‘చింతపిక్క స్పీడుగా అరగదీస్తూ సడన్‌గా నా తొడమీద పెట్టేసాడమ్మా! ఎంత మండిపోయిందో?' అన్నయ్య చెప్పిన కంప్లయింట్ కి మనకి పడాల్సిన నాలుగూ పడిపోయాయి.
ఏడెనిమిదేళ్ల వయసులో నిక్కర్లే కదా వేసుకునేవాళ్లం? వేసవి సెలవుల్లో ఆడపిల్లలంతా కలిసి చింతగింజలాట ఆడుకుంటోంటే వింతగా చూసేవాళ్లం. పుంజీలు, గుర్రాలు, ఏనుగులు..అంటూ లెక్కలుండేవి.
బోల్డన్ని గింజల్ని అరచేతి మండమీద వుంచుకుని గింజ కిందపడకుండా ఒక్క వుదుట్న చెయ్యి బోర్లించి గింజలన్నీ గుప్పిట పట్టేసేవారు ఆడపిల్లలు. మనం కూడా ఆ ప్రయత్నం చేసి ఒక్క గింజకూడా పట్టకుండా అన్నీ నెత్తిమీదా, ఒళ్లోనూ పడేసుకోడం చాలాసార్లే జరిగింది.
ఇక అష్టాచెమ్మ కోసం పిక్కల్ని అరగదీసే కార్యక్రమం మాకప్పచెప్పేవారు. పిక్క సగానికి అరిగిపోతే తెల్లరంగొచ్చేస్తుంది. జోరుగా అరగదీస్తోంటే ఆ రాపిడికి విపరీతమైన వేడిపుడుతుంది గింజలో. ఆ వేడివేడి గింజని పక్కనున్నవాడి తొడమీద పెట్టి ఏడిపించే వికృతానందం దాదాపుగా అందరు పిల్లల్లోనూ వుండేది. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది కానీ అప్పుడు ఒకరిమీద ఒకరు పగపెట్టేసుకునేవాళ్లం.
అష్టాచెమ్మ ఆటలో అన్నీ తెలుపులే పడితే ‘చెమ్మ’ అని నాలుగు గళ్ళు నప్పేవారు. అన్నీ నలుపులైతే ‘అష్టా’అంటూ ఎనిమిది నప్పులు నడిపేవారు.
ఇక వేసవిలో ఇంటిముందు ఐస్ ఫ్రూట్ అమ్మేవాడొస్తే వాణ్ణి గుమ్మంలో నిలబెట్టేసి అమ్మ కొంగు పట్టుకుని పేచీలు మొదలెట్టేవాళ్లం. ఒక్కోసారి వాడు కాస్తంత అన్నం పెడితే డబ్బాలో వున్న ఐసులన్నీ ఇచ్చేసేవాడు. అది మా చిట్టిమట్టిబుర్రకి చాలా వింతగా అనిపించేది. అలా ఎలా ఇచ్చేస్తాడని ఆశ్చర్యపడిపోయేవాళ్లం.
అన్నంముద్ద ఖరీదైందో, ఐసుముక్క ఖరీదైందో తెలియని వయసది!
ఇక మనకి చిన్నప్పట్నుంచీ ఎలక్ట్రానిక్ పరికరాలంటే ఉత్సుకత ఎక్కువ. దాంతో రేడియోని ఒక పట్టుపట్టి దానిచేత ఎలాగోలా చాలా పాటలు పాడించేవాణ్ణి. మొదట్లో మాయింట్లో ‘బుష్’ రేడియో వుండేది. దాని వాల్యూమ్ బటన్ తిప్పితే స్టేషన్ మారడం, స్టేషన్ బటన్ తిప్పితే సౌండు పెరిగిపోయి నాన్నగారు తిట్టడం ఒక అయిదారేళ్లపాటు జరిగాక అది కొన్నాళ్లకి ముమ్మిడివరం బాలయోగిలా పూర్తిగా మౌనదీక్షలోకి వెళిపోయింది. అయినా దాని నెత్తిమీద రెండు దెబ్బలేసి ఏదో రకంగా పాడించేవాణ్ణి.
ఎప్పుడైనా తుఫాను హెచ్చరికలో, ఎలక్షన్ ఫలితాలో వినాలంటే జగ్గిగాణ్ణి...అంటే మనని ఆశ్రయించాల్సిందే! ఎలాగోలా స్టేషన్ సంపాదించేవాణ్ణి. దాన్ని ఒకదగ్గరే వుంచాలి. కాస్తంత దిక్కుమారినా వెనకాల కాకరపువ్వొత్తులు కాలుస్తున్నట్టు చిటపటలొచ్చేస్తూ వుండేవి. అందువల్ల అందరం దానిచుట్టూ కూర్చునే వినేవాళ్లం.
మాయింటికి రెండిళ్లవతల రుద్రావఝుల మేష్టారుండేవారు. ఆయనకి గంపెడుమంది పిల్లలు. వాళ్ల ఆఖరికొడుకు వెంకటేశం, నేనూ ఒకీడువాళ్లం. కడగొట్టుది రాజా. ఆ పిల్ల పిచ్చిది. పాపం పుట్టినప్పుడు ఏ ఎనోక్సిక్ బ్రెయిన్ ఇంజ్యురీయో అయ్యుండాలి. వాళ్లకి ఆ పిల్లతో చాలా తలనొప్పిగా వుండేది.
పెద్దాడి పేరు సుబ్బారావన్నయ్య. చాలా కోపిష్టని అనుకునేవారు. ఎర్రగా, పీలగా వుండేవాడు. కోపమొస్తే చెవులు ఎర్రగా కందిపోతుండేవతనికి. ఊళ్లోవాళ్ల రేడియోలు, ఫ్యాన్లు రిపేరు చేస్తూండేవాడు. వీధిలో పిల్లలందరూ హాయిగా ఆడుకుంటోంటే నేనుమాత్రం ఈ సుబ్బారావన్నయ్య పక్కనచేరి రకరకాల ప్రశ్నలతో వేపుకుతినేవాణ్ణి.
‘ఆ వైరెందుకు ఎర్రగా వుంది? ఇది పసుపులో ఎందుకుంది? మధ్యలో ఆ ఆకుపచ్చ వైరేఁవిటీ?’ అంటూ కురుపు సలిపినట్టు సలపాదించేసేవాణ్ణి.
పాపం ఆరైగారబ్బాయిని కదాని ఓపిగ్గా సమాధానాలిచ్చేవాడు. వాళ్ల నాన్నగారికి మా నాన్నగారంటే చాలా గౌరవం. ఆ కారణంతో చాలాకాలంగా ఆపుకున్న కోపం ఒకరోజు ఆపుకోలేకపోయాడు.
ఆవేళ అతనేదో రెండు వైర్లు కలపగానే ఓ మెరుపు మెరిసి పెద్ద చప్పుడుతో రేడియోలోంచి పొగలొచ్చేశాయి. అదెవరిదో రిపేరు చెయ్యడానికని తెచ్చింది పాపం. ఆ కంగారు, చిరాకులో వుండగా నేను పక్కనచేరి ‘అయ్యో అయ్యో ఫరవాలేదా? మళ్లా బాగవుతుందా?’ అంటూ నస మొదలెట్టాను.
దాంతో అతని కోపం మొత్తం మొహంలోకి వచ్చేసి ‘ఒరేయ్, నువ్వింకొక్క మాట మాట్టాడినా ఈ రెండువైర్లూ నీ ముక్కులో దోపి కరెంటు పెట్టేస్తాను ఏఁవనుకున్నావో? అలా బయటికి పోయి ఆడుకోవచ్చు కదరా ఇలా నా ప్రాణాలు తోడకపోతేనూ?’ అన్నాడు కుర్చీలోంచి లేచి.
దెబ్బకి పరుగోపరుగు. మరి వాళ్లింట్లోకి అడుగెట్టింది లేదు.
మా వీధిలో పిల్లలంతా రెండు జట్లు. కరుణ, మంజుల వర్గానిది చాలా అల్లరి, ఆటలు బాపతు. ఇక రెండోది భాస్కర్ గాడి వర్గంలో కాస్తంత బుద్ధిమంతులుండేవారు. నేను స్వతహాగా బుద్ధిమంతుణ్ణేగానీ మంజులా వాళ్లతో కలిస్తే మాత్రం చాలా అల్లరి చేసేసేవాణ్ణి. ఒకసారి వాళ్లందరితో నాకు గొడవైపోయింది. వెంటనే వెళిపోయి భాస్కర్ గాడి బ్యాచ్ లో చేరిపోయాను. నేను చేరిన సందర్భంగా అంతా కలిసి ఆరోజు నా గౌరవార్ధం ఒక సభ ఏర్పాటు చేసారు.
భాస్కర్ గాడంటే బంగారయ్య మేష్టారబ్బాయి. వాళ్లింట్లో కాస్తంత పొలిటికల్ వ్యవహారాలు నడుస్తుండేవి. వాళ్ల మావయ్య చొక్కాకి ఎప్పుడూ ఒక బేడ్జి వుండేది. దానిమీద ‘ఆవు దూడ’ బొమ్మ కనబడుతూ వుండేది. అది కాంగ్రెస్ పార్టీ గుర్తన్న విషయం నాకు ఆ తరవాత తెలిసింది.
వాళ్లింటికి పెద్ద ఇనపగేటుండేది. దానికటూయిటూ సిమెంటుతో చేసిన సింహం బొమ్మలుండేవి. మొత్తం ఆకుపచ్చరంగులో వుండి నోరొక్కటీ ఎర్రగా వుండేవి. వాటి నోట్లో చేతులు పెట్టి కరిచేస్తోందంటూ చాలాసార్లు ఉత్తుత్తినే ఏడ్చేవాళ్లం. పెద్దవాళ్ళు కంగారుగా బయటికొచ్చి ఏఁవయ్యిందేఁవయ్యిందంటూ గాభరాపడిపోయేవారు. అదో వినోదం.
సభకి భాస్కర్ అందర్నీ తెల్లచొక్కాలు తొడుక్కుని రమ్మన్నాడు ఆరోజు. ఒక కర్రకి ముందు చిన్న కాఫీగ్లాసొకటి తగిలించి స్టేజిమీద పెట్టాడు. అది మైకుట! ముందు చాపలు పరిపించాడు. పిల్లలు చాలామందే వుంటామని వెడల్పు చారలున్న మడతమంచం గుడ్డలు కూడా తెప్పించి వేయించాడు.
పదిహేనుమందికి పైగా పిల్లలు చేరాక ఒక్కొక్కడూ ‘మైకు’లో మాటాడ్డం మొదలెట్టారు. భాస్కర్ గాడి మావయ్య కొడుకు మూర్తి సన్నగా చింతబరికలా వుండేవాడుగానీ కీచుగొంతేసుకుని తెగ మాటాడేశాడు. అంతా చేతులరిగిపోయేలా చప్పట్లు కొట్టేశారు. ఇంతకీ వాళ్ల నిర్ణయాలేఁవిటంటే....
భోగిపండక్కి దొంగచాటుగా కర్రలు, తలుపులు, ద్వారబంధాలు ఎత్తుకురావడం తప్పు కాబట్టి అలాంటి పనులు చెయ్యకూడదని...
అప్పడాలు, వడియాలు ఎవరైనా ఆరుబయట పట్టెమంచమ్మీద ఎండబెట్టుకుంటే ఎవరూ చూడకుండా ఆవారా ఈవారా వచ్చి తినెయ్యడం తప్పు కనుక అలా కక్కుర్తిపడకూడదని...
అమ్మానాన్నలు రెండోఆట సినిమాకెళదామనుకుంటే నేనూ వస్తానంటూ పేచీలవీ పెట్టడం, కాలుపట్టుకుని జీళ్ళపాకంలా సాగడం మంచి లక్షణం కాదని, అంతగా కావాలంటే మొగపిల్లలంతా కలిసి ఏ మేట్నీకో పోవాలని...
బడికెళ్లేముందు తమ్ముళ్లకి, చెల్లెళ్లకి నీళ్లు పొయ్యడం, తలకాయ దువ్వడంలాంటి సాయాలు చేసి అమ్మచేత మంచి పిల్లాడనిపించుకోవాలని...
పాదులకీ, మల్లె అంటుకీ నీళ్లు సరిగా అందేలా గొప్పులవీ తవ్వాలని, సాయంత్రాలు మల్లెపూలవీ కోసుకొచ్చి అమ్మకీ, అక్కచెల్లెళ్లకీ ఇవ్వాలని...
అన్నీ ఇలాంటివే!! చిన్నపిల్లలకి ‘కిక్’ ఇచ్చే వ్యవహారం ఒక్కట్లేదందులో!
దానిక్కారణం బంగారయ్య మేష్టారికి ఆరెస్సెస్సంటే ఇష్టంట! ఆయనతోపాటు తెల్లారే వీళ్లూ నిక్కరేసుకుని, కర్రుచ్చుకుని సభలకీ గట్రా పోతుండేవార్ట! అక్కడంతా క్రమశిక్షణ, ఎదటివాళ్లకి సాయంచెయ్యడం ఇలాంటివన్నీ వినీవినీ వాళ్లందరూ అలా తయారయ్యారు.
చెప్పొద్దూ, నాకు ఆ సభ బోర్ కొట్టింది.
ఆ భాస్కర్ గాడి తమ్ముడొకడున్నాడు. ఆరేళ్లు వాడికి. నానిపండనేవారు. అసలు పేరు ఎవడికీ తెలీదు. చిన్న చింతగింజలా వుండేవాడు. వాడు నానిపండేఁవిటో? వాడయితే వాళ్లన్నయ్య మాటాడే ప్రతి మాటకీ చప్పట్లుకొట్టెయ్యడఁవే! చేతులు విడదీసి పట్టుకోవాల్సొచ్చేది ఆపకపోతే!
ఈలోగా సన్నగా చినుకులు మొదలయ్యాయి. దూరంనుంచి లీలగా అరుపులు, గోలా వినబడ్డాయి. ఎక్కణ్ణించా అని వెనక్కితిరిగి చూశాను. అడ్డగుడి సూన్నారాయణగారి అరుగుల మీద పదిపదిహేనుమంది పిల్లలు చుట్టూ తిరుగుతూ వానపాటలు పాడుతున్నారు. మధ్యమధ్యలో ఒకే గొంతులో ‘వానల్లు కురవాలి వానదేవుడా! పంటల్లు పండాలి వానదేవుడా!!’ అంటూ అరుస్తోంటే నాకు ఒళ్ళంతా కిర్రెక్కిపోయింది.
అదికదా అసలు ఆటంటే! ఇదేం గోలరా బాబూ, ఇలా మైకులూ, మీటింగులూ అనుకుంటూ?
కూర్చున్నచోట్లో ఇబ్బందిగా కదుల్తోంటే భాస్కర్ గాడికి నామీద అనుమానం వచ్చింది. నేను నెమ్మదిగా లేచి గేటుదగ్గరున్న సింహం బొమ్మల దగ్గర నిలబడ్డాను. వెంటనే మూర్తిగాడొచ్చి నన్ను పట్టుకున్నాడు. నేను ఒక్క వుదుట్న విడిపించేసుకుని పారిపోయి వానపాటలు పాడుతున్న మేళంలో కలిసిపోయాను. ఇహ చూస్కోండి, ఆరోజు ఆడానూ!! రాత్రికల్లా జ్వరం వచ్చేసింది కూడానూ!
అంతపెద్ద వర్షంకూడా పిల్లలెవర్నీ ఆపలేకపోయింది.
వేసవంటే వీధివీధంతా సందడే! ఒక్కొక్కరికీ అయిదారుగురు పిల్లలు. మొత్తం మావీధిలోనే ముప్ఫైకి పైగా పిల్లలు ఒకదగ్గర చేరేవారు. ఇహ ఆ తరవాత సంవత్సరం నాన్నగారికి కలెక్టరాఫీసుకి బదిలీ అవ్వడంతో కుటుంబాన్ని కొత్తవీధికి మార్చారు. అక్కణ్ణుంచి అనకాపల్లి. ఎక్కడికెళ్లినా వేసవి సెలవులు మాత్రం పరిపూర్ణంగా మావిడిపండుని చీకి టెంక అవతల పడేసినట్టు జుర్రేసుకునేవాళ్లం!

0 comments:
Post a Comment