కవితా దినోత్సవం అనేదో అంటున్నారు... కాసుకోండి!
భార్యకొక లేఖ
*************
సాయంకాలాలు కూడా సాయం చేస్తూనే గడిపేస్తావా?
బడి వదిలే క్షణాలకోసం గోడ గడియారమైపోతావా?
తల్లి కనబడగానే పిల్లల తిను‘బండారం’ బయటపడుతుంది
మాగీ కోసం యాగీ చేస్తూ మాట నెగ్గించుకోడం బాధపెడుతుంది
గ్లాసుల నిండా కాంప్లాన్లూ
క్లాసు పిల్లల మీద కంప్లైంట్లూ
నీ సాయంత్రాల్ని వేడెక్కించేస్తాయి
నీకు తెలుసా?
ఎన్నో సంధ్యలు నీ నవ్వు చూడకుండానే వెళిపోతున్నాయి
వివాహమవుతూనే విధులన్నీ ఆవాహన అయిపోతాయి
పిట్టల్ని చూస్తూ గడిపిన పిట్టగోడలూ
నీ కనుబొమ్మల మధ్య సూర్యాస్తమయాలూ
భావాన్ని పలికించలేక ఉండలైన ఎన్నో కాయితాలు
వీటిమధ్య ధీటుగా నిలిచిన నీదైన శైలిలో ఉత్తరాలు
ఏమైపోతాయవన్నీ? నీ మెదడులోంచి
రసమయమైన చిప్ తీసేసి
రసమూ సాంబార్ల చిప్ పెట్టేస్తాడా దేవుడు?
మాటవిని ఈ సాయంత్రం నాకోసం రా
‘మాటే మంత్రమూ’ పాట మళ్లీ విందాం
అటుచూడు పశ్చిమానికి పచ్చికారం రంగంటుకుంది
పూర్వకాలంలో ఏమనేవాణ్ణీ...
నీవంటి పిల్ల ఏలోకానా ఉండబోదనీ
నీ ఒంటి పరిమళం వదలనివ్వదనీ..
ఇప్పుడుచూసావా,
నీ వంటింటి పోలికలే నా కలాన కూడానూ!
తారలెందుకలా మెరుస్తాయో తెలుసా?
చందమామ తన పక్కనున్నాడని...
నీ సాంగత్యంలో
నా ముఖానా అదే తళుకు!
ఒడిలో పడుకుంటే నా రక్తం వడి తెలిసే తీరుతుంది నీకు
జడంటే నాకిష్టమన్నానని దిట్టంగా అల్లుకు రాకు
చంద్రబింబాన్ని కప్పుకోడానికి కురులే కదా కొబ్బరాకు!
ఆగీ ఆగీ వీస్తున్న వింతగాలి చెబుతోంది
ఇది భాద్రపదమని!
ఆర్టీసీ బస్సులాంటివాణ్ణి చెబుతున్నా
నాతో వుంటే సుఖం, సురక్షితం, శుభప్రదమని!

0 comments:
Post a Comment