తెల్లకోటంటే డాక్టరూ
నల్లకోటంటే లాయరు!
ఇదేగా మనం చిన్నప్పట్నుంచీ విన్నదీ, చూసిందీ?
‘దొంగ’ వేషమనగానే అడ్డచారల టీషర్టు, బుగ్గమీద ఉలిపిరికాయ, లుంగీమీద బెల్టు తప్పనిసరిగా ఉండేట్టు మేకప్ చేసేవారు పూర్వం. నాటకాలూ అంతే, సినిమాల్లోనూ అంతే!
డాక్టరనగానే తెల్లకోటొకటి తొడిగేసి, మెళ్లో స్టెత్తొకటి పడేస్తారు. మామూలు సాదాసీదా దర్శకులైతే ‘పేషెంట్ స్పృహలోకి రావడానికి ఇంకో రెండు గంటలు పడుతుంద’నో, ‘ఐయామ్ సారీ’ అనో ఓ డైలాగిస్తారు.
కాస్తంత కామెడీ టచ్ ఉన్నవాళ్లు లావుగా ఉన్న నర్సునో, బక్కగా ఉన్న పేషెంటునో పెట్టి అడ్డమైన చెత్తా లాగించేస్తారు. కొంతమంది దిగ్దర్శకులైతే ఇంకొంచెం ముందుకెళ్లి ఆపరేషన్లవీ చూపిస్తారు.
దరిద్రమేంటంటే..
ఈ తెల్లకోటేసుకుని ఆపరేషన్ చేస్తున్నట్టు కూడా చూపిస్తారు.
ఇంకా దరిద్రమేంటంటే..
పేషెంట్ ముక్కుకి చిన్న ఆక్సిజన్ మాస్కొకటి తగిలించి గుండాపరేషన్ చేసేస్తున్నట్టూ చూపిస్తారు. అవన్నీ చూసి సినిమాహాలు కుర్చీ చేతులమీద మాలాంటివాళ్లకి చెయ్యి బిగుసుకోవడం తప్ప పెద్దగా పొడిచేదేమీ లేదనుకోండి, అది వేరే విషయం.
ఇవన్నీ పక్కనబెడితే... అసలీ తెల్లకోటు వ్యవహారం చూద్దాం.
మనం ఏడోక్లాసు చదువుతుండగా ఒకసారి మా స్కూలు పక్కనే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్లాం. అప్పుడక్కడ డాక్టర్ రామిరెడ్డి గారనే ఆయన ఉండేవారు. అచ్చం స్టేషన్ మాస్టర్లా వైటండ్ వైట్ డ్రెస్ వేసుకుని, నల్ల బెల్టొకటి పెట్టుకుని హుషారుగా హాస్పిటలంతా తిరిగేస్తూ ఉండేవారు. చూడ్డానికి శరత్ బాబులా ఉన్నా మాట మాత్రం ప్రభాకరరెడ్డిలా సగం మింగేసేవారు. దానివల్ల ఏదైనా మాత్ర వేసుకోమంటున్నారో, వేసుకోకూడదంటున్నారో తెలిసేది కాదు.
ఆయన తెల్లకోటు మాత్రం తప్పకుండా వేసుకునేవారు. అది చూడగానే సగం రోగం తగ్గిపోయిన ఫీలింగ్. ఆ తరవాత చాలామంది డాక్టర్ల దగ్గరకి వెళ్లానుగానీ కోటేసుకునే వాళ్లను చాలా తక్కువమందిని చూశాను.
సరే, ఇంటర్లో ఉండగా మనకి జువాలజీ, కెమిస్ట్రీ ల్యాబుల్లో డిమాన్స్ట్రేటర్లు ఎప్పుడూ తెల్లకోట్లు తొడుక్కునే ఉండేవారు. కానీ అవి దుక్కలా ఉండే బిన్నీ గుడ్డతో కుట్టించినవనుకుంటా, చూసేందుకు చిరాగ్గా ఉండేవి. కాలర్ల దగ్గర చిరుగులు అదనపు ఆకర్షణ.
మెడిసిన్లో చేరాం.
మా నూటపాతికమందికీ మొదటిరోజు కెజిహెచ్ అంతా తిప్పి చూపించమని ఒకాయన్ని నియమించారు. ఆయనొక ఆర్థోపెడీషియన్. ఎర్రగా ఇంగ్లీష్ దొరలా ఉండేవాడు. తెల్లటి బట్టల మీద మళ్ళీ తెల్లటి ఏప్రానొకటి తొడుక్కుని మాతో తిరిగారు. అతను అప్పుడే పుట్టిన బాలయేసుని తీసుకెళ్లడానికొచ్చిన దేవదూతలా ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న శాంతి మొత్తం అతనిలో కనబడింది మాకు. ఎవరైనా నోరెత్తితే ఒట్టు. అల్లరి చెయ్యాలన్న ఆలోచనే రాలేదసలు. అదీ డ్రెస్ మహత్యమంటే!
వారం తరవాత అనాటమీ డిసెక్షన్ మొదలైంది. తెల్లకోటు తప్పనిసరిగా వేసుకురావాలన్నారు.
అప్పుడు కొన్నారు మనకి మొట్టమొదటిసారిగా తెల్లటి ఏప్రాన్!
అప్పట్లో ఖర్చులకి భయపడి నాన్నగారు కాపరం మొత్తం విశాఖపట్నం మార్చడానికి భయపడ్డారు. అంచేత ఫస్టియర్లో నేను కొన్నాళ్లు హాస్టల్లో ఏడిశాను. ఖచ్చితంగా వారానికొకసారి అనకాపల్లి వచ్చేసేవాణ్ణి.
అనకాపల్లిలో మనకెప్పుడూ బట్టలు కుట్టే ఫిట్ వెల్ టైలర్ దగ్గరకెళ్లి బా..గా దళసరిగా ఉన్న కాటన్ గుడ్డ ఇచ్చి రెండు ఏప్రాన్లు కుట్టమన్నాను. అతనికి అదెలా కుట్టాలో తెలీదు.
‘ఏదన్నా మోడలిస్తే కుట్టడం ఎంచేపండీ? మీ ఫ్రెండెవరి కాడన్నా ఉంటే ఓపాలి తీసుకురండి. కుట్టేద్దారి!’ అంటూ సలహా ఇచ్చాడు. యూట్యూబ్ లో చూసి కుట్టెయ్యడానికి ఇప్పట్లా ఇంటర్నెట్ రోజులు కావుగా?
సరే, మా రూమ్మేట్ కొనుక్కున్న రెడీమేడ్ ఏప్రాన్ తీసుకొచ్చి ఇచ్చాను. వాడసలు ముందే చెప్పాడు, ‘రెడీమేడ్ తీసేసుకోరా!’ అని. నాన్నగారికి రెడీమేడ్ మీదా, కాంగ్రెస్ పార్టీ మీదా మంచభిప్రాయం ఉండేదికాదు. ‘పున్నమినాగు’లో చిరంజీవి తండ్రి చిన్నతనం నుంచీ విషం ఎక్కించినట్టు అదే అభిప్రాయాన్ని మాక్కూడా చిన్నతనం నుంచీ మెల్లిమెల్లిగా ఎక్కించారు!
టైలర్ ఇవ్వడానికి పదిరోజులు పడుతుందని చెప్పాడు. ఏంచెయ్యాలో తెలీక అమలాపురం నుంచొచ్చిన మా సీనియర్ ఒకతని దగ్గర రెండుంటే ఒకటి తెచ్చుకున్నాను. పదిరోజుల పాటు అలా ‘కిరాయి కోటుగాడి’లానే గడుపుకొచ్చాను.
సరే, మొత్తానికి ఫిట్ వెల్ టైలర్స్ ఏదో చేతనైనంతలో బానే కుట్టారు. ఆరోజు సాయంత్రం ఇంటికి తీసుకురాగానే మొట్టమొదటిసారిగా ఆ కోటు వేసుకున్నప్పుడు చూడాలి నా మొహం...
చిన్నప్పటినుండీ చూసిన సినిమాల్లోను, స్కూళ్లలో వేసిన నాటకాల్లోను కనబడ్డ డాక్టర్లు, రామిరెడ్డి డాక్టరు.. వీళ్లందరితోపాటు ఇప్పుడు నేను! అదేదో... గూస్ బంప్స్ అంటారు చూడండి, అచ్చం అలాగన్నమాట! అమ్మకైతే కళ్లలో నీళ్లు కూడా వచ్చేశాయి నన్ను చూసి!
ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తయి, తనవాళ్లని అవమానించిన విలన్స్ మీద పగ తీర్చుకోవడం కోసం అదేంటో చిత్రంగా... ‘అదే’ ఊరికి పోలీసాఫీసరుగా వచ్చిన హీరోని చూసినట్టు చూసింది అమ్మ నావైపు.
ఈ మధ్యతరగతి ఎమోషన్లన్నీ ఇలాగే ఉంటాయి. గీజర్ లేకుండానే వేణ్ణీళ్లూ, గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లూ!
తొమ్మిది నెలల తరవాత హాస్టల్లో నా కష్టాలు చూడలేక నాన్నగారు వైజాగ్ కాపరానికి ఒప్పుకున్నారు. మొదట్లో కొన్నాళ్ళు అక్కయ్యపాలెంలో ఉండేవాళ్లం.
ఇక ఆ తెల్లకోటుని భుజంమీద వేసుకుని రోజూ కాలేజీకి వెళ్లడం కొత్తగా పైటలేసుకునే పిల్లల ఇబ్బంది లాంటిదే! మనదసలే ఇజినారం సోంబాబు పర్సనాలిటీ. భుజమ్మీద కోటు అస్సలు నిలబడేది కాదు. మాటిమాటికీ పైకి లాక్కోడమే! బస్సుల్లో అయితే ఇంకా నరకం.
ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ప్రాక్టికల్స్, అనాటమీ డిసెక్షన్ తప్పనిసరిగా ఏప్రాన్ వేసుకునే చెయ్యాలి. ఏవిఎన్ కాలేజీ పక్కనే మా అనాటమీ బ్లాక్. సాయంత్రం కాలేజీ అయిపోయిన తరవాత ఈ ఏప్రాన్లేసుకుని మేమందరం బస్టాపులో నిలబడేవాళ్లం.
కొంతమంది పెద్దవాళ్ళు ‘ఏ ఇయర్ బాబూ?’ అని పలకరించేవారు. ఫస్టియర్ అని చెప్పగానే ‘ఫస్టియర్లోనే తెల్లకోట్లేసేసుకుంటారా?’ అని వాళ్లడిగినా, మేం సమాధానం ఇచ్చేలోగా ఫార్టీ ఎయిట్ బస్సు వచ్చేసేది.
మెడిసిన్ పూర్తయ్యాక ‘స్వర్ణయుగం’ ఆరంభమైంది.
దీన్నే కొన్ని ఏరియాల్లో ‘హౌస్‌సర్జెన్సీ' అనంటారు.
మెళ్ళో స్టెతస్కోపు, ఒంట్లో వూపు, ఆకాశంవైపు చూపు... ఇవన్నీ ఈ‘యుగ'పురుషుల లక్షణాలు!
ఏదో అయిపోయిన ఫీలింగ్!
ఏదేదో అయిపోబోతున్నామని థ్రిల్లింగ్!!
కొన్నాళ్ళపాటు అవకతవకగా ఇచ్చాకా అర్ధమైంది ..ఇంజెక్షనెలా ఇవ్వాలో!
పెన్సిలిన్ ఇవ్వగానే పేషెంట్లు పడిపోడాలు
ఇన్సులిన్ డోసెంతివ్వాలో తెలుసుకోడాలు
‘సిస్టర్...!' అని పిలుస్తూనే వాళ్ళతో
మిస్టీరియస్ గా మాట్లాడ్డాలు 😜
మెన్స్ హాస్టల్లో వెయిట్ లిఫ్టింగులు...
ఉమెన్స్ హాస్టల్ ముందు వెయిటింగులు..
క్షణం ఖాళీ ఉండేదికాదు.
అప్పుడప్పుడు కాస్తంత తీరికచేసుకుని ఇరవైమూడు నుంచి పాతికేళ్లవరకు వయసున్న మిసమిసలాడే కుర్రకారంతా తెల్లకోట్లేసుకుని, మెడల్లో స్టెతస్కోపులు వేలాడదీసుకుని పానగల్ బిల్డింగు వెనకాల ఉండే కాలేజీ క్యాంటీన్ నుంచి భావనగర్ వార్డుదాకా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తోంటే ఆ అందం చెప్పడం కంటే చూడ్డానికే బావుంటుంది.
అందరి మొహాల్లోనూ ఒకరకమైన వెలుగు. అది విద్యవల్ల వచ్చింది. ఎవరికీ పంకులూ, పైనాపిల్ హెయిర్ కట్లూ, చిరు గెడ్డాలు ఉండేవికావు. అప్పటి ఫ్యాషన్లు వేరే. అమ్మాయిలు కూడా జీన్స్, టీషర్ట్ వేసుకున్న వాళ్లు క్లాస్ మొత్తంలో ఇద్దరో ముగ్గురో ఉండేవారంతే.
తెల్లకోట్లు మాత్రం అందరికీ మోచేతుల మీదో, భుజాలమీదో వేలాడుతూ ఉండేవి. కొంతమంది నాలాంటి బక్క పర్సనాలిటీలు మాత్రం అది వేసుకునే తిరిగేవాళ్లం. ‘మీరు బక్కేంటండీ బాబూ?’ అని అవాక్కదీ అవ్వకండి. నేచెప్పేది ముప్ఫయ్యేళ్ల క్రితం మాట!
పీజీ చెయ్యకముందు ఒక ఏడాదిపాటు సింగరేణి హాస్పిటల్లో ఉద్యోగం చెయ్యడం వల్ల తెల్లకోటు తొడుక్కుని పేషెంట్లని చూసే సరదా తీరింది నాకు. అది నిజంగానే నాకు తరచూ వస్తుండే తియ్యటి కల. తీరాజేసి నేను అనెస్తీషియా పీజీలో చేరాను.
ఈ మత్తు డాక్టర్లెప్పుడూ ఆపరేషన్ థియేటర్లలోనేగా ఉండాల్సింది? అంటే ఎప్పుడు చూసినా వదులుగా ఉండే ఆకుపచ్చ పైజమా, టైలరు చేసిన తప్పిదం వల్ల దానికి ముడెయ్యడానికి చాలనంత పొడవులో తాళ్లు తప్పనిసరి. ఒకవేళ ఎలాగోలా తిప్పలుపడి ముడేసేసినా మళ్ళీ ఆపరేషన్ పూర్తయిపోయిన తరవాత ఆ ముడి రాకపోవడం, పావుగంటసేపు దాంతోనే కూర్చుని ఇహ రాదని నిశ్చయమయ్యాక కత్తెరతో దాన్ని తెంపేసుకుని ‘ఖైదీ’లో చిరంజీవిలా బయటపడి ఊపిరి పీల్చుకోవడం... ఇవన్నీ ఆపరేషన్ల కంటే కాంప్లికేటెడ్ వ్యవహారాలు. గడచిన ఇరవై మూడేళ్లుగా ఈ బాధలన్నీ అనుభవించినవాడిగా చెబుతున్నాను ఈమాట!
ఇహ చొక్కాలు.
ఒక్కోదానికీ నాలుగేసి జేబులు. చొక్కాలు పాతవైతే బొత్తాల్లేని కాజాలు, కొత్తవైతే కాజాల్లో దూరని బొత్తాలు. ఇదీ హింసే! మనకి నూటికినూరుపాళ్లూ నప్పిచచ్చే డ్రెస్ ఒక్కటీ దొరకదు. ఒకవేళ కుట్టించుకున్నా అవి రెగ్యులర్ గా శ్రద్ధగా ఉతికించుకుని మనతోపాటు తీసుకెళ్తూ ఉండాలి.
మనం ఓటీలో ఉండగా వార్డునుంచో, ఓపీనుంచో ఎవడో ఒక ఫిజీషియన్ తెల్లకోటొకటి తొడుక్కుని స్మార్ట్ గా వస్తాడు. మనకి మళ్లీ పాతరోజులు గుర్తొస్తాయి.
ఇక ఇప్పుడు చేస్తున్న హాస్పిటల్లో మాత్రం మా డాక్టరమ్మలెవరూ ఉత్తుత్తినే తెల్లకోట్లవీ వేసుకుని కాజల్, రకుల్ ప్రీత్ సింగుల్లా తిరిగెయ్యరు. నిజానికి అదెంత కష్టమో మీకు తెలీదు. వేసవిలో ఉక్కపోసేస్తూ ఉంటుంది. ఓపీ ఎప్పుడయిపోతుందా, ఈ కోటు ఎప్పుడెప్పుడు తీసవతల పడేద్దామా అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే సాధారణంగా వేసుకోరు.
కానీ రక్తదానం చెయ్యడానికి రాజకీయ నాయకులో, పళ్లు పంచిపెట్టడానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్సో వస్తేమాత్రం వాళ్ల వెనకాల తెల్లకోట్లేసుకుని బ్యాండ్ మేళంలా ఊరేగాల్సిందే.
ఇక టీవీలో అడ్వర్టైజ్మెంట్లు.
పళ్లపొడి తయారుచేసే వాళ్లనుంచి స్పేస్ సైంటిస్టుల వరకు అందరూ ఏప్రాన్లేసుకున్నట్టే చూపిస్తారు. డిటర్జెంట్ పౌడర్ ఒకటి తయారుచేసి, తెల్లకోట్లేసుకుని సీరియస్‌గా మైక్రోస్కోపులో చూసేస్తూ ఉంటారు.
మురికి కారకమైన క్రిముల్లో అదేంటో ఒకటెప్పుడూ ఉండిపోతుంది. అది మైక్రోస్కోపులో దెయ్యంలా కనబడుతూ ఉంటుంది. కిందన ‘తొంభైతొమ్మిదీ పాయింట్ ఎనిమిది శాతం మురికినుంచి రక్షణ’ అంటూ రాసుంటుంది. ఈ కామెడీకి అంతులేదు.
ఇప్పుడు పారామెడికల్ డిప్లమా స్కూళ్లు, ఫార్మసీ కాలేజీలు కూడా ఏప్రాన్లు తప్పనిసరిగా వాడిస్తున్నారు.
ఇవన్నీ చూసిన తరవాత నాకు తెల్లకోటు మీద మోజు పోయింది. ఇప్పుడు ఓటీ డ్రెస్సు, స్టెతస్కోప్ సహజ కవచకుండలాల్లా మారిపోయాయి.
ఒక్కసారి మనం బయటపడ్డామా... మన ఆకారమే మారిపోతుంది. ఎంచక్కా బోల్డు బోల్డు రంగుల్లో బట్టలేసుకుని మాళ్లకీ, హాళ్లకీ వెళిపోతూ ఉంటాను.
అంచేత...
తెల్లకోటంటే డాక్టరొక్కడే కాదు.

0 comments:
Post a Comment