‘ఆ బాయిలర్లో వేణ్ణీళ్లున్నాయేమో చూడు. లేకపోతే మళ్ళీ అంటించు. నాన్నగారింకా స్నానం చెయ్యలేదు!’ తులసికోట మొదట్లో నీళ్లు పోస్తూ చెప్పింది సావిత్రి.
అమ్మ చెప్పిన ప్రతిపనీ వెంటనే చేసేస్తుంది మహాలక్ష్మి. చేతిలో పుస్తకాన్ని పక్కనబెట్టి లేచెళ్లింది. బాయిలరెప్పుడో ఆరిపోయింది. మళ్ళీ నిప్పురాజేసి తిరిగొచ్చి కూచుంది. ఇంకా నాలుగు పుస్తకాలున్నాయి అట్టలెయ్యాల్సినవి. సాంఘికశాస్త్రం పుస్తకానికి కొంచెం పెద్ద కాయితం తీసుకోవాలి. చాలా లావుంది.
మహాలక్ష్మికి అట్టలు వెయ్యడం చాలాబాగా వచ్చని వాళ్లింట్లోనే కాదు, స్కూల్లో కూడా పేరుంది. ఆ కళ తనకి తండ్రినుంచి వచ్చింది. అదొక గృహనిర్మాణంలా చేపడుతుంది శ్రద్ధగా! ఒక పెద్ద కత్తెర, ఒక చిన్న కత్తెర; ఇత్తడి గిన్నెలో అమ్మ ఉడికించి ఇచ్చిన మైదాపిండి; ఒక బ్లేడు...ఇలా అన్నీ దగ్గరపెట్టుకున్న తరవాతే పని మొదలెట్టేది.
‘అట్టలకేంలే, బానే వేస్తావు. చదివేదేఁవన్నా ఉందాని?’ చేతిలో పేపర్ని చుట్టచుట్టి, దాంతో మహాలక్ష్మి నెత్తిమీద మీద ఒక్కటేసి తనూ ఓ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాడు కామేశ్వర్రావు. చెల్లెలి చదువంటే చాలా అలుసు అతనికి.
‘ఒరేయ్, నీకు అట్టలెయ్యడం, అట్లుపొయ్యడం ఈ జన్మలో రావుగానీ, ఆ పుస్తకం పక్కనుంచు. అనవసరంగా అట్ట తగలెయ్యకు! మళ్ళీ కొనాలంటే పెద్ద బజారు దాకా పోవాలి. కందుల గంగరాజు కొట్లో తప్ప ఇంకెక్కడా దొరకట్లేదివి!’ అంటూ అన్నయ్య చేతిలోంచి పుస్తకం లాక్కుంది మహాలక్ష్మి.
‘ఈ బ్రౌన్ అట్టలేంటే తాలూకాఫీసు ఫైళ్లలాగా? ఎంచక్కా నాలాగ కేలండర్లో, న్యూస్‌పేపర్లో వేసుకోవచ్చుగా? నా ఇంగ్లీషు టెక్స్టుబుక్కు చూడు, రాజా రమేష్ సినిమాలో నాగేశ్వర్రావు, వాణిశ్రీ బొమ్మలు చూసి ఇప్పటికీ మా క్లాసులో అందరూ అడుగుతారు ఎక్కడిదిరా ఆ అట్ట? అని!’ అంటూ ఉడికించిన మైదాపిండిని చిన్నచిన్న ఉండలు చేసి కిందపడేస్తున్నాడు.
‘ఒరేయ్, మీ బళ్లో అడగరేమోగానీ మావాళ్లైతే చెమ్డాలెగ్గదీసేస్తారు. అయినా చదువుకునే పుస్తకాలకి సినిమా అట్టలేంట్రా? ఇక చదువేం సాగుతుంది అవన్నీ చూస్తూ కూచుంటే? అలా పిండంతా ఉండలు చేసి ఇల్లంతా పడేస్తే చీమలు పట్టేస్తాయి. ఆనక ఆ చీమలన్నీ ఓ కాయితంలోకి ఏరి నీ చొక్కాజేబులో పోసేస్తాను!’ అంది మైదాపిండి గిన్నె లాక్కుంటూ.
‘ఓయబ్బో, దిగొచ్చిందండీ ఇంగిలీస్ దొరసాని! మొన్న క్వార్టర్లీలో నీకంటే నాకే ఎక్కువ మార్కులొచ్చాయి. మర్చిపోయావేమో? అయినా నీకవేం బుద్ధులే? మనింట్లో అందరం చాలా సౌమ్యంగా ఉంటాం కదా? అమ్మేమో అంజలీదేవంత మంచిది. నాన్నగారు గుమ్మడికన్నా గొప్పవారు. నీకీ పోలికలన్నీ ఆ నాగభూషణం మావయ్యవే అయుంటాయి!’ అన్నాడు గిన్నె వదిలేసి.
‘ఏడిసావులే, స్లిప్పులు పెట్టి రాసే సన్నాసులకి ఎన్ని మార్కులైనా వస్తాయి. నాకెవరి పోలికలూ రాలేదు. నాకు నేనే! కావాలంటే అమ్మనడుగు. సర్లేగానీ, వెళ్లి స్నానం చేసిరా! ఉప్మా చల్లారిపోతే అమ్మ తిడుతుంది మళ్ళీ!’ అంటూ పొడుగాటి పుస్తకంతో అన్నయ్య మోకాలి మీద ఒక్కటేసింది మహాలక్ష్మి.
అన్నయ్యతో అలా మాటాడిందేగానీ నిజానికి పుస్తకాలకి ఈ గోధుంరంగు అట్టలేంటసలు? .
ఆంధ్రజ్యోతి వాడు సినిమా పేజీలు ఎక్కువేస్తాడు. నాన్నగారికి చెప్పి జ్యోతి తెప్పించుకుంటే బావుంటుందేమో? ఎంచక్కా మంచిమంచి రంగుల్లో చాలా అట్టలే వేసుకోవచ్చు.
కృష్ణా, జయప్రదా గెడ్డాలు రెండూ రాసుకుంటున్నట్టు పేద్ద బొమ్మేసాడు మొన్న. అల్లరిబుల్లోడో ఏదో సినిమా. అందులో జయప్రద కాశ్మీర్ సిల్క్ చీర కట్టుకుని ఎంతబావుందో నిజంగా! అది సామాన్య శాస్త్రం పుస్తకానికేసింది జానకి. ఇంగ్లీషుకేమో విమల్ వాళ్లది రేఖ కేలండర్ వేసుకుంది. అదీ చాలా బావుంది. అటువంటివేస్తే ఏ పుస్తకం ఏదో కనిపెట్టడం కూడా సులువసలు.
లేకపోతే తెల్లకాయితాలు లేబుళ్లలాగా కత్తిరించి వీటన్నిటి మీదా అంటించుకోవాలి. మళ్ళీ వాటన్నిటిమీదా రంగు పెన్సిళ్లతో పువ్వులు, లతలు డిజైన్లు గీసుకోవాలి. ఇంతాచేసి మళ్ళీ పేర్లవీ అన్నయ్య చేతే రాయించుకోవాలి. వెధవకి చదువు ఎలా ఏడిసినా రైటింగ్ మాత్రం అద్భుతం. భలే రాసేస్తాడసలు. తన స్నేహితురాళ్లకి కూడా పుస్తకాలన్నిటి మీదా పేర్లు చెక్కేది కామేశ్వర్రావన్నయ్యే!
అసలీ గోలంతా ఎందుకు? చక్కగా రామదాసు కొట్లో లేబుళ్లు కొనుక్కుంటే సరిపోతుంది కదా? మొన్న గీతా వాళ్లక్క అంటించుకొచ్చిన లేబుళ్లు భలేవున్నాయి. నాన్నగార్నడిగితే ‘వచ్చే ఫస్టుకి చూద్దాంలే!’ అనేశారు.
పోయిన సంక్రాంతికి అమ్మమ్మా వాళ్ల ఊరెళ్లి, తిరిగొచ్చేసేటప్పుడు మావయ్యలిద్దరూ తనచేతిలో చెరో అయిదేసి రూపాయలూ పెట్టి గుప్పెట మూసేశారు. ఆ పదిరూపాయలు జాగ్రత్తగా దాచుకుంది. అమ్మకి తెలిస్తే , ‘ఆడపిల్లవి నీకెందుకే అంత డబ్బం’టూ తీసేసుకుంటుంది.
అందులో నాలుగు రూపాయల్తో గాజుల రామారావు కొట్లో ఆకుపచ్చ రిబ్బన్లు, ముదురు, లేతాకుపచ్చ రంగువి ఆరేసి గాజులూ కొనేసింది. మిగతా ఆర్రూపాయలూ పరుపుకింద దాచింది. ప్రతిరోజూ పరుపుని ఒకసారి పైకెత్తి చూస్తుంది డబ్బులున్నాయో లేదోనని. తెలుగు వాచకంలో ‘పిసినివాడు-పసిడిమూట’ పాఠంలోలా ఎవరైనా ఆ ఆర్రూపాయలూ ఎత్తుకుపోతారేమోనని భయం!
‘అక్కా, నా పుస్తకాలకి కూడా అట్టలెయ్యాలి. నాన్నగారు నీచేతే వేయించుకోమన్నారు. అన్నయ్యకి సరిగ్గా వెయ్యడం రాదుట కదా? తెచ్చెయ్యనా? అంటూ వచ్చింది మహేశ్వరి.
ఆడపిల్లలకి అమ్మవార్ల పేర్లే పెట్టాడు సత్యనారాయణ. కూతుళ్లిద్దరూ పండగలప్పుడు పట్టుపరికిణీలు వేసుకుని బంగారుతల్లుల్లా నట్టింట్లో తిరుగుతూ ఉంటే సాక్షాత్తూ ఆ అమ్మవార్లే తనింటికి నడిచొచ్చినంత ఆనందంగా అనిపిస్తుందతనికి.
ఇలాగే వుంటుంది తన పని. ఇక తప్పదని చెల్లెలి పుస్తకాలకీ అట్టలెయ్యడం మొదలెట్టింది.
‘అక్కా! నిన్నట్నుంచి మనూరికి ‘కటకటాల రుద్రయ్య’ సినిమా ఇచ్చాడు తెలుసా? అందులో కృష్ణంరాజు భలే వున్నాడే!’ అంది మహేశ్వరి.
దీనికిదేం పొయ్యేకాలం? రామకృష్ణాలో రోజూ నాలుగాటలంటూ తనూ చూసింది మొన్న ఆ వాల్ పోస్టరు. నెట్ బనీను తొడుక్కుని, చొక్కా విప్పి భుజమ్మీద వేసుకునున్నాడు కృష్ణంరాజు. శుభ్రంగా తొడుక్కోవచ్చుగా?
రెండు కళ్లల్లోనూ పొట్టుపొయ్యి వెలిగించినట్టు ఆ మంటేఁవిటో! ఎలా నచ్చి చస్తారో అలాంటి వాళ్లసలు.
‘నీ తలకాయ్. అలాంటి సినిమాలు చూడకూడదు మనం. అందులో అన్నీ అలాంటివే ఉంటాయి. ’
‘అలాంటివంటే? ఎలాంటివి?’
‘ఏవోలే! ఆ బొమ్మలు చూస్తే తెలియట్లా? రేడియోలో కూడా వస్తోంది. నే విన్నాను. ఎక్కడ పుట్టావు.. అంటే ‘కుప్పతొట్టిలో!’ అంటాడు. మనకెందుకే అలాంటివన్నీ?’
‘అబ్బా! ఎంతసేపూ ‘అలాంటివి’ అంటావే తప్ప అవేంటో చెప్పొచ్చుగా?’
‘నిన్నిక తంతానే! ఫో ఇక్కణ్ణుంచి!’ అని కసిరేసింది చెల్లెల్ని.
‘అయినా దాన్నని ఏంలాభం? ఏ సినిమా చూసినా అన్నీ ఇలాంటివే! ఆ విజయనిర్మల దర్శకత్వం చేసిన సినిమాలైతే మొత్తం అన్నిట్లోనూ బలాత్కారం సీన్లుంటాయిట! బళ్లో అబ్బాయిలంతా అనుకుంటోంటే వింది తను. ఆ గిరిబాబునీ, సత్యేంద్ర కుమార్నీ చంపెయ్యాలసలు. చూడ్డానికి ఎంత బావుంటారో మళ్ళీ! కానీ అన్నింట్లోనూ చెడ్డవాళ్లకిందే వేస్తారు అదేంటో? అబ్బ, ఎంతలా పరిగెట్టిస్తారో పాపం ఆడపిల్లల్ని! అయినా నాకెందుకీ గోల!’ అనుకుని మొత్తం పుస్తకాలన్నీ పూర్తిచేసేసింది.
హమ్మయ్య! ఈ అట్టల పనయ్యింది. పుస్తకాలన్నీ దొంతుకింద పెట్టుకుని ఒకసారి గర్వంగా చూసుకుంది. ‘ఎంతందంగా వేసేశావే అట్టలన్నీ?’ అని అమ్మేఁవైనా అంటుందన్న ఆశలేదు. తనసలు అలాంటివేం పట్టించుకోదు. ఇప్పుడు వీటిని పొగడాలంటే రాత్రి పదిన్నరకి జనతా వచ్చేదాకా ఆగాలి. నాన్నగారు అందులోనే దిగుతారు రోజూ!
ఆయనైతే ఎంత రాత్రైనా భలే హుషారుగా ఉంటారసలు. తనే, ఆయనొచ్చే వేళకి పిచ్చిగా నిద్రపోతూ ఉంటుంది. మళ్ళీ పొద్దున్నే బడికి ఆలస్యమైపోతుందంటూ అమ్మ పోరబట్టిగానీ లేకపోతే మెలకువగా ఉండకేం?
రాగానే చొక్కా చిలక్కొయ్యకి తగిలిస్తారని, మొత్తం పుస్తకాలన్నీ ఆయనకి కనబడేలా సరిగ్గా అక్కడున్న సందుగుపెట్టె మీద పెట్టింది. ఒకరాత్రివేళ నుదుటి మీద జుట్టంతా వేళ్లతో వెనక్కితోసి తన బుగ్గమీద వెచ్చటి ముద్దొకటి పెట్టినట్టు అనిపించింది. ‘నాబంగార్తల్లికి అన్నీ నా పోలికలే! ఏ పనిచేసినా తీర్చిదిద్దినట్టుంటుంది!’ అన్నమాటలూ లీలగా వినబడ్డాయి. కానీ కళ్ళు తెరవడం మాత్రం తనవల్ల కాలేదసలు.
మర్నాడు బడికెళ్లేముందు నోట్‌బుక్సన్నీ ముందేసుకుని కూర్చుంది. మళ్ళీ అన్నిటినీ అట్టలతో సింగారించి ప్రతి పుస్తకం మీదా లేబుళ్లంటించింది.
‘అన్నయ్యా, ఇక నీపనే బాకీ! పేర్లన్నీ రాసేస్తే ఈ ఏడాదికింక తిరిగిచూసుకోక్కర్లా! తెచ్చెయ్యనా?’ అంది దోశల పళ్లెం వాడి ముందుంచి.
‘నీకంతా ఆటగా వుందే! ఒకటా రెండా? ఏకంగా ముప్ఫైమూడు పుస్తకాలు పట్టుకొచ్చి నా నెత్తిన పడేసి రాయమంటే ఎలా రాసేది? కొన్ని నువ్వు రాసుకో! నోట్‌బుక్స్ మీద మాత్రం నేరాస్తాను. అన్నీ ఒకే సైజుకదా, కనిపెట్టడం సులువౌతుంది!’ అన్నాడు దోశలు తింటూ.
ఏం పోజు కొట్టేస్తావురా? అసలు నిన్నని ఏంలాభం? మా క్లాసులో ఆ బాలాజీగాడు కూడా బానే రాస్తాడు. ఈసారి వాణ్ణే అడుగుతాన్లే! ఓ..తెగ మురిపించేసుకుంటున్నాడు!’ అంటూ లేచి నిలబడింది.
‘వాడా? వాడిమొహం. నీపేరు మహాలక్స్మి అంటాడు. వాడేఁవిటీ రాసేది గాడిదగుడ్డు! సర్లే, తీసుకురా! ఎవరికి తప్పినా నాకు తప్పదుకదా!’ అన్నాడు పెద్ద ఆరిందాలా!
పైకి అలా నీలుగుతాడుగానీ వెధవ ఎంతందంగా చెక్కుతాడో పేర్లన్నీ! నిన్న రాత్రే డాక్టర్ పెన్నులో కేమ్లిన్ నల్లింకు పోసుంచుకుంది. దాంతో రాస్తోంటే ప్రింటులాగే ఉన్నాయి అక్షరాలన్నీ! కానీ ఆమాట వాడితో అందో.. చెట్టెక్కి కూచుంటాడు!
‘ఎలావున్నాయో చెప్పవేం?’ అన్నాడు గర్వంగా తలెత్తి.
‘బానే వున్నాయిలే! అన్నిటిమీదా ఇప్పుడే రాసేస్తావా లేక మధ్యాహ్నం అన్నానికొచ్చినపుడు కొన్ని రాస్తావా?’ అంది పేర్లన్నీ మురిపెంగా చూసుకుంటూ.
‘అసలు నీమొహానికి ఒకసారి రాయడఁవే ఎక్కువ. మళ్ళీ మధ్యాహ్నం కూడానా? మెచ్చుకుంటే నీ సొమ్మేంపోయిందీ?’
‘అవునూ, మొన్న మురళీగాడు ఇంట్లో తెలియకండా ‘యవ్వనం కాటేసింది’ సినిమాకెళ్లాడా? మంగతాయారు చెప్పింది!’ అంది గొంతు తగ్గించి రహస్యంగా!
‘మీకేం పనీపాటా లేదా, ఎప్పుడూ ఇలాంటి కబుర్లేనా మీవాళ్లంతా చేరి! గోపాల్ గాడితో ‘వెళ్దాం’ అన్నాడంతే! కానీ వెళ్లలేదు! ఇంతుంటే అంత చేసేస్తారేం?’
‘చచ్చినాడా! అదేదో దేవుడి సినిమాలా ఎలా చెప్తున్నాడో? అసలెందుకెళ్లాలి అలాంటి సినిమాలకి?’ అంది కోపంగా.
‘నోర్ముయ్! నేను కాదుగా వెళ్లింది? అనవసరంగా నన్నంటే ఇదంతా ఆపేస్తాను!’
ఇక వ్యవహారం చెడుతుందని ఊరుకుంది మహాలక్ష్మి. ఆరోజు అవసరం లేకపోయినా పది పుస్తకాలదాకా బడికి తీసుకెళ్లింది. అందరూ ఒకటే మెచ్చుకోవడం అట్టలు చూసీ, పేర్లు చూసీ!
కానీ...
ఆరోజు సాయంత్రం క్లాసులన్నీ అయిపోయాక బయటంతా ఏదో అలజడవుతోంటే పుస్తకాల సంచి పట్టుకుని బయటికొచ్చింది. ఏమైందో? అందరూ జేబుల్లోంచి డబ్బులవీ తీసి లెక్కెట్టుకుంటున్నారు. మంగతాయారుని అడిగింది ఏఁవైందంటూ!
‘తాలూకాఫీసు పక్కన అదేదో షాపులో లేపాక్షి నోట్‌బుక్స్ అమ్ముతున్నార్ట! చాలా తక్కువ స్టాకొచ్చాయిట. పెద్ద లైనుందిట. కొనుక్కోడానికి వెళ్తున్నారంతా!’
‘మనం కొనేసాం కదే? ఇవి సరిపోవా?’ అంది నిరాసక్తంగా.
‘నువ్వసలు చూసావా వాటినీ? ఒసేయ్, రాణీ, ఆ పుస్తకం ఒకసారిటియ్యి. చూపించి మళ్ళీ ఇచ్చేస్తాను!’
మంగ చేతిలో ముదురు ఊదారంగు, గులాబీరంగుల్లో దళసరి అట్టా, దానిమీద లేపాక్షీ నంది బొమ్మా వేసున్న నోట్‌బుక్కొకటి చూడంగానే మహాలక్ష్మికి పిచ్చిపిచ్చిగా నచ్చేసింది.
‘ఎంతే?’ అంది కళ్లంట నీళ్లు తిరిగిపోతోంటే!
‘చాలా తక్కువ. ముప్పావలా అనుకుంటా ఒక్కోటీ! నాకూ తెలీదు సరిగ్గా!’
ఇక మహాలక్ష్మి మనసు మనసులో లేదు. చెత్తమొహందాన్ని అన్నీ గోధుంరంగు అట్టలేసుకుంటూ కూర్చున్నాను! ఇవెంత బావున్నాయో? ఇప్పుడు నాన్నగారిని ఏమొహం పెట్టుకుని అడుగుతాను?’ అనుకుంటూ దిగులు పడిపోయింది.
సాయంత్రం చీకటిపడిపోతోంది. శీతాకాలాలింతే! అయిదింటికే మూసేస్తుంది. గబగబా నడుచుకుంటూ ఇంటికొచ్చేసింది. సంచీ విసురుగా మంచం మీద పడేసి కాళ్లు కడుక్కుని గదిలోకెళ్లింది.
ఆశ్చర్యంగా అక్కడ స్టూలు మీద ఆరు లేపాక్షి పుస్తకాలు కనబడ్డాయి. ఇవెక్కణ్ణుంచొచ్చాయి? ఒక పుస్తకం చేతిలోకి తీసుకుని చూస్తోంటే అన్నయ్యొచ్చాడు లోపలికి.
ఎక్కడివిరా ఇవన్నీ? ఎవరికీ?’ అంది పేజీలు రెపరెపలాడిస్తూ.
‘నాకేగానీ, అక్కడ పెట్టవి. మాసిపోతాయి మళ్ళీ!’
‘నీకా? ఎవరు కొన్నారు?’
‘ఇవాళేదో హాఫ్ డేట. ఇందాక నాన్నగారు ఆఫీసునుంచి వచ్చేస్తూ కొన్నారు! నేనింతవరకూ కొనుక్కోలేదుగా నోట్సులవీ! అమ్మా! ఆకలేస్తోందే అమ్మా!’ అనరుస్తూ వంటింట్లోకెళ్లాడు.
ఏడిసినట్టుంది! మహాలక్ష్మికి ఒక్కసారిగా కుళ్లొచ్చేసింది. ఎలాగైనా వీడిదగ్గర్నుంచి ఒక్క పుస్తకమైనా కొట్టెయ్యాలి! అని అప్పటికప్పుడు సినిమాల్లో కె.విజయలా వంకరగా ఆలోచించడం మొదలెట్టింది.
ఏంచెయ్యాలి? ఎంత అరిచి గీపెట్టినా వీడివ్వడు. ఇక బెదిరింపే మిగిలింది.
వెంటనే ఒక చిన్న చీటీలాంటిది తీసుకుని దానిమీద ఇలా రాసి అన్నయ్య జేబులో పెట్టేసింది....
‘మర్యాదగా ఆ కొత్త లేపాక్షి నోట్‌బుక్ ఇచ్చెయ్. లేకపోతే రాజా టాకీస్ దగ్గర నిలబడి ‘వయసు పిలిచింది’ వాల్ పోస్టర్ చూసావని అమ్మకీ, నాన్నగారికీ చెప్పేస్తాను!’

0 comments:
Post a Comment