‘అమ్మా, నా తెల్లచీరేదీ?’ అంటూ చిటారుకొమ్మ మీదనుంచి ఒక్క అరుపరిచింది శాకిని.
‘బాగా వాసనేస్తోందని ఉతికి ఆ మోహినీ వాళ్లింటెదురుగా ఉన్న చింతచెట్టు మీద ఆరేశాను. ఈపాటికి ఆరిపోయే ఉంటుంది. వెళ్లి తెచ్చుకో. లేకపోతే ఈ ఒక్కరోజుకీ నల్లచీర కట్టుకునెళ్లవే! ఓ సతాయిస్తున్నావు!’ అంటూ విసుక్కుంది ఢాకినమ్మగారు.
‘అమ్మా! ఆ మోహిని ఇందాక స్మశానం దగ్గర కనబడింది. ఇదేంట్రా నా చీరలానే ఉందీ అనుకున్నాను. అయితే అది నాదేనన్నమాట! నీకసలు బుద్ధిలేదు. ఇక్కడ ఇన్ని చెట్లుండగా దాన్ని తీసుకెళ్లి అక్కడెందుకారేశావు?’
’అసలు నువ్వివాళ బయటికెళ్లకు. మన ప్రాణానికి ఇవాళ గుళ్లో ఏదో భజనలూ అవీ పెట్టారు. నామాట విని హాయిగా నీకిష్టఁవైన దెయ్యంపాటలు పెట్టుకుని వింటూ కూర్చో!’
‘ఇంకా నయం. ఇవాళ రామ్ గోపాల్ వర్మ ‘దెయ్యం’ సినిమాకి నేను, నా ఫ్రెండ్స్ రుధిర, కర్కోట, కర్కశా కలిసి సెకండ్ షోకెళ్లాలని ప్లాన్ చేసుకున్నాం. కర్కశా వాళ్ల బాబాయ్ మరీమరీ చెప్పాడు చూడమని!’
‘నీ బొంద! నిన్నరాత్రి మీ నాన్న ఆ మెలొడీ హాల్లో ప్రొజెక్టర్ కి చుట్టుకుని చూసొచ్చార్ట. పిచ్చ భయమేసేసిందిట! మధ్యలోనే వచ్చేసి మర్రిచెట్టు తొర్రలో దూరిపోయి వణికిపోతున్నారు. ఓరాత్రప్పుడు నే వెళ్లి చూద్దునుకదా... మనింటా వంటా ఎరగం అసలు, హవ్వ! ఆంజనేయ దండకం చదువుకుంటున్నారు. ఖర్మ! అంతలా భయపెట్టి చస్తాడు ఆ మిడిగుడ్లోడు. మీరు వెళ్లారంటే వారందాకా చెట్టు దిగరు చెప్తున్నాను. ఆనక మీయిష్టం.’
‘అవునా, మరి వాళ్లకెలా చెప్పేది నేను రావట్లేదని?’ అంటూ నిరాశగా అడుగుతున్న కూతుర్ని జాలిగా చూసింది ఢాకినమ్మగారు.
‘రేపు మనిద్దరం జగన్మోహిని సినిమా మళ్ళీ చూద్దాంలే! అదయితే బావుంటుంది. కాసేపలా నవ్వుకోవచ్చు.’ అంటూ ఊరుకోబెట్టింది.
‘ఏంచేస్తున్నారు తల్లీకూతుళ్లిద్దరూ?’ అంటూ గుమ్మంలో ఎగురుతూ గాల్లో నిలబడ్డాడు నిశాచరంగారు.
‘ఆఁ, నిన్న రాత్రి మీరు చేసిన నిర్వాకం గురించి చెప్తున్నాను. సిగ్గులేకపోతే సరి. అంత ధైర్యం లేకపోతే ఎలాండీ?’ అంది నవ్వుతూ.
ఈలోగా చిటారుకొమ్మ మీంచి ‘నిను వీడని నీడను నేనే!’ పాట సన్నగా వినబడింది. దాంతో కొయ్యబారిపోయాడు నిశాచరంగారు.
‘దాన్ని ఆపాట పెట్టొద్దని చెప్పవే బాబూ! హడిలి చస్తున్నాను భయంతో. అయినా రాత్రి తొమ్మిదవుతోంది. ఇదింకా ఇంట్లోనే తగలడిందేం? ఆడదెయ్యం తిరక్క చెడిందని సామెత. ముందు దాన్ని బయటికి పొమ్మను. వెధవపాటలూ అదీను!’ అనన్నాడో లేదో..
‘ఓ...నా రాజా! రావా రావా!’ పాట మొదలైంది.
‘ఇదివాళ మన ప్రాణాలు తోడెయ్యడానికే ఇంట్లో ఉన్నట్టుంది!’ అంటూ వణకడం మొదలెట్టాడు.
‘ఏవండీ! ఆ చింతచెట్టు మీదుండే చింతామణికి ఎంత పొగరనుకున్నారు? మొన్న అమావాస్య రోజు మనింట్లో భోజనానికి రమ్మంటే రానంది. వాళ్లబ్బాయి ఆ మంత్రాల మర్రిచెట్టు సినిమాలో నటించినప్పట్నుంచి ఆవిడగారి మిడిసిపాటు అంతా ఇంతా కాదు. అయినా నాదే బుద్ధితక్కువలెండి! అది శుక్రవారం నాడు, పైగా పదమూడో తారీకున పోయి దెయ్యమైంది. ఆమాత్రం గర్వం ఉండదా ఏం?’ చెప్పుకుంటూ పోతోంది ఢాకినమ్మ.
‘అబ్బబ్బ! ఆపవే నీ గోల! అలా అందర్నీ ఇళ్లకు పిలవద్దూ శుభం కాదని చెప్పానా? నువ్వు పెట్టే ఆ నెత్తుటికూడు కోసం ఎవరూ రారు. మనిల్లు చూద్దామని, ఆనక మనఁవలా బయటికెప్పుడైనా వెళ్లగానే ఈ చెట్టు మీదకొచ్చి వాలిపోవాలనీ వాళ్ల దురాశ. ఇది వెయ్యేళ్లనాటి మర్రిచెట్టు. తెలుసునా నీకు?
ఎన్నో ఏళ్లనుంచి ఈ చెట్టుకింద బొబ్బిలి బ్రహ్మన్నలు, పెదరాయుళ్లూ బోల్డన్ని తీర్పులూ గట్రా చెప్పారు. అసలెన్ని దెయ్యం సినిమాల షూటింగులయ్యాయో తెలుసా ఈ చెట్టుకింద?’ అంటూ చెప్పుకుపోతున్నాడు నిశాచరం.
ఈలోగా బయట ‘క్రూర’ అరుపు వినబడింది. ఎవరో వచ్చినట్టున్నారు.
‘క్రూరా! బీ సైలెంట్! షటప్ ఐసే!’ అంటూ అరిచింది శాకిని. దెబ్బకి నోరు మూసేసింది వాళ్ల పెంపుడు తోడేలు.
‘నిశాచరంగారూ!’ అని బయటనుంచి పిలుపు వినడంతో పక్క కొమ్మమీదకొచ్చి చూశాడు.
భయంకరం వచ్చాడు.
అతను ఆ వీధి చివరుండే తుమ్మచెట్టు మీదుంటాడు. ఈమధ్యే ఓ రాత్రప్పుడు పరిచయమయ్యాడు.
‘ఆ రావోయ్ రా! ఏవిటి విశేషాలు?’ అంటూ వచ్చి అలసటగా తోకనలా కాసేపు వాల్చాడు.
‘ఏంలేదండీ, ఇప్పుడే బయటికొచ్చాను. మీయింట్లోంచి మన భక్తిగీతాలేవో వినబడితే ఇటొచ్చా! ఎవరూ పాటపాడేది?’ అన్నాడు తనుకూడా ఇంకో కొమ్మ మీద పడుకుంటూ.
‘ఉందిలెండి నాప్రాణానికి. మా అమ్మాయి శాకిని. అయినా ఈకాలం పిశాచాలకి అస్సలు అల్లరంటే తెలీదండీ! మన చిన్నతనాల్లో ఎంచక్కా రాత్రయిందంటే చాలు ఊరు ఊరంతా భయపడి చచ్చేలా అరిచి గోలచేస్తుండేవాళ్లం. వీళ్లెంతసేపూ కొమ్మదిగి రారసలు. అప్పట్లో మా తాతగారుండే చెట్టు పేద్ద మహావృక్షం. దాదాపు వందడుగుల మేర ఊడలవీ దిగిపోయి అదే పెద్ద దెయ్యంలా ఉండేది.
కింద పదిపదిహేను నక్కల్ని పెంచుతుండేవారు పాలేరు దెయ్యాలు. వాటిని రోజూ రాత్రిపూట అలా ఊరి చివరదాకా వాకింగ్ కి తీసుకెళ్లకపోతే ఊరుకునేవి కావు. అబ్బో, అదో వైభవం! అవునూ, మీకా పాటలవీ నచ్చుతాయా? భయం వెయ్యదూ?’ ఆశ్చర్యంగా అడిగాడు నిశాచరం.
‘అదా? నా చిన్నతనాల్లో మా తాతగారు బోల్డన్ని కథలు చెప్పేవారు. అవన్నీ ఎంతో ధైర్యాన్నిచ్చేవి. అసలు మన వంశమేవిటీ, మనుషుల్ని ఎలా భయపెట్టేవాళ్లం అంటూ చాలా విషయాలే చెప్తూండేవారు. పొద్దున్న లేచిందగ్గర్నుంచీ మాయింట్లో అన్నీ ఇవే పాటలు!’ అంటూ నవ్వేశాడు భయంకరం.
‘మీ తాతగారెవరండీ? వారి పేరు?’
‘కాష్మోరాగారనీ.. చాలా పెద్ద పేరు గడించారు!’
అతను కాష్మోరా మనవడని తెలియగానే అంతవరకూ కొమ్మమీద విలాసంగా చాపుకున్న తోకని ఒక్కక్షణం గౌరవంగా కిందకి దించేశాడు నిశాచరం.
‘మీరు కాష్మోరాగారి మనవడా? చెప్పారుకారు?’
‘ఇప్పుడు చెబుతున్నాగా? అయినా ‘మా తాతలు నెత్తురు తాగారు, మా మూతులు వాసన చూడండ’ని సామెత! ఇప్పుడా వైభవం ఎక్కడండీ? ఆయనతోనే పోయింది అదంతా! ఆయన గురించి చాలా పుస్తకాలు కూడా వచ్చాయి. మీకు తెలుసా?’
‘ఆఁ ఆఁ! విన్నాను. అవన్నీ చదువుతోంటే ఒక్కొక్కడికీ తడిసిపోయేవిట! ఇప్పుడసలు దెయ్యాలంటే బొత్తిగా భయం లేకండా పోయిందిస్మండీ? వేళాకోళాలు మొదలయ్యాయి. కామెడీ దెయ్యాలుట! వాళ్ల బూడిద, వాళ్ల బూడిదానీ!’ అంటూ ఆవేశంగా చెబుతూండగా పైనుంచి ‘రాజా! పిలుపు నాదేనురా!’ అంటూ పాట వినబడింది. దెబ్బకి కొమ్మ మీంచి కింద పడిపోయాడు నిశాచరం.
అదిచూసి భయంకరంగారు ఒకటే నవ్వు.
‘మరి మీలాంటి వాళ్లని చూస్తే కామెడీ దెయ్యాలే గుర్తొస్తాయి. రండి, వచ్చిలా కూర్చోండి!’
‘నావల్ల కాదండీ బాబూ! దీన్తరవాత నందికొండ వాగుల్లో పాటా, ఆ తరవాత ఆ పాటేదీ, ఆఁ.. ‘దూరాకాశ వీధుల్లో తారాదీపాలూ..అంటూ మరోటీ పెట్టి చంపుతుంది. పదండి అలా స్మశానందాకా వెళ్లొద్దాం. ఇక్కడికన్నా అక్కడే నయం!’ అంటూ చెట్టు దిగారిద్దరూ.
‘బయటికెళుతున్నారా? వచ్చేటప్పుడు ఓ రెండు పుర్రెలు పట్రండి. పాతవి చిల్లులు పడిపోయాయి!’ అంటూ బయటికొచ్చింది ఢాకినమ్మ.
‘అలాగే! దాన్ని కాసేపలా బయట తిరిగి రమ్మను. కొక్కిరాయి వెధవలైనా కాస్త భయపడతారు దీన్ని చూసి. పాపం, ఆడపిల్లల్ని వేధించుకు తింటున్నార్ట!’ అంటూ బయల్దేరాడు.
అలా రెండు చెట్లు దాటారో లేదో వాళ్లెదురుగా ఓ తోడేళ్ల బండొచ్చి ఆగింది. అందులోంచి తల బయటికిపెట్టి పోలీస్ దెయ్యం అడిగాడు
‘ఎవర్రా మీరు? ఇంత పెందరాళే బయల్దేరారూ ఊరుమీదకి? ఇంకా పన్నెండయినా అవ్వలేదు?’
‘మేం ఈ పక్క చెట్టుమీద వాళ్లమేలెండి. మా అమ్మాయి గోల భరించలేక ఇలా కాసేపు ప్రశాంతంగా నక్కల ఊళలవీ విందామని స్మశానానికి బయల్దేరాం. తెల్లారేలోగా వెళిపోతాం!’
‘సర్సరే! ఇంకెప్పుడూ రాత్రి పన్నెండవకుండా రోడ్లమీద కనబడకండి. తెల్లారేలోగా కొంపకి చేరండి. పోనీరా బండి!’ అంటూ ముందుకి పోనిచ్చాడు.

0 comments:
Post a Comment