Latest Posts

Content

Monday, August 3, 2020

ఆరనీకుమా...

‘టీ తాగుతావా?’ అంటూ హాల్లోంచి గదిలోకి దూసుకొచ్చింది తను. 

జి.ఎస్.ఎమ్. ఎరీనాలో కొత్త ఫోన్ల రివ్యూలు చదువుతూ తన్మయత్వంలో ఉన్న నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. 

‘ఆఫీసునుంచొచ్చి ఎంతసేపైంది ?’  అన్నాను ఫోన్ పక్కనబెట్టి.

డీమోనిటైజేషన్లా ఇలా చెప్పాపెట్టకుండా రావడం తనకేం కొత్తకాదు.

‘అరగంటైందిరా! నేనొచ్చి చూసేటప్పటికి నువ్వు పడుకుని నిద్రపోతున్నావు. రాత్రంతా కేసులంటూ తిరుగుతూ ఉన్నావు కదాని నేనే డిస్టర్బ్ చెయ్యలేదు. వస్తావా హాల్లోకి?’ అంది కిచెన్లోకి తిరుగుప్రయాణానికి సిద్ధమవుతూ.

‘తీసుకురా! ఇక్కడే కూర్చుందాం!’ అన్నాను ఏసీ ఆపేస్తూ బద్ధకంగా. 

‘హాల్లోకి రా! ఈటీవీ సినిమాలో ఏదైనా మంచి సినిమా వస్తోందేమో చూడు. నేనీలోపల టీ పెట్టి తీసుకొస్తాను!’ అంటూ కస్టమర్ కేర్ వాళ్లు పంపే ఈమెయిల్లా రిప్లై కోసం చూడకుండా వెళిపోయింది. ఒకవేళ మనం మాటాడినా అది డ్రాఫ్ట్స్ లోకి వెళ్లడం తప్ప ఉపయోగంలేదని లేచి హాల్లోకొచ్చా.

ఈటీవీ సినిమాలో అగ్గిపిడుగు వస్తోంది. 

‘ఎన్టీయార్ పైన గౌనేసుకున్నాడు కానీ కింద పేంటేసుకోలేద’ని నేను..., 

‘నీ తలకాయ్, వేసుకున్నాడు. అది స్కిన్ టైట్. సరిగ్గా చూడం’టూ తనూ.. కాసేపు వాదించుకున్నాం. 

ఈలోగా తెరమీదకి రాజశ్రీ తిప్పుకుంటూ వచ్చింది. తను వేసుకున్న బట్టల్లాంటివి మనంగనక వేసుకుని, ఒక్కసారి కిందకి వంగి షూ కట్టుకుంటే చాలు... పుటుక్ పుటుక్ మంటూ కుట్లన్నీ ఊడిపోతాయి. అంత ఇరుగ్గా ఉంది ఆ సౌందర్యం! ఖర్మరా బాబూ!

ఇంకా అరాచకం ఏంటంటే.. జస్ట్ అప్పుడే పరిచయమయ్యాడు ఎన్టీవోడు. కానీ టీవీ కాలిపోయేంత విరహం ఒలకబోసేస్తోంది రాజశ్రీ! ఆ వేడిలో టీ వేడి తెలీలేదసలు. గుటుక్కున తాగేశాను.
          
‘అసలా డ్రెస్ కుట్టించిన తరవాత వేసుకుందా లేక ఒంటిమీదే కుట్టారా? నీకు పుణ్యముంటుంది. అంత టైట్ బట్టలు చూడ్డం నావల్లకాదు. జీ సినిమాలు పెట్టు. ఏ విశాల్ గాడి సినిమానో వస్తుంది. చూద్దాం!’ అంది గ్రీన్ టీ తాగుతున్నట్టు మొహం వికారంగా పెట్టి! 

సరే, రిమోటందుకుని ఛానల్ ఇలా మార్చీ మార్చగానే టీవీలోంచి ఒక రౌడీ వచ్చి మా కాళ్లమీద పడ్డాడు. వెంటనే చేతి కడియం తిప్పుకుంటూ ఆరడుగుల నల్లరాతి విగ్రహం మా ఇసాల్ బాబు వచ్చేసాడు.

‘ఎణ్ణిసార్లు చెప్పాల్రా! ఒక్కసారీ చెప్తే విణరా? ఇంకొక్కసారి జాణకిని కణ్ణెత్తి చూసారో... ’ అని పక్కనే పుణుకులమ్ముకుంటూ గుట్టుగా బతుకుతున్న ఓ ముసలమ్మ తాలూకు బండిని ఒక్కచేత్తో బోర్లించేశాడు. దెబ్బకి పదహారుమంది గూండాలూ పరుగందుకుణ్ణారు... ఛీ.. నాకూ అదే వచ్చేస్తోంది.. పరుగందుకున్నారు!

ఈలోగా నా ఫోను గణగణమంది.

‘ఎవరూ?’ అంది మా కుతూహలమ్మ.

‘ఇంకా ఏదీ, నేనైనా చూడకుండా ఎలా చెప్తాను?’ అంటూ ఛార్జింగ్ పెట్టివున్న ఫోన్ దగ్గరకి వెళ్లి చూశాను. 

ఘోషానుంచి. 

‘డిక్రీజ్డ్ ఫీటల్ మూవ్‌మెంట్స్‌ సర్! స్కాన్ చేసి చూసాను, హార్ట్ బీట్ కొంచెం స్లోగా ఉంది. దొంగమొహంది, నిన్నట్నించీ బేబీ సరిగ్గా తిరగట్లేదుట. కానీ అమావాస్య, నిన్న వెళ్లొద్దని అత్తగారు చెప్పిందిట, ఇంటిదగ్గరే ఉండిపోయింది! ఇప్పుడు ఆక్సిజన్ పెట్టిన తరవాత చూస్తే బేబీ హార్ట్ బానేవుంది. ఎందుకైనా మంచిది, చేసేస్తే బెటర్ కదా? ఎంతసేపట్లో వస్తారు?’

ఆవేదన, ఆగ్రహం, అసహనం, చివరిగా అభ్యర్ధన కలగలిపిన ఎమోషనల్ ఫోన్ కాలది! గడిచిన ఇరవయ్యేళ్లుగా అలవాటైపోయిన రొడ్డకొట్టుడు వ్యవహారమే అయినా ఆ భావోద్వేగాలు మాత్రం ఎప్పుడూ పచ్చిగానే ఉంటాయి.. ఆవకాయలో ఊటలా!

‘చా...లా ఖాళీగా ఉన్నాను. లుంగీ కట్టుకుని, విశాలంగా కాళ్లు చాపుకుని విశాల్ గాడి సినిమా చూస్తున్నాను. స్టాఫందరూ రెడీగా వున్నారంటే ఇప్పటికిప్పుడు వచ్చెయ్యమన్నా వచ్చేస్తాను!’ అన్నాను తనవైపు క్రీగంట చూసి నవ్వుతూ.

‘సార్, ఆగండాగండి! వస్తే ఇప్పుడే వచ్చెయ్యండి. లేకపోతే ఎనిమిది తరవాత రండి. అంతేగానీ అటూయిటూ కాకుండా ఏడున్నరకి రాకండి!’ అంటూ కంగారుగా చెప్పింది డాక్టరమ్మ. 

అది ఆవిడ రిక్వెస్ట్ కాదు. వెనకేదో కుట్రపాత్రికై దాగివుంటుంది. ఎవరో పక్కనుండి మాటాడిస్తున్నారు. ఆ రహస్యాన్ని మనఁవెళ్లి ఛేదించాలి. 

అకస్మాత్తుగా తట్టింది అదేంటో...

దీని వెనక దాగివున్న పాపం....కార్తీకదీపం! 

సరిగ్గా ఏడున్నరకి వెలిగే ఈ దీపానికి గ్యాలన్లకొద్దీ చమురునీ, చున్నీలు తడిసిపోయేటన్ని కన్నీళ్లనీ సప్లై చేస్తూవుంటారు మావాళ్లు.

మా హాస్పిటల్లో ఈ సీరియల్ టైముకి ఏ ఎమర్జెన్సీ కేసూ పెట్టొద్దంటూ డాక్టరమ్మల్ని వేడుకోవడాలు, బయట్నించి నొప్పులతో ఏ పేషెంటూ రాకూడదంటూ పైడితల్లమ్మకి మొక్కుకోవడాలు ఉంటాయి. అంతా కలిసి టూజీబీ పర్ డే జియో డేటాతో మొబైల్లో చూసేస్తారు. 

ఒకవేళ విధి వక్రించి ఆ ఎపిసోడ్ చూడలేని అభాగ్యులు చేతిలో పని అయిపోయిన వెంటనే నాలుగు లెంపలేసుకుని, అయిదు గుంజీల్తీసి, ఆరో నిముషంలో హాట్ స్టార్ ఓపెన్ చేస్తారు. 

ఆ క్షణంలో వాళ్లని చూసిన నా మనసెలా రెపరెపలాడుతుందో తెలుసా?

ఉదయం నుంచీ ఎర్రటి ఎండలో రాళ్లు కొట్టి, తట్టలకెత్తి, ఆ రాళ్లని అరకిలోమీటరవతల కుప్పలా పోస్తూ ఏ మధ్యాహ్నమో పమిటకొంగుతో చెమట తుడుచుకుంటూ ఒకచోట కూర్చుని, పాలకోసం ఏడ్చే పసిపిల్లాణ్ణి చేతుల్లోకి తీసుకునే ఆడకూలీలంత ఆత్రంగా తీసుకుంటారు... మొబైల్ని!

సిగ ఉన్నమ్మ ఏ కొప్పైనా పెడుతుందని సామెత! కొంతమంది డబ్బున్న మారాణులు హాట్ స్టార్ ప్రీమియంకో, వీఐపీకో డబ్బు కట్టి దర్జాగా చూస్తే, అంత స్తోమత లేని పేదింటి పిల్లలు పాత ఎపిసోళ్లనే కరకరలాడిస్తూ ఉంటారు.

ఏదైతేనేం, ఆ దీపం ఆరిపోకుండా నిత్యం ఒలింపిక్ జ్యోతిలా వెలిగిస్తున్నారు. 

మనం ఇగోలకి పోయి సరిగ్గా ఆ సీరియల్ టైముకే వెళ్లి కేసు ఓటీలో పెట్టాలని, రాంగోపాల్ వర్మని అదుపులో పెట్టాలని మడతపేచీలవీ పెడితే మనకి మడతడిపోతుంది. 

‘ఆ వచ్చీదేదో ఏడింటికో, ఎనిమిదింటికో రావచ్చు కద్సార్? సరిగ్గా సీరియల్ టైముకే వస్తారు!’ అంటూ ‘గోము’ బ్యాచ్ కూడా ఒకటి తయారవుతుంది.

‘బేబీ తిరగట్లేదని చెప్పారుగా, నాకిక ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. రండ్రండి త్వరగా చేసేద్దాం!’ అంటూ మూర్తీభవించిన మానవత్వపు పరిమళాలతో ఘుమఘుమలాడుతూ ఓటీలోకి అడుగుపెడతాను.

అయినా మనమీద గౌరవంతో మాట కొట్టెయ్యలేక రావడమైతే వస్తారనుకోండీ.  కానీ...

ఓటీ గౌనే అరగంట వేసుకుంటారు....

హవాయి చెప్పులు సైజు సరిపోలేదని వాటితో కాసేపు వీరీవీరీ గుమ్మడి పండు ఆడతారు....

ఫేస్ మాస్క్ కట్టుకోవడానికి బాబ్రీ మాస్క్ కట్టినంత టైం తీసుకుంటారు.

ఇవన్నీ అసహనానికి ప్రతీకలు. ఒకవేళ వాళ్ల దగ్గరేవన్నా అవార్డులవీ ఉండుంటే మన మేధావుల్లాగ వాపస్ ఇచ్చెయ్యడానిక్కూడా వెనకాడరు.

ఆ టైములో మనం వాళ్లని కదపడం అనేది సెడిషన్ కేస్ కిందకొస్తుంది. ఆనక మనమీద పగబట్టడాలు, ఆ సీరియల్లోలానే ప్రతీకారం తీర్చుకోడాలూ ఉండే అవకాశాలు స్ఫుటంగా ఉన్నాయి. 

అంచేత ఆ కాసేపూ నా ఫోన్లో నిత్యానంద కామెడీ వీడియోలు చూస్తూ, ఆ విజ్ఞాన గుళికలకి భక్తులతో పాటు నేను కూడా మా ఓటీలో బల్లల మీద, బిన్స్ మీద దరువేస్తూ సేద తీరుతూ ఉంటాను.

సరే, ఎట్టకేలకు టీమంతా రెడీ అయిపోయుంటుందీ, ఇక కొయ్యడఁవే తరువాయి అని అనుకుంటూ గోడ గడియారం వైపు చూస్తే అందులో పదకొండూ నలభయ్యయింది. మనకి వాచీలవీ అలవాట్లేవు. కాలమానానికి, కాలకృత్యాలకీ కూడా మొబైలే! ఏతావాతా తేలిందేంటంటే గోడ గడియారం చూపిస్తున్న టైము రెండువేల పదో సంవత్సరం, జనవరి పదోతేదీ, ఉదయం పదకొండూనలభైట! సరిగ్గా ఆయేడు పెద్దపండక్కి మూడురోజుల ముందే అది బ్యాటరీలైపోయి హృదయస్పందన కోల్పోయిందని చెప్పారు మావాళ్లు.

ఒరిజినల్ గా  ఎనిమిదీ పదయ్యింది. షిఫ్ట్ మారినట్టున్నారు. పదో ఎపిసోడ్‌లో ఉన్న యాక్టర్లంతా వందో ఎపిసోడ్‌లో ప్లాస్టిక్ సర్జరీలవీ చేయించుకుని మారిపోయినట్టు మొత్తం పాతవాళ్లందరూ మారిపోయి వేరే నర్సుల బ్యాచ్ వచ్చింది. వాళ్ళందరూ ఆనందాన్నీ, సంతోషాన్నీ పసుపూ, చందనం పేస్టులా కలిపి మొహానికి పూసుకొచ్చినట్టు చాలా తాజాగా కనబడుతున్నారు. దానిక్కారణం వాళ్లప్పుడే సీరియల్ చూసి బయల్దేరార్ట. 

పేషెంటుకి నొప్పులొస్తున్నాయి. ఇక ఆలస్యం చెయ్యడం ప్రమాదమని నా కర్తవ్యం నిర్వహించాను. మత్తిచ్చిన మరుక్షణం చిరునవ్వులు చిందించడం మొదలెట్టింది నాగమణి. 

‘నన్నొదిలి ఎక్కడికీ ఎల్లకండి ‘డాక్టర్ బాబూ’!’ అంది నా చెయ్యి గట్టిగా పట్టుకుని. 

నేనులిక్కిపడ్డాను. ‘ఈ డైలాగెక్కడో విన్నానే?’ అంటూ అవాక్కదీ అవబోతోంటే మావాళ్లు చెప్పారు నాగమణి కూడా కార్తీకదీపం చూస్తుందని...

ఇక అక్కణ్ణుంచి కాసేపు ఆ కబుర్లవీ బేబీతో పాటు దొర్లాయి. కాసిన్ని కన్నీళ్లు ఉమ్మనీరుతో పాటు ఒలికాయి. 

పది నిమిషాల్లో లక్షణంగా ‘ఏడుస్తూ’ బుజ్జిదొకతి బయటపడింది. 

‘మొదటెవరు నీకు?’ అన్నాను ఫ్యామిలీ ప్లానింగ్ కోసం అకుంఠిత దీక్షతో పనిచేసే నిబద్ధతగల దేశపౌరుడిగా!

‘ఫష్టు పాప. దానిపేరు కార్తీక. ఉప్పుడెవరు?’ అంది నవ్వేసుకుంటూ.

‘ఎంచక్కా ఏడుస్తూ మళ్లీ పాపే. అచ్చం దీపే! ఇంకెందుకాలస్యం? ఆ పేరే పెట్టెయ్!’ అన్నాను ఏడ్చుకుంటూ!

........జగదీశ్ కొచ్చెర్లకోట

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive