Latest Posts

Content

Tuesday, February 14, 2017

ఓం నమో వేంకటేశాయ



క్యూ కాంప్లెక్స్‌లో నిలబడిన ప్రతిసారీ మనక్కనబడే హాథీరాంజీ మఠం చూసి ఓ దణ్ణం పెట్టడఁవే తప్ప ఆయనగురించి కాస్త పరిశోధిద్దామని ఏనాడూ అనుకోలేదు.
మొత్తానికి వికీపీడియానో, గూగులమ్మనో, తిరుమల చరిత్ర పుస్తకాలనో..వేటిని ఆశ్రయిస్తేనేం, మంచి భక్తిరసప్రధానమైన కథావస్తువునే ఎంచుకున్నారు.
కానీ చెప్పాల్సింది అరగంటలో అయిపోయే ప్రమాదం వున్నప్పుడు అర్ధరూపాయి బిళ్ళని రైలుపట్టాలమీద పెట్టి పెద్దది చేసినట్టు సాగదియ్యక తప్పదు. లేకపోతే పద్దెనిమిదిరీళ్ళు చుట్టడం, ప్రతీవాడి నోరూ కట్టడం అసాధ్యం.
సినిమాలో మంచి:
నాగార్జున అమోఘంగా....ఏంకాదు...బాగా నటించాడు. హావభావాలు బాగా పలికించాడు.
అనుష్క అందంగా వుంది. అంతకంటే ఇంకేంలేదు.
వేంకటేశ్వర పాత్రధారి సౌరభ్ జైన్ అందంగా, ఆకర్షణీయంగా వున్నాడు. మంచి నటన ప్రదర్శించాడు.
రావురమేష్ గురించి ప్రత్యేకంగా ప్రతిసారీ చెప్పుకోనక్కర్లేదు. ఆయనెలాగూ ప్రత్యేకమే!
పరుచూరి సోదరుల బారినుంచి బయటపడి(షిరిడీసాయికి వాళ్ళే) చాలామంచిపని చేశారు. భారవి సంభాషణలు ఇట్టే తెలిసిపోతాయి.
ఇక కీరవాణి ఈచిత్రానికి ఆక్సిజనూ, సెలైనూ..అన్నీ!
ఎంత అందమైన బాణీలు! నేపథ్యసంగీతం! హాయిగావుంది.
ఆద్యంతం వర్ణమయం. అద్భుతమైన రంగుల కలయిక, అపురూపమైన మనోహర దృశ్యాలు చూడాలంటే గోపాల్ రెడ్డిలాంటివాళ్ళు, కళాదర్శకుడు ప్రాణం పెట్టేస్తే ..ఇదిగో ఇలావుంటుంది.
సినిమాలో చెడు:
ప్రగ్యా జైస్వాల్ అనే పిల్లని 'కంచె'దాటించి బత్తాయి వొలిచినట్టు వొలిచేశాడు ముసలోడు. అత్యంత అనవసరమైన పాత్రలో అందాల్ని పారబోసేసింది. ఇక ఏరుకోడం కూడా కష్టం. పాటవ్వగానే మటుమాయమవ్వడం ఎంత అప్రదిష్టగా అనిపించిందో!
జగపతిబాబు పాత్ర కూడా కథ ముందుకెళుతోంటే మనకాళ్ళకడ్డం పడుతుంది. 'అనుష్కని పెట్టేసుకున్నాం! పాట లేపోతే ఎలా?' అని అనుకున్నట్టున్నాడు పెద్దాయన. జగపతిబాబు, అనుష్కల మధ్య మరో అసందర్భపు ప్రదర్శనా కార్యక్రమానికి నుడికారం చుట్టాడు.
ఒత్తులు. నాగార్జునుడి నోటివెంట ఒత్తులు మరోసారి మర్యాదగా తప్పుకున్నాయి. గునగనాలు, బవబందాలు, బక్తిమార్గం...రాళ్ళతో అన్నం వండుకుని అందులో కొంచెం బియ్యం కలుపుకున్నట్టనిపించింది.
ఇక పట్టపగలు కొండలమధ్య పాచికలాడుతూ ఘంటానాదం విన్న స్వామివారు 'సుప్రభాతానికి వేళయింది!' అనడం హాస్యాస్పదంగా వుంది. కొంచెం అలాంటివి చూసుకో సామీ!
ప్రశంసలు, విమర్శలు:
'వేయి నామాలవాడ...' పాట రమ్య చాలా రమ్యంగా పాడింది. మంచి బ్రేక్ ఇచ్చేపాట రమ్యకి. ట్యూన్, కోరస్, వేదవ్యాస్ రచన..అద్భుతంగా అమిరాయి. చిత్రీకరణలో డాన్సులు..నిజంగా డాన్సుల్లానే వున్నాయి. నృత్యాల్లా లేవు. కానీ కన్నులపండుగలా చిత్రీకరించాడు రాఘవుడు. హేట్సాఫ్!
'కొటికొటి దండాలయ్యా...' అనేదిమాత్రం బాలేదు. మరీ ముద్దుగా అనేసింది. కోటికోటి దండాలయ్యా అనే ఆస్కారముంది. కావాలంటే కీరవాణిగార్నో, కోరస్ నో అడగండి. వాళ్ళు బానే అన్నారు.
శ్వేత, శరత్ సంతోష్ పాడిన 'ఆనందం' పాట..
శరత్ చాలాబాగా పాడాడు. అతని తెలుగు ఉచ్చారణ హాయిగావుంది. శ్వేత అద్భుతమైన గాయని. కానీ...' చిన్ని ఆనందం కాదు అది చిన్మయానందం!' అనడానికి 'కదుఅది..కదుఅది...' అంటూ పాటంతా పాటుపడింది.
దానిబదులు 'కాదది చిన్మయానందం' అనిపాడిస్తే సరిపోయేదేమోనని అనిపించింది. మొత్తంమీద పాట వినడానికీ, చూడ్డానికీ(?? బత్తాయిలు) బావుండే పాట!!
ఇక 'కమనీయం కడురమణీయం శ్రీవేంకటేశ్వర కళ్యాణం!' పాటని బాలు పాడిన విధానం ఎంత హృద్యంగా వుందంటే, ఆ ఏడుకొండలవాడికి అతనే కాళ్ళుకడిగి కన్యాదానం చేస్తున్నాడన్నంతగా!
ఇక ఆపాట గురించి నేను మాటాడలేను. ఎంత రమణీయంగా చిత్రీకరించాడంటే..మనకి కళ్ళలో నీళ్ళుతిరిగాయి. పదేళ్ళు పడుతుంది మళ్ళీ అలాంటి పాటేదయినా రావాలంటే!
ముక్తాయింపు:
'పొడగంటిమయ్యా మిమ్ము...'
'దాశరథీ! కరుణాపయోనిధీ...'
'మహాప్రాణనాథం...'
'ఒక్కడే దేవుడు...'
'బాలుగారు, శంకర్ మహదేవన్ లాంటి సీనియర్లు కాకుండా ఇలాంటి పాటలు ఇంకెవరైనా పాడ్డం చాలా కష్టఁవండీ బాబూ!' అని అనేసుకుని ఓ..తమిళంలో తెగ బాధపడిపోయేవాళ్ళం.
ఇదిగో..వచ్చాడు వారసుడు!
శరత్కాల పున్నమిలా సంతోషాల్ని నింపడానికి తెలుగింటి 'బాలు'డు!
కష్టసాధ్యమైన 'అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా!' పాట పాడడానికి....
'హరిహరా'దులు దిగిరానవసరం లేదనీ...
'హరిచరణా'లను పట్టుకోవలసిన అగత్యంలేదనీ...
'శంకరా మహదేవా!' అని వేడుకోనక్కరలేదనీ...
నిరూపించాడు.
ఈపాట శరత్ సంతోష్ నిజరూపదర్శనం.
చివర్న బయటికొచ్చేసేముందు విష్ణుమూర్తి విశ్వరూపం చూపించారు.
ఇంటికొచ్చేసిన తరవాత కూడా ఇతగాడి గానం వెంటాడుతూనేవుంది.
సినిమా చూడండి. బావుంది.
ఇది 'నా' రివ్యూ!

..........జగదీష్ కొచ్చెర్లకోట


0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive