Latest Posts

Content

Sunday, April 9, 2017

అల్లరె ఆనందం..

"నిజంచెప్పు! డబ్బుల్తీసావా లేదా?" కృష్ణంరాజులా అలా కళ్ళెర్రజేసేసి అడుగుతోంటే పదేళ్ళపిల్లాడు భయంపడిపోడూ?

నాన్నగారి జేబులోంచి డబ్బులు తీసేశాడు పెద్దన్నయ్య. అదీకథ! వాడొప్పుకోడమూ, నాన్నగారు వాణ్ణి సైకిలుమీద కూచోబెట్టుకుని పోలీస్టేషన్‌కి తీసికెళిపోడమూ, ఇవన్నీ చూసి అమ్మ కంగారుపడిపోడమూ అన్నీ అరగంటలోనే జరిగిపోయాయి.

మాచిన్నతనాల్లో ఈ ప్రభుత్వోద్యోగులకి ఏవో స్టాంపులిచ్చి అమ్మమని చెప్పేవారు. క్షయవ్యాధి నిర్మూలనకోసఁవనుకుంటా!

మళ్ళీ పెద్దన్నయ్యే! క్లాసులో పిల్లలందరికీ తలో స్టాంపూ ఇచ్చేసాడు. ఇంటికొచ్చి చూస్తే ఒకటీ మిగల్లేదు. పాపం, చాలాదెబ్బలు తిన్నాడు బాల్యంలో!

వాళ్ళ క్లాసులో ఒకసారి మేష్టారు కొట్టారని పగపెట్టేసుకున్నాడు. ఆయనొకసారి మాయింటికొచ్చారు.

అమ్మేమో అన్నయ్యని మేష్టారికి మంచినీళ్ళిమ్మని చెప్పింది. వీడేంచేసాడో తెలుసా??

ఆయనమీద కోపంకదూ? ఎవరూచూడకుండా ఆ గ్లాసు ఎంగిలిచేసి కొంచెంనీళ్ళు తాగి అప్పుడు పట్టుకెళ్ళిచ్చాడు. అంత అమాయకమైన ప్రతీకారాన్ని మనఁవెక్కడా వినివుండం! కదూ??😄 😄 

ఇక మనసంగతి....

నాకు అయిదేళ్ళప్పుడు మాయింటికి పెద్దపెద్ద అరుగులు, మండువా వుండేవి. ఇంటి ఓనర్ అయ్యలుగారి కొడుకు సురేంద్రా, నేనూ ఒకీడువాళ్ళమే!

ఒకసారి మేఁవిద్దరం ఒక విచిత్రమైన పందెంవేసుకున్నాం. 'అరుగుమీద నిలబడి ఎవడెక్కువ దూరం పొయ్యగలడో చూసుకుందాం!' అని!!😜 😜

ఖర్మకాలి నేను గెలిచాను. వాడికి ఉక్రోషం వచ్చి నన్ను వెనకనించి తోసేసి లోపలికి పారిపోయాడు. మనకి కిందపెదవి చిట్లి, బోల్డు రక్తం కారిపోయింది. తీరా లోపలికొచ్చాక నాన్నగారు అయ్యలుగారితో దెబ్బలాడ్డం మానేసి నాకింకో రెండు తగిలించారు. సూపర్‌కదా??😜 😜

ఆ మచ్చ మన పెదవిమీద ఇప్పటికీ వుంది! అద్దంముందు నిలబడితే సురేంద్రగాడే గుర్తొస్తాడు!

ఆరోక్లాసులో నాపక్కనే కూర్చునే మాధవరావుకీ, నాకూ పోటీవుండేది. అయితే మాధవకి రామభక్త హనుమాన్లా ఒక బాడీగార్డుండేవాడు. వాడు టైలర్ శ్యామ్ తమ్ముడు రమణ్రావు. మాధవని కొట్టాలంటే ముందు రమణ్రావుని కొట్టాలి. మినిష్టర్ పియ్యేలా అడ్డంపడిపోయేవాడు.

ఒకసారి మాయిద్దరికీ చాలా గొడవైపోయింది. అప్పటిదాకా అక్కళ్ళేని రమణ్రావు ఎక్కళ్ళేని వేగంతో వచ్చేసాడు. రాడం రాడం నామీదడిపోయి పిడిగుద్దులు గుద్దెయ్యడం మొదలెట్టేసాడు.

మనం చూట్టానికి అర్భకంగా వున్నా కత్తెరపట్టు వెయ్యడంలో దిట్ట! అంటే తెలుసుగా? నడుంచుట్టూ కాళ్ళేసి కత్తెరలా బిగించేస్తే వాడిక కదల్లేడన్నమాట! ఆరోజూ అలానే వేసేసాను.

పాపం వాడుక్కిరిబిక్కిరైపోయాడు. అయినా వదల్నే! మరి నన్నేం తక్కువకొట్టాడా?? 

"వదిలీరా! ఒరేయ్ జగ్గీ, వదిలీరా!" అని ఏడ్చేశాడు.

అదిగో, అప్పుడొచ్చారు  పీటీ మేష్టారు. ఆయన్ని చూస్తేనే మాకు తడిసిపోయేది. అలాంటిది ఆయనకి లైవ్ లో అల్లరిచేస్తూ దొరికిపోడమంటే పాము పుట్టముందు నాగినీ డ్యాన్స్ చేసినట్టే!

లావాటి పైపొకటి పట్టుకు తిరిగేవారయాన! అది ఆయన సైకిలుకేసే లాక్! పాపం, ఇంటికెళిపోయే మూడ్ లో వున్నాయన మాగురించి తెలిసి మళ్ళీ వెనక్కొచ్చి మమ్మల్ని కొట్టారు చూస్కోండీ...

గ్రౌండంతా పరిగెట్టించేసాం ఇద్దరం!

ఇంట్లో మా రెండోఅన్నయ్యకీ నాకూ రెండేళ్ళే ఎడం! చూడ్డానికి ఒకేలా వున్నాఁవనేవారు. పగలంతా పగతో రగిలిపోతూ వుండేవాళ్ళం. వాలిసుగ్రీవులనే అనేవారు నాన్నగారు.

తీరా రాత్రయ్యేటప్పటికి మళ్ళీ ఇద్దరం బోల్డు కబుర్లు చెప్పేసుకుని ఒకే మడతమంచం మీద పడి నిద్రపోయేవాళ్ళం. అప్పుడు రామలక్ష్మణులనేవారు. అంత కాంట్రాస్ట్‌ తెలీని మా అమ్మకి చాలా వింతగా వుండేది మాప్రవర్తన!

ఇక మావాళ్ళు...

కారు కొన్న కొత్తలో మాకో డ్రైవరుండేవాడు. ఒకసారి మాశ్రీమతి ఇద్దరు సన్నాసుల్నీ తీసుకుని కార్లో షాపింగ్‌ కి బయల్దేరింది. 

"చాలా చిన్నపని! ఇప్పుడే వచ్చేస్తా! అల్లరి చెయ్యకుండా కార్లోనే కూచోండి నాన్నా?" అని పిల్లలిద్దరికీ చెప్పి, డ్రైవర్ని కాస్త కాపలాకాయమని బయటికెళ్ళింది.

తిరిగొచ్చేటప్పటికి ఇద్దరూ సీరియస్‌గా వున్నారు. ఏమైందని అడిగితే డ్రైవర్ చెప్పాడు..తనిలా వెళ్ళినవెంటనే మొదలైందిట యుద్ధం. చచ్చేలా కొట్టేసుకున్నార్ట! అంతదూరంలో అమ్మని చూసి మళ్ళీ ఆపేసార్ట!

అంతే! ఈవిడగారికి క్రమశిక్షణారాహిత్యం అనిపించి పిల్లలిద్దర్నీ లాక్కుని పక్కనేవున్న పోలీస్టేషన్‌కి తీసికెళిపోయింది. చిన్నవాడు బాగా చిన్నవాడు. 

తను లోపలికెళ్ళి ఒక కానిస్టేబుల్ని తీసుకుని వచ్చేటప్పటికి కార్లో పెద్దాడొకడే వున్నాడు. "తమ్ముడేడ్రా?"అనడిగితే కిందకి చూపించాడు వాడు. కారు సీటుకిందకి దూరిపోయాడు భయంతో!

ఇద్దర్నీ జైల్లోపెట్టెయ్యమని చెప్పేసింది. దెబ్బకి మూగరోదన మొదలైపోయింది. పాపం, వాళ్ళ మొహాలుచూసి ఆ పోలీసాయన పంపించేసాట్ట! 

ఇప్పుడా సంఘటన చెప్పుకుని చచ్చేలా నవ్వుకుంటారు సన్నాసులిద్దరూ!

ఇక్కడికొచ్చాక మా పైయింట్లో ఒక బుడుగ్గాడుండేవాడు. వాడికి మూడో, నాలుగో! వాడి అల్లరి అద్భుతంగా వుండేది. 

మాయింటి గుమ్మంలో బుల్లెట్టొకటి పార్క్ చేసివుండేది. అది మాపక్కింటాయనది.

ఆయన శివభక్తుడు. ఆయనొకసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు చిన్న ఇత్తడి త్రిశూలం బొమ్మొకటి కొనితెచ్చుకుని బండికి ముందు తగిలించాడు.

వీడెళ్ళి ఎవరూ చూడకుండా ఆత్రిశూలాన్ని పీకేసి పట్టుకుపోయి వాళ్ళింట్లో దేవుడిగదిలో పెట్టేసుకున్నాడు. ఇక నవ్వాం ఆరోజు అందరమూ?? చాలా ముద్దొచ్చేసేది వాడి అల్లరి!

దీపావళికి మాయింట్లోనే వుండేవాడు. లక్ష్మీబాంబులు కొవ్వొత్తికి అంటించి విసిరేస్తూండేవాడు. భూచక్రాల్ని అంటించేసి దానితోపాటూ దానిచుట్టూ తిరుగుతుండేవాడు. మేం సామాన్లు కాల్చడం మానేసి వాడి మొహంలో వెలుగుల్నే చూస్తుండేవాళ్ళం. ఎంత ఉత్సాహంగా వుండేవాడో!

పిల్లలన్నాక అల్లరిచెయ్యాలి. అది తీపిజ్ఞాపకంలా మిగిలిపోతుంది. మితిమీరితే చేదు అనుభూతులే మిగుల్తాయి.

          
                       ........జగదీష్ కొచ్చెర్లకోట 

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive