మనసంత తెల్లని చీరకు అందమైన ఆలోచనల్లాంటి చుక్కల ముగ్గుతో అలంకారం చేస్తే?
‘కుసుమాలు తాకగనే నలిగేను కాదా నీ మేను!’ అంటూ ఓ కవిగారు మరీ అతిచేశాడని ఎవరో సౌకుమార్యం ఎరగనివాళ్లు అనొచ్చునేమో?
కానీ ఆ పారాణంటిన పాదాల్ని తాకే క్షణాన చీర అంచుల్లో కనబడే లాలిత్యం ఎంత బావుంటుంది? అలా అడుగడుగుకీ మెత్తగా జారిపోతూ, మరొక అడుగు కోసం ఎదురుచూస్తూ మురిసిపోయే ఆ దృశ్యం ఎంత మహత్తరంగా ఉంటుంది?
ఆ సుమనోహరమైన సంబరాన్ని చూసే కళ్లకి ఏకాస్తైనా మనసుంటే ఆ కోమలి వేసే ప్రతి అడుగుకీ ఆ పదపల్లవాలు కందిపోతాయనే అనిపిస్తూ ఉంటుంది.
సరికొత్త చీరనొకదాన్ని ఊహించడం...
సరదాల సరిగంచుని నేయించడం...
చిత్రకారులకి సాధ్యమే!
కానీ ఆ కుంచెకి ఆరాధించే మనసుండాలి.
గోదారొడ్డున గులకరాళ్లను,
చందమామలో ముసలమ్మనీ,
ఓపిక చేసుకుంటూ మెల్లిగా ఊగే కొబ్బరాకుల్లో మంద్రాన్నీ కూడా ప్రేమించే గుణముండాలి.
బట్టల కోసం తెరిచే అరల్లో నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాలు ఒక్కొక్క చీరకొంగునీ అంటిపెట్టుకుని వాటిలో అవి ఊసులాడుకుంటుంటాయి.
‘ఆరోజు వెన్నెల్లో సముద్రపొడ్డున గుప్పెళ్లతో ఇసక తీసి ఒళ్లో పోసేశావు గుర్తుందా?’ అంటూ ఆ గంధం రంగు నైలెక్స్ చీర నీ గుండె గూటిలో గువ్వలా దాగున్న గురుతుల్ని బయటికి తెస్తుంది.
‘కాలిలో దిగిన ముల్లు తియ్యడానికి వంగినవాడివి ఎంతకూ పైకిరావాయె! ఆ లేతపాదాల్ని కరుచుకున్న ముల్లుని మరిచి, చీలమండల్ని కప్పుతున్న నన్ను చూస్తూ వేలికొసలతో గిలిగింతలు పెట్టి, కిందపడేలా చేశా’వంటూ చిలకపచ్చ చీర ఇప్పుడలుగుతుంది.
‘నేను తయారుగా ఉన్నా’నంటూ గది తలుపు తెరుచుకుని తను రాగానే మూగదైన సామ్రాజ్యానికి మహారాజల్లే నోరలా తెరుచుకుని చూస్తుండిపోయావు... నిజంగా నచ్చానా? అంటుంది గులాబీలే గుత్తులుగా పరుచుకున్న జార్జెట్ చీర.
ఇవన్నీ కలిసి లోపలంతా కిక్కిరిసిన సౌందర్యంలా గాలాడక వేలాడుతోంటే ఒక్కొక్క చీరతోనూ ముడిపడిన ముచ్చట్లు నీలోని అప్పదాసుని బయటపడేస్తాయి.
అన్ని వేడుకలకీ కొత్తచీరలు!
అసలు కొత్తచీర కడితే చాలు వేడుకలు!
శ్రావణ శుక్రవారం ఇల్లంతా ఆడమేళంతో నిండిపోయిందని ఆరుబయట మల్లెపొదల దగ్గర మెల్లిగా తిరుగాడుతున్న నీకు అకస్మాత్తుగా కర్పూర పరిమళాలంటిన ఊదారంగు పట్టుచీర గరగరలు వినబడతాయి.
‘నీకోసం ఆలోచించే నేనున్నా’నంటూ ఇత్తడి గ్లాసుతో కాఫీ తెచ్చి ఇచ్చే ఆ క్షణంలో ‘ఆ గుర్తింపే’ మనసుకి మయూరమంటి నర్తింపు.
అమావాస్య చీకటిని కాస్తంత కాటుకలా దిద్దుకుని, అస్తమించడానికై వెళుతున్న సూర్యుణ్ణి నుదుటన బంధించి, కళ్లలో నింపుకున్న దీపకాంతులు ఆ నీలంరంగు చీరలో నిజమైన దీపావళిని నిరూపిస్తాయి.
తెల్లచీరంటే శోభనాలు, దెయ్యాలు, మందాకినులకే పరిమితమా? కానేకాదు.
కనబడీ కనబడనంత లేతగా, పల్చటి పసుపు వర్ణాన లతలూ, పువ్వులూ పరుచుకున్న తెల్లని కాటన్ చీరలు వేసవికాలపు సాయంత్రాల్లో సాయం చేస్తాయి.
కాస్తంత గంజిపోస్తే కదలకుండా పడుంటాయి కూడా!
తెల్లచీరలెప్పుడూ మల్లెలతో కలిసి కుట్రపన్నుతాయి. ఆనక చంద్రమండలానికెళ్లి అతగాడినీ కిందకి దింపుకొస్తాయి. ముగ్గురూ కలిసిచేసే ముప్పేటదాడిని ఎదుర్కోవడానికి నీకున్న బలం సరిపోదనిపిస్తుంది.
ఆ తెల్లచీరను చూస్తే ఆ ఇస్త్రీ మడతల్లో అంతవరకూ దాగివున్న కాగితంలా మారిపోతే ఎంత బావుంటుందనే చిలిపి కోరికా కలిగి తీరుతుంది.
ఈ చీరలమీద మమకారం అంతా ఇంతా కాదు. దేవతలకి సైతం చీరలు చుట్టి హంసల మీద కూర్చోబెట్టాం, తామరల మధ్య నిలబెట్టాం. రాక్షసుల్ని మాత్రం అరకొర బట్టల్లో అప్రదిష్ట పాలు చేసేశాం.
నీకొక ముద్ద వండాలన్నా, నీతో యుద్ధానికి సిద్ధపడాలన్నా అలా బొడ్లో దోపే కొంగు ఎంత ముద్దొస్తుందో కదా? ఆ సౌందర్యాన్ని చూస్తే పసలేని చారు కూడా పరమామృతంలా తోస్తుంది. పనిగట్టుకుని మరీ పోరులో తనతో ఓడిపోవాలనిపిస్తుంది.
అలకలకి కూడా అనువైనది ఈ చీరనేది. అసలు అలగాలంటే ముందొక చీరకట్టుకు తీరాలి.
వయ్యారమంతా అలా విసిరి పారేసినట్టు పడుండే కోపం, నటిస్తున్న నిద్రా కూడా చీరకట్టుతో పదింతలు సౌందర్యాన్ని పెంచుకుంటాయి. అసహనంతో ముడులు తిప్పే చీరకొంగులు నీ గుండెల్ని మెలితిప్పుతున్నట్టే ఉంటాయి. ఆ అందం ముందు ఏ చుడీదారుణాలూ సరిపోలవు.
నర్తించే పాదాల్ని సైతం మరింత మోహభరితం చేస్తుంది చీర.
ఆర్తితో అమ్మని చూడాల్సిన కళ్లు ఆశతో రొమ్ముని చూడకుండా కప్పుతుంది. లేతపెదాల పాలుతాగే బుజ్జాయిల్ని కూడా దిష్టి తగలకుండా కాపాడుతుంది.
చీరంటే ఒక భావం, ఒక భాష, ఒక బంధం.
మనదేశ ప్రతీక! మనదేనన్న గర్వం కూడా!

0 comments:
Post a Comment