గమనిక:
కథాకాలం కరోనాకు ముందు.
*************************
‘మళ్లీ ఇడ్లీయా?’ అన్నాను ఏడుపుగొంతుతో!
వేడివేడినీళ్లు తలారా స్నానం చేసి, అపారెల్ స్ప్రేలు, ఇస్త్రీ మడతల మధ్య నాకు నేనే ముద్దొచ్చేస్తున్నాను. నకనకలాడే ఆకలి కూడా ఉత్సాహాన్నిస్తోంది.
అదిగో, ఆ శుభతరుణాన డైనింగ్ టేబుల్ మీద పింగాణీ పళ్ళెంలో తెల్లగా మెరిసిపోతూ ఆరిడ్లీలు కనబడగానే ఉత్సాహం కాస్తా ఆవిరైపోయి ఇడ్లీ పొగలతో కలిసి పైకెగిరిపోయింది.
అప్పటివరకూ అక్కడెక్కడా లేని కాకిలా అసహనం వచ్చి నామీద వాలింది.
‘విజయవంతమైన అయిదోరోజు!’ అన్నానో లేదో, ‘సరే, మీక్కావలసిన టిఫిన్ తెప్పించుకు తినండి!’ అంటూ మూతెట్టేసింది.
‘పోనీ ఆవిరికుడుము వెయ్యలేకపోయావా?’ అనగానే నావైపు విచిత్రంగా చూసింది. నేనేదో తప్పుమాట అన్నానని అర్ధమైంది.
‘రెండూ ఒకటే పిండి కదరా?’ అంటూ నవ్వేసింది. ఆ నవ్వు చూడగానే నాకు హమ్మయ్య అనిపించింది.
ఇంకా పదినిమిషాల టైముంది. సోఫాలో కూర్చుని పేపర్ తీశాను. మొదటిపేజీలో పావువంతు అడ్వర్టైజ్‌మెంట్... ‘ఇన్‌స్టంట్ ఇడ్లీ దోశ మిక్స్’ట! ఇరిటేషనొచ్చి పేపరక్కడ పడేసిలేచాను.
ఇంకాసేపు ఇక్కడేవుంటే ఆ ఇడ్లీలన్నీ తినేస్తానేమోనని భయమేసి బయల్దేరిపోయాను.
మావూరి రోడ్లమీద పాముల్లాంటి ఆటోలన్నింటినీ దాటుకుని వైకుంఠపాళిలో పైవరస చేరుకున్నట్టు హాస్పిటల్లో అడుగెట్టాను.
‘భయో’మెట్రిక్ యంత్రానికీ నాకూ రోజూ పావుగంటసేపు యుద్ధం జరుగుతుంది. అది భైరవద్వీపంలో బాలకృష్ణకీ, తుంబురుడికీ మధ్య యుద్ధంలా వుంటుంది.
వేలెట్టిన మరుక్షణం ‘ప్లీజ్! ట్రై ఎగైన్!’ అంటూ నాతో పరాచికాలాడుతుంది. వేలుని జీన్ పేంటుకేసి రుద్దుకుని మళ్లీ పెట్టగానే ‘ఏదీ మరియొకసారీ!’ అంటూ గారాలుపోతుంది.
కాళ్లావేళ్లా పడ్డా, కాళ్లవేళ్లతో ప్రయత్నించినా కూడా అదే పరిస్థితి.
ఎట్టకేలకి నేనే గెలుస్తాను. వెళ్లేటప్పుడు థాంక్స్ చెప్పి సాగనంపుతుంది. ఈలోగా ఓ ఇరవైమందికి పైగా వచ్చి వేలెట్టి థాంక్స్ చెప్పించుకునెళిపోతారు.
దానిపక్కనే దానికి అక్కలా ఇంకోటుంటుంది. అది ఆధార్ని ఆధారంచేసుకుని పనిచేస్తుంది.....అప్పుడప్పుడు!
ఆధార్లో చివరి ఎనిమిదంకీలూ కొట్టగానే వేలుపెట్టమంటుంది. మనం బుద్ధిగా వేలెట్టిన వెంటనే స్క్రీన్‌మీద మొన్న సంక్రాంతి రోజు మా ఆవిడేసిన ముగ్గులాంటి బొమ్మొస్తుంది. దానిమీద ‘ఎవడ్రా నువ్వూ?’ అంటూ ఇంగ్లీషులో అక్షరాలొస్తాయి.
అలా కాసేపు అదీ నేనూ దాగుడుమూతలాడుకున్న తరవాత గుండుతో వున్న నాఫొటో వస్తుంది. ఆఫొటో చూసి ‘గజిని’ వాల్ పోస్టరనుకుని నేను రోజూ ఉలిక్కిపడతాను.
మొత్తానికి మనం హాస్పిటల్లోనే వున్నాఁవని రకరకాల ఆధారాలతో రుజువుచేసుకుని ఆగదిలోంచి బయటపడ్డాను.
ర్యాంప్ వాక్ చేసుకుంటూ గదిలోకి చేరి ఓటీ అబ్బాయిని పిలిచాను, టిఫిన్ తెచ్చిపెడతాడని. వైటండ్ వైట్ లో ఫ్రెష్‌గా కనబడుతున్నాడు. రాగానే టేబుల్‌మీద చిందరవందరగా వున్న కాయితాలన్నీ దొంతిగా పెట్టేస్తాడు రోజూ.
‘ఏం తెమ్మంటార్సార్? ఎంకటేస్వరాలో హాట్ హాట్ గా ఇడ్లీ ఏస్తాడు ఇప్పుడే! తెచ్చీమంటారా?’ అన్నాడు నన్ను ఊరిస్తున్నాననుకుని.
కానీ నన్నుడికిస్తున్నాడని అతనికి తెలీదు.
నేను ఇంట్లో టిఫిన్ చెయ్యకపోవడానిగ్గల కారణాలు టీవీనైన్ రజనీకాంత్ లా వున్నవీ, లేనివీ కల్పించి మరీ కథలా చెప్పాక పరిస్థితి అర్ధంచేసుకుని వేరే టిఫిన్ తేవడానికి ఒప్పుకున్నాడు.
అతనెళ్లాక కుర్చీలో కూర్చుని తిరిగిచూస్తే గది బయట కేస్ షీట్ పట్టుకుని ఒకావిడ నిలుచునుంది. లోపలికి పిలిచి కూచోమన్నాను.
‘పేరేంటి?’ అన్నాను రిపోర్టులన్నీ చదువుతూ.
‘అబద్దం’ అంది బుర్రగోక్కుంటూ.
‘మరిందులో రజని అనుంది?’ అన్నాను ఎక్కడో కేష్షీట్ మారుంటుందన్న అనుమానంతో.
‘అదా! మా అత్తగోరింట్లో మార్చుకున్నారు. ఆళ్లలా పిలుస్తారు.’ అంది చాలా ధీమాగా.
అంటే అబద్ధఁవే నిజఁవన్నమాట!
ఆపరేషనయ్యాక మత్తునించి బయటపడే స్టేజిలో మనం ‘రజనీ..రజనీ!’ అని గొంతుపోయేలా అరిచినా కళ్లుతెరవదు. ‘అబద్ధం....!’ అనగానే టక్కున చూస్తుంది. అందుకే అసలుపేరు కనుక్కునేది.
‘సర్లే, నాలిక చాపు!’ అనగానే చాపింది.
ఇంతలో ఇంటినుంచి ఫోనొచ్చింది... ‘టిఫిన్ తిన్నావా జగ్గూ?’ అంటూ.
పావుగంట మాటాడిన తరవాత ఫోన్ పెట్టేసి తిరిగి అబద్ధం వైపు చూద్దునుకదా....
తనింకా కాళికాదేవిలా నాలుక చాపుకునే వుంది.
‘అయ్యో, అదేంటమ్మా అలావుండిపోయావూ? లోపల పెట్టెయ్!’ అన్నాను.
‘మరి నువ్వేటన్లేదనీసి అలగుంచీసినాను!’ అంది అమాయకురాలు.
‘ఇంతకుముందు ఎక్కడైంది ఆపరేషన్? ’ అనడిగాను.
‘ఆవూరు పేరేటో నాకు పలకదు. మా పెనిఁవిట్ని అడుగు. సెప్తాడు!’ అంది చిరుదీపం వెలిగిస్తూ!
పురుషుణ్ణి ప్రవేశపెట్టారు. వాడు పట్టపగలే పొట్టపగిలేలా తాగేశాడు. నేనడిగిన ప్రశ్నకి కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నాడు. అంత హృదయవిదారకమైన ప్రశ్న నేనేఁవడిగానో నాకు బోధపళ్ళేదు.
వాడి ఎమోషనల్ అవుట్ బరస్ట్ కి నేనొక సాధనంగా మారానన్నమాట. చంద్రబాబు నాయుడంటాడు, బస్టాండులో పెద్దగొడవంటాడు. అందరం కలిసి సాయంపట్టి వాణ్ణి బయటికి పంపించేశాం.
అంతకుముందు అబద్ధం డాక్టర్లకి చూపించుకున్న కాయితాలు చూద్దునుకదా..
ఒకావిడ రాసినవన్నీ రాగిరేకుల్లో బీజాక్షరాల్లా వున్నాయి.
ఒక కోడి కాలుకి పెన్నొకటి కట్టేసి వదిలేస్తే ఎలావుంటుందో అలావుంది ఇంకొకావిడ రైటింగ్.
చేసేదేంలేక ఫిట్‌నెస్ రాసి పేషెంటుని పంపించేసి కుర్చీలో వెనక్కి వాలానోలేదో టిఫినొచ్చేసింది. ఆత్రంగా అడిగాను ఏంతెచ్చావేంతెచ్చావని!!
‘సార్, దోశ మాస్టర్ మానీసాడంట నిన్నట్నించి. పూరీ వుందిగానీ కర్రీ అయిపోయిందట. బజ్జీలవీ ఆయిలు. మీరు ముట్టుకోరు. ఇంకేటి చేస్తాం...ఇడ్లీయే తెచ్చీసాన్సార్!’ అంటూ నాముందు చిన్నసైజు ఏకపాత్రాభినయం చేశాడు.
నేను అన్నిటికీ అతీతుడిలా, నిస్సత్తువగా కుర్చీలో కూలబడి తెచ్చిన టిఫినంతా ఆవురుమంటూ తినేసి బావురుమనే ఆత్మారాముణ్ణి ఊరుకోబెట్టాను.

0 comments:
Post a Comment