#ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైన నా రచన....
‘ఏఁవైంది సారూ? పన్ను నొప్పా?’ దవడ మూసుకుని, తలొంచుకు నడుస్తున్న రాజుని ఆపి అడిగాడు వాచ్ మన్ సూరిబాబు.
అవునన్నట్టు తలూపాడే తప్ప నోరుతెరిచి మాటాడలేదు. నిజానికి మాటాడే పరిస్థితిలో లేడు. చిన్నప్పట్నుంచీ ఎంతో ఇష్టంగా పళ్లు తోముకునే, ఆమాటకొస్తే ఎంతో ఇష్టంగా తినేసే ఆ పిప్పరమెంటు పేస్టునొదిలేసి చూడ్డానికి భయంగొలిపేంత ఎర్రగా, వగరుగా, ఘాటైన వాసనొచ్చే ఆ ఆయుర్వేదం పేస్టే కొంటున్నాడీమధ్య.
రాజు పూర్తిపేరు రాజేశ్వరరావు. కుర్రాడు చాలా భావుకుడు. గోరింటాకులో మీరా జాస్మిన్లాంటి చెల్లెలు, సంధ్య సినిమాలో సుజాతలాంటి అక్క ఉన్నారు. రక్షాబంధన్ పండక్కి వాళ్లు చేతికి రాఖీలవీ కడుతోంటే అప్రయత్నంగా కళ్లంట నీళ్లు కారిపోయేవి. రాఖీలు తడిసిపోతున్నాయని తిడితే అప్పుడు ఆపేవాడు ఏడుపు.
‘అంత సెన్సిటివైతే ఎలారా బాబూ? రేప్పొద్దున్న పెళ్లయ్యాక వదిన దగ్గర ఇలా ఏడుపులవీ ఏడ్చేవు? అసలే సిటీ గాళ్. ఇంత సెంటిమెంట్ తట్టుకోలేదు.’ అంటూ ఏడిపించింది చెల్లెలు. నెలరోజుల్లోనే ఆ పెళ్లీ అయింది. ముహూర్తం టైములో జీలకర్రా బెల్లం కుమారి నెత్తిమీద పెట్టంగానే ఒక్కసారిగా ఎమోషనలైపోయాడు. అది తను కనిపెట్టేసి ఆ మర్నాడు చాలా ఏడిపించింది. కాసేపు ఉడుక్కున్నాడుగానీ తరవాత పన్లోపడి మర్చిపోయాడు.
టీవీలో రెగ్యులర్‌గా వచ్చే ప్రకటనలన్నీ తప్పనిసరిగా చూడటం, అవన్నీ పాటించడం అలవాటు రాజుకి. అతను బయటికెళ్తే ఏం కొనాలన్నా వెంటనే ఆ వస్తువుకి సంబంధించిన యాడ్ గుర్తుచేసుకుంటాడు.
కారం తీసుకురమ్మని వాళ్లావిడ చెబితే హీరోయిన్ స్నేహ మావిడికాయ ముక్కలు కోసి కారం చల్లి టేబుల్ మీద పెట్టడం, రాహుల్.. అని పిలవడం గుర్తొచ్చి షాపతన్ని ‘ఆశీర్వాద్ కారం ఉందా?’ అనడిగేవాడు.
టీ తాగితే తెలివితేటలు పెరుగుతాయన్న విషయం కూడా నమ్మేసేవాడు.
ఇవన్నీ ఒకెత్తు.
ఒకమ్మాయి తను గర్భవతైన విషయం చాలా రొమాంటిక్ గా ఒక బుల్లి కాఫీ కప్పుని ముందుకుతోస్తూ భర్తకి సింబాలిగ్గా చూపించే యాడ్ అంటే రాజుకి పిచ్చి ఇష్టం. వాళ్లావిడ కూడా మొదటిసారి అచ్చం అలానే కాకపోయినా అంతే రొమాంటిక్ గా చెప్పాలని, చెప్తుందని ఆశించాడు.
అయితే విధెప్పుడూ వీవీ వినాయక్ సినిమాల్లో విలన్ లాంటిది.
రాజుకి తను తండ్రి కాబోతున్నాడన్న విషయం దురదృష్టవశాత్తు వాళ్ల అపార్ట్‌మెంట్ వాట్సప్ గ్రూపులో మెసేజ్ చూశాక తెలిసింది.
ఆరోజు ఉదయం రాజు భార్య కుమారి పీరియడ్ మిస్సైందని రెండో ఫ్లోర్లో వుండే కృష్ణవేణిని తీసుకుని డాక్టర్ దగ్గరకెళ్లింది. అక్కడ గైనకాలజిస్ట్ కుమారి నాడి పట్టుకుని ‘కంగ్రాచ్యులేషన్స్! మీరు తల్లి కాబోతున్నారు!’ అని అందామనుకుంది. కానీ అలా చెప్తే నెలరోజులకే ప్రాక్టీస్ మానేసి నాడీ జ్యోతిషాలయం పెట్టుకోవాల్సొస్తుందని బెల్ కొట్టి నర్సుని పిలిచింది.
నర్సు కుమారిని తీసుకెళ్లి, ప్రెగ్నెన్సీ పరీక్ష చేసి రిపోర్ట్ రాయించుకుని, కుమారీ, కృష్ణవేణి చూడకుండా కవర్లో పెట్టి, మడిచి, ఒక ఫైల్లో పెట్టి, దానికి పసుబ్బొట్టదీ రాసి, ‘డాక్టర్ గారొస్తారు కూచోండ’ని అరగంట వెయిట్ చేయించింది.
ఈలోగా వాళ్లిద్దరూ ఓపీలో టీవీ చూస్తూ కూర్చున్నారు. సీరియలేదో వస్తోంది. అందులో గౌరి అనే పిల్ల గర్భవతి. ఆ గర్భాన్ని ఎలాగైనా పోగొడితే ఆస్తంతా తమకే దక్కుతుందని ఇద్దరు ఆడ విలన్లూ, ముగ్గురు మగ విలన్లు, ఒక అటూఇటూ కాని విలను రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
మీ బొందలా వుంది. ఎంతో సంతోషంతో బిడ్డల్ని మోస్తున్న ఇంతమంది గర్భవతులు కూర్చుని చూడవలసింది ఇదా? ఏఁవిటో, బొప్పాయి ముక్కలు తినిపించడాలు, పాలల్లో అవేవో కలపడాలు, మేడమెట్ల మీద నూనె ఒంపేసి జారిపోయేలా చెయ్యడాలు.. ఇదీ అదీ అనిలేదు. చూడకుండా ఉందామని కళ్లు మూసుకున్నా డైలాగులవీ వినబడుతూనే వున్నాయి వెధవఖర్మ.
ఆఖరికి డాక్టరమ్మ కుమారిని లోపలికి పిలిచింది. కవర్లోంచి రిపోర్టు బయటికి తీసి, కళ్లజోడు కూడా తీసి, మరకల్లేకపోయినా చిన్న గుడ్డముక్కతో స్టైలిష్ గా తుడుస్తూ కళ్లు సగం పైకెత్తి కుమారి వంక ముందు సీరియస్‌గా చూసి, ఆనక ఆ కళ్లలోంచే చిలిపిగా చిన్న చిరునవ్వుని బయటికితెచ్చింది.
ఆ తరవాత మధురమైన స్వరంతో...
రాజు తండ్రి కాబోతున్నాడని,
రాజు వాళ్ల నాన్నగారు తాతయ్య కాబోతున్నాడని,
కృష్ణవేణికి త్వరలోనే ముద్దుల మేనల్లుడు రాబోతున్నాడని
రకరకాల పర్మ్యుటేషన్స్ అండ్ కాంబినేషన్లలో చెప్పింది.
అదేమీ పెద్ద ఆశ్చర్యకరంగా లేకపోయినా వాళ్లిద్దరూ ఎంతో సంభ్రమంగా మొహాలు పెట్టి ‘థాంక్యూ మామ్, థాంక్యూ సోమచ్! మా మమ్మీ అందుకే మీ దగ్గరికే వెళ్లమని చెప్పింది. మా పిన్నీ వాళ్ల కోడలికీ ఇక్కడే సిజేరియన్ అయిందంటకదా, ఇఫ్ యు రిమంబర్, సంజనా అనేసి షార్ట్, క్యూట్ అన్ ఛార్మింగ్ గాళ్! వాళ్లంతా సోహ్హాపీ!’ అంటూ ఇరవై వంకర్లు తిరిగిపోయింది.
డాక్టరమ్మకి ఆ సంజనా ఎవరో గుర్తే లేదు. అయినాసరే ‘ఓ! సంజనా మీ రెలెటివా, నాకెందుకు తెలీదూ?’ అంటూ పక్కనున్న సీనియర్ మోస్ట్ నర్సు వైపు చూసి ‘సంజనా..గుర్తుందిగా? ఈళ్ల చుట్టాలంట!’ అంటూ నందితారాజ్ కి ఎక్కువగాను నందితాదాస్ కన్నా తక్కువగానూ నటించి ఏడొందలు తీసుకుని పొమ్మంది.
బయటికొచ్చాక ఆటో డ్రైవరుకి కుమారి అడ్రెస్సదీ చెబుతుండగానే రహస్యం అన్న ప్రతీదాన్నీ వాట్సప్ గ్రూపుల్లో పెట్టే ‘మంచి’ అలవాటున్న కృష్ణవేణి మరుక్షణం తమ పక్క పోర్షన్ సుజాతకి మెసేజ్ పెట్టేసింది.
‘వెల్కమ్ టు జూనియర్ కుమారి! జస్ట్ నౌ కన్ఫర్మ్డ్!’ అని...
మరుక్షణం సుజాత ఆ వార్తని వాళ్ల అపార్ట్‌మెంట్ వాట్సప్ గ్రూపులో పెట్టేసి ‘కంగ్రాట్స్ కుమారీ!’ అని, అప్పటికప్పుడు గూగుల్లోంచి ‘న్యూబోర్న్ బేబీ ఇమేజెస్ ఇన్ ఇండియా’ అని సెర్చ్ కొట్టి, అక్కడొచ్చిన వేలాది బొమ్మల్లో అసహజంగా, ఎక్కడికక్కడ కొవ్వుతో వేలాడుతున్న ఓ బడ్డుగాడి ఫొటో ఒకటి డౌన్‌లోడ్ చేసి ఈ కంగ్రాట్స్ మెసేజుకి అటాచ్ చేసి పెట్టేసింది.
ఇహక్కణ్ణించి వరసపెట్టి ‘కంగ్రాట్స్ కుమారి గారు’...అంటూ జెంట్సు...
‘కంగ్రాట్స్ కుమారక్కా’...అంటూ చిన్నపిల్లలు...
‘వావ్ కుమ్స్.. చప్పనాలాదు?’....(చెప్పనేలేదూ..అన్న మాటల్ని ఇంగ్లీషులో టైప్ చేసిన తెలుగు మెసేజ్)...అనే బీటెక్ చదివే ఓ పిల్లా...
‘అదా సంగతీ, ఏంట్రా ఈమధ్య రాజు మొహం వెలిగిపోతోందీ అనుకున్నా! పనిమంతుడే?’.... అన్న సగం బూతు మెసేజు... అదెవరి అకౌంటో తెలీదు. పేరేమో ‘ఐ నో షిట్’ అనుంది.
‘కుమారీ, ఐ’ల్ సెండ్ యు పికెల్స్. ఐ హేవ్ సమ్ విద్ మి!’....అన్న బాధ్యతాయుతమైన పెద్దరికపు మెసేజు...
‘కుమ్మూ... నేనొస్తన్నా! లెట్స్ సెలబ్రేట్ యార్’.... అనే పెళ్లైపోయినా ఇంకా యవ్వనాన్ని మర్చిపోలేని ఓ కొత్తపెళ్లికూతురు మెసేజూ...
ఇలా ఇరవైకి పైగా మెసేజులొచ్చేసాయి.
ఏంట్రా మొబైల్ ఇలా కొట్టేసుకుంటోందీ.. కొంపదీసి ఇండియా గెలిచిందా అనుకున్నాడు రాజు. కానీ ఆరోజసలు ఏ మ్యాచూ లేదు.
సరే, ఏంటో చూద్దాఁవని కారు పక్కకాపి ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా క్రుంగిపోయాడు. ఇప్పుడు ఇంటికెళ్లిన తరవాత కుమారితో ఎలా మాటాడాలో అర్ధంకాలేదతనికి.
అతని రొమాంటిక్ ఆశలసౌధం ట్విన్‌టవర్స్ లా కూలిపోతోంటే ఏంచెయ్యలేక నిరాసక్తంగా ఇంటికొచ్చాడు.
కార్ పార్కింగ్ లో పెడుతూండగానే అప్పుడే షటిలాడి చెమటల్ని టర్కీ టవల్తో తుడుచుకుంటూ లిఫ్ట్ దగ్గరకొస్తున్న పక్క పోర్షన్ల వాళ్లిద్దరు రాజుకి షేక్‌హ్యాండిచ్చి కంగ్రాట్స్ చెప్పారు.
ఏ పరపతీ లేని మంత్రిపదవి దక్కినవాడిలా వుంది రాజు మానసిక స్థితి. ‘ఈ వార్త విని సంతోషించాలా లేక ఇలా తెలిసినందుకు బాధపడాలా? తన బుల్లికప్పు ఆశ తీరేదెలా?’ అనుకుంటూ ఇంట్లోకొచ్చిపడ్డాడు.
సోఫాలో పడుకుని వాళ్లమ్మతో మాటాడుతోంది కుమారి. అట్నించి గర్భము, తీసుకోవలసిన జాగ్రత్తలు, తినదగినవి, తినకూడనివి, భర్తతో మెలగవలసిన విధానము, శొంఠిపొడి, ఆముదము...ఇత్యాది విషయాలన్నీ సోఫాలో కుమారితో పాటు దొర్లుతున్నట్టున్నాయి.
శుభం.
‘కనీసం ఇంట్లోవాళ్లకంటే ముందు నాకు చెప్పాలన్న ఆసక్తి కూడా లేదన్నమాట!’ దాంతో రాజు మనసు అప్పడంలా ఒక షేపూ పాడూ లేకుండా విరిగిపోయింది.
దానికితోడు ఈ పంటినొప్పి. సెన్సిటివిటీ అనేది కేవలం చిగుళ్లలోనే కాకుండా మనుషుల్లో కూడా ఉంటే ఎంత బావుంటుంది? చల్లటి నీళ్లిలా నోటికి తగలంగానే జివ్వుమంటూ ప్రాణం గిల్లార్చుకుపోతుంది. అలాంటిది ఇంత చల్లటి కబురు తెలిసినా తనతో పంచుకోవాలనే అనిపించట్లేదు కుమారికి.
‘మమ్మీ, ఈయనొచ్చారు. నేను కాఫీ ఇచ్చేసి మళ్ళీ చేస్తా!’ అనందేగానీ ఆ తరవాత మరొక పదినిముషాలపాటు అవతలనుంచి వచ్చే వరదని చెవితో అడ్డుకుంటూ గడిపేసింది.
సహనం కోల్పోయిన రాజు బూట్లైనా విప్పకుండా మేడమీదకి వెళిపోయాడు. కాఫీ రెడీచేసి భర్తని పిలిచింది కిందకి రమ్మని. భారంగా అడుగులు వేస్తూ, పాత సినిమాల్లో అక్కినేనిలా అయిదునిమిషాలకొక మెట్టు చొప్పున దిగుతున్నాడు.
‘మనసులేని దేవుడు.. మనిషికెందుకో మనసిచ్చాడు’ పాటొస్తోంది టీవీలో! దాంతో ఇంకా మెల్లిగా నడవడం మొదలెట్టాడు.
‘త్వరగా కాఫీ తీసుకో రాజూ! నీకో న్యూస్ చెప్పాలి!’ అంది చాలా రొమాంటిక్ చూపొకటి విసిరి. అతనికా చూపు తగల్లేదు.
కప్పు చేత్తో పట్టుకుని దానివంకే చూస్తున్నాడు. ఆ కాఫీ అంతా వలయాలుగా తిరుగుతూ సముద్రంలో ఉప్పెనలా తోచింది రాజుకి. ఎంత ఊహించుకున్నాను ఈ కాఫీ కప్పు గురించి? చివరికేమైంది? ఆ మెలాంకలీలో బాగా మునిగిపోయి వుండగా ఘోరమైన శబ్దంతో ఫోన్ మోగింది.
వాళ్ల బాస్ శేఖర్ గుప్తా. ఇప్పుడేకదా వచ్చానూ? ఇంతలోనే ఎందుకు చేశాడబ్బా అనుకుంటూ ఎత్తాడు.
‘కంగ్రాట్స్ రాజూ, జస్ట్ నౌ ఐ గాట్ ద న్యూస్!’ అనేసి పెట్టేశాడు. అంతే!
క్లుప్తంగా మాటాడ్డం బాల్యంనుంచీ అలవాటయిపోయింది పాపం. వీడిపేరు శేఖర్ క్లుప్తా అనుండాలసలు.
అంటే ఈవార్త ఆఫీసులో కూడా వ్యాప్తి చెందేసిందన్నమాటేగా?
దాంతో కప్పులో కాఫీ ఒక్కసారిగా పొంగి మరింత ఉధృతమై తీరాన్ని దాటి అతనిమీద పడిపోతున్నట్టనిపించింది.
అతికష్టం మీద ప్రేమనగర్లో నాగేశ్వర్రావు విస్కీనే విషం తాగినట్టు మొహమంతా బిగదీసుకుని కాఫీ తాగేసి, కాలర్ పిసుక్కోడం మొదలెట్టాడు.
‘ఏఁవైంది రాజూ? ఎందుకలా ఉన్నావ్? తలనొప్పా?’ అంటూ అతని నుదుటిమీద చెయ్యేసి చూస్తూ లాలించింది కుమారి. ఆ చేతిని పక్కకి సున్నితంగా తోసేశాడు.
‘నువ్విలా ఉంటే లాభంలేదు. రేపట్నుంచి కొంచెం బొజ్జ పెంచాలి!’ అంది క్రీగంట చూసి నవ్వుతూ.
‘ఏం? నేనారోగ్యంగా ఉండడం ఇష్టంలేదా?’ అన్నాడు ఏడుపు గొంతేసుకుని.
‘నీ తలకాయ్. మొద్దుమొహం! నీ బొజ్జ మీద ఆడుకోడానికి ఓ బుజ్జి పాపాయి రాబోతోంది త్వరలో! ’ అంటూ కళ్లు రెండుచేతులతోనూ మూసేసుకుంది.
‘అవునట కదా? ఇందాక షటిల్ కోర్టులో అనుకుంటోంటే విన్నాను.’ అన్నాడు కావలసినంత నిష్టూరంగా.
‘షటిల్ కోర్టా? అక్కడెలా తెలిసింది? నేనెవరికీ చెప్పనేలేదే?’ అంటూ ఆశ్చర్యపోయింది.
‘నువ్వు చెప్పకుండానే వాట్సప్ లో అన్ని మెసేజులొచ్చాయా?’ అన్నాడో లేదో
‘ఏ వాట్సప్? నాకేం తెలీదే?’ అంది అర్ధంకానట్టు.
అతను ఓపెన్ చేసి చూపించాడు.
‘సరిపోయింది. నేనసలా గ్రూపులో లేనుగా? ఇదంతా కృష్ణవేణి పనయ్యుంటుంది. తనూ వచ్చింది నాతోపాటుగా. ప్రతీ చిన్న విషయమూ ఇలా రచ్చబండలో పెట్టెయ్యడం అలవాటేగా వాళ్లందరికీ? అదే చూస్తున్నా, మీకెలా తెలిసిందా అని!’ అంది అతని మెడ చుట్టూ చేతులు వేస్తూ.
‘గ్రూపు సరే. మీ అమ్మకి? ఇంతదాకా ఫోన్లో మాటాడేశావుగా?’ అన్నాడు సగం తీరిన బెంగతో.
‘అమ్మా? అమ్మకింకా చెప్పందే? తను వచ్చే నెల్లో వెళ్లబోయే చార్ ధామ్ ట్రిప్ గురించి చెప్తోంది. ఎంతకీ పెట్టదు. వెళ్లి చూసొచ్చాక చెప్పొచ్చుగా? అసలే మా రాజు అగ్గిరాజులా ధుమధుమలాడిపోతున్నాడు?’ అంది అతని ఒళ్లో పడుకుంటూ.
మబ్బులన్నీ పారిపోయి, నిండుచంద్రుడు బయటపడ్డాడు. అచ్చం రాజు ముఖంలా!
‘అయితే రేపట్నుంచి జిమ్మూ గిమ్మూ మానెయ్యమంటావ్?’ అన్నాడు కుమారి పొట్టమీద సుతారంగా చెయ్యేసి రాస్తూ!
ఇటువంటి రొమాంటిక్ ప్రపంచమే రాజు కలలుగనేది! ఆ నిశ్శబ్దమందిరంలో బ్యాటరీలు అయిపోయిన గడియారం కూడా ఆగిపోయింది.... శబ్దం చెయ్యడం ఇష్టం లేక!
0 comments:
Post a Comment