Latest Posts

Content

Sunday, November 18, 2018

నాన్డిటైల్డ్ లెటర్

పెద్దాడికి ప్రేమతో... మొన్నేఁవైందో తెలుసా? మనూళ్ళో కొత్తగా బట్టలకొట్టొకటి పెట్టారు, అదేలే..షాపింగ్ మాల్! కొత్తగా మెరిసిపోతోందని, ఓమారు చూద్దాఁవని వెళ్ళాం నేనూ మీఅమ్మ! బయట్నుంచి చూస్తే లోపల చాలామంది జనం కనబడ్డారు. ‘అబ్బో, జనం బానేవున్నారు. మంచి కలక్షన్ పెట్టుంటాడు! పద!' అని లోపలికెళ్ళామా? హాఛెరం! అవన్నీ బొమ్మలు. సూట్లేసుకుని ఓనలుగురూ, చీరలుకట్టుకుని ఓముగ్గురూను. ఎంత తెలివి? అవిచూసి మేం బొమ్మల్లా నోళ్ళుతెరుచుకు చూస్తోంటే “ఏంకావాల్సార్?" అని మాపక్కనించి గుసగుసగా అడిగాడు. ‘ఫార్మల్స్!' అన్నాను కేజువల్ గా! ‘ఫోర్త్ ఫ్లోర్! నాతోరండ'ని లిఫ్ట్‌లో తీసుకెళ్ళాడు. వెధవలిఫ్టు చాలా స్లోగా ఏడిసింది. మేడమీదకెళుతున్నాఁవో, మార్స్ మీదకెళుతున్నాఁవో అర్ధంకాలా! చాలాదూరం ప్రయాణంచేసాక ‘జెంట్స్ వేర్'కి వచ్చాం. పాపం, అక్కడున్న ఇద్దరు కుర్రాళ్ళు.. వినయ్ ఒకడిపేరు, గౌరవ్ ఇంకొకడూ! ఓపిగ్గానే చూపించారు బట్టలన్నీ! ఇంతలో అక్కడికి నల్లసూటేసుకున్న సూపర్‌వైజర్ ఒకతనొచ్చి “ఇవన్నీ ఎందుకురా? సార్ కి మొన్నొచ్చిన కొత్తస్టాకు చూపించండి!" అనెళిపోయాడు. అరగంట వెతికి రెండు కేజువల్స్ తీసుకున్నాను ఫార్మల్ కని వచ్చి! బిల్లింగ్ సెకండ్‌ఫ్లోరంటే మళ్ళీ లిఫ్టెక్కి అంతప్రయాణమూ చేసాం. అసలు కథ ఇక్కడే మొదలైంది. జేబులో చూస్తే సెల్ లేదు. అసలు నేనారోజు వేసుకున్న టీషర్టుకి జేబే లేదు! మొబైల్ ట్రయల్ రూంలో వదిలేసానని గుర్తొచ్చింది. గబగబా వెళ్ళి చూస్తే దొరికిందిలే! నేను ముందునించీ చెప్తూనేవున్నా! నాకు జేబుల్లేని టీషర్టులవీ వద్దురా అని! నువు వింటేగా? అసలే నాకు జేబులో ఔరంగజేబు సామ్రాజ్యమంత సామానుంటుంది. ....ఒకపక్కకి చూస్తే కాణీపాకం వినాయకుడు, ఏంగిలు మారిస్తే తిరపతి బాలాజీ..ఇద్దరూ కనబడే కార్డా, ....డబ్బుల్లేకపోయినా గీతలు కొట్టుకోడానికి పనికొచ్చే స్టేట్‌బేంక్ ఏటీయమ్ కార్డా, ....డబ్బులున్నా ఎప్పుడూ ‘నో క్యాష్' అన్చెప్పే ఆంధ్రాబేంక్ ఏటీయమ్ కార్డా, ....నెంబరు అరిగిపోయిన పాన్‌కార్డా, ....ఫోటో దగ్గర విరిగిపోయిన డ్రైవింగ్ లైసెన్సా, ....ఇవన్నీ కాకుండా మొన్నామధ్య ట్రెండ్స్ లో అంటగట్టాడు చూడూ కార్డొకటి! గుర్తులేదూ? ఎప్పుడెళ్ళినా ‘సర్వర్ డౌన’ని చెప్పి పాయింట్లు యాడవ్వలేదంటాడే...! ఆ..ఆకార్డొకటి! ఇన్ని పెట్టుకోవాలి జేబులో. ఇక సెల్లు! బాడీలో మిగతా సెల్స్ లాగే ఇదీనూ! వదల్లేంగా? పోనీ పేంటు జేబులో పెడదామంటే దేవుడిగదిలో పీటలా ఎంతుందో చూడు! ఇది ప్యాంటు జేబులో పెట్టుకుని మొన్న మర్చిపోయి కార్లో కూర్చుండిపోయాను. బల్లెంలా కడుపుకింద గుచ్చుకుంది. ఒక్కక్షణం మీరంతా గుర్తొచ్చేసారు తెల్సా? ‘ఏఁవైంది సార్?' అంటూ హింసపెట్టేసాడు పార్కింగ్ బోయ్ నామొహం చూసి. ఏంచెప్తాం? ముసలాడికి దసరాపండగనీ.. ఈ మోడ్రన్ టీషర్టులు నాకెందుకుచెప్పూ? మీఅమ్మేమో పొట్టివానికి పుట్టెడంగీలంటుంది. “బీరువా తీస్తే మీదడిపోతుంటాయి ఈనగారి బట్టలు. కేవలం నీవొక్కడి బట్టలకోసం ఒకిల్లు కొనుక్కోవాలి" అంటూ నామీద సెటైర్లూ! మొన్నటికిమొన్న ఆ కొత్తజీన్సూ అలానే చేసావ్! నేనెప్పుడు కొనుక్కున్నా బిల్లింగ్ దగ్గరకొచ్చేటప్పటికి కౌంటరు కుర్రాడు “సర్! ఎనీ ఆల్టరేషన్?" అనడుగుతాడు నన్ను, నా హైటూ చూసికూడా! శాడిజం కదా? నువ్వేమో ఫైవ్ స్టార్ చాక్లెట్ ఎడ్వర్టయిజ్‌మెంట్లోలా ‘‘మా డాడీ పేంటూ...సగానికి కట్ చెయ్యండి'' అని మొహమాటంగా చెబుతూవుంటావు! వాడు నాక్కనబడకుండా ముసిముసినవ్వులు నవ్వేసుకుంటూ “నిన్నే వచ్చింద్సార్ స్టాకు. ఫస్ట్ పీస్ మీదే! ఇటాలియన్ బ్లెండ్" అంటాడు నన్ను ఊరుకోబెట్టాలని! అక్కడికేదో నేను రాహుల్ గాంధీ అన్నట్టు. వాళ్ళ కబుర్లకేంలే? పెళ్ళికూతుర్ని బుట్టలో కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టేస్తారు మాటల్తో! ఆరోజుమాత్రం నువ్వొచ్చి “నాన్నా! కటింగొద్దునాన్నా! ఫోల్డ్ చేసెయ్! బానేవుంటుంది!" అన్నావా? నీమాటట్టుకుని నేను ఈఒక్కసారీ చూద్దామని తెచ్చేసుకున్నాను. తీరా హాస్పిటల్‌కెళ్ళేముందు వేసుకుంటే ఎంత మడతెట్టినా ద్రౌపది చీరలా పొడవు తగ్గదే? ఆఖరికి అది విప్పేసి పాత ప్యాంటే వేసుకుపోయాను. ఆరోజు అరగంట లేటు. ఈమధ్య ఐరిస్సొకటి పెట్టేసారు హాస్పటల్లో! అక్కడ నెంబరుకొట్టి బైస్కోపులో ఎర్రలైటు చూస్తోంటే నీలంలైటు ఆరిపోవాల్ట! నాకు నీలంలైటుమీదే దృష్టంతా..ఆరిందా లేదా అని! దాంతో ఆ కుర్రాడేమో “సార్! మీరు ఎర్రలైటునే చూడండి. నీలంలైటు దాన్ని చూడకపోయినా ఆగిపోతుంది" అని అరిచాడు. “మీకే ఎందుకలా అవుతోంది? ఇంకెవరికీ అలా అవ్వలేదు!" అన్నాడు పైపెచ్చు. సరే మొత్తానికి అలవాటు చేసాళ్ళే! ఈ ఐరిస్ దగ్గర వీధికుళాయిలా బోల్డుమంది జనం! అందరం ఒకసారే వస్తాంగా! పెళ్ళిచూపుల్లా ఒక్కొక్కరికీ రెండుసార్లు ఫెయిలయ్యాక మూడోసారి అవుతోంది! మొత్తానికి దీనివల్ల రోజూ ఆలస్యమే! దానికితోడు ఈ ప్యాంటువల్ల పావుగంట పోయింది! అంచేత నేచెప్పే కథలో నీతేంటంటే... మాకీ జన్రేషన్ మీకీ జన్రేషన్ కన్నా బహుత్ పీఛే! కృష్ణనీ, గౌతమ్ కృష్ణనీ ఒకే సినిమాలో చూడాలనుకో! తప్పులేదు. కానీ ఒకేరకం బట్టలేస్తే అసియ్యంగా వుంటుంది. నిజ్జం! ‘నాగార్జునా, వెంకటేషూ వెయ్యగాలేంది..అంతకంటే చిన్నాడివి నీకేంటి నాన్నా?' అనేదో అంటున్నాడు వెనకనించి నీతమ్ముడు! వాళ్ళ సెల్ ఫోన్లు వాళ్ళ పియ్యేలు పట్టుకుతిరుగుతారు. మరి నాకలాక్కాదే? అప్పుడప్పుడు ప్రాణాయామం పేరుతో ఊపిరైనా ఆపుతాంగానీ వైఫై ఆపాఁవా చెప్పూ ఇంట్లో ఎప్పుడైనా? మరిక వుంటా! జైల్నించి ఇందిరాగాంధీకి నెహ్రూగారుకూడా ఇలానే వుత్తరాలు రాసేవార్ట! అవన్నీ అట్టేపెట్టి మాచేత చదివించేవారు! అంత డీటైల్డుగా రాసినా నాన్-డిటైల్డనే అనేవాళ్ళం మేం అదేంటో!? అలానే ఇదీ గూగుల్ డ్రైవ్ లో అట్టేపెట్టుకో! పెద్దయ్యాక పెద్దగా ఉపయోగంలేకపోయినా ‘మానాన్న నా మానాన నన్ను వదిలెయ్యకుండా రాసిన లేఖం'టూ చూపించుకుందూగాని! .......జగదీశ్ కొచ్చెర్లకోట

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive