"మగపిల్లాడివి నీకెందుకూ..ఆడపిల్లలు తింటార్లే చద్దన్నం!" చిన్నప్పుడు అమ్మ అలాగే అంటుండేది.
..........
"ఛిఛీ! ఆడపిల్లలా ఆ ఏడుపేంట్రా బాబూ!" బుద్ధితక్కువై ఎప్పుడైనా ఏడిస్తే స్కూల్లో మేష్టారనేమాట.
...........
"అయ్యో! మీరొదలండి. ఆడవాళ్ళం మేఁవుండగా మీరు కాఫీలందించడఁవేంటీ? ఇంకానయం!" ఏవైనా ఫంక్షన్లప్పుడు మనం ఓవరేక్షన్ చేస్తే పడే డైలాగు.
...........
మనకిష్టమైన చద్దన్నంలో గోంగూర పచ్చడేసుకుని ఓ వుల్లిపాయ నంచుకు తినాలంటే ఆడపిల్లగా పుట్టాలా?
కష్టమొచ్చినపుడు కరువుతీరా ఏడుద్దామంటే అదేదో ఆడవాళ్ళ హక్కన్నట్టు మధ్యలోనే ఆపేస్తారు.
ఒళ్ళొంచి పనిచేద్దామంటే ఆడాళ్ళొచ్చి చేతిలోంచి లాగేసుకుంటారు..లేదా కాళ్ళకడ్డం పడిపోతారు!
ఎలాండీ ఇలాగయితే? మళ్ళీ
పురుషాహంకారం, పులుసులో కారం అంటూ
లెక్చర్లు దంచుతారు, పిక్చర్లు దించుతారు!
అన్నానని కాదుగానీ...అసలు మొగాళ్ళకెన్ని కష్టాలో తెలుసాండీ? ఈ షేవింగొకటుంది చూసారూ! ఒక్కరోజు చెయ్యకపోతే స్కాచ్ బ్రైట్లా గరుగ్గా తయారైపోతుంది గెడ్డఁవంతా!
ఏదో స్మార్ట్ గా లేకపోయినా ఉన్నట్టు కనబడే ప్రయత్నం చేద్దామని ఎంచక్కా రోజూ షేవింగ్ చేసుకుంటే....
"ఈమధ్య నీకు పర్సనల్ అపియరెన్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగినట్టనిపిస్తోంది!" అంటూ సెటైర్లు!
పోనీ చెయ్యకుండా వెళ్ళామా..
"ఏట్సార్? డల్లుగున్నారు?" అంటూ కూపీ బ్యాచ్ రెడీగా వుంటుంది హాస్పిటల్లో!
ఇకక్కణ్ణుంచి ప్రతివాడికీ "ఏంలేదు..బానేవున్నా! పొద్దున్న కాస్తాలస్యమైపోయింది! అంచేత షేవింగవలేదు." అని గుడ్ మార్నింగ్ తోపాటు కలిపి చెప్పుకుంటూ రావాలి.
ఇహ జుట్టు.
నలుపో, తెలుపో నాలుగు వెంట్రుకలున్నాయికదా! వాటికి ఎంత సేవచెయ్యాలని!
ఏదైనా ఫంక్షన్ కి బయల్దేరేముందు రంగేద్దాఁవనుకుంటే "ఇప్పటికే లేటయిపోయింది. డై అనదర్ డే!" అంటుంది.
ఇకక్కడ ఫంక్షన్లో తనకి దూరంగా ఉండాలి. లేకపోతే తన ఫ్రెండ్సు కూడా మనల్ని అంకులంటోంటే మొహం పెంకులా పెట్టుకుతిరగాలి.
మా హాస్పిటల్లో రోజూవుండే యవ్వారఁవే అయినా ఆపరేషన్ల దగ్గర స్త్రీపురుష భేదం చాలా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పాపం..గైనకాలజిస్టు అమ్మళ్ళు ఆపరేషన్లవీ బానే చేస్తారు.
ఎప్పుడైనా బిడ్డ అడ్డం తిరిగిపోయి బయటకి లాగడం కష్టఁవైతే "సార్! ఓసారి రండి!" అనడం, నేను చెయ్యిచేసుకోడం...(అపార్ధం చేసుకోకండి...బేబీని బయటికి తియ్యడం), ఇవన్నీ నిత్యకృత్యాలే!
ఆ తరవాత ఓ అరగంటసేపు "ఏఁవైనా మేల్ ఫోర్సనేది డిఫరెంట్!" అంటూ స్తోత్రాలుంటాయి. కరక్టుగా అరగంట తరవాత మళ్ళీ రొటీన్ మొదలైపోతుంది. అదేనండీ, 'మీ గొప్పేఁవిటి బోడిగొప్ప!' అనడం!😳
ఇహ బేబీని డెలివరీ చేసేటప్పుడు ఎన్ని జోకులని?
ముందు బిడ్డ మొహఁవొక్కటే బయటకొస్తుందికదా! అది చూడగానే లేడీ డాక్టర్లు, సిస్టరమ్మలు ఊహాగానాలు మొదలెడతారు 'బాబా, పాపా' అని!
"క్యూట్ గా వుంది. పాపయ్యుంటుంది!"
"దొంగమొహంలా వుంది! బాబే అయ్యుంటాడు!"
ఇలాంటివి రోజూ వినికూడా మేఁవింకా ఆపరేషనైపోయిన తరవాత వాళ్ళతోనే కలిసి కాఫీ తాగుతున్నాఁవంటే మీరర్ధం చేసుకోండి! భూదేవంత సహనం వాళ్ళదా లేక ఆకాశమంత హృదయవైశాల్యం మాదా అని!
ఇంట్లో గ్యాస్‌సిలిండర్ని అవలీలగా మార్చేసుకునే అమ్మణ్ణులు ఆపరేషన్ థియేటర్లో ఆక్సిజన్ సిలిండర్ మాత్రం అబ్బాయిలే మార్చాలని అల్లరిపెడుతుంటారు. కలికాలం!
ఇక కార్ డ్రైవింగ్ సంగతి! కారు కొన్న అయిదేళ్ళదాకా నేనే నేర్చుకోలేదు. మావూరి రోడ్లమీద చిన్నచిన్న రణాలే కారణాలు! మావూరి రోడ్లమీద జనం ఎవరెష్టెక్కినంత ధీమాగా ఎవరిష్టమొచ్చినట్టు వాళ్ళు నడుస్తుంటారు. ఎవడికైనా తగిలిందో మనకి తగుల్తాయ్!
అంచేత ఓ డ్రైవర్ని పెట్టుకుని కాలచక్రాన్ని కొన్నాళ్ళు తిప్పాను. అయితే ఆ డ్రైవరే కాలయముడిలా కనబడి భయఁవేసి పట్టుబట్టి డ్రైవింగ్ నేర్చుకున్నాను.
అంతకుముందు ఏ రోడ్డుమీదా తిరగలేనివాణ్ణి ఇప్పుడు ఏరోడ్డైనా తిరుగులేదనే స్థాయికి వచ్చేసాను.
మరలాంటిది మహిళలకి సారథ్యం ఇవ్వాలంటే.... ఇస్తాం. కానీ ఎప్పుడో తప్ప చెయ్యని కారణంగా వాళ్ళ డేరింగ్ & డాషింగ్ (డేరింగ్ గా స్పీడెళ్ళి డాషిచ్చెయ్యడం😜 ) డ్రైవింగ్ చూసి కాస్తంత భయం. అంతే!
మరి పండగలు!
అట్లతద్దంటూ తెల్లారేలేచి అన్నాలవీ తినేసి ఏటిగట్లమ్మట ఆడేసుకునేదీ వాళ్ళే!
శ్రావణమాసంలో బోల్డంత బంగారఁవదీ పెట్టేసుకుని ధగధగలాడిపోతుండేదీ వాళ్ళే!
కార్తీకదీపాలతో చెరువుల దగ్గరా వాళ్ళదే పెత్తనం. ఆ అందమంతా వాళ్ళు దీపాలొదిల్తేనే వుంటుంది. మన డ్యూటీ అగ్గిపెట్టందించడం, దీపాలారిపోకుండా చేతులడ్డం పెట్టడఁవే!
అందించేది మనం, అంటించేది వాళ్ళు!😜
పెళ్ళిళ్ళకీ, పేరంటాలకీ షాపుల్లో చీరలవీ కొంటోంటే కార్డు గీకినప్పుడల్లా కార్డియాలజిస్ట్ దగ్గరికి పరిగెట్టాల్సిందే!😜
మనకేఁవుంది చెప్పండి! ఎంత డబ్బెట్టి కొన్నా ఎప్పుడూ ఆ నీలంరంగు జీన్సూ, పొట్టొచ్చేసిందని టక్ చెయ్యని చొక్కాలూ తప్ప! ఉడ్ లాండ్ వాడి పుణ్యమాని ఏదో కాస్త మంచి బూట్లేసుకునే భాగ్యం దొరికిందంతే!
మరి వంటో?
ఎప్పుడైనా పెళ్ళాం ఊరెళితే 'నో నాగమణి ఎంజాయ్!' అని ఆడిపోసుకుంటారుగానీ కాస్తంత అన్నఁవొండుకుని, ఓ రెండు దుంపలు వేపుకునేటప్పటికి చేతులుకాలి ఆకులు పట్టుకోడానికి కూడా పనికిరాకుండా పోతాం.
అలవాటవుతుందని ఎప్పుడైనా కిచెన్లోకెళ్ళి సాయంచెయ్యబోయామా... "మీరెళ్ళి అలా టీవీ చూస్తుండండి. పదినిమిషాల్లో వేడివేడిగా వడ్డించేస్తాను!" అని తరిమేస్తారు.
కారణం మీమీద ప్రేమకాదు. మీరు చేసే అవకతవక పన్లు భరించలేక!😜
పొద్దున్నలేస్తే ఇన్నిరకాల ఈతిబాధలు పడుతూ మగపుట్టుక పుట్టినందుకు మనఁవేడుస్తోంటే మెన్స్ డేట!
సర్లెండి! అలవాటున్నవాళ్ళు ఇవాళ 'మందు' మింగి ఈబాధల్ని దిగమింగండి.
అలవాటులేనివాళ్ళకి కడుపుమంటకి మందులెలాగో వున్నాయి.
శుభాకాంక్షలు!
...........జగదీష్ కొచ్చెర్లకోట
0 comments:
Post a Comment