ఆయనకేఁవండీ! దశరథమహారాజు. నలుగురు కొడుకులకీ నాన్నెంతంటే అంత! ఎంత వినయం? పెద్దలంటే ఎంత గౌరవం?
ఆ! అవడానికి నాకొడుకేగానీ వాళ్ల పిన్నమ్మ కైకలా వాణ్ణొదలదు. వీడూ ఆ చూరట్టుకునే వేళ్లాడతాడెప్పుడూ! ఎవరైతేనేం, కంటేనే కొడుకా? నాకన్నా బానే చూసుకుంటుంది మాతోడికోడలు.
వీడిలా బాలరాముడికిమల్లే ఆకాశంలో చందమామల్నీ గట్రా తెచ్చిమ్మంటే కష్టం లక్ష్మీ! నేనుకూడా సుమంతుడిలా అద్దంలో చూపించాలంతే!
అబ్బో! ఆయనంటే వాళ్లకి చాలా గురి. వసిష్ఠులవారే అనుకో. ఇంట్లో ఏంచెయ్యాలన్నా వారిని సంప్రదించకుండా అడుక్కదలదు.
మీకిది న్యాయంకాదు. ఇంకా నిక్కర్లు తొడుక్కోడఁవే పూర్తిగా రాదు వీళ్లకి. మీరేమో వూరుగానివూళ్లో ఆ దిక్కుమాలిన టెక్నోబళ్లకి పంపేస్తానంటున్నారు. ఆ పీఆర్వో ఒకడూ..పంపుతారా పంపరా అంటూ విశ్వామిత్రుళ్లా వచ్చికూచున్నాడు హాల్లో మన ప్రాణానికి.
అమ్మో! మా ఆఫీసరుందే? అదో పెద్ద తాటకి. మనఁవిలా ఏదన్నా మొదలెట్టగానే వచ్చి మీదడిపోతుంది. ప్రతిపనికీ అడ్డఁవే. ఏంచేసినా నచ్చదావిడకి.
ఇదేఁవన్నా జనకసభా? మీకూతురేఁవన్నా సీతా? ఇన్ని కండిషన్లు పెడుతున్నారు! ఇష్టముంటే చెప్పండి లేకపోతే స్వయంవరాలు ప్రకటించుకోండి. వస్తా!
ఆవిడ మంచిదే! వాళ్ల మేనత్తుందే! అదో మందర. అందరిమీదా చాడీలుచెప్పి ఆవిణ్ణలా మార్చేసింది.
ఎప్పుడో పదేళ్లకితం మాటకదా సుధా? అప్పుడేదో అన్నానే అనుకో. అవన్నీ కైకలా గుర్తెట్టుకుని ఇప్పుడు కొనమని అడగడం భావ్యమా చెప్పు నీకు?
అతను వాళ్ల నాన్నమాట జవదాటడండీ! నిప్పుల్లో దూకమన్నా దూకేస్తాడు, అడవులకి పొమ్మన్నా పోతాడు. రాముడు మంచిబాలుడు టైపు.
ఇది మరీబావుంది. మీరా వూరినించి అన్నేళ్లపాటు రానంటే నేనెందుకుంటానిక్కడ? రాముడి వెంట సీతమ్మే నేను. పదండి. నా సూట్ కేసు కూడా సర్దేశాను.
ఆయనకి వాళ్లన్నయ్యంటే ప్రాణం. ఒకతల్లి కడుపున పుట్టకపోయినా రామలక్ష్మణుల్లా ఎప్పుడూ కలిసేవుంటారు.
మీరలా కూర్చోండి సార్. శ్రమతెలీకండా కబుర్లుచెబుతూ గుహుళ్లా అవతలొడ్డుకి చేర్చేస్తాడు మావాడు. చాలా ఎక్స్‌పర్టనుకోండి! రేయ్, బండితిప్పు!
ఆధార్ కార్డులో నాఫొటో చూసావా? ముక్కూచెవులూ కోసేసిన శూర్పణఖలా వున్నాను.
ఆ యాదగిరి మంచోడుకాదు. వాళ్ల చెల్లెల్నేవన్నా అంటే వూరుకోడు. రావణాసురుళ్లా పగపెట్టేసుకుంటాడు. వాడితో వద్దురా రేయ్!
అమ్మాతల్లీ! నీకో దణ్ణం. ఇలా బంగారుజింకల్నీ, కొండమీద కోతుల్నీ తెచ్చిమ్మంటే నావల్లకాదు. ఏ ఐపాడో, ఏదన్నా చిన్న వుంగరమో కావాలనడుగూ.. కొనిస్తాను. ఇప్పటికిప్పుడు స్విట్జర్లాటే ఎంతవుతుందో తెలుసా?
నువ్వలా గదిదాటి బయటికి రానంటే ఎలా? అదేఁవన్నా లక్ష్మణరేఖా? సాయంత్రం మీవారొచ్చేదాకా అప్పుడప్పుడు అలా బయట షాపులకీ వాటికీ తిరిగొస్తూవుండు. అదే కాలక్షేపంగా వుంటుంది.
ఏడిసినట్టేవుంది. నేను లేనప్పుడొచ్చి సీతని రావణాసురుడెత్తుకెళ్లినట్టు నాబండి పట్టుకుపోయాడా? ఇప్పుడేంచెయ్యను?
..........
ఏఁవిటయ్యా రామా?
నిత్యజీవితమంతా నీకథ చుట్టూనే తిరుగుతుంది. ఏపనిచేసినా, ఎవరెదురైనా రామాయణ పాత్రలే ఉపమానాలు. ఎందుకిలా?
పురాణాలన్నీ శోధించి, యుగయుగాల చరిత్రనంతా తవ్వి, వీలైనంత పరిశోధనలు చేసిమరీ చెప్పారు...
రాముడు అతిప్రాచీన మానవుడని!
వేలయేళ్లకు పూర్వమే ఈనేలను నడయాడిన ఈ పురాతనుడి జీవనశైలి మాత్రం నవనాగరికులకు సైతం అనన్యసామాన్యం. అబ్బురం. అద్వితీయం.
పదిమంది అభిమానాన్నే పర్ణశాలగా మార్చుకున్నాడు.
కష్టాలనే కందమూలాలుగా స్వీకరించాడు.
కట్టుకున్నదాని కోరిక కోసం పనికట్టుకుని మరీ పరుగులెత్తాడు.
నిర్భయంగా నిలబడి, సాధారణమైన ఆయుధాలతోనే అసాధారణంగా పోరాడాడు.
ఆత్మీయఫలాల్ని ఆరగించాడే తప్ప అంటరానివని సందేహించలేదు.
మావూరి రామాలయాల్లో నీపెళ్లికోసం కాళ్లరిగేలా తిరిగే అయోధ్యవాసుల్లాంటి కార్యకర్తలు...
మా వీధరుగుల మీద పడక్కుర్చీల్లో కూర్చుని ఏళ్లతరబడి బేళ్లకిబేళ్లు పుస్తకాల్లో నీపేరు రాస్తూండే భద్రులు...
వృద్ధాప్యం లంఖిణిలా బెదిరిస్తున్నా వంగిన నడుముతోనే నీకు రెండు పటికపందార ముక్కలు నైవేద్యం పెడితేతప్ప ముద్దముట్టని శబరులు...
అందరం ఎరిగిందే అయినా నీకథని కొత్తసొగసులతో ముస్తాబుచేసి ఎప్పటికప్పుడు వినూత్నంగా వినిపించే ప్రవచనకారులు...
నీపేర్న గుడికట్టడానికి వున్నదంతా వూడ్చిచ్చేసే కంచెర్లగోపన్నల్లాంటి నిష్కాములు...
ఉన్నారున్నారు. మాచుట్టూ ఇంకావున్నారు. నీ ప్రభావం అలాంటిది.
ఏ కథానాయకుడైనా కొన్ని దశాబ్దాలు గుర్తుంటాడు
ఏ ప్రజానాయకుడైనా శతాబ్దకాలం కీర్తించబడతాడు
కానీ నువ్వలాకాదు. యుగాలసైతం, నాగరికతల్నీ, మనుధర్మాల్నీ, రణాలనీ, వాతావరణాలనీ దాటుకుని వచ్చి ఇదిగో.. మా కలియుగంలోకూడా ఇంకా మా మనసైన మానవుడిగా మన్ననలందుకుంటున్నావు.
ఇది సామాన్యమైన విషయంకాదు.
నీలీలలు చాలించవయా..అంటూ కృష్ణుణ్ణీ...
అంతా విష్ణుమాయ...అంటూ ఆ వైకుంఠవాసుణ్ణి...
శివుడిలా మూడోకన్ను తెరుస్తాడు కోపమొస్తే...అంటూ ఆ ముక్కంటినీ...
ఇలా ఆడిపోసుకోవడం నీవిషయంలో జరగదుగాక జరగదు.
పెళ్లాన్ని అడవులపాలు చేశావని, అగ్నిలో తోయించావని, ఒక్కనాడూ సుఖపెట్టలేదని ఏవేవో కూతలుకూసేవాళ్లు ఎప్పుడూ వుంటారు. వారికి నీ చిరునవ్వే సమాధానం. నీ నిరాడంబరతే నిజమైన నిదర్శనం.
నువ్వు రావణాసురుణ్ణి చంపావా లేదా అనేది మాకనవసరం. దుష్టబుద్ధులున్నవారిని దండించాలన్న నీ సిద్ధాంతానికి మాత్రం మేం బద్ధులం.
అయోధ్యలో నీకో గుడికావాలంటావా?
ఏం? మా అందరి గుండెల్లోనూ తలొకటీ చొప్పున కోట్లకొద్దీ రామాలయాలున్నాయి. అవిచాలవా?
ఇవాళ నీ జన్మదినమో, వివాహదినోత్సవమో మాకనవసరం. నిన్ను తలచుకుంటూ చేసే ఈ కార్యక్రమం మా జీవితంలో చేసే అతితక్కువ మంచిపనుల్లో ఒకటి. అంచేత నీతోపాటు మావదినమ్మ సీతమ్మనీ కూర్చోబెట్టి మా మురిపెం తీర్చుకుంటాం.
అన్నట్టు..విళంబిలోనే పుట్టావుట. ఇప్పుడే తెలిసింది. నీకెన్నేళ్లో మాకెందుకు చెప్పు?
ఎన్నాళ్లయినా నువ్వే మా కులదైవానివి...క్షమించు.. లోకులదైవానివి!
మావూరి దేవుడమ్మా!
చల్లంగ మమ్మేలు రాముడమ్మా!
శ్రీరామనవమి శుభాకాంక్షలు!!
........జగదీశ్ కొచ్చెర్లకోట
0 comments:
Post a Comment