Latest Posts

Content

Monday, August 3, 2020

అన్నమయ్య సీడీ అన్నం కుక్కరు

అలారం మోగుతూనే వుంది, దాన్ని స్నూజ్ చేసి మళ్ళీ మళ్ళీ పడుకుంటూనే ఉన్నా. ఈ చలికాలంలో తెల్లారగట్ట నిద్రపోగలగడం అనే అదృష్టం పూర్వజన్మ సుకృతం. మనకంత భాగ్యం లేదు. ఎప్పుడూ ఎవరో ఒక డాక్టరమ్మ ఆపరేషనంటూ పిలుస్తానే ఉంటుంది. సరే, పనేదైనా ఉన్నప్పుడు లేవక తప్పదుగా? ఎవరైనా ఫ్యాన్ ఆపేస్తే బావుణ్ణు. చలి చంపేస్తోంది. ఇలాంటప్పుడే గదిలోకి ఎవరూ రారు. మనకెప్పుడైనా జున్నుపాలు వచ్చినప్పుడు కూడా అంతే. ఇంటికెవరూ రారు. 

తను హాల్లో ఉందన్న సంగతి తెలుస్తోంది. పావుగంట తరవాత తనే గదిలోకొచ్చింది. ‘అంతలా మోగుతోంటే లేవరేం?’ అంటూ నన్ను లేపి, బాల్కనీలోకొచ్చి నిలబడింది. శీతాకాలం ఉదయం నాలుగున్నరంటే ఎంత అద్భుతంగా వుంటుందో తెలుసుగా? నన్నూ బయటికి రమ్మంది. ఆరోజు తెల్లారే పూజాకార్యక్రమం ఒకటి పెట్టుకున్నాం ఇంట్లో!

వంటింటి తలుపు తెరిచీతెరవగానే పక్కనే ఉన్న కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలోంచి డోలు, సన్నాయి వినబడుతోంది. ధనుర్మాసంలో స్వామివారికి ఇంత అందమైన మేలుకొలుపు చూడముచ్చటా, వీనులవిందూనూ! 

మంచులో తడిసిన కొబ్బరాకులు అప్పుడే తెల్లారిందా అనుకుంటూ నాకంటే బద్ధకంగా ఊగుతున్నాయి. అంత పొద్దున్నే గుడికొచ్చిన ఒకావిడ తన ఐదేళ్ల కొడుకుని ఎత్తుకుని వాడిచేత గంట కొట్టిస్తోంది. 

ఆ స్వరం మృదువుగా అలా సాగిపోతూ తూర్పుదిశగా పయనించి  ప్రాతఃసంధ్య చెవినపడింది. ఆమె వయ్యారంగా ఒళ్ళు విరుచుకుని ఇంకా మేలుకోని సూర్యుడి వైపు పరవశంగా చూసింది. పాపం, ఈ మూడు నెలలేగా ఈయనిలా ఎక్కువసేపు నిదురించేది? ప్రశాంతంగా పడుకుని ఉన్న స్వామిని కనులారా వీక్షిస్తూ ఆ నాదస్వర హేలలో మునిగిపోయింది. 

‘రఘువంశ సుధాంబుధి’ కీర్తన మహత్తరంగా వాయిస్తున్నారు. కాసేపటికి మేలుకొలుపులు ప్రారంభమయ్యాయి. దాదాపు ఇరవైమందికి పైగా భక్తులు ఏకకంఠంతో ఆలపిస్తున్న ఆ సుప్రభాతం నరాల్ని ఉత్తేజపరుస్తోంది. గబగబా కాలకృత్యాలు తీర్చుకుని జరపబోయే తంతుకి సిద్ధమవుతున్నాం.

‘మరీ నిశ్శబ్దంగా వుంది. ఏవో భక్తిగీతాలు పెట్టు. వింటూ పనిచేసుకుంటా!’ అంది తను. ఆరూ ఏడుగంటలకల్లా వచ్చేస్తారు బ్రహ్మగారు. గుమ్మంలో అడుగెడితే మరి ఆగడాయన. వస్తూనే ‘అయ్యా జగదీష్ గారూ, తమరు గభాల్న స్నానం గట్రా చేయిస్సీ, పంచే గట్రా కట్టీసుకుంటే కార్యక్రమం మొదలెట్టీడఁవే!’ అంటాడు. 

సినిమాల్లో పోలీసుకి ‘యువార్ అండర్ అరెస్ట్!’ అన్న ఒకే ఒక్క డైలాగులా గత ఇరవయ్యేళ్లుగా ఈయనకి ఇదొక్కటే డైలాగ్! 

అందుకే తను తయారైపోయిందప్పుడే!

ఈ భార్యనేది మామూలప్పుడు విజయశాంతిలాగా, తలస్నానం చేసి పూజచీర కట్టుకున్నప్పుడు సుహాసినిలాగా కనబడుతుంది ప్రతి భర్తకీ!😛

ఆమాట కాస్తా అనేసి, నాలుగూ తినేసి, నోరుమూసుకుని సీడీల బాక్సు బయటికి తీశాను. 

‘అన్నమయ్య’ పెడదామా ‘భక్తతుకారాం’ పెడదామా? రెండు సీడీలతోనూ కాసేపు ఆడుకుని ప్లేయర్ ఓపెన్ చేశాను.

చివరికి ఆదినారాయణరావు మీద కీరవాణి గెలిచాడు. ఒకవేళ బ్రహ్మగారు రావడం ఆలస్యమైతే  భక్తతుకారాం కూడా వినొచ్చు. ఏంపోయిందీ? నేనుకూడా పట్టుపంచా, ఉత్తరీయం సింగారించుకుని, అధాట్టుగా చూడగానే ‘కొంపదీసి ఈయన చాలా మంచాయన కాదుగదా?’ అనిపించేట్టు తయారయ్యాను.

సోఫాలో కూర్చుని పేపరు చదువుతున్నానన్న మాటేగానీ ‘అన్నమయ్య జననం’ పాటలో నందకం ఏవిధంగా భూమ్మీద అవతారమెత్తిందీ బాలసుబ్రహ్మణ్యం చెబుతోంటే వింటూ ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాను. ఎంతైనా వేటూరాయన కలంలోంచొచ్చే పాట శివుని జటాజూటాన్ని వదిలొచ్చే గంగలా పరవళ్ళు తొక్కుతూ మనల్ని ముంచేస్తుంది.

‘ఆంధ్రసాహితీ అమరకోశమై
అవతరించెను అన్నమయ
అసతోమా సద్గమయా ||

తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ
తమసోమా జ్యోతిర్గమయ ||’

‘ఏవో కాలక్షేపం కబుర్లేతప్ప అట్టాంటి పాటొకటి రాసే చేవుందా నీకసలూ?’ అంటూ లోపల్నుంచి కవిగాడు ప్రశ్నించాడు. మనకంతలేదని రచయిత వాణ్ణి పడుకోబెట్టేశాడు.

వార్తాపత్రిక తెరిస్తే ఏముందీ? దేశంలోకి దొంగల్ని రానివ్వాలంటూ చేస్తున్న ఉద్యమాలు ఏదో ఓపిక చేసుకుంటూ సాగుతున్నాయి. 

వినరో భాగ్యము...
మూసిన ముత్యాలకే...
దాచుకో నీపాదాల... అయిపోయాయి. 

తను పెళ్లైన కొత్తలో ఒకసారెప్పుడో పాటపాడితే నేను నవ్వానుట. అంచేత నా ఎదురుగా ఇంకెప్పుడూ పాడకూడదని ఎవరిమీదో ఒట్టేసేసుకుంది. ఏవండీ, నేను మరీ అంత దుర్మార్గుణ్ణా చెప్పండి? ఇన్నాళ్లనించి చూస్తున్నారుగా? 

కానీ వంటింట్లో పనిచేసుకుంటూ మాత్రం కూనిరాగాలు తీస్తూవుంటుంది. నేను పిల్లిలాగా వెనకనుంచి వెళ్లి విందామని ప్రయత్నిస్తానా, ఎలా తెలిసిపోతుందో వెంటనే ఆపేస్తుంది. 

అనుకున్నట్టే బ్రహ్మగారు ధవళ వస్త్రాలంకృతుడై గుమ్మంలో అడుగెట్టారు. రాగానే నేనిందాకా చెప్పిన డైలాగు కొడదామనుకున్నవారే నా వాలకం చూసి ఆపేశారు. 

తస్సాదియ్యా, అంతలో జరిగిందిది....

అప్పటివరకూ భక్తిపారవశ్యంలో మునిగిపోయిన హాల్లోకి అకస్మాత్తుగా అస్మదీయ మగటిమితో మోహన్ బాబు, తస్మదీయ తకధిమితో రోజా వచ్చేసి వాతావరణాన్ని భంగభంగా అనిపించేశారు.

తను కంగారులో పట్టకారుతో కాఫీగిన్నె పట్టుకుని మరీ హాల్లోకొచ్చేసింది.

‘ఛీ! నీకసలు తెలుస్తోందా? భక్తి పాటలు పెట్టమంటే ఇలాంటి ఛండాలమంతా పెడతావేంటీ?’ అంది కోపంతో రగిలిపోతూ.

ఆ కోపానికి కారణం లేకపోలేదు. మేం తిరుపతిలో ఉన్నప్పుడు రామరాజ్ థియేటర్లో ఆ సినిమాకి మా డాక్టర్లం నాలుక్కుటుంబాల వాళ్లం పిల్లామేకా కలిసి నారాయణ మంత్రం జపించుకుంటూ వెళ్లాం. 

కానీ చాలాసేపటివరకూ ‘నారాయణ నారాయణ! ఏఁవిటీ సినిమా?’ అనుకుంటూ కూర్చున్నాం.  నాగార్జున భక్తుడిగా మారిన తరవాతగాని మాకూ, అతనికీ కుదురులేదనుకోండీ!

అంతవరకూ మరదళ్ల సరసాలు, ‘ఢమాలూ..ఊఁ, ఢిమీలూ..ఊఁ!’లతో చీదరగా ఉన్న మా మనసుల్ని కీరవాణీ, బాలూ కలిసి ఆదుకున్నారు. ఆ పాటలన్నీ పాకం గారెల్లా రుచిగా వుండబట్టి ఆ కాసేపైనా కూర్చున్నాం.

ఇంతలో వెకిలి మహారాజు, సకిలించే మహారాణీ కలిసి ఈ అస్మదీయ మగటిమి పాటందుకున్నారు. మాటిమాటికీ రోజా బొడ్డుమీద పూలతోనూ, పళ్లతోనూ కొడుతోంటే మాకందరికీ డోకొచ్చినంత పనైంది.

దాంతో మా ఆవిడకి ఎవర్నైనా చంపాలన్న కోరిక ప్రబలమైంది. ఎలాగోలా తనని శాంతపరచి ఇంటిదారి పట్టించాను. అప్పట్నుంచీ ఆపాట ఎప్పుడు విన్నా తను కృష్ణవేణి సినిమాలో వాణిశ్రీలా మారిపోతూ వుంటుంది.

అయినా తను అంతలా కోప్పడటానికి నేచేసిన పాపం ఏముందందులో? ఈ సీడీలతో వచ్చిన గోలే ఇది! 

ఈ వ్యవహారమంతా గమనిస్తున్న బ్రహ్మగారందుకున్నారు.

‘బంగారంలాటి సినిమాలో ఈ వికారాలన్నీ పెట్టి చచ్చేడండీ! అవన్నీ లేకపోతే ఎంత బావుండీదో అసలుకి! పొయ్యీకాలం సన్నాసులకి!’ అంటూ కొత్త జంధ్యం ఒకటి బయటికి తీసి పసుబ్బొట్టదీ పెట్టి సిద్ధంచేస్తున్నాడు.

పక్కనే దర్భలవీ సిద్ధం చేస్తున్న మరొకతను వెంటనే అందుకున్నాడు..

‘అవన్నీ లేకపోతే ఎవడ్రా చూసేదీ? సినిమా అన్నాక తప్పదు అదంతా!’ అంటూ రాఘవేంద్రరావుకి సపోర్టొచ్చాడు.

‘ఒరేయ్, నీకింకా కుర్రతనం పోలేదు. భక్తిరసం తియ్యడఁవంటే బత్తాయిరసం తియ్యడం కాదురా! మొన్న టీవీలో త్యాగయ్య వేశేడు చూసేవా?’ అన్నాడు శర్మగారు కోపంగా

‘నావల్ల కాదొరేయ్. డైలాక్కీ డైలాక్కీ మధ్యలో ఓ ఉపనయనం చేయించి రావచ్చు. అంత స్లోగా ఉంది ఆ సినిమా. ఎలా చూస్తాంరా?’ అన్నాడు. అతనంతా జెట్ స్పీడ్. ఈ జెనరేషన్ గ్యాపనేది అన్ని వృత్తుల్లోనూ దాని ప్రభావం చూపిస్తోంది.

సరే వెంటనే భక్తతుకారాం పెట్టేశాన్లెండి. దీంతోనూ జాగ్రత్తగా వుండాలిస్మీ? పూజకు వేళాయెరా, సరిసరీ అంటూ కాంచన డ్యాన్స్ పాటలే రెండున్నాయి. ఆనక భక్తి కాస్తా రక్తిగా మారిపోయే డేంజరుంది.

సరే, పూజ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగిపోయింది. అంతా చక్కగా సాంగోపాంగంగా జరిపిస్తాడు శర్మగారు. వేదంలో ఒక పన్నమేదైనా అందుకున్నాడంటే అపార్ట్‌మెంట్ భవనం మొత్తం అదురుతూ వుంటుంది. ఒళ్లంతా ఒకలాంటి జలదరింపుతో రోమాంచితమవుతుంది. ఆ మంత్రానికున్న శక్తి, ఆ నాదానికున్న స్వరమహిమ కలిసి మన నాడుల్ని జల్లుమనిపిస్తాయి. ఆశీర్వచనం చేసేసి, మంగళం పాడేసి సెలవు తీసుకున్నాడు బ్రహ్మగారు.

అప్పటివరకూ చంటిపాపాయి బొజ్జలా చిరువేడిగా ఉన్న సూర్యుడు కన్నెపిల్ల బుగ్గలా వెచ్చగా తయారయ్యాడు. ఎనిమిదయ్యింది. సోఫాలో కూర్చుని మొబైల్ చూసుకుంటున్నాను.

‘నేను మేడమీదకెళ్లి బట్టలారబెట్టి వస్తాను. కాస్త కుక్కర్ విజిల్సొస్తే చూడు. మూడు రాగానే ఆపెయ్!’ అంటూ ఈ హిప్పోపోటమస్ గాడికి సూచనలిచ్చేసి వెళిపోయింది.

నేను విన్నానా? విన్నట్టే వుంది.

ఫేస్‌బుక్ తెరిస్తే ఒకదాన్నుంచి మరొకటి అలా లాక్కుపోతూ వుంటుంది. రామేశ్వరంలో ఇరవైనాలుగు బావుల్లోనూ స్నానాలు చేస్తే తప్ప గర్భగుడి లోపలికెళ్లనట్టు ఇదీ అంతే. అన్ని అకౌంట్లూ చూసిన తరవాతే కదిలేది.

పావుగంట తరవాత....‘ఎన్నోదిది?’ అంటూ చేతిలో బక్కెట్టుతో గుమ్మంలో నిలబడుంది తను. 

‘ఏంటి ఎన్నోది?’ అన్నానో లేదో 

‘చెప్పానా నీకు? కుక్కర్ విజిల్స్ వినమనీ?’ అంది స్టవ్ దగ్గరికి పరుగెడుతూ.

‘అయిదోదే అనుకుంటా ఇంకా!’ అన్నాను కంగారేం లేదన్నట్టు.

‘ఇంకో నలభై విజిల్స్ వచ్చాక ఆపుతావా? మూడు రాగానే ఆపాలని చెప్పానుగా. వినలేదా అసలు? ఇదికాస్తా మాడి తగలడింది! ఎలారా బాబూ నీతో?’ అంటూ విసుక్కుంది.

నే వెంటనే చిటికేసి...

‘బన్నీ, ఇప్పుడు తెలిసిందా....

అన్నమయ్య సీడీని, అన్నం కుక్కర్నీ పెట్టేసి అటూ ఇటూ వెళిపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. అర్ధమైందా?’ అంటూ విషయాన్ని సరళం చేసేశాను.

తనుకూడా నవ్వేసి ‘వీటికేం తక్కువలేదు!’ అంది సుహాసిని నుంచి మళ్ళీ విజయశాంతిగా మారిపోయి.

......జగదీశ్ కొచ్చెర్లకోట

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive