Latest Posts

Content

Monday, August 3, 2020

కావ్యం ‘వై’రసాత్మకం

‘అలారం అయిదూ ఏభైకి పెట్టు. సరిగ్గా ఆరింటికి కుళాయి వదుల్తాడు వాచ్ మన్. ఇంకో ఫోన్లో కూడా పెట్టు. ఒకటి వినబడకపోయినా ఇంకొకటి వినబడుతుంది.’ 

నిద్రపోయేముందు ఇటువంటి భద్రతాపరమైన హెచ్చరికలు మనకి మామూలే! లేకపోతే తెల్లారే నీళ్లుండవు. నిప్పులే!

ఏం వచ్చినా రాకపోయినా మాకు ఎండాకాలం, నీళ్లు ఎండేకాలం త్వరగా వచ్చేస్తాయి. అపార్ట్‌మెంట్లలోను, అడవిలోను జీవించడానికి ఒక ప్రోటోకాలుంటుంది. వలయు పదార్ధములు, తగుజాగ్రత్తలు, అప్రమత్తత... ఇవన్నీ అందులో భాగాలు.

అలారం పెట్టేశాక ఫోన్ పక్కనబడేసి శానిటైజర్తో చేతులు కడుక్కుని ఆ చేతుల్ని గుండెలమీద నిశ్చింతగా వేసుకుని ‘హమ్మయ్య, నేనెంత స్వచ్ఛంగా ఉన్నానో?’ అనుకుంటూ తృప్తిగా నిద్రపోయాను. 

ఆరింటికి అలారం రెండోసారి గోలెట్టాక లేచి బాత్రూములోకొచ్చి నిలబడ్డాను. నీళ్లెంతకీ వదలడే? వీడికివాళ కోటింగివ్వాలి. ఆరుంపావుకి కుళాయిలోంచి నేనామధ్య కొత్తగా ఫ్లూట్ నేర్చుకుంటున్న రోజుల్లో ఊదినట్టు హృదయవిదారకమైన సౌండొచ్చింది. కాసేపటికి డైనోసార్ దగ్గుతున్నట్టు ఓ నాలుగు ముక్కులు ముక్కి ఆనక జలజలా నీళ్లొచ్చాయి. గబగబా నీళ్ల డ్రమ్ములన్నీ నింపేసి మళ్లీ వచ్చి పడుకున్నాను. 

తిరిగి నేను లేచేటప్పటికి ఏడున్నరయింది. ఇదివరకు లేచీలేవగానే మొబైల్లో వాల్ పేపర్ ఏ దేవుడి ఫొటోనో ఉండేది. అది చూసేవాళ్లం. ఇప్పుడు ఎదురుగా చంటిపిల్లాళ్లా శానిటైజర్ బాటిలుంటోంది. దానికో దణ్ణం పెట్టుకుని మొబైల్ అందుకున్నాను.

వెంటనే కళ్లు నులుముకుని, ఫోన్లో కోవిడ్ వెబ్‌సైట్ ఓపెన్ చెయ్యడం, ‘ఇవాళెన్ని’ అని చూడటం అయ్యాయి. 

‘ఇదిగో, ఇండియా పదివేలుట! ఇప్పుడే చూశా!’ అంటూ కిచెన్లోకొచ్చాను.

‘పదివేలంటే గుర్తొచ్చింది. ఓ ఐదువేలివ్వు. వాచ్ మన్ ఇప్పటికే మూడుసార్లు వచ్చెళ్లాడు మెయింటినెన్స్ ఇవ్వమని!’ అంది కొత్తిమీర కట్టలు ఫ్రిజ్ లోంచి తీస్తూ.

వంటిల్లంతా ఘుమఘుమలాడిపోయింది ఒక్కసారిగా.

‘చారు పెడుతున్నావా?’ కొత్తిమీర పరిమళా‌న్ని దీర్ఘంగా ఆఘ్రాణిస్తూ అన్నానోలేదో

‘టాపిక్ డైవర్ట్ చేస్తే మర్చిపోతాను. ముందు డబ్బులిచ్చి మరీ కదులు.’ అంది ఆఫ్ఘనిస్థాన్ వారి ఆడపడుచులా.

సరేనంటూ ఆరుబయట బాల్కనీలోకి వెళ్తోంటే ‘అటెక్కడికి, నీకింకా నిద్రమత్తు వదల్లేదా?’ అంది ఆశ్చర్యంగా.

‘నీకు తెలీదా? నోట్లని కూడా ఎండబెట్టి ఆనక పాంట్ జేబులో పెడుతున్నాను. బయటేవున్నాయి!’ అన్నాను

‘అవునా, ఈ విషయం తెలీదే నాకు?’

‘తెలిసినా అవి నువ్వు ముట్టుకోకూడదు. కరోనాసొమ్ము కోబ్రావంటిది.
అవి కరెన్సీ నోట్లు కాదు. కరోన్సీ నోట్లు.’ అంటూ బెదిరించాను.

’నీతలకాయ్. ఓ పదివేలు నొక్కేసి, తరవాత సబ్బుతో ఇరవై సెకండ్లపాటు చేతులు రుద్దేసుకుంటే అది పవిత్రమైన సంపాదనగా మారిపోతుందిట. మొన్న నాగేశ్వరరెడ్డి గారు, గురవారెడ్డి గారు చెప్పారు టీవీలో!’ అంది ‘నాక్కూడా తెలుసులేవోయ్’ అన్నట్టు చూస్తూ!

వీళ్లొకరు, నా ప్రాణానికి. 

సరే, దినఫలాల్లో ‘ధనవ్యయం’ అని...
‘కావలసినవారే దోచుకుంటార’నీ.... రాసి ఉంటే ఏంచెయ్యగలం? డబ్బులిచ్చేసి స్నానాదుల కోసం బాత్రూములో దూరాను. ఇదివరకటికన్నా చాదస్తంగా రుద్దుకుంటూ మైసూర్ శాండల్ గోల్డ్ రౌండుని అర్ధరూపాయంత చేసేశాను.

గదిలోకొచ్చాక డియోకి బదులు అలవాట్లో పొరపాటుగా శానిటైజర్ తీసి ఒళ్లంతా కొట్టేసుకోబోయాను. అలాచేస్తే ఈ జన్మకే కాదు, ఏడెనిమిది జన్మలదాకా ఏ కరోనాలూ నా దరిదాపులకి రావేమో?

టిఫినేఁవిటో? డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే పళ్లెంలో రెండు బరువైన పదార్ధాలొచ్చి పడ్డాయి. 

‘ఏంటివి?’ అన్నాను వాటివంక ఏవో గ్రహశకలాల్ని చూసినట్టు చూస్తూ.

‘మనం ఈవూరొచ్చిన కొత్తలో మంథావారింట్లో అద్దెకుండేవాళ్లం కదా, ఆ ఆంటీ చేసేవారు గుర్తుందా, అటుకుల అట్లు. నీకు విపరీతంగా నచ్చాయని ఒకసారి చెప్తే, ప్రత్యేకంగా ప్రతీవారం చేసి పంపేవారావిడ. అవి ట్రై చేసాను. ఎలావున్నాయో చూసి చెప్పు!’ 

ప్రతి కష్టం వెనుకా ఓ కన్నీటి కథ ఉంటుంది. ఇంత చరిత్ర కలిగిన ఆ అటుకుల దోశలు ఒళ్లంతా చిల్లులతో భలే మెత్తగా రుచిగా ఉండేవి. నాకింకా ఆ రుచి జ్ఞాపకం ఉంది.

కానీ ఇవేఁవిటో బాగా బలంగా ఉన్నాయి. ‘తినకపోతే తంతాం’ అన్నట్టు చూస్తున్నాయి నావైపు. సరే, అల్లప్పచ్చడి జోడిస్తే హాలాహలం కూడా హలం డ్యాన్సులా ఆస్వాదించెయ్యొచ్చు. 

చూడ్డానికలా ఉన్నాయి కానీ అవి చాలా రుచిగా ఉన్నాయి. మళ్లీ ఇంకో రెండు వెయ్యమని అడిగిమరీ తిన్నాను.

‘ఇంతకీ వీటికి పేరేం పెట్టావు?’ అన్నాను మెచ్చుకోలుగా చూస్తూ.

‘నువ్వే చెప్పు. బావున్నాయన్నావుగా?’ అంది మురిసిపోతూ.

‘అటుకుల బొంత!’ 

అలా అన్నానో లేదో ముందు సింకైపోయి సింకులో గిన్నెలు  విసిరేసిందే మళ్లీ సిట్యువేషన్ సింకవ్వట్లేదని నాతోపాటు నవ్వేసింది.

టిఫిన్ చేస్తూ ఇద్దరం ఎంచక్కా బోల్డు కబుర్లు చెప్పుకున్నాం.

....ఈ కరోనా వైరస్ స్టీల్ మీద ఎంతసేపుంటుంది, 

....ప్లాస్టిక్ మీదకంటే పేపర్ మీద తక్కువగా ఉంటుందిట కదా, 

....కూరలన్నీ వేణ్ణీళ్లలో పడేస్తున్నావా లేదా, 

....ఆఫీసులో మీకక్కడ సబ్బుందా, 

....మీ హాస్పిటల్లో ఎవరికైనా ఈ జబ్బుందా...

ఇలా చాలాసేపు మాటాడేసుకున్నాక బయల్దేరి, కింద కారు దగ్గరకొచ్చాను.

హేండిల్ మీద పన్నీరు చిలకరించి తలుపు తెరిచి కూర్చుని బయల్దేరాను. కార్ స్టీరియోలో బాలు పాడుతున్నాడు...

‘ఎదురే నాకులేదు, నన్నెవరూ ఆపలేరు..’

కానీ స్టేట్ బ్యాంక్ దగ్గరకు రాగానే పోలీసులు ఆపారు. 

‘ఎవర్సార్ మీరు?’ అని అడగ్గానే ‘కొండవీటి దొంగ’ అనబోయా!  

వెంటనే నాలుక్కరచుకుని మళ్ళీ ఈ కరోనాకి నాలుక్కరుచుకోవడం ఇష్టమో కాదో అని అనుమానించి మధ్యలోనే మానేశాను.

కారు అద్దానికంటించి ఉన్న డాక్టర్ స్టిక్కర్ చూసి లెంపలేసుకుని, రెండు గుంజీల్తీసి ‘సారీ సర్, ఎళిపోండి సార్!’ అని పంపించేశారు. 

రోడ్లన్నీ సిఎం కాన్వాయ్ కోసం ఖాళీ చేసేసినట్టు బోసిగా నవ్వుతూ కనబడుతున్నాయి. ఈవూరొచ్చిన ఇరవయ్యేళ్లకి మెయిన్‌రోడ్డు మీద ఫోర్త్ గేర్లో వెళ్తోంటే తెలియకుండానే ఒకరకమైన భావోద్వేగంతో కళ్లమ్మట నీళ్లొచ్చేసాయి. 

ఏఁవిటో, నాపేరసలు ‘అల్పసంతోష్ కుమార’ని పెట్టుండాల్సింది నాన్నగారు. ఇలా చిన్నచిన్న ఆనందాలకే ఉద్వేగపడిపోతుంటాను.

హాస్పిటల్ గేటు దగ్గర ఇద్దరు సెక్యూరిటీ వాళ్లు వాఘా బోర్డర్లో భారత్ పాకిస్తాన్ సైనికుల్లా దూరదూరంగా నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. పేషెంట్ల బంధువుల తాకిడి పెద్దగా లేకపోవడంతో వాళ్లు కాస్త మంచీ, చెడూ మాటాడుకుంటున్నారు.

‘పద్మనాభం మండలంలో ఒకడు పోయాడంట్రా నీకు తెలుసా?’

‘ఆడీమజ్జే దుబాయ్ నించి వచ్చేడంట్రా!’ 

ఇవే కబుర్లు. 

లోపలికెళ్లి అటెండెన్స్ రిజిస్టర్లో ‘జెకె’ అని గీకేసి, పక్కనే ఉన్న అభిషేకజలంతో ‘హస్తం ప్రక్షాళయామి’ అనిపించుకుని మా సామ్రాజ్యంలో అడుగెట్టాను. 

పదిపదిహేనుమంది అమ్మాయిలు పెద్దపెద్ద పొట్టలేసుకుని, రుమాళ్లు, పైటకొంగులు, మాస్కులు కట్టుకుని వరసగా కూర్చున్నారు. ఇంకొందరైతే పూలపక్కల్లో పురిటికందుల్ని పట్టుక్కూచున్నారు. ఆ వెధవలందరూ నుదుటనొకటీ, బుగ్గనొకటీ అక్కుళ్లతో పెట్టిన బొట్లేసుకుని, వేళ్లు నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ చోద్యం చూస్తున్నారు. 

పక్కన రెండుమూడేళ్ల వయసున్న ఆడపిల్లలు రెండుజళ్లతోను, మగపిల్లలు డిప్పల్తోనూ వాళ్లమ్మల్ని సలపాదిస్తున్నారు. ఆ టిక్కెట్లన్నీ మా హాస్పిటల్లో పుట్టినవే.  మొదటి కాన్పులన్నమాట.

ఒక పిల్లాడి చేతిలో మిరిండా బాటిలు, కుర్కురే పేకెట్టూ ఉన్నాయి. వాడవన్నీ భూదేవితో కలిసి సరిసమానంగా పంచుకుతింటున్నాడు. అవన్నీ చూస్తూ నడుస్తాను రోజూ. ఆ వయసు పిల్లల్ని చూస్తే చాలు, ఎక్కళ్లేని ఉత్సాహమూ వచ్చేస్తుంది.

ఈలోగా ఓటీ కుర్రాడొచ్చి పదకొండు ఆపరేషన్ కేసులున్నాయని చెప్పాడు. ప్రపంచమంతా పంచెలు కట్టుకు పడుకున్నా మా హాస్పిటల్లో మాత్రం పుంజీలకొద్దీ పేషెంట్లుంటారు. నూటముప్ఫై కోట్లలో ఓ ముప్ఫైకోట్లు మా కంట్రిబ్యూషనే ఉంటుంది. 

డ్రెస్ మార్చేసి, కళ్లొక్కటీ కనబడేలా గుడ్డలు కట్టుకుని ఈజిప్షియన్ మమ్మీలా గదిలోంచి బయటకొచ్చాను!

మావాళ్లందరూ కూడా మాస్కులవీ కట్టుకుని అటూఇటూ హడావుడిగా తిరిగేస్తున్నారు. అందరం కలిసి దాదాపు నలభైమంది దొంగల్లా ఉన్నాం. విష్ చేసినవాళ్లనే మళ్లీ మళ్లీ విష్ చేసేస్తున్నాం. ఓటీ డ్రెస్సుల్లో ఉన్న నర్సుల్ని డాక్టర్లనుకుంటున్నాం, డాక్టర్లని ఎవరో అనుకుని పక్కనించి వెళిపోతున్నాం. ఇంతకంటే సామాజికదూరం ఇంకేం ఉంటుంది? 

వరసగా అయిపోతున్నాయి ఆపరేషన్లన్నీ. ‘పిల్లల్ని అప్పజెప్పేటప్పుడు జాగర్తర్రా, ఈ మాస్కుల్లో ఎవరెవరో కూడా తెలియట్లా ఖర్మ!’ అంటూ హెచ్చరికలు చేశాను మావాళ్లకి.

కరోనా మనందరిళ్లకీ తాళాలేసేసి, దాని పాటకి అందరిచేతా తాళం వేయిస్తున్నా నిత్యజీవితంలో ఏమాత్రం మార్పులేని జీవనశైలి ఎవరిదయ్యా అంటే... మాదే! 

అత్తిపత్తి జీవితాలైపోయాయి. ‘నువ్ ముట్టుకుంటే నే ముడుచుకుంటా’ అంటూ యమదొంగలో పాట పాడుకుంటూ పనిచేసుకుపోవడమే తక్షణ కర్తవ్యం.

ఇదివరకు ఏదైనా రాస్తే ‘కావ్యం రసాత్మకం’ అనేవారు. ఇప్పుడు ఏం మొదలెట్టినా వైరసాత్మకమై కూచుంటోంది.

త్వరలోనే మళ్లీ మనందరం ఎంచక్కా షేక్‌హాండ్లిచ్చుకునే రోజు, ఆత్మీయంగా కౌగలించుకునే రోజూ వస్తుందని ఆశిస్తున్నాను. అప్పుడైనా ఈ నమస్‘కారాలు మిరియాలు’ నూరే వాళ్ల బాధ తప్పుతుందేమో? 

ఎప్పుడూ స్పిరిటూ, టీమ్ స్పిరిటే తప్ప ఆల్కహాలికుణ్ణి కాను. 
ఆ డ్రగ్గేదీ, ఈ డ్రగ్గెంతా అనే వెదుకులాటే తప్ప డ్రగ్సంటే సినిమాల్లో చూడ్డంతప్ప బయట పరిచయం లేనివాణ్ణి...

అయినా నిరంతరం మత్తులో....

.......మీ కొచ్చెర్లకోట జగదీశ్

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive