Latest Posts

Content

Monday, August 3, 2020

‘వంట’రి పోరాటం

‘ఏవండీ, మీ ఫోన్ మోగుతోంది. ఇద్దరికీ ఒకే రింగ్ టోన్ పెట్టొద్దని ఇదివరకు చెప్పానుకదా? ఎవరి ఫోనో తెలీక ప్రతిసారీ కన్ఫ్యూజనే!’

‘ఇదేదో స్పామ్ కాల్లా వుంది. మొత్తం ఫోనంతా ఎర్రగా మారిపోయింది. డేంజర్ సిగ్నల్సు, పుర్రె బొమ్మలూ వస్తున్నాయి. ఎత్తకపోవడం మంచిది. ఏంటో నాకీ తలనొప్పి!’

‘మీక్కూడానా?’

‘ఏంటి మీక్కూడానా?’

‘తలనొప్పి!’
 
నేనన్నది మొత్తం వదిలేసి చివర తలనొప్పి మాట ఒకటే విందని అర్ధమైంది.

‘అంటే నీకు ఆల్రెడీ ఉందా?’

‘భయంకరంగా! తల బద్దలైపోతోంది. కాస్త ఆ టీవీ కట్టేద్దూ! నీకు పుణ్యఁవుంటుంది. నే కాసేపు పడుకుంటా! ఓ గంటపోయాక లేచి వంటచేస్తా!’

‘సరే! నేనూ ఇక్కడే కూర్చుంటా! ఏదో రాసుకుంటూ!’

‘ఆ రాసేదేదో నాకు అమృతాంజనం రాయొచ్చుగా? నువ్వు రాస్తే నాకు వెంటనే తగ్గిపోతుంది. ఏ టాబ్లెట్లూ పనిచెయ్యవు!’

ఇదొక రకమైన ఎమోషనల్ పుల్లింగ్. రాయనని అనలేని దివ్యస్థితి. ఎప్పట్లాగే ఓ పావుకేజీ అమృతాంజనం వేళ్లనిండా తీసుకుని ఆ బ్రహ్మ రాసిన నుదుటిరాత చెరిగిపోయేంత గట్టిగా రాయడం మొదలెట్టాను.

‘ఏఁవండీ ఇదేదో అమృతాంజన్ మహా శక్తో ఏదో అనుకుంటాను. పండు మిరప్పళ్ల కారం కలిపి చచ్చాడేమో నుదురంతా మండిపోతోంది! ఇక చాలు!’ అంటూ ఆర్తిగా ఆర్తనాదం చేసింది.

బహుశా ఈ జన్మలోనే కాకుండా వచ్చే జన్మలో కూడా తలనొప్పి పొడసూపకూడదనే అంత స్ట్రాంగ్ గా చేశారేమో....

వాళ్ల మొహాలు ‘కూడా’ మండా!

పాపం, దేశోద్ధారకులవారు ఏ ముహూర్తాన కనిపెట్టారోగానీ మాయింట్లో నెలవారీ సామాన్లతో పాటు ఓ రెండు జాడీలు వేయించుకుంటూ వుంటాం. 

నాకెప్పుడైనా తలనొప్పొస్తే ఏ పతంజలివారి శీతల్ ఆయిలో తలకి మర్దనా చేసుకుంటే తగ్గిపోతుంది. ఇంకా తగ్గకపోతే అప్పుడు మాత్రం మాత్ర గురించి ఆలోచిస్తాను. 

ఈ మాత్రల్లో రకరకాలు. 

‘వావిరాన్’ మాత్ర వేసుకున్న అరగంటకి కడుపులో హరికెన్ లాంతరు వెలిగించినట్టు మంట మొదలవుతుంది. మనం పట్టించుకోకపోతే ఆ లాంతరు కింద పడిపోయి హరికేన్ గా మారి అమెరికాలో కార్చిచ్చులా వ్యాపిస్తుంది. మళ్లీ దానికి విరుగుడు కోసం అగ్నిమాపక సిబ్బందిలా ఏ నెక్స్ ప్రోనో లోపలికి పంపించాలి. అదెళ్లి మంటల్ని అదుపులోకి తీసుకునేవరకూ మనకి ఎదురుగా ఎవరుంటే వాళ్లని తిట్టాలని, తప్పనిసరైతే కొట్టాలనీ కూడా అనిపిస్తుంది. 

ఇక ‘డోలో’ ఆరొందలేభై మాత్రది మరో కథ. ఇది పచ్చివెలక్కాయలాంటిది. గొంతుకడ్డంపడ్డం దీని ప్రత్యేకత. పూర్తిగా కడుపులోకి చేరితే బానే పనిచేస్తుంది. కానీ గుంటూరెళ్లే లోపల సింహాద్రి ఎక్స్‌ప్రెస్ లా మధ్యలో ఎక్కడెక్కడ ఆగిపోతుందో అన్న  భయంతోనే దాన్ని వేసుకోవాలా వద్దా అని మనసు ‘డోలో’యమానమవుతుంది. 

ఈ మాత్రల గోల పళ్లేకనే అమృతాంజనాన్ని ఆలంబనగా చేసుకున్నది. మాకు ఇద్దరూ అబ్బాయిలైపోయారుగానీ ఒకవేళ అమ్మాయిలే పుట్టుంటే ఎంచక్కా ఇద్దరికీ ‘అమృత’ ‘అంజన’ అని పేర్లెట్టుకునేవాళ్లం. తిరువయ్యూర్లో త్యాగరాజ స్వామికి చేసినట్టే ఆరాధనోత్సవాలు చేస్తాం దానికి మాయింట్లో! 

తనకి నిద్ర పట్టేసింది. ఎంతో ప్రశాంతంగా నిద్రపోతోంది. హమ్మయ్య! అమృతాంజనం మరొకసారి పనిచేసింది. సన్న వాల్యూమ్ లో న్యూక్ రేడియోలో తెలుగు ఓల్డ్ మెలొడీస్ ఆన్ చేశాను. బ్లూటూత్ స్పీకర్లోంచి ఒక్కసారిగా విరుచుకుపడింది ఈపాట.....

జంబలకిడిపంబ కాడ
జాంగిరి జగదంబ కాడ
జాంపండూ జమాగుందిరో
జామురాతిరీ కమానందిరో...

సత్యం-శివం సినిమాలోని ఈ ‘స్వీట్ మెలొడీ’ మొదలైన మరుక్షణం తను గాభరాగా లేచి, ‘ఏంటి జగదీషూ ఆ పాటలూ? ఛీఛీ! కట్టెయ్ ఆ రేడియో!’ అని మళ్లీ పడుకునే ప్రయత్నం చేస్తూ అటు తిరిగిపోయింది.

అదేం మెలొడీరా కుంకల్లారా? కాపురంలో కారం కొడతారా ఏం ఖర్మ!!

ఇక వంటాగింటా లేనట్టే! తన తలనొప్పి ద్విగుణీకృతం అయుంటుంది... ఈపా(ట)టికి!!  ఏంచేద్దాం?

ఆకలేస్తే అన్నం తినాలిగానీ క్యాడ్ బరీ ఫ్యూజ్ తిని కడుపు నింపుకుంటే కృతీ ‘సన్న’న్లా సన్నగానో, స్నిక్కర్స్ తింటే రేఖలా రూపురేఖలు మారిపోవడమో ఖాయం! 

స్విగ్గీ, జొమాటో వాళ్లిద్దరూ కొత్తగా మావూరొచ్చారుగానీ ఇంకా ఇల్లు సర్దుకుంటున్నారు. 

అప్పుడొచ్చింది ఆ అమోఘమైన ఆలోచన:

వంట చేద్దామని...

అవును. మీరు విన్నది నిజమే! తను ఇంట్లో వుండగా వంటింట్లోకెళ్లడమంటే డైరెక్టర్ని పక్కనబెట్టి పవన్ కళ్యాణ్ దర్శకత్వం చేసినట్టే వుంటుంది. దాని పరిణామాలన్నింటికీ సిద్ధపడే వంటింట్లోకి ప్రవేశించాను. చాలా ఎక్కువగా ఊహించుకుంటూ లుంగీని పైకెగ్గట్టి, చేతులు కూడా పైకి మడతలెట్టి రంగంలోకి దిగాను.

కానీ తను బొమ్మరిల్లులో ప్రకాష్ రాజ్ టైపు. మనకంత అవకాశం ఇవ్వదు. అప్పటికే కుక్కర్లో అన్నం, బంగాళాదుంపలూ పెట్టేసింది. స్టవ్ అంటించాలంతే!

స్టవ్ దగ్గరకెళితే ఈవీఎమ్ దగ్గరకెళ్లినట్టుంది. ఏ బర్నర్ సరైనదో నిర్ణయించుకోవడం ఒక నేషనల్ ఛాలెంజ్ మాయింట్లో!

మొత్తం నాలుగు బర్నర్లనీ టెస్ట్ చేసి ఒకదానికి నా ఓటేసి కుక్కర్ని అగ్నిపీఠం మీద కూర్చోబెట్టాను. అది ఓ వారం తరవాత విజిలొస్తుంది. ఈలోగా మళ్లీ ‘అద్భుతమైన మెలొడీస్’ వింటూ కాలం గడిపాను. 

ఈ ఉడికించిన బంగాళాదుంపలు రాంగోపాల్‌వర్మ హీరోయిన్ల లాంటివి. వేలితో ఇలా అంటే చాలు, ఇట్టే ఊడొచ్చేస్తాయి తొక్కలు. రేడియోలో ‘నీపాపం పండెను నేడు.. నీ భరతం పడతా చూడు’ పాటొస్తోంటే అన్నింటికీ తొక్కతీసి మూకుట్లో పడేశాను. మూతెట్టి ఫోన్ తీసి ‘గ్యాడ్జెట్స్ 360’ లో కొత్త ఫోన్ల వివరాలు చదువుతోంటే ఆసక్తికరంగా అనిపించింది.

‘ఒరేయ్, పిచ్చి సన్నాసి...ఇలాచూడు ఇలాచూడు ఇటుకేసి!’ అకస్మాత్తుగా మొదలైన మనవూరి పాండవులు పాటకి అటుతిరిగి చూశాను. ఇంకా నయం. ఆ పాటొచ్చి కాపాడింది. లేకపోతే కూరముక్కలు అస్తిత్వాన్ని కోల్పోయుండేవి. ఎలాగైనా ఇవాళ చాలా బాగా వండేసి తనచేత పొగిడించుకోవాలి! ఇప్పటివరకూ బానే నడిచింది యవ్వారం. 

ఈలోగా ‘మునక తప్పదని తెలుసు..అయినా పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం....’ అన్న లైన్లు వినబడగానే మనసెందుకో కీడుని శంకించింది. ఎడం కన్నదరింది కూడానూ! 

రేడియో సిటీ పెడదాం. వాడేమంటాడో చూద్దాం నాగురించి...

‘నీకేం తెలుసు...నిమ్మకాయ్ పులుసు!’ పాటొచ్చింది! 

థూ! ఏంటివాళ! దుర్యోధనుడికి కూడా జరిగుండదు ఇంత అవమానం.

దెబ్బకి రేడియో కట్టిపడేసి మిగతా వంట పూర్తిచేశాను. ప్రశాంతంగా వుంది. హమ్మయ్య! కాసేపు ఈనాడు ఆదివారం పుస్తకం తిరగేద్దాం. రీడర్స్ సైకాలజీ ప్రకారం వెనక పేజీనుండి మొదలెట్టి చదువుతోంటే వారఫలాలు కనబడ్డాయి. ఆమధ్యెప్పుడో చదివితే ఈయేడు మిరపకాయల వ్యాపారంలో బాగా రాణిస్తానని రాశాడు. నేనైతే ఇంకా మొదలెట్టలేదు. ఇవాళేంటంటాడూ...

‘భాగస్వామి మనసు గెలుచుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతారు!’

భయంతో పుస్తకం గబుక్కున మూసేశాను. నిజమేనా? చూద్దాం!!

తనున్న గదిలోకెళ్లి, బలవంతంగా నిద్రలేపి ‘రెండు ముద్దలు తినేసి మళ్లీ పడుకో!’ అని బ్రతిమాలాను. 

వేడివేడన్నంలో ఎర్రెర్రని కూరముక్కలు కలుపుకుని నోట్లో పెట్టుకుని సగం మూతబడిపోతున్న కళ్లతో.....

‘సూపర్! చాలాబావుంది కూర! ఫుల్ మార్క్స్!’ అనేసింది.

హన్నా! ఈ రేడియోవాడూ, ఈనాడు వాడూ రొంబ మోసమప్పా! ఎంత గడబిడ చేసినారూ???

..........జగదీశ్ కొచ్చెర్లకోట

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive