రాత్రిపడిన వానకి ఊరంతా చల్లగా అయిపోయింది. ఏసీ ఎప్పుడాపేశానో గుర్తులేదసలు. పడుకున్నది రెండుమూడు గంటలే అయినా హాయిగా నిద్రపట్టేసింది. ఎవరో వెనకనుంచి తరుముతున్నట్టు విపరీతమైన వేగంతో పరుగెడుతున్న సీలింగ్ ఫ్యాన్ని చూసి నవ్వొచ్చింది. నెలల తరబడి దాన్నసలు పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా నిర్విరామంగా తన శక్తిమేరకు తిరుగుతూనేవుంటుంది.....అమ్మలా!
అలారం పెట్టుకుని పడుకున్నా మోగిన వెంటనే లేవబుద్ధెయ్యదు. అదేంటో, నిజానికి అప్పుడే బాగా నిద్రపడుతుంది. అలారానికి ఈ స్నూజ్ కనిపెట్టిన వాడెవడోగానీ కనుక్కుని ముద్దువెట్కోవాలి ఈసారి!
కప్పుకున్న రగ్గుని సుతారంగా తీసి పక్కమీద పడేశాను. ఇది మనం మెడిసిన్ చదువుతూండగా చండీఘర్ వెళ్లినప్పుడు కొన్న రగ్గు. అంటే సుమారు పాతికేళ్ల పైబడే దాని వయసు. ఊదారంగు పువ్వుల చీరతో రెండు వైపులా దట్టంగా కుట్టించేసింది తను. బంగారంలా పనిచేస్తోంది ఇప్పటికీ! ఇలా ఇంట్లో వస్తువుల మీద మమకారం పెంచుకునే జబ్బుని ఏఁవంటారో నాకు తెలీదు.
రెండుమూడు స్నూజులయ్యాక పక్కమీంచి లేచాను. కిచెన్లోకొచ్చి బాల్కనీ తలుపు తియ్యగానే నాకంటే ముందు నన్ను తోసుకుంటూ ఆరేడు దోమలు బయటికెళిపోయాయి. ‘సాయంత్రందాకా ఆడుకుని చీకటడకుండా తిరిగొచ్చెయ్యాలి మరి!’ అని వాటన్నిటి చేతా ఒట్లేయించుకుని, టాటా చెప్పేసి పంపించేశాను.
మా వీధి వెనకవైపు గతవైభవ చిహ్నంగా మిగిలిన ఒకేఒక రావిచెట్టు మీద కోయిలొకటి గొంతు చించుకు అరుస్తోంది. అది రోహిత్ శర్మలా మంచి ఫామ్ లో వుందని అర్ధమవుతోంది. రాత్రి మొదలెట్టింది అరవడం. ఎంతకీ ఆపట్లా! ఆ చెట్టుకింద నిలబడి ఏడేళ్ల కుర్రాడొకడు కీచుగొంతేసుకుని ‘కూ...’ అంటూ క్రూరంగా అరుస్తూ దాన్ని మరింత కవ్విస్తున్నాడు.
చిన్నప్పుడు నేనూ అంతే! కుక్కని చూస్తే కుక్కలాగా, పిల్లొస్తే(పిల్లకాదు. పిల్లి) పిల్లిలాగా గొంతుమార్చి అరిచి, వాటిని అయోమయంలో పడేసేవాణ్ణి!
ఆ పిల్లాడి నాన్న చెట్టుకింద ఇస్త్రీచేస్తూ వాణ్ణి ఒక్కరుపరిచాడు ఆపమని! వాడసలు లెక్కే చెయ్యలేదు వాళ్ల నాన్నని. ఇహ వాణ్ణీ, టిక్ టాక్ వీడియోలనీ ఆపడం ఎవడివల్లా కాదని ఊరుకున్నాడు. టిక్ టాకంటే గుర్తొచ్చింది...
ఆవిడెవరో పాపం, వాళ్లాయన టిక్ టాకులవీ చెయ్యొద్దన్నాడని టిక్ పాయిజన్ తాగేసిందిట! బ్రతకడానికి వంద మార్గాలని విన్నాంగానీ చావడానికే ఎక్కువగా వున్నట్టున్నాయి మార్గాలు!
అతనెవరో వెంకటేశ్వర స్వామి గుడిముందు రోడ్డుమీద అడ్డంగా బుల్లెట్ పార్క్ చేసేసి ప్రదక్షిణలు చెయ్యడానికి లోపలికెళ్లాడు.
‘పుణ్యం సంపాయించే ముందు ఎంతో కొంత పాపం చెయ్యక తప్పదా?’
గుళ్లో వాచ్ మన్ మొబైల్లో పాటలు పెట్టుకుని వింటూ పైపుతో మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు. పక్కన వాళ్లావిడ కూడా సాయం చేస్తోంది. ‘సఖినెరి చూపుల చల్లదనంతో జగమునె ఊటీ ఛాయగా..!’ అంతలా ఎలా సింకైపోయారో ఆపాటకి!
అదే మనిళ్లలో అయితే ఆకాశవాణి ప్రోగ్రాముల్లా పొద్దున్నే మొదలైపోతాయి భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలవీ!
సన్నటి గాలివల్ల గిలిగింతలు, సరిగా నిద్రలేక ఆవులింతలతో తెల్లారింది.
వెంకటేశ్వరస్వామి గుడి ప్రాంగణంలో వున్న కొబ్బరాకులు ‘గుడ్ మార్నింగ్’ అంటూ తలలూపాయి.
ఆకాశంలో మేఘాలన్నీ స్నానాలవీ చేసేసి, రంగురంగుల చీరలు సింగారించుకుని సూర్యుడికోసం ఎదురుచూస్తున్నాయి. ఆయనగారు రావడం బానేవస్తాడుగానీ కాసేపటికే ఓ....వేడెక్కిపోతాడు.
అప్పుడే స్వామివారు లేవడం, మంగళస్నానాలు చేసేసి, కిరీటం పెట్టేసుకుని, కర్పూరం నుదుటికి అద్దేసుకుని రెడీ అయిపోవడం, పంతులుగారు చదివే మంత్రాలు వింటూ భక్తుల్ని దీవించడానికి సిద్ధంగా నిల్చోడం జరిగిపోయాయి!
శ్రీదేవమ్మ తయారైపోయింది. భూదేవిని పిలుస్తోంది.. ‘రా అక్కా! స్వామి పిలుస్తున్నారు! హారతిచ్చేస్తారు మళ్ళీ!’ అంటూ!
‘ఇదిగో, వచ్చేస్తున్నా! ఈచీర చూడు! ఆకుపచ్చరంగంటే నాకిష్టమని నీకు తెలుసుగా? నిన్న ఆవిడెవరో గుడికి పట్టుకొచ్చింది! ఆవిడ చేతుల్లో చూడగానే చాలా నచ్చేసిందనుకో! అప్పుడే అడిగేశాను ‘స్వామీ! చెల్లాయిని ఎలాగైనా ఒప్పించి ఆచీర నాకిప్పించరూ?’ అని!’
ప్రకృతి పరవశమంతా భూదేవి కళ్ళలో కనబడుతోంది!
పచ్చదనమంటే భూమికి నులివెచ్చదనం!
ప్రకృతిమాత వర్ష ఋతువులో పేరంటం చేసిమరీ ఆకుపచ్చ చీరలు పెడుతుంది కొండలన్నింటికీ!
అంతలేసి కొండలూ మురిపెంతో ఆ చీరలన్నీ ముచ్చటగా సింగారించుకుని ముద్దుగుమ్మల్లా మురిసిపోతాయి
మేఘాలు ఆ అందాల్ని కనులారా చూసి, గుండెనిండా నింపుకుని పరవశంతో ఆనందబాష్పాల్ని వర్షిస్తాయి
గిరికాంతలన్నీ కొత్తచీరలన్న మాటకూడా మరిచి ఆ వర్షాన తనివితీరా తడిసి హర్షాతిరేకాన్ని పొందుతాయి
నీళ్లోడుతున్న ఆ అర్ధనగ్న సౌందర్యాన్ని చూసి మేఘాలన్నీ సిగ్గుతో పక్కకు తప్పుకుంటాయి
నిర్మలమైన నీలాకాశం మాత్రం నిస్సిగ్గుగా పరికించి చూసేస్తుంది. అంతవరకూ అగోచరుడైన సూర్యుడు మబ్బుల పరదాల్ని తప్పించుకుని ముందుకొచ్చి అకస్మాత్తుగా కన్నెర్రజేస్తాడు. తప్పుచేసి దొరికిపోయినట్టు ఆకాశం ఒక్కసారిగా తెల్లబోతుంది!
ఇంత సౌందర్యాన్నీ ఉచితంగానే చూసేంత కన్నులూ, ఆ ప్రకృతిలో పరవశించి పరవళ్ళు తొక్కేంత హృదయమూ ప్రతివాడికీ ఇచ్చే కిందకి పంపిస్తాడాయన!
కానీ మధ్యలో కోరికలొచ్చి తీరికని దరిచేరనివ్వవు.
ఇంటిముందు ఊరికే ఊగిపోతున్న గన్నేరు చెట్టు, అమ్మమ్మ స్వయంగా చేసుకునే కాటుకలా ఆకాశం, ఏదో కాస్తంత చల్లటి కబురందించేలా వీస్తూ గాలి, సన్నకారప్పూస మూకుట్లో వేగుతున్న శబ్దంతో వాన....
నిన్ను తాకిన తొలిచినుకు నరాలన్నిటా పరుగెడుతుంది
కంటిరెప్పను తడిపి ఆనందబాష్పంగా జారిపడుతుంది
అభిషేకం జరిపించుకోవడంలో ఆనందం శివుణ్ణడుగు.
ధారలుగా..
నీ అణువణువునూ తడిమేస్తూ, కడిగేస్తూ!
ఈ వర్షాలు మొదలయ్యే రోజుల్లో ఇంటిపట్టున వుండాలనిపించదు. అలా బయటపడిపోయి, కొండల దారుల్లో తప్పడిపోతే బావుంటుంది. ఇంటికి దారెటో మర్చిపోతే మరీ మహత్తరంగా వుంటుంది.
కవి సమ్మేళనాలకి తరలివచ్చే పెద్దల్లా గచ్చకాయరంగు శాలువాలతో గుంపులు గుంపులుగా మేఘాలు!
అనుకోకుండా కలుసుకున్న ఆనందంలో అవన్నీ ఒకదానితో ఒకటి మమకారంతో కౌగలించేసుకుంటూ...
అభిప్రాయ భేదాలొచ్చి అంతలోనే విడిపోతూ...
కాసేపటికి ఒకదాని మీద ఇంకొకటి అరుచుకుంటూ...
నోరెట్టుకు పడిపోయే ఆ కర్రిమబ్బు ఇంకాస్త గట్టిగా గర్జిస్తూ...
చివరికి అన్నీ కలిసి కరువుతీరా ఏడుస్తాయి.
చినుకుగా మొదలైన ఆ సందడంతా చిలికి చిలికి గాలివానగా మారిపోయి నీకు నిలవ నీడైనా లేకపోవడం ఇంకా బావుంటుంది.
కష్టం తెలియాలి. నిజానికది కష్టం కాదనే నిజం కూడా అప్పుడే తెలిసేది!
నీ మోచేతికి తగులుతున్న ఆ పెద్దపెద్ద ఆకులున్న పేరు తెలీని చెట్టు ఆ క్షణం నీకు పెద్దమ్మలా కనిపిస్తుంది.
నీ ఉంగరాల జుత్తుమీద మమకారంతో ఆకొకటి కసిగా తెంపి నెత్తిన కప్పుకున్న తరవాత తెలుస్తుంది... అవి పాలుగారే పసికొమ్మలని!
చివరంటా మొనదేలిన దొప్పల్లోంచి రాలిపడే ఒక్కో బొట్టూ నీకంటికి మంచి ముత్యాల్లా కనిపిస్తాయి.
లేత చిగుళ్ల కోసం చెంగనాలు తొక్కుతూ తల్లినుంచి తప్పడిపోయిన మేకపిల్లొకటి నిన్ను చూసే చూపు నీకు పునర్జన్మనిస్తుంది.
ఆ క్షణం నీకే తెలియని నువ్వొకడివి నీలోంచి బయటికొచ్చి దాన్ని గుండెలకి హత్తేసుకుంటే దానికి తల్లి కనిపిస్తుంది. చలిదుప్పటిలా మారిన ఆ వెచ్చదనంలో తండ్రివనిపిస్తుంది.
ఎన్నో ఏళ్ల దాహం అప్పుడే తీరినట్టనిపిస్తుంది. చిత్రంగా నీలోని చిత్రకారుడికి లోకమంతా వర్ణశోభితంగా కనబడుతుంది. అంత ఆనందాన్నీ ఎవరితో పంచుకోవాలన్న ఆరాటం నిన్ను నిలవనియ్యకుండా పరుగెత్తిస్తుంది.
నీ కళ్లలో మెరుపుల్నీ, మాటలకందని పలు విన్యాసాలు చేసే నీ చేతుల్నీ చూసి ‘నువ్వేమీ చెప్పకుండానే అర్ధమయింద’నే మనసుంటే మరుక్షణం నీలో మరొక వర్షం మొదలవుతుంది!
అదీ అసలైన వర్షం!
వర్షాకాలపు శుభోదయం!

0 comments:
Post a Comment