రోజూలాగే ఆవేళా ఆలీసెంగా ఇంటికొచ్చాడు గోపాళం. రాధకి ఒళ్ళుమండిపోతోంది. అసలే బోల్డు మారణాయుధాలుంటాయి తనదగ్గర!
కనుబొమ్మల్తో బాణాలెయ్యచ్చు!
వాలుచూపుల్ని కత్తుల్లా వాడొచ్చు!
జడచూస్తే ఉరితాడే!
"కాఫీ!" అన్న మాట తూటాలా తగిల్తే మొబైల్లోంచి తలెత్తిచూసాడు.
శివుడివిల్లు విరిగిపోయిందని ఎవరన్నారు?
విరక్కుండా కళ్ళెదుట కనబడుతోంటే!
రెండు కనుబొమ్మల్నీ రోజూ చూస్తూకూడా విస్తుపోడం అలవాటైపోయింది గోపాళానికి
"రాధా!" అన్నాడు కాఫీ పుచ్చుకునీ, ధైర్యం తెచ్చుకునీ!
"చెప్పండి! ఏదోకటి అల్లేవుంటారుగా ఈపాటికి?" అంది సోఫాలో అలవోకగా పడుకుని.
ఆ భంగిమ చూసిన గోపాళానికి నోటమాట రాలేదు.
"మాటాడరేం? ఆపాటి మాటలకీ నోచుకోనో?" అంది కనుసన్నల ఒక విరితూపు విసిరి.
"నీతో మాటాడకుండా వుండడంకూడానూ? అంతకంటే శిక్షుంటుందా నాకు?" అన్నాడు చూపుల్ని తప్పించుకుంటూ! ఎలాచూడగలడు ఆకళ్ళలోకి?
"పందారక్కర్లేదు! మీ మాటలుచాలు! ఏం తియ్యగా చెబుతారో?" అంది మరింత అలక ప్రదర్శిస్తూ!
అలకతీర్చడంకంటే అదృష్టం మరోటుండదు ఈభూమ్మీద! ఇది గోపాళం స్థిరాభిప్రాయం. అందుకోసఁవే ఆలీసెంగా వస్తాడో, అతను తీరుస్తాడని తను అలుగుతుందో...ప్చ్! చెప్పడం కష్టం!
తనెలాగూ కాసేపటిదాకా మబ్బుల్లోకెళిపోతుంది. ఏరాత్రో మళ్ళీ తిరిగొస్తుంది.
కాఫీగ్లాసట్టుకుని కాసేపలా ఆరుబయట చందమామని చూస్తూ కూచున్నాడు. ఆయనగారు గోపాళాన్ని చూసి మబ్బుల దుప్పటి పక్కకి తొలగించి ఒక్కసారిగా విరగబడినవ్వుతూ బయటికొచ్చాడు.
చంద్రుడి వాలకం చూసి గోపాళానికి ఒళ్ళుమండింది. ఖోపంగా లోపలికెళిపోయాడు.
"ఏం వచ్చేశారూ? ఏఁవంటున్నారు మీ చంద్రులవారు?" అంది రాధ జడగంటల్ని తిప్పుతూ!
గోపాళానికి ఆ అవకాశం వదులుకోడం ఇష్టంలేదు. అంచేత మొదలెట్టాడు....
"నేనలా కాఫీగ్లాసట్టుకుని పెరట్లోకెళ్ళానా! నన్నుచూసి అతగాడు పొగరుగా బయటకొచ్చాడు. నాక్కోపం వచ్చింది...
'నీకేంటి చెప్పూ! ఒకరుకాపోతే ఇంకొకరంటూ ఇరవయ్యేడుమంది!' అన్నాను అసూయగా!
'ఇదేఁవన్నా న్యాయంగావుందా గోపాళం? ఒకళ్ళనే సమర్ధించుకోలేక నానాయాగీ చేసేసుకుంటున్నావు. అట్టాంటిది ఇంతమందిని ఎలా నెట్టుకొస్తున్నానో అని జాలిపడ్డం మానేసి ఈర్ష్యపడతావూ?' అంటూ మరింత తెల్లమొహఁవేసాడు చంద్రుడు!
'ఇంకెంతా..మరో వారంపదిరోజులేగా నీ కళలన్నీ! అదే మా రాధైతే నిత్యపెళ్ళికూతురు...తెల్సా!' అన్నాను.
దాంతో మొహం వేలాడేశాడు. పాపం, నీకన్నా బెంగగా చూసాడు.
'ఆగవయ్యా , లోపల మా బంగారఁవుందీ!' అని కసిరేసి వచ్చేశాను.
కోపమొచ్చి మబ్బుల్లోకెళిపోయాడు. 'వెళితేవెళ్ళూ! నాకేం కొత్తకాదుగా నీ అలకలు! మళ్ళీ నేను రాగానే తయారైపోతావు..'ఏఁవోయ్ గోపాళం?' అంటూ!' అని బెదిరించాను
ఆపళంగా లోపలికెళ్ళినవాడే నామాటవిని మళ్ళీ బయటికొచ్చాడు. 'ఏంబావుంటుందా పిల్ల? ఓ..తెగ మురిసిపోతున్నావు? నాపెళ్ళాల్ని చూసావా..ఇరవయ్యేడుమంది! ఒక్కొక్కర్నీ చూస్తే మతిపోతుంది నీకు!' అని మొదలెట్టాడు.
'నీ ఇరవయ్యేడుమంది పెళ్ళాల వయసూ, నీ పదహారుకళల సొగసూ కలిపి బ్రహ్మ తయారుచేసిన స్పెషల్ ఎడిషన్రా నాయనా నాబంగారం!' అనిచెప్పాను
😒 😒 😒 😒 ఇలాపెట్టాడు..మొహం!
నే చెప్పాను..'అబ్బా! ఆ మొహాలవీ చూసిచూసి విసుగొచ్చింది. ఎంచక్కా ఒక పోజ్ చెప్తాను..అలావుండు!' అని...నీ ఫొటో చూపించాను. దెబ్బకి మళ్ళీ డీలాపడిపోయాడు. తారలందర్నీ లోపలికి పొమ్మన్నాడు.
వాళ్ళేమో 'ఎదీ! ఓమారు చూణ్ణీ! ఎవరామ్మాయి? మన రోహిణికన్నా బావుంది? అశ్వనక్కా! చూసావా ఆపిల్లనవ్వు? మన చంద్రులవారి పున్నమి వెలుగులా ఎంతబావుందో చూడు?' అని ఇరవయ్యేడుమందీ తోసుకుతోసుకు చూడ్డం మొదలెట్టారు
అప్పుడు చంద్రుడు దొంగచాటుగా నీఫొటోవేపు చూడ్డం కృత్తిక చూసేసింది. ఆయన చెవట్టుకుని మెలేస్తూ 'ఇరవయ్యెనిమిదోది కావాలేం నీకు?' అంటూ లోపలికి తీసుకుపోయింది. నేను ఖాళీ కాఫీగ్లాసు పట్టుకుని లోపలికొచ్చేసాను!"
"అబ్బ! ఏంచెప్తారో! కబుర్లతో కాజాలొండేస్తారు!" అంది రాధ అలకపానుపు దిగుతూ!
"అయ్యో! ఇదంతా నిజంగానే జరిగింది రాధా!" అన్నాడు అమాయకంగా మొహఁవెట్టి!
కానీ అప్పటికే వెండికంచంలో వేడివేడన్నంతో వచ్చికూచుంది రాధ! ఉప్ఫని ఊదుతూ ఎర్రగా వేగిన బంగాళాదుంప ముక్కల్తో కలిపి అన్నం ముద్దలు తినిపించడం మొదలెట్టింది.
"మరి నీ అలక?" అన్నాడు నోట్లో ముద్దతో ముద్దగా.
"రేపటికి వాయిదా వేసాన్లెండి!" అంది చిలిపిగా.
"ఓసి రాక్షసీ! ఇలా రోజుకో కథల్లడం నావల్లవుతుందా? అవుతుందేమోలే...నీతోవుంటే ఏదైనా సాధ్యమే!" అనుకున్నాడు గోరుముద్దల్ని ఆస్వాదిస్తూ!
....................
గోపాళాల్లాంటి భర్తలూ...
కోపవనితలైన రాధలూ...
ఇది మీకే అంకితం!!
పెళ్ళంటే...
వంటలతో కమ్మని విందేకాదు...
జంటను చూస్తే కనులవిందు...
సరదాల సాయంత్రాలే కాదు...
సమభావనల సావాసాలూనూ...
ఒకరికొకరై కరిగిపోడమే కాదు...
ఒకరినొకరు ఎరిగుండడం కూడానూ...
దీనికోసం ప్రేమవివాహాలే చేసుకోనక్కర్లేదు...
చేసుకున్నాకా ప్రేమించుకోవచ్చు కూడానూ...(ఒకరినొకరు)
పందిట్లో కట్టిన మావిడాకులైనా ఎండకముందే...
ముడివడిన మూణ్ణాళ్ళకే విడివడిపోకముందే...
ఎంచక్కా ఆకూవక్కల్లాంటి ఇద్దరిమధ్యా అనురాగం వుంటే అది సున్నంలా పరుచుకుంటుంది. అప్పుడే ఆకాపురం పండుతుంది.
........జగదీష్ కొచ్చెర్లకోట
0 comments:
Post a Comment