Latest Posts

Content

Sunday, June 26, 2022

సరదాగా సిగరెట్




‘బాగా చలిగావుంది కదా?’

‘అవును. ఈయేడు మరీ ఎక్కువగా ఉందిట. ఇందాక డ్యూటీరూములో నవీన్, మూర్తీ అన్నారు!’

‘ఇక్కడన్నీ ఎక్స్ట్రీమ్సే! సమ్మర్‌లో యాభైదాకా పోతుందిట! గాల్లో ఎగురుతున్న పిట్టలు కూడా ఠప్పని రాలిపడిపోతాయిట! ఓపీలో పుష్ప సిస్టర్ చెప్పింది!’

‘అవునా! బాబోయ్, ఈలెక్కన సమ్మర్ మనమిక్కడ ఉండకపోవటం మంచిదేమో!’

డ్యూటీ అయిపోయింది. ఇద్దరం క్వార్టర్స్ వైపు నడుస్తున్నాం. రాత్రి తొమ్మిదింపావైంది. ఊళ్లో ఆడవాళ్లంతా నల్లచీరలు ఆరేసుకున్నట్టు మొత్తం చిమ్మచీకటిగా ఉంది రోడ్డంతా! ఈ బొగ్గుగనులుండే ఊళ్లన్నిటా రోడ్లమీద నల్లటిమట్టి బొగ్గుతో కలిసి మెరుస్తూ ఉంటుంది.

‘సిగరెట్ కాలుద్దామా సరదాగా?’ అన్నాడు రాంబాబు సడన్‌గా.

‘ఏంటీ?’ అన్నాను ఉలిక్కిపడి. అదేదో ఐఎస్ఐలో చేరదామా అని అడిగినట్టనిపించింది నాకు. 

‘ఒకసారి చూద్దాం జగదీషూ! ఎప్పుడూ కాల్చలేదుకదా? సరదాగా ట్రైచేద్దాం. అలవాటుకోసం కాదు.’

ఒక్కసారిగా నాకు నాన్నగారు గుర్తొచ్చారు. ఆయన ఒకప్పుడు నిత్యాగ్నిహోత్రుడు. అంటే కేవలం ఒకటే అగ్గిపుల్ల ఉపయోగించి రోజంతా ఓపెట్టె చార్మినార్ ఊదేసేవారు.అయిపోతున్న సిగరెట్టుతో కొత్త సిగరెట్టు ముట్టించడమేతప్ప మాటిమాటికీ అగ్గిపుల్లలు వెలిగేవికావు. 

ఆయనకి సిగరెట్లు తెచ్చిచ్చిన చేత్తోనే పప్పుండలు, న్యూట్రిన్ చాక్లెట్లు కొనుక్కుని బొక్కేసిన బ్యాచ్ మనది. 

అంతేకాకుండా ఈ ఖాళీ సిగరెట్టు పేకెట్లన్నిటినీ సేకరించే అలవాటు కూడా ఉండేది నాకు. చార్మినార్, బర్కిలీ, పనామా ఎక్కువగా ఉండేవి అప్పట్లో. వాటి లోపలుండే బాక్స్‌ని బయటికి తీసి దానిమీద ఏదో ఒక మంచి బొమ్మ అంటించేవాణ్ణి. ఈ పైనవున్న పెట్టెకి అదే సైజులో తెరలాగా కత్తిరించి దానికొక దారంకట్టి వెనకనుంచి మెల్లిగా లాగితే ఆ అందమైన బొమ్మ కనబడుతుంది. ఆ బొమ్మలు తరచుగా మార్చేస్తూండేవాణ్ణి. ఈ ఆట చాలామంది ఆడేవారు. వారందరిలోనూ మనం ‘న్యుమరో యూనో’ అన్నమాట! అదో సరదా!

ఓయేడు ఆగస్టు పదిహేనుకి మావూళ్లో చాలా హడావుడి చేశారు. నాకు గుర్తున్నంతవరకూ జైఆంధ్రా ఉద్యమంలో భాగంగా ఆ సంవత్సరం ఓ పెద్ద ఊరేగింపు జరపాలని సంకల్పించారు. కోస్తాంధ్రాకు చెందిన అనేకమంది స్వాతంత్ర్యోద్యమ నాయకుల వేషాలు వేసుకుని అందరూ తలొక రిక్షాలోనూ ఊరేగారు. నాన్నగారికి చాలా ప్రస్ఫుటంగా కనబడే ముక్కు, భావస్ఫోరకమైన కళ్లూ ఉండేవని ఆయనచేత అల్లూరి సీతారామరాజు వేషం వేయించారు. 

కాషాయవస్త్రాల్లో బాణం పట్టుకుని, అమ్ములపొది పెట్టుకుని ఆయన కదలకుండా మెదలకుండా రిక్షాలో నిలబడి ఊరేగుతోంటే మేం అయిదుగురం ఆయన చుట్టూచేరి పలకరించి, చుట్టూవున్న మా వీధి బ్యాచ్‌కి గొప్పగా చెప్పడం మొదలెట్టాం. ఆయనేమో అస్సలు ఉలకరూ పలకరూ! మాకసలు అర్ధంకాలేదు. చూడ్డానికి సూపర్‌స్టార్ కృష్ణ కంటే ఆయనే బావున్నా అలా బిర్రబిగుసుకుపోతే ఇంకేం బాగు?

అయితే మా హడావిడే తప్ప ఆయనేమీ మాటాడకపోయేసరికి మా చుట్టూవున్న వెధవలంతా ‘ఆయన మీ నాన్న కాడ్రా! ఇంకెవరో?’ అనేసి మమ్మల్ని ఏడిపించారు. నాన్నగారు ఆరాత్రి ఎర్రటి మొహంతో ఇంటికొచ్చాక చెప్పారు అసలు విషయం. మాట్లాడితే మీసాలూ, గెడ్డం ఊడిపోతాయని మేకప్ చేసినతను చెప్పాట్ట. ఆ రెండు మూడు గంటలూ సిగరెట్టు సైతం కాల్చకుండా ఆయన ఎంత నరకం అనుభవించారో అదికూడా చెప్పారు పాపం! మేకప్పుతోపాటు అదొక హింస! ఆ రంగదీ పోవడానికి మూడురోజులు పట్టింది.

అయితే ఈ సిగరెట్ల విషయంలో ఒకరోజు అమ్మ చాలా గొడవ చేసేసింది. ‘అయిదుగురు పిల్లలు. అందరూ చిన్నవాళ్లు. బాధ్యతదీ ఉండొద్దా?’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది. ఆసమయంలో ఇంట్లో అమ్మమ్మ కూడా ఉంది. గూడెంనించి అప్పుడప్పుడు నర్సీపట్నం వచ్చి నెలేసిరోజులుండి వెళ్లేది అమ్మమ్మ. ఆవిడది చాలా విచిత్రమైన పద్ధతి. అల్లుడికి ఎదురుపడేదికాదు. నాన్నగారలా గుమ్మంలో కనబడగానే లోపలికెళిపోయేది. ఇక అక్కణ్ణుంచి శ్రుతిలయలు సినిమాలో సుమలతలా తలుపుచాటున నిలబడే మాటాడేది. అదికూడా చాలా పొదుపుగా! 

ఎప్పుడైనా నాన్నగారు అమ్మని ఏదన్నా అన్నా తనుమాత్రం అల్లుడుగారిని ఏమీ అనకుండా కూతుర్నే తప్పుబట్టేది. కానీ ఈ సిగరెట్ల విషయంలో మాత్రం ఆవిడ అమ్మతరఫున మాటాడింది. పిల్లలింకా చిన్నవాళ్లు. తెలిసీతెలియని వయసు. వాళ్ల చదువులవీ తీరాలి, ఆడపిల్లల పెళ్లిళ్లు చెయ్యాలి. ఇన్ని బాధ్యతలుండగా అలా ఆరోగ్యం, డబ్బు తగలెట్టుకోవద్దంటూ అమ్మ మొత్తుకుంటే, అమ్మమ్మ విన్నవించుకుంది.

ఏకళనున్నారో నాన్నగారు, ఒక్కసారిగా ఒట్టేసేశారు... మరిక జన్మలో సిగరెట్టనేది ముట్టనని! అయితే అలా నలభై యాభై సార్లు సిగరెట్లు మానేసి, మళ్లీ మొదలెట్టినవాళ్లను నేనెరుగుదును. కానీ ఆయన మాత్రం మాకందరికీ చాలా పెద్ద జర్కే ఇచ్చారు.

ఆరోజు మొదలు మరి సిగరెట్లు కాల్చలేదు. అన్‌‌ఫిల్టర్డ్ చార్మినార్ పెట్టెమొత్తం కాల్చిపడేసే నాన్నగారు అంత నిబద్ధతతో మానేసి తద్వారా మాకందరికీ ఒక ఉదాహరణగా నిలిచారు. ఏదైనాసరే మాటంటేమాటే! అమ్మకి నగలూ, చీరలూ ఎక్కువగా ఉండేవికావు. మాకోసమూ ఎటువంటి ఆస్తులూ కూడబెట్టిందిలేదు. అయితేనేం, ఒకసారి నిర్ణయమంటూ తీసుకుని మాటిచ్చిన శ్రీమతికి అదే పెద్ద బహుమానంలా భావించింది అమ్మమ్మ. అటుపిమ్మట మాయింట్లో సిగరెట్టనేది కనబడలేదు.

నాకు పదేళ్లవయసులో ముత్యాలముగ్గు సినిమా చూశాను. గోదారొడ్డున విరహోత్కంఠుడైన శ్రీధరంబాబు సిగరెట్ కాలుస్తోంటే అతగాడి కూతురే వచ్చి, సిగరెట్ అలా కాల్చకూడదని చెప్తుంది. ‘మరెలా కాల్చాలీ?’ అంటూ నవ్వుతూ అడుగుతాడు శ్రీధరం. ‘అసలు కాల్చేకూడదు. మొన్న మా క్లాసులో సి.బి.మురళిని మాష్టారు కొట్టారుగా?’ అనీ అనంగానే సగంకాల్చిన సిగరెట్టుని అవతలపారేస్తాడు. ఆ సన్నివేశం మనమీద చాలా ప్రభావం చూపెట్టింది. 

ఆ తరవాత నేను చాలా పుస్తకాల్లో సిగరెట్లు కాల్చడం గురించి చదివాను. పేద్ద పడవలాంటి కారులో ఓచేత్తో స్టీరింగ్ తిప్పుతూ, మరోచేత్తో స్టైల్‌గా సిగరెట్ కాల్చే యద్దనపూడి హీరోలు నాకు ఆదర్శంగా కనబడ్డారు. ఉంటే అలావుండాలి. ఎందుకీ వెధవబ్రతుకు? అనుకునేవాణ్ణి. 

ఆనక యండమూరి నవల్లో ఎక్కడో ఓదగ్గర సిగరెట్లు కాల్చే అబ్బాయిలంటే అమ్మాయిలకి నచ్చరని చదివాను. వాళ్ల పెదాలు నల్లగా ఉంటాయనీ, ఇట్టే పోల్చేస్తారనీ కూడా ఉంటుంది అందులో. 

నీవే నా ఊపిరంటూ ఊరేగడానికి అక్కడ మనకెవరూ గర్ల్‌ఫ్రెండ్సే లేరు. కానీ ఊపిరితిత్తుల గురించి ఆలోచించి ముందు సిగరెట్ల మీద విరక్తి పెంచుకున్నాను. తరవాత సంగతి తరవాత చూసుకోవచ్చని!

మెడికల్ కాలేజీలో చదివేటప్పుడు కూడా మా క్లాసులో ఈ ధూమకేతులు తక్కువే! ఒకవేళ కాల్చినా అమ్మాయిలకి కనబడకుండా ఏమూలకో పోయి ఊదేసేవారనుకుంటా! 

సరే ఇంకా ఏ సిగరెట్టూ కాల్చకుండానే రింగురింగుల పొగల్లోంచి ఫ్లాష్‌బాక్‌లోకి వెళిపోయిన నేను రాంబాబుతో కలిసి నడుస్తూ ఓ కిళ్లీకొట్టుముందు ఉన్నానని గమనించలేదు. చలి చంపేస్తోంది. ఎదురుగా శ్రీనివాస మహల్లో శారద, విజయశాంతి నటించిన అత్తాకోడళ్లు సినిమా ఆడుతోంది. అప్పటికే రెండుసార్లు చూసేశాం ఇద్దరం. హాలు గోడలమీద ‘పొగత్రాగరా...’ అని కనబడుతోంది. అన్ని ఊళ్లకిమల్లే అక్కడ కూడా ఎవడో ‘దు’ ని చెరిపేశాడు. 

ఇంకేం? వెంటనే ‘రెండు కింగ్స్ ఇవ్వు!’ అన్నాడు మావాడు స్టైల్‌గా.

గోల్డ్‌ఫ్లేక్ కింగ్స్ అనొచ్చుగా?

ఆ షాపతనికి మమ్మల్ని చూడగానే ‘వీళ్లకి బాగా అలవాటనుకుంటా!’ అని అనిపించాలని వాడి తాపత్రయం.

అతను మాత్రం మాయిద్దర్నీ గత మూడునెలలుగా గమనిస్తున్నాడు. మేం ఎంత పోటుగాళ్లమో అతనికి తెలుసు. 

అంచేత కాన్వెంట్ స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా తొలిసారి నృత్యప్రదర్శన చేసే నర్సరీ పిల్లల్ని చూసినట్టు మావైపు చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఓ రెండు సిగరెట్లు, ఒక గులాబీపువ్వు అగ్గిపెట్టె ఇచ్చాడు. 

మావాడు స్టైల్ ఎక్కడా చెదరనివ్వకుండా చాలా రెక్‌లెస్‌గా వాటినందుకుని నాకొక సిగరెట్ అందించాడు.

నాచేతులు ఒక్కసారిగా వణికాయి. ఏదో తప్పుచేసేస్తున్నామన్న ఫీలింగ్. ఒక్కసారిగా దగ్గుతున్న గుమ్మడి, దగ్గలేకపోతున్న అక్కినేని మొహాలు కనబడ్డాయి. తీరాజేసి ఓరెండుమూడు పప్ఫులు లాగిన తరవాత ఉక్కిరిబిక్కిరి అయిపోతేనో? ‘ఊరుగాని ఊళ్లో ఎందుకొచ్చిన ప్రయోగాల్రా సావీఁ!’ అని బతిమాలాను. కానీ మావాడు ఊరుకోలేదు.

అక్కణ్ణుంచి కాస్తదూరం వెళ్లిన తరవాత క్వార్టర్స్‌కి మలుపు తిరక్కముందే అంటించాడు. నేనూ అంటించి నోట్లోపెట్టుకుని ఓ రెండు మూడు సార్లు గట్టిగా పీల్చాను. అంత పొగా లోపలికి లాగేసుకోకూడదని, చాలావరకు బయటికి వదిలెయ్యాలని హెచ్చరించాడు. వీడికెలా తెలుసునూ ఇదంతా? 

కాసేపటికి బానే అలవాటయింది. ఏదో తెలియని ఆనందం. అదేమిటన్నది ఒకరితో పంచుకోలేంగానీ, ఒకరకమైన యుఫోరియా! సరే, ఇద్దరం అక్కడే నిలబడి కాల్చేసి, ఆనక ఇంటికెడదామని నిశ్చయించుకున్నాం. ఎందుకంటే మా పక్క క్వార్టర్‌లో రవి అనే ఇంజనీరు ఉండేవాడు. అతనో, అతని భార్యో మేమిలా సిగరెట్లవీ కాలుస్తుండగా చూశారంటే ముందు క్వార్టర్ ఖాళీచేయించేస్తారు. 

అయితే విధి అనేది ‘వినయవిధేయరామ’ సినిమాలో వివేక్ ఓబ్రాయ్‌లాంటిది. సరిగ్గా మాయిద్దరికీ ఒకేసారి లఘుశంక వచ్చింది. ఇద్దరం అలా చీకట్లో ఓమూలకెళ్లి పైపులు విప్పాం. ఇద్దరి పెదాలమధ్యా సిగరెట్లు వెలుగుతున్నాయి. ఆ కటికచీకట్లో రెండే రెండు ఎర్రటి నిప్పుకణికలు మెరుస్తున్నాయి మా నోళ్లముందు.

వాడు ఓ పెద్ద పఫ్ లాగేసి, చివరాఖర్న మిగిలిన బట్‌ని కిందపడేసి డిటెక్టివ్ యుగంధర్‌లా బూటుకాలితో నలిపేస్తూ ‘వెళ్దామా?’ అన్నాడు. అయితే నాకింకా శంక పూర్తవలేదు.

నేనూరుకోవచ్చుగా? 

‘ఒక్కనిముషం రాంబాబూ!’ అన్నాను.

అంతే! ఇంకేముందీ, ఆ సిగరెట్టు కాస్తా నోట్లోంచి కిందపడింది. నాకు ముందు ఏడుపొచ్చింది. ఆనక చాలా కోపమొచ్చింది.

‘లక్షణంగా సిగరెట్ కాల్చుకుంటోంటే అసలలా మాట్లాడిస్తారా ఎవరైనా? నీవల్లే బంగారంలాంటి సిగరెట్టు బుగ్గిపాలైందం’టూ వాడిమీద అరిచాను. 

నీదెప్పుడో అయిపోయి ఉంటుందనుకున్నాననీ, చీకట్లో కనబడలేదని, క్షమించమని వేడుకున్నాడు పాపం. 

అచ్చం నామొహంలా ఉంది నా తొలి పొగానుభవం. కదూ? 

ఇక ఆ తరవాత జీవితంలో మరి సిగరెట్టు ముట్టుకున్నదిలేదు. 

నాకుతెలుసు. అమ్మాయిలు కూడా ఏదో ఒక సందర్భంలో ఒకటీ అరా నాన్న దూరంగా పారేసిన సిగరెట్లో, తాతగారి దగ్గర కొట్టేసిన బీడీలో కాల్చి, అవసరంకంటే ఎక్కువగా దగ్గి, ఓవరేక్షన్ చేసే ఉంటారు. ఎందుకంటే తను ఇందాకే చెప్పింది చిన్నప్పుడు వాళ్ల కజిన్‌ ఎవరితోనో కలిసి తను రహస్యంగా బీడీ కాల్చానని! 

‘వై బోయ్స్ ఓన్లీ షుడ్ హేవ్ ఫన్?’ అంటుంది చూడండీ ఆపిల్ల? ఆఁ! అనుష్కాశర్మ! ఆ అమ్మాయంటే పిచ్చిష్టం తనకి! 

నా గోడమీద ప్రస్తుతం ‘దు’ చెరిపేశాను. అంచేత...

రండి. మీరుకూడా మీమీ తొలినాటి అనుభవాలను సిగరెట్టింపు ఉత్సాహంతో ఇక్కడ పంచుకోండి!

అదీ కథ! 



......కొచ్చెర్లకోట జగదీశ్

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive