“నమస్తే డాక్టరుగారూ! మేడమ్ ఎప్పుడొచ్చేదీ?" బత్తయ్య పలకరింపుకి మెట్లెక్కుతున్న నేను మళ్ళీ వెనక్కొచ్చాను. రిసెప్షన్లో పెద్ద కుర్చీకి పూర్తిగా న్యాయం చేకూరుస్తూ నిండుగా వున్నాడు బత్తయ్య. అలిపిరి గెస్ట్ హౌసుకి మేనేజరతను.
పదింట ఎనిమిది వేళ్ళకి ఉంగరాలు, మెళ్ళో బలమైన పులిగోరుతో చూడ్డానికి ఎస్వీయార్లా గంభీరంగా వున్నా పిల్లలంటే విపరీతమైన ముద్దు. మాపెద్దాణ్ణి వాళ్ళుచేసినంత ముద్దు మేంకూడా చెయ్యలేదంటే నమ్మండి!
మనం తిరుపతి స్విమ్స్ లో ఒకేడాదిపాటు ఉద్యోగం చేసినప్పుడు అలిపిరి స్వామివారి పాదాలచెంత ఉండేవాళ్ళం. ఆ గెస్ట్ హౌస్ మొదటిఅంతస్థంతా మా రెసిడెంట్లకి ఇచ్చేశారు తితిదేవాళ్ళు. తనుకూడా ఉద్యోగం చేస్తున్నమీదట ఓ రెండునెలలు సెలవుపెట్టి పిల్లాణ్ణేసుకుని వచ్చేది. ఆ గదిలోనే వంటా గింటా!
గెస్ట్‌హౌస్ సిబ్బంది మా అందరితోనూ చాలా సఖ్యంగా ఉండేవారు. వైజాగ్ నుంచి మాకొచ్చే ఫోన్లన్నీ కింద రిసెప్షన్‌కే వచ్చేవి. అలా పరిచయం పెరిగేది వాళ్లందరితో!
ఆ భవనాన్ని ఆనుకుని అందమైన పూలతో, అరుదైన మొక్కలతో అద్భుతమైన ఉద్యానవనం. ఇక ప్రహారీలోపల బోల్డన్ని చెట్లతో పర్ణశాలలో వున్నట్టుండేది.
మా అంతస్థులో దాదాపుగా అన్ని గదులూ ఇచ్చేసినా ఓనాలుగు మాత్రం యాత్రికులకోసం అట్టేపెట్టేవారు. వాటిలో నిత్యం ఎవరో ఒకరు వుంటూనే వుండేవారు. హాస్పిటల్లో చచ్చేచాకిరీ చేసి వచ్చి పడుకుంటే తెల్లారే మూడింటికల్లా అరుపులు, కేకలు, పిల్లల ఏడుపులు, పరుగులు వినబడేవి. తీరా బయటకొచ్చి చూస్తే..
పట్టుచీర కట్టుకుని, స్నానంచేసిన తడిజుట్టు ఆరబెట్టుకుంటూ ఆ గదీ, ఈ గదీ తిరిగే ఆడవాళ్లు,
పట్టుపంచెల్ని జారిపోకుండా పట్టుకు తిరుగుతూ మగవాళ్లు,
పట్టరాని సంతోషంతో ముసలివాళ్లు,
పట్టుకోలేని వేగంతో పరుగులెడుతూ పదులకొద్దీ పిల్లలు!
వాతావరణమంతా కన్నడ కస్తూరి పరిమళాలు వెదజల్లుతూ వుండేది. ఆ సమయంలో వచ్చేది కర్ణాటక టూరిజం బస్సుకదా మరి! అక్కడంతా సువాసనలతో కూడిన సుమధుర దృశ్యాలే! అవిచూసి మాకు నిద్రమత్తు వదిలిపోయేది. సుమారుగా రోజూ ఇదేతంతు!
వాళ్లకి ఉదయాన్నే ఒక నిర్ణీత సమయంలో దర్శనం ఏర్పాటు చేస్తాడు బస్సువాడు. అదీ హడావిడి. నాకలా తెల్లారగట్ట సందళ్లంటే చాలా ఇష్టం. పైపెచ్చు అంతా సాంప్రదాయ పద్ధతిలో! గెస్ట్‌హౌస్ వాళ్లకి కొన్ని పద్ధతులవీ ఉంటాయి. ఆ సమయాన వేంకటేశ్వర సుప్రభాతం, ప్రపత్తి వినిపించేవారు.
ఈ బస్సు వెళిపోతే మా వరండాలన్నీ బోసిపోయేవి. ప్రతీ వరసలోనూ చజవర్న గీజరుంటుంది. అక్కడ బక్కెట్ పడేసి నెమ్మదిగా దినచర్యలోకి దిగేవాళ్లం.
ఒకసారి ఎవరిదో తెలుగు కుటుంబమైతే నాలుగాకులు ఎక్కువచదివింది. పిల్ల పెళ్లి మంగాపురంలో చేసేసి మా గెస్ట్‌హౌసులో శోభనం పెట్టుకున్నారు.😜 పైపెచ్చు మా పక్కరూమే! రెండుగంటలసేపు ఆ జనమంతా చేసిన హడావిడి అంతాయింతా కాదు.
హాస్పిటల్లో బాగా అలసిపోయి సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఎవరెవరో మా బ్లాకంతా తిరుగుతూ కనబడ్డారు.
పువ్వులు, పళ్లూ బుట్టలతో తెచ్చి చడీచప్పుడూ లేకుండా ఆ గదిలో అలంకరించేశారు. అందరూ ఆశ్రమవాసుల్లా నిశ్శబ్దంగా సంచరిస్తోంటే నాకు అనుమానం వచ్చి తనని అడిగాను.
తనిలా శోభనమని చెప్పగానే నాకు నవ్వాగలేదు.
అప్పుడే రామ్ రాజ్ గ్రూప్‌థియేటర్స్ లో అన్నమయ్య సినిమా రిలీజయింది కొత్తగా. అందులో పాటలన్నీ అరగదీసేస్తుండేవాళ్ళం. వీళ్ళ తతంగం చూసి నాకో కొక్కిరాయి ఆలోచనొచ్చింది.
ఫిలిప్స్ టేప్‌రికార్డర్‌లో ‘శోభనమే...శోభనమే' అన్నపాట పే....ద్ద సౌండుతో పెట్టాను. తను గొడవ. బాగోదు..ఆపేయండంటూ! ఏంటి బాగోనిది? మాకొలీగ్సందరూ బయటికొచ్చేసి నవ్వులే నవ్వులు! అదో ప్రహసనం!
ఇక మా డిపార్ట్‌మెంట్‌లో ఆరుగురు అనెస్తీషియా టెక్నీషియన్లు పనిచేస్తుండేవారు. అందరితోనూ చాలా సరదాగా వుండేవాణ్ణి. మేమందరం కలిసి కొండమీదకి స్కూటర్లమీద వెళిపోతూండేవాళ్లం..
మా ఐడీ కార్డ్ ఒక వజ్రాయుధంలా పన్జేసేది కొండమీద. త్వరత్వరగా దర్శనాలవీ అయిపోతుండేవి. ఇక నడిచయితే చాలాసార్లు వెళ్ళాం. సాధారణంగా కుటుంబంతో వెళితే మూడునాలుగ్గంటలు పట్టే ఆ కొండ, వాళ్లతో గంటన్నరలో ఎక్కేసేవాణ్ణి!
తను రాకముందు చాలాకాలం స్విమ్స్ నుంచి మా గెస్ట్‌హౌసుకి నడిచి వచ్చేవాళ్లం. ముందు మెడికల్ కాలేజీ, తరవాత రుయా హాస్పిటల్. ఒకటే రోడ్డు...తిన్నగా!
బాగా దట్టమైన మబ్బులవీ కమ్ముకున్న సాయంసమయాల్లో అలిపిరి కొండల మీద తెల్లటి మేఘాల్ని చూస్తే పైన ఉత్తరీయంలా కప్పుకున్న ఆమూర్తి భుజస్కందాల్లా వుండేవి!
దారిపొడవునా అశోకవృక్షాలు స్వామి సేవకై వేచివున్న భక్తకోటిలా అనిపించేవి!
గతుకులెరుగని ఆ దారి పేదవాడికి నిరంతరం మెతుకందించే అన్నదాన సత్రానికి మార్గంలా తోచేది!
ఆ మనోహర దృశ్యం రోజూ కొత్తగా వుండేది.
ఎన్ని సూర్యోదయాలైనా చూడాలనిపిస్తుంది.
ఎంతసేపయినా సముద్రంచెంత ఉండాలనిపిస్తుంది.
అమ్మచెప్పే కబుర్లు ఎన్నయినా వినాలనిపిస్తుంది.
ఏ పసిపాప నవ్వూ విసుగనిపించదు.
అచ్చం అలాగే ఈ తిరుపతి కొండ!
చూసినకొద్దీ ఒకరకమైన ఆధ్యాత్మిక భావన!
అన్నమయ్యను తలచుకుని ఒక్కోసారి కళ్లనిండా నీళ్లు చిప్పిల్లేవి. ఆ స్వామిని నిరంతరం తన భావనాతరంగిణుల పుష్కరిణిలో ఓలలాడించిన ఆ మహితాత్ముడి జీవనయాత్ర తలచుకుని అలా అనిపించేది.
డబ్బుకోసమో, పేరుకోసమో చేశాడా అంత సేవ? ఒక్క పోస్టు పెట్టి రాత్రయ్యేవరకూ ఎన్ని లైకులొచ్చాయో లెక్కెట్టుకునే మనకి ఆ యోగి ప్రస్తావనకైనా అర్హతుందా అని?
తిరుపతిలో ఉన్నన్నాళ్లూ పుణ్యనదుల్లో స్నానమాడినట్లు పవిత్రమైన ఆలోచనలే! వ్యాపారాత్మక ధోరణి లేనివారెవరైనా ఆస్తికత్వమే ఆస్తిగా బతికేస్తారు ఆ వాతావరణంలో!
ఇక వెన్నెలరోజుల్లో అలిపిరినుంచి ఆ సుమనోహర దృశ్యం మరింత శోభాయమానంగా వుండేది. పైన విష్ణుమూర్తుంటాడంటే నమ్మెయ్యాలనిపించేది అదిచూస్తే!
ఒకసారి విరగబూసే వెన్నెల్లో వరదరాజస్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం. అడ్మిన్ భవనానికి సమీపంలో వుండే ఆ దేవాలయం ధవళవర్ణంలో మెరిసిపోతూండేది.
ఇక శీతాకాలంలో గోవిందరాజస్వామి ఆలయ మండపాలపై గంటలకొద్దీ గడిపిన క్షణాలు ఇప్పుడు తలుచుకుంటే అది మేమేనా అనిపిస్తుంది! ఆ దేవాలయ ప్రాంగణంలో ఉండే వందలాది దుకాణాల్లో తీరికగా చేసే పిచ్చి షాపింగ్ కూడా భలే బావుంటుంది. తీరా ఇంటికొచ్చి సంచి బోర్లిస్తే సరుకేదీ కనబడనంత పిచ్చి షాపింగది. అయినా భలే సరదా! దేదీప్యమానంగా వెలిగే లైట్లమధ్య ‘ఓం......!’ అంటూ వెలిగే వెంకటేశ్వర స్వామి పటాలు, చందనం బొమ్మలు, వంటసామాన్లు, సీడీలు...ఒకటేమిటి, అన్నిటినీ పలకరిస్తూ పులకరించిపోయేవాళ్లం.
జేబులో డబ్బులవీ పెద్దగా లేకపోయినా ఏమిటో ఏమీ అనిపించేదికాదు. స్టైపండ్ వచ్చినరోజయితే భీమాస్‌లోనో, ఉడిపి లక్ష్మీనారాయణ భవన్‌లోనో సుష్టుగా తినేసి, విష్ణు ప్యాలెస్ హొటల్ దగ్గర షాపులో కిళ్లీ కట్టించుకుని గ్రూప్ థియేటర్లలో దూరిపోయేవాళ్లం.
ఎందుకంటే సెల్ ఫోన్లు, ప్రాక్టీసు, ఈర్ష్యాసూయలు లేని రోజులవి! ఏకైక వినోదసాధనం సినిమా!
మా గెస్ట్‌హౌస్ ఎదురుగా ‘హిల్‌వ్యూ రెస్టారెంట్’ అని ఒక పెద్ద హొటలుండేది. అందులో ఎప్పుడూ ఏదీ దొరికేదికాదు. కానీ మాకోసం పాల పేకెట్లు తెప్పించేవాడు షావుకారు. నరకం చూపిస్తున్నాడని దానికి నేను ’హెల్‌వ్యూ రెస్టారెంట్’ అని పేరుపెట్టాను. ఒకసారి ఎవరికో అడ్రెస్ కూడా అలాగే చెప్పేశాను ఖర్మ!
బత్తయ్యతో సహా మిగతావాళ్లు ఎవరైనా సరే కొండమీదకెళ్లిన ప్రతిసారీ లడ్డూలు తెమ్మని అడిగేవాళ్లం. అభిమానంగా తెచ్చిచ్చేవారు.
ఇక మాతోపాటు కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో పనిచేసిన డాక్టర్ భరద్వాజ గారి కుటుంబం, మా కుటుంబం ఇప్పటికీ అదే అలవరసలమీద స్నేహాన్ని కొనసాగిస్తున్నాం.
వాళ్ళబ్బాయీ మాపెద్దాడూ ఒకీడువాళ్ళే! ఇద్దరూ కలిసి గెస్ట్ హౌసుని ఒకాట ఆడించేసేవారు. ఇప్పుడిద్దర్నీ మెడిసిన్ ఒకాట ఆడుకుంటోందనుకోండి!😜
మరపురాని మధురక్షణాలు మీతో పంచుకోవాలనిపించింది. మరుక్షణం మనసుకి తోచింది మీముందుంది!
........జగదీశ్ కొచ్చెర్లకోట
0 comments:
Post a Comment