి ఒకచోట రాసుకుంటే మనకు షాపులో దొరికేవి పదీ, దొరకనివి ఇరవై, అసలవేంటో తెలీనివి ఇంకొక పదీ ఉన్నాయి. ఉన్నంతలోనే అన్నీ వేసి చేసి, డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఫొటోలు తియ్యాలంటూ నన్ను పిలిచారు.
‘మీ దగ్గరా మంచి ఫోన్లే ఉన్నాయి కదర్రా? మీరే తీసుకోవచ్చుగా?’ అనడిగాను అమాయకంగా!
‘నువ్వు ఫొటోలు బాగా తియ్యడంలో తోపని ఎఫ్.బీ.లో అందరిచేతా కామెంట్లు పెట్టించుకుంటావుగా, నువ్వే తియ్!’ అంది తను.
ఇక ఎక్కువ లాగితే నా అకౌంట్ బ్లాకవుతుందని నోరుమూసుకుని తియ్యడానికి రెడీ అయ్యాను. అంతా కలిసి నాచేత హీరోయిన్ ఫొటోషూట్‌లా పది ఫొటోలు తీయించారు. అవన్నీ వివిధ వాట్సప్ గ్రూపుల్లో పెట్టగానే....
వావ్...
స్పైసీ...
యమ్మీ...
సూపర్...
అసలిలా ఎలా...
మరి మాకో...
నే వచ్చేస్తున్నా...
అని రాత్రి తొమ్మిదింటిదాకా వాళ్లక్కలూ, తొక్కలూ మెసేజులు పెట్టాక వాటితో సగం కడుపు నింపుకుని, మిగతా సగం పావ్ బాజీతో నింపుకున్నారు. కాస్త ఫొటోగ్రాఫరుకీ పడేశార్లెండి!
ఇల్లు సర్దుడు:
ఇది అయోధ్యలో రామమందిర నిర్మాణం లాంటిది. అవ్వడం అనేది ఉండదు. అలాగని స్టేలూ ఉండవు. తను పొందిగ్గా కడుతుంది, నేను ఓ వారంలోనే బాబ్రీ మసీదుని ధ్వంసం చేసినంత చిందరవందర చేసేస్తాను. మళ్లీ తాజాగా మొదలెడతాం. ‘ఈసారి ఇద్దరం కలిసి సర్దుదాం!’ అని సరదా పడుతుంది. కానీ మధ్యలో నాకొక ఎమర్జెన్సీ ఫోనొచ్చి తీరుతుంది. తన సరదా తీరకుండానే నిర్మాణం మధ్యలో ఆగిపోతుంది.
అలా ఉందండీ మా వ్యవహారం.
ఇంకా ఈ నిర్బంధం ఎన్నాళ్లుంటుందో తెలీదుగానీ, మా నలుగురికీ అనుబంధం, ఆత్మీయతా అంటువ్యాధుల్లా ప్రబలుతున్నట్టనిపిస్తోంది. ఇంకొంత కాలం ఇలానే కొనసాగితే రోజూ నేను హాస్పిటల్‌కి, తను ఆఫీసుకీ వెళ్లిన వెంటనే పిల్లలిద్దరూ ‘చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావూ?’ అంటూ పాటందుకుంటారేమోనని అనుమానంగా ఉంది!

0 comments:
Post a Comment