Latest Posts

Content

Monday, August 3, 2020

అడ్డపొగ

‘ఏంపేరు?’ 

‘సూరమ్మ!’

‘పిల్లలెందరు?’

‘పుటకైతే ఆరుగురు. ముగ్గురు చెల్లిపోనారు. ముగ్గురున్నారు.’

చాలా క్యాజువల్ గా చెప్పింది సమాధానం.

‘ఎలా పోయారు పాపం? ’

‘అలగే! ఊష్టఁవొచ్చీ, టైపాడ్ మలేరియా వొచ్చీ!’

మావూళ్లో ‘టైఫాయిడ్ మలేరియా’ అనేది ఒక సింగిల్ ఎంటిటీ! ఎంతకీ తగ్గని జ్వరాలకి ముద్దుపేరది.

‘ఆయాసం ఉందా?’

‘సిన్న మబ్బేసిందనుకో, పిల్లికూతలెలిపొచ్చేస్తయ్! నిన్న సినుకట్టింది సూడూ, అప్పుడు కాణ్ణించి కొదిగ ఆవేసం సూపెడతంది.’

ఆయాసాన్ని ఆవేశం అంటారని కూడా తెలుసుకు తీరాలి. లేకపోతే అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది.

‘చుట్టాగిట్టా అలవాట్లేవైనా..?’

‘మానీసాను.’

‘ఎన్నాళ్లైంది?’

‘ఇక్కడకొచ్చినకాణ్ణించి మానీసాను!’

అడ్మిషన్ డేట్ చూశాను కేస్ షీట్ మీద. అయిదురోజులైంది హాస్పిటల్‌లో చేరి. అంటే మొన్నమొన్నటి వరకు కాలుస్తూనే ఉందన్నమాట.

‘అడ్డపొగేనా?’ అన్నాను పెన్ను పక్కనబడేసి.

తలొంచి కొంగు నోట్లో కుక్కుకుని ముసి‘ముసలి’ నవ్వు నవ్వింది.

‘అసలెలా అలవాటైంది నీకు?’

‘ఇంత గుంటగా ఉన్నప్పుట్నుంచీ అలవాటు సేస్సారు.’ అంటూ చేతిని దాదాపుగా నేలకి జస్ట్ మూడడుగుల ఎత్తుకి దించి చూపెట్టింది.

‘ఎవరు చేసింది?’

‘ఆళ్లూ ఈళ్లూ అన్లేదు బాబూ! ఊళ్లో అందరు గుంటలూ కాల్చీవోరు. ఆళ్లతోపాటే నానూ! ఇప్పుడు మానీసాను!’

‘ఏఁవిటి మానేసావు నీ తలకాయ్! ఏభయ్యేళ్లనించీ కాలుస్తూ ఐదురోజుల క్రితం మానేసానని గొప్పగా చెప్తున్నావు! ఏదిటు తిరుగు!’ అంటూ స్టెతస్కోప్ చెవుల్లో పెట్టుకుని ఊపిరి విన్నాను.

గాలి తీసుకుంటున్న ప్రతిసారీ అప్పడాలు చితుకుతున్నట్టు కరకరలు వినబడుతున్నాయి. గుండెల మీద ముతకాకుపచ్చ చీర ముసలి వాసనేస్తోంది. పక్కటెముకలకి పట్టుకున్న చర్మం, అక్కడక్కడ వాతల మచ్చలూ కనబడ్డాయి.

‘ఈ మచ్చలేంటి సూరమ్మా?’

‘సిన్నప్పుడు సురుసుర్లేస్తే కాల్చి వోతలెట్టినారు. అదలగుండిపోయింది.’

మీదుంపతెగా! ఇంతంత వాతలెలా భరిస్తారే తల్లీ?

‘సరే, నీకింకా ఈ ఊపిరితిత్తుల్లో కరకరలవీ తగ్గాలి. మందులు ఓ వారంపాటు వాడి, ఆనక మళ్లీ చూసి అప్పుడు చేద్దాం ఆపరేషన్. సరేనా?’

‘నువ్వెలగంటే అలగే! నానుండీదా ఇంటికెల్లొచ్చీదా?’

‘నీయిష్టం. వెళ్లి మందులవీ శ్రద్ధగా వాడేసి వస్తానంటే ఓ వారం తరవాత రా! లేదూ ఇక్కడే ఉండిపోతానన్నా ఉండొచ్చు.’

‘ఇక్కడే ఉంతాను బావూ! ఇంటికాడ ఇంత గెంజీ వొన్నం ఏసీవోళ్లు కూడా నేరు. ఇక్కడైతే ఆ నరుసులమ్మలు టయానికి మందులూ ఇత్తన్రు, ఆ బోయనం కూడా ఉంతాది. మీదయ!’ అంటూ చేతులెత్తి నమస్కరించింది.

‘ఏంచేస్తూ ఉంటావు నువ్వు? ’

‘పూలమ్ముతాను బావూ! రోజంతా తిరిగితే ఏబయ్యో అరవయ్యో వత్తయ్! అలగే మరి!’

‘మీ యజమానున్నాడా?’

‘ఆడికి మన ద్యాస నేదు. పోయిన సమత్సరం వోతఁవొచ్చి కాలూసెయ్యీ ఒగ్గీసినాయి. నేనట్టుకెల్లి ఇంత గెంజి పోస్తే తాగుతాడు. ఎటో సూత్తాడు. ఎర్రిమాలోకంనాగ!’

ఒక్క క్షణం కన్ను చెమర్చింది. ఎన్ని పువ్వులమ్మితే ఇద్దరికీ నోట్లోకి వేళ్లెళతాయి? 

‘కొడుకులు చూడరా?’

‘ఒక్కడే! ఆడికి పొలం రాస్సేక మా ఊసే నేదాడికి. వొగ్గీసెలిపోనాడు. ఆడి పెల్లం మాసెడ్డ గుంట! మమ్మల్ని రానీదు. ఏటి సేత్తాం? బతకాలిగందా? అందుకే ఇలా ఊరంతా తిరిగి పూలమ్ముతా ఉంటాను!’

‘కూతుళ్లో?’

‘ఇద్దరికీ పెల్లి చేస్సేం! ఆల సంసారాలాళ్లవి! ఉప్పుడా సిన్నగుంటనే ఇంటికాడుంచి ఎలిపొచ్చినాను!’

ఒక్క క్షణం మా బంధువుల్లో ఉన్న అరవై డెబ్భయ్యేళ్ల మహిళలందరూ కళ్లముందు తిరిగారు. ఎంత వ్యత్యాసమో కదా అనిపించింది.

ఎండనేది ఎరగకుండా చల్లగా వాళ్లు
అండనేదే లేకపోయినా ధైర్యంతో వీళ్లు

మూడులాంతర్ల దగ్గర సాయంత్రాలు కనబడే ముసలమ్మలు, రోజూ తెల్లారే బొంకులదిబ్బ మీద కూరలమ్మే మామ్మలు.. అందరూ మహిళలే!

ఎంత ధైర్యం వాళ్లకి? ఏ పోరాటాలూ వాళ్లని అంటవు. సమ్మెలు, బందులూ వారికోసమే చేస్తున్నా ఆరోజెలా గడుస్తుందోనన్న భయంతో అవేవీ పట్టనట్టే ఉంటారు. 

మనం రాసే రాతలు, కూసే కూతలు తెలియని జీవితాలు. చిన్న చుట్టముక్కిచ్చే ఆనందం ముందు రోజంతా పడే కష్టం ఆ చుట్టపీక కన్నా చిన్నదిలా తోస్తుంది వాళ్లకి.

ఎటువంటి అడ్డగోలు పనులూ చెయ్యకుండా, ఎవరి బతుకులోనూ పొగబెట్టకుండా, ఏ ఒక్కరినీ కాల్చుకుతినకుండా తన అడ్డపొగేదో తను కాల్చుకుంటోంది.

అదే ఆ గాజుగోళాల్లాంటి క్యాటరాక్ట్ కళ్లని సైతం అరమోడ్పుల్ని చేసేంత మత్తునిస్తుంది. మానెయ్యమనడానికి నేనెవరిని?

అంతకుమించిన ఆనందాన్ని ఒకవేళ ఇవ్వగలిగితే అప్పుడు ఇవ్వాలి తనకి సలహా!

........కొచ్చెర్లకోట జగదీశ్

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive