Latest Posts

Content

Sunday, November 18, 2018

తాగమని నన్నడగవలదు

‘‘అస్సలు తాగవా?'' నమ్మకం కుదరట్లేదు వాడికి. శివుడు గరళం మింగలేదన్నా నమ్మేస్తాడుగానీ నేను మందెయ్యనంటే నమ్మట్లేదు. ఆ నిజం వాడికి విషం మింగినట్టుంది!

‘‘లేదురా! వచ్చేజన్మలో ట్రైచేస్తాను, ఈసారికొదిలెయ్యండి!'' ఆవు,పులి కథలో ఆవులా వేడుకుంటున్నాను. అయితే అక్కడ చాలా పులులున్నాయి. ఒక పులి మిగతావాటిని కసిరింది. బలవంతపెట్టొద్దంది.

‘‘ఆడి పద్దతాడిది. మనకెందుకు? మందు మిగులుద్ది. పోనీ థమ్సప్పేనా తాగుతావా?'' వాడు నన్ను సపోర్ట్ చేస్తున్నాడని మీరు నమ్మాలి. కాలేజీలో ఏదో తప్పించేసుకున్నా పీజీ హాస్టల్లో మాత్రం దాదాపు రోజూ ‘మద్య'తరగతి సమావేశాలు జరుగుతూ వుండేవి. అవి ఎప్పుడూ శిఖరాగ్ర సమావేశాలే!

కొంతమంది ఎన్ని రౌండ్లేసినా గుళ్ళో విగ్రహంలా నిగ్రహంతో వుండేవారు. ఇంకొంతమంది మొదలెట్టిన పదినిమిషాలకే మొదలెట్టేసేవారు. అరుపులు, కేకలు, తలుపులు, బద్దలు...! మర్నాడు అవన్నీ చెప్తే వాళ్ళు నమ్మేవారు కాదు. ఇంకొకడు పగలు కొట్టినా సమాధానం చెప్పేవాడు కాదు. రాత్రి మందేస్తే మాత్రం కుండపగలగొట్టి మరీ చెప్పేవాడు..అంటే... మాకు హాస్టల్లో ప్రతి వింగ్ కీ మంచినీళ్ళ కుండలుండేవి. వాడు రోజుకో కుండ పగలగొట్టేసేవాడు. పైన అమ్మాయిల రూములుండేవి. వాళ్ళు గోల. చదువుకోనివ్వట్లేదని. అదో సరదా! వినోదం. మళ్ళీ ఈ సన్నాసిగాళ్ళందరికీ మార్కులు బానే వచ్చేవి. ప్రస్తుతం అందరూ మంచి పొజిషన్లలో వున్నారు.

ఇక ఉద్యోగంలో చేరాక మళ్ళీ కొంతమంది విస్కీలో వాటర్‌లా నన్ను వాళ్ళలో కలిపేసుకోవాలని చూసారు. కానీ కలవలా! వీళ్ళు తెప్పించుకున్న కోకులూ, చిప్సూ దడదడలాడించేసేవాణ్ణి. ఒకడిదంతా గమనించి నన్ను బయటికి గెంటేసాడు.

‘‘ఆనందవనంలాంటి ఈచోట్లో ఇలాంటి చీడపురుగుంటే మనల్నికూడా చెడగొట్టేస్తాడు. పోరా పో! బయటకెళ్ళి కోక కట్టుకుని కోక్ తాగు! నీలాటోళ్ళకి ఇక్కడ ప్లేస్ లేదు. పోరా!'' అని పంపించేసాడు. అందరూ వాణ్ణి ఊరుకోబెట్టి నన్ను బతిమాలారు... ‘‘పోన్లే, జిన్నెయ్యచ్చు కదా? లేడీస్ డ్రింక్! నిమ్మకాయ పిండిస్తాను! ఏంకాదు. హేపీగా బండేసుకుని ఇంటిక్కూడా వెళిపోగలవు!'' అంటూ చిన్నప్పుడు అమ్మమ్మలా బతిమాలుతున్న అతని ఆప్యాయతకి కరిగి నీరైపోయాను. కానీ.....నీళ్ళే తాగాను.

ఇహ వీడితో కష్టమని ఎవడి బీర్లు వాడు తాగడం మొదలెట్టారు. ఇదీ చాలాకాలం సాగింది. ఆగండాగండి. మీకొచ్చిన డౌటనుమానం క్లియరైతేగానీ ముందుకెళ్ళాలనిపించదు. నాకుతెలుసు. ‘‘అంత తాగనివాడివి అసలక్కడికెందుకెళ్ళాలి?'' ఇది చాలా అమానవీయమైన ప్రశ్న. స్నేహం విలువ తెలిసినవారెవరూ అలా అడగరు. అంతా నావాళ్ళే! అన్నీ ఒకగూటి పక్షులే! ఎక్కడికి పోతాం? నేనొక్కణ్ణి తాక్కపోతే మిగతావాళ్ళని వదిలేసి సినిమాహాల్లో దూరలేం కదా?

ఇక రెండోవిషయం: ఆటైంలో పేలే జోకులు సహజంగానే హాస్యప్రియులమైన మాకు కర్ణపేయంగా వుండేవి. కొంతమంది పైక్కనబడరుగానీ భలే జోకులేస్తారు. కానీ వాళ్ళు ముందు మందెయ్యాలంతే! ఇంతమందిలోనూ ఒకతను చాలా విపరీతంగా తాగేస్తూవుండేవాడు. బానిసత్వానికి పరాకాష్ట! ఆరోగ్యం, డబ్బూ, ప్రాక్టీసు...మూడూ రిటర్న్ జర్నీలో వున్నాయన్న సమయానికి కుటుంబసభ్యులు ‘తాగేవ్యక్తికి తెలియకుండా మందు మాన్పించబడును' అనేచోట పెట్టారతన్ని....కానీ అతను మాన్పించే వ్యక్తికి తెలీకుండా తాగేస్తుండేవాడు! ఇంక చేసేదేంలేదని ఆ సెంటరాయన ఎంటరయిన వారానికే అతన్ని తిప్పి పంపించేసాడు.

అలా సాగిపోతున్న ఈజీవితనౌకకి అప్పుడప్పుడు రోడ్లమీద కొన్ని విచిత్రాలు కనబడుతుంటాయి. ఓ కొత్తకోలనీ తయారయితే మందులషాపుకన్నా ముందు మందుషాపు పెట్టేస్తారు. రాత్రుళ్ళయితే ప్రజాప్రయోజనార్థం పదకొండింటిదాకా తీసేవుంచుతారు. మావూళ్ళో బార్లన్నీ మాంఛి సెంటర్లలోనే వుంటాయి. సాయంత్రఁవయ్యేటప్పటికి అక్కడంతా ‘తీర్థ'ప్రజలతో నిండిపోతుంది. కాస్తంత తీర్థం పుచ్చుకుంటే మళ్ళీ ఎవరిదార్న వాళ్ళు వెళిపోతారు. కానీ తాగడానికి వందైనాలేని ‘మందు'భాగ్యులు నాటు తాగేసి నీటుగా రోడ్లమీదకొచ్చేస్తారు.

మొన్నరాత్రి కారేసుకుని హాస్పిటల్‌కి వెళుతున్నా! కవితాబార్ దగ్గర ఏదో ఉచిత భోజనం దొరుకుతున్నట్టు ఓ...కొట్టేసుకుంటూ తాగేస్తున్నారు. తాగేసి కొట్టేసుకుంటున్నారు. ఈలోగా మన కారుకి అడ్డంగా ఒకడు నిలబడి ట్రాఫిక్ పోలీస్ మోనోయేక్షన్ మొదలెట్టాడు. ఎంత హారన్ కొట్టినా కదల్లా! పక్కనున్నవాళ్ళు నన్నే తిట్టారు.....హారన్ కొట్టొద్దని!

అద్దం దించి కారణం చెప్పమని వేడుకున్నాను. “అలా పక్కనించి ఎలిపోండ్సార్! ఎందుకలా ఓ...ఆర్న్ కొట్టీడం?" అని ఒక మహిళామణి సెలవిచ్చింది. చేసేదేంలేక దారుణ వారుణవాహినీ పథకాల్నీ, నాలుగురోడ్ల కూడళ్ళ సాక్షిగా నిస్సిగ్గుగా బార్లముందు బారులుతీరి నిలబడ్డ నాదేశప్రజల్నీ కోపంగా కార్లోనే తిట్టుకుని వేచిచూసాను. కొంతసేపటికి వాడికి మళ్ళీ తాగాలనిపించి బార్లో దూరి నన్ను కరుణించాడు.

ఇవండీ నాజీవన‘మధు'ర తరంగాలు! ‘బారిష్టం' పార్వతీశాలందరూ నన్ను తప్పట్టుకోరనే ధైర్యంతో రాసేసానిదంతా!

.......జగదీశ్ కొచ్చెర్లకోట

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive