‘ఏం నాయనా నీ ఫోను వ్యవహారం అయిందంటే మిగతా కార్యక్రమం నే మొదలెడతాను!’ రామశాస్త్రి కొంచెం గట్టిగానే అరిచాడు.
ఆ ఫోర్సు చూసి పక్కనే ముహూర్తానికి అన్నీ రెడీ చేస్తున్న దక్షిణామూర్తి ఉలిక్కిపడి తలెత్తి గురువుగారి వైపు భయంగా చూశాడు.
దానికి సమాధానంగా రామశాస్త్రి అందుకున్నాడు.
‘నే సాధారణంగా ఎవరిమీదా అరవన్రా! వచ్చినప్పణ్ణించి చూస్తున్నాను, ఆ దరిద్రప్ఫోను పట్టుకుని ఆ ఇక ఇకలేఁవిటి చెప్పు? పోనీ ఆ మాటాడేది కాబోయే పిల్లతోనా అంటే ఆ అమ్మాయక్కడ గౌరీపూజ చేసుకుంటూ లక్షణంగా ఫొటోలు తీయించుకుంటోంది. పిల్ల తల్లేమో కూతురి మెళ్లో నగలు సర్దింది సర్దినట్టే ఉంది. వాళ్ల నాన్న భుజమ్మీద కండువా ఇప్పటికి ఇరవైసార్లు సర్దుకున్నాడు. ఈ ఫొటోలవీ వచ్చిపడ్డాక జనాల్లో శ్రద్ధ లోపిస్తోందిరా మూర్తీ! ఎంతసేపూ ఆ ఫొటోలవాడి కళ్లల్లో కళ్లు పెట్టి చూడ్డంతోనే సరిపోతోంది వెధవసంత!’
గురువుగారి మాటలకి ఔనన్నట్టు ఆవేదనతో తల పంకించి మళ్లీ తన పనిలో మునిగిపోయాడు దక్షిణామూర్తి.
‘పైపెచ్చు ఈ కరోనా ఒకటేడిసింది కదరా మన ప్రాణానికి! ఎంత తొందరగా కానిచ్చుకు పోతే అంత క్షేమం మనిద్దరికీ! ఎక్కువ మంది కలిసుండడం ప్రమాదంట్రా! నీకేవన్నా తెలుసున్రా దాని గురించి?’ ఆవేదనగా అడిగాడు రామశాస్త్రి.
‘నేనూ టీవీల్లో చూసిందే గురువుగారూ! ఒకళ్లనొకళ్లు ముట్టుకోకండనీ, ఓవేళ యాదాలాపంగా ముట్టుకున్నా డెట్టాలో, విమ్మో పెట్టి చేతులు కడుక్కోమనీ చెబుతున్నారు. దాని సిగదరగా, ఎంతమందిని తినేస్తోందో చూశారా? కలికాలం!’ అన్నాడు ఓ యాభై తమలపాకుల కట్ట పట్టుకుని నీళ్లు దులుపుతూ.
‘వాళ్ల పిండాకూడు. మనం తరతరాలనించీ పాదప్రక్షాళనం, హస్తప్రక్షాళనం అని ఏడుస్తూనే ఉన్నాం. ఇప్పుడు వీళ్లు చెప్పొచ్చీదేఁవిటి కొత్తగా?’ అన్నాడు హేళనగా.
‘అంతలా తీసిపడెయ్యకండి గురూగారూ! మనిషికీ మనిషికీ కాస్త ఎడం ఉండాలంటున్నారు. ఈలెఖ్ఖన ఈ నూతన దంపతులు గర్భాదానం కొన్నాళ్లు వాయిదా వేసుకోవాల్సిందేనేమో?’
‘కుర్ర బుద్ధులూ, కుర్ర మాటలూనూ! నీలాంటి చవటాయినడిగితే అలాగే చెబుతాడు. లక్షణంగా పెళ్లి చేసుకున్న తరవాత కాపరానికి కరోనా అడ్డేఁవిట్రా నీ అవివేకం కాకపోతేనూ? శాస్త్రం అన్నిటినీ సరిచేస్తుంది. నువ్విలాటి పింజారీ మాటలవీ వాళ్ల దగ్గరనకు. ఆ మోహన్రావుకసలే బ్రాహ్మలంటే పడదు!’ అంటూ హెచ్చరించాడు.
‘మీరు మరీను గురువుగారూ! ఇలా మూతులకీ, ముక్కులకీ గుడ్డలు కట్టుకుంటూ, అసుంటా ఇసుంటా అనుకుంటూ శోభనం చేసుకోకపోతే ఏఁవిట్టా? ఆనక ఇదేదో పూర్తిగా మనదేశం వదిలి వెళిపోయిన తరవాత చేసుకునేడవచ్చుకదా?’ అన్నాడు ఆశావహంగా.
‘మనదేశం వదిలి వెళిపోవడమేఁవిట్రా నీ బొంద! ఇదేఁవన్నా అలెగ్జాండర్ చక్రవర్తనుకున్నావా ఇలావచ్చి అలా వెళిపోడానికి? ఒరేయ్, మనుషులు దగ్గరయ్యాక ఏ భయాలూ ఉండవురా! కామాతురాణాం నభయం నలజ్జ అన్నాడు శాస్త్రకారుడు. మర్చిపోయావా?’ అంటూ తన్మయత్వంతో బోధిస్తున్న రామశాస్త్రి ప్రవాహానికి సడన్ బ్రేక్ పడింది.
‘అయ్యా శాస్త్రిగారూ, ముహూర్తానికి టైమవుతోంది, మీ గురుశిష్యులిద్దరూ ఇలా మోకాళ్ల మీదకి పంచెల్లాక్కుని కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఎలా చెప్పండి?’ అంటూ వచ్చాడు మోహన్రావు.
‘నేనిక్కడ అరగంటనించి పడేడుస్తున్నాను. మీవాడు ఫోను ఎప్పుడాపితే అప్పుడు మొదలెడదామని!’
‘ఏదో ఇంపార్టెంట్ కాలయుంటుందిలెండి. నే చెప్తాగా? మీరిక మొదలెట్టండి. అంటూ పెళ్లికొడుకు గదివైపు వెళిపోయాడు.
‘ఆ మగపెళ్లివార్ని చూశారా కొదమసింహం సినిమాలో దొంగల్లా ఎలా ఉన్నారో? ఆ నల్ల మాస్కులెక్కడ దొరికాయో వీళ్లకి? అయితే గురువుగారూ, మనం కూడా కట్టుకోవాలంటారా మాస్కులూ?’
‘ఆ ముచ్చటా ఉంది. ఇందాక ఆ దిలీపు గాడొచ్చి రెండు నల్లగుడ్డలిచ్చి పోయాడు మనకోసం. మంత్రాలు చదివేటప్పుడు ఉమ్ము తుంపర్లు ఎవరిమీదా పడకూడదుట. అవి కట్టుకుని తంతు జరిపిస్తే నోట్లో గుడ్డలు కుక్కుకుని మూలుగుతున్నట్టే ఉంటుంది. అయినా తప్పదు. అదుగో ఫోను మూశాడ్రోయ్! రారా! ఆ అక్షింతల పళ్లెం అందుకో!’
‘ఏం నాయనా, ముహూర్తం వేళ మించిపోయేదాకా ఇలా ఫోన్లవీ మాటాడుకుంటూ కూచుంటే ఆనక నాకే చెడ్డపేరు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక మీయిష్టం వచ్చినంతసేపు మాటాడుకోండి. ఆ చెంబుతో నీళ్లు ముందు పెట్టుకో నాయనా! ఒరేయ్ మూర్తీ, రెండు మావిడాకులందులో పడెయ్!’
‘పెళ్లికి రాలేని వాళ్లంతా చేస్తున్నారంకుల్! లైవ్ ఇవ్వడం అవుతుందా అనడుగుతున్నారు. ఆ ఏర్పాట్లవీ డాడీ చూస్తున్నారు.’
‘లైవ్ ఏంచూస్తార్ట వాళ్ల తలకాయ! మొత్తం హాలంతా కలిపి నూటయాభైమంది. చదరంగంలో పావుల్లా తలోమూలా తగలడ్డారు. మళ్ళీ ప్రతివాడూ సూట్లేసుకుని, మూతులకి ఆవుదూడల్లా చిక్కాలు కట్టుక్కూచున్నారు. ఆ వీడియో అబ్బాయొస్తే ఆ గుడ్డముక్కని గెడ్డం కిందకి దింపి చెయ్యూపి నవ్వుతున్నారు. ఆనక ఇలాంటి వీడియోలు పెట్టుకుచూసి ఏడవడం తప్ప చేసేదేంలేదు.’ అనుకుంటూ పూజ మొదలెట్టాడు రామశాస్త్రి.
ఈలోగా బయట హడావిడేదో మొదలైంది. హాల్లో కూచున్నవాళ్లందరూ లేచి బయటికి పోతున్నారు. కాసేపటికి ఇద్దరు పోలీసుల సాయంతో ఖద్దరు బట్టలేసుకున్న మంత్రిగారెవరో వచ్చాడు లోపలికి. ఆయన, ఆయన వెనకనున్న మేళం అందరూ మూతికేదో కొబ్బరి చిప్పలాంటి మాస్కొకటి కట్టుకునున్నారు.
‘దాన్ని ఎన్ నైంటీఫైవంటారు గురూగారూ! ఈ రాజకీయాల వాళ్లందరూ ఇవే! దాన్దుంపతెగ, మొన్న మా పెత్తల్లి కొడుకు ఒకటి పడేశాడు నామొహాన. అదెట్టుకున్న ఐదునిమిషాలకే కపాలమోక్షం అయిపోయింది సుమా! వెంఠనే తీసవతలబడేశాను. రండ్రండి. ఈ వ్యవహారాలవీ ఎప్పుడూ ఉండేవేగా?’ అంటూ తన వంతు మంత్రాలందుకున్నాడు దక్షిణామూర్తి.
మండపం ముందు వరసలో విద్ధసాలభంజికల్లా విడివిడిగా కూర్చున్న వాళ్లందరికీ గ్లాసుల్లో జ్యూసిస్తున్నాడు క్యాటరింగ్ కుర్రాడొకడు. వాడు సరిగా మాస్కు కట్టుకోలేదని మగపెళ్లివారు తిడుతున్నారు.
ఎవరికైనా పైటజారినా ఫరవాలేదుగానీ మాస్కు జారితే మాత్రం నానా హడావుడీ చేసేస్తున్నారు.
బయట భోజనాలకోసం వేసిన పెద్ద పందిట్లో నలుగురైదుగురు పిల్లలు మాస్కులు కట్టుకుని ఆడుకుంటున్నారు. మధ్యమధ్యలో ముక్కు కారినప్పుడల్లా దాంతోనే తుడుచుకుంటూ పరుగులెడుతున్నారు. ఈ ఏర్పాటేదో బావుంది, మాటిమాటికీ దానికోసం వాళ్లమ్మల దగ్గరకి పరుగెత్తి రాకుండా!
ఈ మోహన్రావు పెద్ద బిజినెస్‌మాన్. అతనికందరూ కావాలి. అన్ని పార్టీలవాళ్లూ కనబడుతున్నారక్కడ.
పసుపు రంగు మాస్కులేసుకున్నవాళ్లంతా వెనక కుర్చీల్లో ఒక దగ్గర చేరారు. నీలం, ఆకుపచ్చ తాళ్లున్న తెల్లమాస్కుల వాళ్లంతా ముందువరసల్లో స్థిరపడ్డారు.
‘అమ్మా పెళ్లికుమార్తెని తీసుకురావాలి!’ అంటూ అరిచాడు రామశాస్త్రి.
పదినిముషాల్లో ధగధగలాడే ఎర్రపట్టుచీరలో బోల్డన్ని నగలవీ పెట్టుకుని మిలమిల మెరిసే జరీ అంచు లేసులల్లిన ముఖమల్ మాస్కొకటి కట్టుకుని వయ్యారంగా నడుస్తూ వచ్చి కూచుంది లావణ్య.
కింద పెళ్లికాని పిల్లలందరూ లావణ్య కట్టుకున్న మాస్కు చాలా బావుందంటూ మెచ్చుకున్నారు. అది స్వయంగా తన చిన్ననాటి స్నేహితురాలు ఆశాయే కుట్టి తెచ్చిందిట. దాంతో అందరూ ఆశా చుట్టూ చేరారు ‘నాకూ కుట్టిపెట్టవా?’ అని పీక్కుతినడానికి. కొంతమందైతే పర్సుల్లోంచి డబ్బులు తీసివ్వబోతోంటే వద్దని వారించి అందర్నీ ఫోన్ పే చేసెయ్యమని చెప్పింది. వాటిని పార్టీ వేర్ మాస్కులంటారని చెప్పింది ఆశా!
రామశాస్త్రి ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాడు. ఆయనకి నవ్వూ, కోపమూ కలగలిపి వచ్చేస్తున్నాయి. వీళ్ల వేలంవెర్రికి అదీ ఇదీ అనిలేదు. ఆ పిచ్చతొత్తు కొడుకులంతా రంగురంగుల గుడ్డలు కట్టుకుని జోకరుగాళ్లలా మండపం వైపు చూస్తోంటే ఈ ఆడపిల్లలేమో మాస్కులకి ఎంబ్రాయిడరీలవీ చేయించుకునేలా ఉన్నారు.
ముహూర్తం వేళకి అక్షింతలెయ్యడానికి అందరూ లేచి ఒక్కసారిగా స్టేజి మీదకి రాబోయారు. విమానాల్లోంచి దిగేటప్పుడూ, సినిమా అయిపోకముందు, ఇలా అక్షింతలెయ్యడానికీ ఎందుకలా గుమిగూడి తోసుకుంటారో అర్ధంకాదు. వెంటనే మైకందుకున్నాడు.
‘అయ్యా, మీరంతా చదువుకున్నవారు. ఖరీదైన బట్టలేసుకునొచ్చారు. మంచిమంచి మాస్కులవీ కట్టుకొచ్చారు. ఇంతాజేసి ఇక్కడ ఇలా తోసుకుంటే వ్రతమూ చెడుతుంది, ఫలమూ దక్కదు. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడే అక్షితలెయ్యాలనేం లేదు. మంచిమనసుతో ఎప్పుడేసినా ఒహటే! అంచేత, నామాట విని, ఎక్కడివాళ్లక్కడే కూర్చోండి. ఓ గంటాగి వీళ్లిద్దర్నీ నేనే మీదగ్గరకి తీసుకొస్తా! అప్పుడు ఆశీర్వదిద్దురుగాని!’ అంటూ అందర్నీ ఆపేశాడు.
అటువంటి పట్టింపులేవీ లేని మోహన్రావు కూడా ఈ ఏర్పాటుకి అభ్యంతరం ఏదీ చెప్పలేదు.
మోహన్రావు బామ్మగారొకావిడ వన్నాట్ వన్ నాటౌట్. ఆవిణ్ణి సాయుధులైన ఇద్దరు మునిమనవలు తీసుకొచ్చి మండపం పక్కనే ఓ కుర్చీవేసి కూర్చోబెట్టారు. ఆవిడ మూతికి పవిత్రమైన మంచిగంధం రంగు మాస్కొకటి కట్టుంది. ఆవిడేమో దాన్ని అస్తమానూ కిందకి దించా, ఆ మనవలేమో పైకిలాగా!
‘ఏఁవిట్రా మీ గోల! ఊపిరాట్టంలేదు నాకు. వాణ్ణి పిలు. శంకర్రావుని! మీ సంగతి చెప్తా వాడికి!’ అంటూ మళ్లీ కిందకి లాగిపడేసింది.
ఆ శంకర్రావు పోయి పదిహేనేళ్లయింది. అతను ఆవిడ పెద్దకొడుకు, ఇంకా మోహన్రావు తండ్రీనూ!
‘అలా మాస్కు తియ్యకూడదు బామ్మగారూ!’ అంటూ ఆవిణ్ణి కన్విన్స్ చెయ్యడానికి నానా మొగ్గలూ వేస్తున్నారు ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లిద్దరూ! ఆవిడకన్నా వాళ్ల మేనేజర్లే నయమనిపించారు వాళ్లకి ఆక్షణంలో!
మొత్తానికి ఆవిడ చేతికి కొన్ని అక్షింతలిచ్చి చల్లమన్నారు. ఆవిడ వాటిని కాస్తా రామశాస్త్రి మీద చల్లేసి చక్కాపోయింది. అందరూ కాసేపు నవ్వుకున్న పిమ్మట మనవలిద్దరూ మళ్లీ తీసుకెళ్లి గదిలో చేర్చేశారు.
ముహూర్తం అవ్వగానే వధూవరుల ఫ్రెండ్స్ ఇద్దరిద్దరు చొప్పున స్టేజి మీదకొచ్చి, దూరదూరంగా నిలబడి, మాస్కులు కిందకిదించి, మొహాలు పైకెత్తి ఫొటోలు మొదలెట్టారు.
మోకాళ్ల చుట్టూ చేతులు బిగించుకుని చతికిలబడి చూస్తున్న రామశాస్త్రికి నవ్వాగడం లేదు.
‘ఒరేయ్ మూర్తీ, ఈ గుడ్డముక్కలతో ఫొటోలు తీసుకోకపోతే ఏం పుట్టి మునిగిందిటా? చూడెలా ఉన్నారో కళాంజలీ షాపులో బొమ్మల్లా దూరదూరంగా!’ అంటూ గుసగుసలాడాడు శిష్యుడి చెవిలో.
ఇదంతా సహజం గురువుగారూ! సరదాల్ని ఎక్కడ చంపుకోగలరూ? ఎన్నాళ్లని ఆపుకుంటారు చెప్పండి? దాంతో సహజీవనం చెయ్యడఁవే సరైన మార్గం. మాంగల్యధారణ కానిద్దాం రండి!’ అంటూ సూక్ష్మం బోధించాడు దక్షిణామూర్తి.
వెంటనే పెళ్లికుమారుణ్ణీ, కుమార్తెనీ కూర్చోబెట్టి మాంగల్యధారణ చేయించాడు.
‘మాంగల్యం తంతునానేన సహజీవన హేతునా...!’ అన్నాడోలేదో అదివిన్న దక్షిణామూర్తి ‘గురువుగారూ, మమజీవన కదా?’ అన్నాడు కంగారుగా!
‘నీమాటే చెవుల్లో తిరుగుతోందిరా, అంచేత అలా వచ్చేసిందది!’ అంటూ మిగిలిన తంతు కానిచ్చాడు రామశాస్త్రి.

0 comments:
Post a Comment