Latest Posts

Content

Monday, August 3, 2020

రామునివారము

పూజలే చేశారో, పాయసాలే తాగారో... 
ఒక్క నలుసైనా చాలనుకుంటే నలుగురుద్భవించారు.

కన్నులపంటల్ని పండించుకోవడమే సరిపోయింది ఆ రాజుకీ, మువ్వురు రాణులకీ!

గా అంటే గా, గీ అంటే గీ! లేకుంటే యాగీ. అసలే యాగఫలమాయె!

ఆకసాన చంద్రబింబాన్ని చూసి అద్దానినే తెచ్చివ్వమంటే అద్దాన్ని తెచ్చి మాయచేశాడు మంత్రివర్యుడు. 

క్షాత్రధర్మమూ, జ్ఞానసముపార్జనా యధావిధిగా పరిపూర్ణమైన వేళ 
నేర్చిన చదువులకు నెలవారీ పరీక్షలు పెట్టాడు ఆ రాజర్షి! 

మానవులకు దుస్సాధ్యమే తప్ప అసాధ్యముండదని నిరూపించారు వారిద్దరూ!

శివుని విల్లే విరిచాడో, విల్లంటి కనుబొమలు చూసి లోకమే మరిచాడో... జానకి మదిలో బాణాలు నాటాడు.

సకల సౌఖ్యాలకూ ఆలవాలమైన రాజప్రాసాదాలలో...

అడుగుపెట్టిన చోట కుసుమాలు
అడుగడుగునా నమస్సుమాలు

పడుకునేవేళకు పట్టుపరుపులు
పరిమళ గంధాల మైమరపులు

సుదతితో తీరికగా సింగారాలు
సుమనోహరమైన శృంగారాలు

జీవితమే సఫలమంటూ సాగిపోయేవేళ 
పినతల్లే పెనుముప్పుగా మారింది!

కాదనలేని కన్నతండ్రి. ఎదురైనా పలకని సీతాసాధ్వి. 

పట్టువస్త్రాలు కాస్తా కట్టుబట్టలయ్యాయి. 
పట్టుబట్టి మరీ తమ్ముడు తోడయ్యాడు.

అంతఃపురాన అలసటన్నదే ఎరుగని వైనం కాస్తా
అడవిలో పదునాలుగేండ్ల పరుగుగా మారింది

దేశదేశాలలో దొరికే ఫలజాతులన్నీ చేతికందేలా అక్కడ
దేశద్రిమ్మరులై దొరికిన ఫలాలతో పొట్టనింపుతూ ఇక్కడ

ఎందుకలా?

ఒక సిద్ధాంతం. 
ఒకరి మాటను నెగ్గించడం కోసం. 
ఒకరి వాక్కును ప్రేమతో గౌరవించడం కోసం... 
అన్నిటినీ మించి....

లోక కల్యాణార్ధమై అవతార పరమార్ధాన్ని పరిపూర్తి చేయడం కోసం!

ఏ దేశాలనేలే రాజైనా, బంటైనా మానవుడన్నవాడు కష్టమొస్తే ఎలా నిలవాలో నిలిచి చూపించాడు.

సుదీర్ఘమైన గడువు పూర్తయేవరకు వెనుదిరిగి చూడనంత దీక్ష. 

ఇది కథగానో, కల్పనగానో ఏ విధంగానైనా తీసుకోండి.

ఏ మందర కన్ను కుట్టిందో మనమందరమూ కైకరోనా బారిన పడిన రాములమయ్యాము!

మీట నొక్కితే చాలు ఎదురుగా నిలిచే ఆహారాలు
ఆటపాటలతో కాలక్షేపాలు చేసే వారాంతాలు

పచ్చని ప్రకృతిలో పరవశించి పాడుకునే పాటలు
వెచ్చని చలిమంటల చుట్టూ విందూ వినోదాలు

అన్నీ మాయమైపోయాయి. 

ఉన్నదానిని ఉపయోగించడమెలాగో నేర్చాం
లేనిదానికోసం నిరర్ధకమైన పరుగును మరిచాం

లాలస రహితంగా జీవించే విధానాన్ని నేర్పాం
విలాసాలన్నిటినీ వాయిదా వెయ్యమని చెప్పాం

ఇన్నాళ్లూ రూపాయలే పాపాయిలుగా పెంచుకున్నాం
ఈనాడు ఆపన్నహస్తాలతో అన్నాన్ని పంచుకున్నాం

ఇంట పట్టుమని పదినిమిషాలైనా ఉండనివారం
ఇంటిపట్టునే ఉండడంలో సౌఖ్యాన్ని చవిచూశాం

మన సంసారనావను దాటించే భార్యలో గుహుణ్ణీ
మమకారంతో వండివడ్డించే తల్లిలో శబరినీ చూశాం

కన్నతండ్రి మాటకోసమై
కాననములందు తిరిగిన
కరుణా సముద్రుడతడు

విశ్వమానవ శ్రేయస్సుకై
వీధులందు తిరగబోమని
విజ్ఞతను చూపింది మనము

నాడు పదిమందీ కలిసి చేశాము రామ కల్యాణం
నేడు పదిమందీ కలవకపోవడమే లోక కల్యాణం

రామునివారము! మనకేమి విచారము!!

.........కొచ్చెర్లకోట జగదీశ్

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive