మాయింటి మాస్టర్ బెడ్రూమ్ కిటికీతలుపులు తీసుకుని పడుకుంటే చల్లటిగాలి! ప్రాకృతికమైన వాతావరణంలో వున్నట్టేవుంటుంది. మరి ఆకిటికీ వెనకనే కొలువై వున్నాడు కళ్యాణ వేంకటేశ్వరుడు.
తెల్లవారేసరికి గుడిగంట మోగించి, చప్పట్లు కొట్టి స్వామివారిని నిద్రలేపుతారు ఆచార్యులవారు. సుప్రభాతం, నైవేద్య ఘంటానాదం, శ్రీమన్నారాయణ స్తోత్రం.. అన్నీ వినబడుతూనే వుంటాయి.
ఇదంతా ప్రకృతి ప్రసాదం! మరి వికృతి? చిత్తగించండి!
మరింత తెల్లని పళ్ళు, మరింత బలమైన చిగుళ్ళకోసం నేను చిన్నప్పటినుంచీ కోల్గేట్ నే ఎంచుకున్నాను. పైగా ఇప్పుడు ఇరవయ్యైదు శాతం అదనం కూడానూ! నురగల తరగల మధ్య దంతధావనం పూర్తయింది.
కార్తీ లాగా రొమాంటిగ్గా బ్రూకాఫీకోసం కూర్చున్నాను. మరిన్ని కప్పులకోసం నిన్ననే తెచ్చుకున్నాను సరికొత్త ఆకర్షణీయమైన బ్రూప్యాక్!
కానీ మావిడ 'ఠాంగ్'మని చప్పుడయ్యేలా కప్పు టేబులుమీద పెట్టి
"వెధవ పేపరు తరవాత చదవచ్చు. కాఫీ తీసుకోండి. చల్లారిపోతే మళ్ళా వెచ్చబెట్టడం కుదరదు. పేరుకే ఫోర్ బర్నర్స్. వెనక స్టవ్‌లేవీ వెలిగి చావట్లేదు. ఆ రిపేరువాణ్ణి రమ్మని వారంనించి పోరుతున్నాను!" అంటూ నిజజీవితాన్ని నిష్కర్షగా నిరూపించింది.
'ఔను! అది టీవీ. ఇది బీవీ! అంతేగా?' అనుకుని చప్పటి కాఫీ చప్పుడులేకుండా చప్పరిస్తూ కూచున్నాను. నాకు షుగర్లేదండోయ్! పందారెక్కువైతే నాకు చిరాకు.
నా వయసునసలు కనబడనివ్వకూడదని ఎన్నాళ్ళనుంచో సంతూరే వాడుతున్నాను. పసుపూ చందనాలతో మరింత మెరుగైన చర్మం మాటటుంచి ఇంట్లోవాళ్ళ తిట్లుతిని చర్మం మరింత దళసరైంది!
"ఎప్పుడూ ఈసంతూరేంటి నాన్నా? వాడిది మీ సొంతూరా?" అని సందేహంకూడా వెలిబుచ్చారు పుత్రరత్నాలు.
పట్టులాంటి మృదువైన చర్మంకోసం తనకి రెక్సోనా తెచ్చిచ్చాను. ఇచ్చి ఊరుకోవచ్చుకదా? 'మరొక సెల్ఫీ!' అంటూ మాటిమాటికీ టచ్చేస్తోంటే "ఏంటీ? ఓవరేక్షన్ చేస్తున్నారూ?" అనేసింది. అంతే!
ఉత్సాహాన్ని మడిచి మనసులో పెట్టుకుని మూసుక్కూచున్నాను.
స్నానానంతరం బీరువాలో ఇస్త్రీ బట్టలు తీసుకుంటున్నాను. 'మిరుమిట్లుగొలిపే తెల్లషర్టేదీ?' అని వెతుకుతుంటే తనొచ్చి "కళ్ళెదురుగా వున్నా కనబడదేంటి మీకూ?" అని ఒకచొక్కా నాముందు పడేసింది.
'ఇది సాధారణ డిటర్జెంటుతో ఉతికావా? అరవైశాతం మురికి వుండనేవుందీ?' అన్నానోలేదో
"మీరు సాధారణ భాష మాట్లాడకపోతే అసాధారణ రీతిలో ఉతుకుతాను" అనడం, నాకు ధారణశక్తి కోల్పోవడం జరిగిపోయాయి.
టిఫిన్ కోసం టేబుల్‌దగ్గర కూర్చుని 'ప్రపంచం ఏఁవైపోతోందో ఏఁవిటో?' అని టీవీ పెట్టాను. ఏదో ఎడ్వర్టైజుమెంటు.
పాపం! ఒకప్పుడు హీరోలా బాగా బతికినవాడే! ఎవరింటిదో కాలింగ్‌బెల్ కొట్టి, ఆవిడ తలుపుతియ్యగానే టాయిలెట్ లోకెళిపోయాడు. పైగా హార్పిక్ పట్టుకుని ఛాలెంజులు చేస్తున్నాడు.
'హతవిధీ! ఇంకేంతింటాం?'
ఏదో 'మమ' అనుకుని బైటపడ్డాను.
నిగనిగలాడే చెర్రీబ్లోసమ్ క్రీముతో బూట్లని రుద్దుతోంటే ఎదురింట్లో అద్దెకుండేవాళ్ళమ్మాయి.. పదమూడేళ్ళది.. గెంతుకుంటూ బయటకొచ్చింది. తనంతలా హుషారుగా వుండగా నేనెప్పుడూ చూళ్ళేదు.
నేననుకోవడం కొంపతీసి విస్పర్ అల్ట్రా వాడితే 'ఆ' మూడురోజులూ అలా గెంతాలనుకుంటోందేమో?
వీళ్ళ మొహాలుమండా! కందిపప్పు, చింతపండుకి మల్లే నిత్యావసర వస్తువుల్లా ఒకటే సొద టీవీలో! తెలిసే వయసొస్తే అదే తెలుస్తుంది. వీళ్ళ పెత్తనమేఁవిటో మధ్యలో?
ఆ యాడ్ చూసి చిన్నప్పుడు మా చిన్నాడు అడిగిన ప్రశ్నలు గుర్తొస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. పెద్దాడు ఏమీ అడిగేవాడు కాదు.
అదింకా ప్రమాదం. వాడికెలా అర్ధమైందో మాకర్ధమయ్యేది కాదు.
పదిరూపాయల కూల్ డ్రింకుకోసం ప్రాణాలకు తెగించడం, పర్వతాలు దూకడంలాంటివి చేసే మహేష్ బాబులాంటి వాళ్ళున్న ఈసమాజంలోనే సోమరిగా మాయింటి దగ్గర గుడిముందు అడుక్కునే బిచ్చగాళ్ళూ వున్నారు.
'కనీసం ఒక అపార్ట్‌మెంట్ మేడమీంచి మరో అపార్ట్‌మెంట్ మేడమీదకి కూడా దూకలేని వెధవలకి ఎందుకెయ్యాలి రూపాయి?' అనిపిస్తుందా అనిపించదా చెప్పండి?
నాబండి నన్నెప్పుడూ మోసం చెయ్యకూడదనే ఎమ్మారెఫ్ టైర్లనే వాడతాను...ఎంతటి క్లిష్టపరిస్థితుల్లోనూ బ్రేకేస్తే 'ఛక్'మని ఆగాల్సిందేనని.
కానీ మావూళ్ళో సై'కిల్లర్స్'తో ఎమ్మారెఫ్ వాడి పప్పూ వుడకదు, సియట్ వాడి సాంబారూ వుడకదు. మావూరివాళ్లెప్పుడూ వ్యతిరేకదిశలో తొక్కుతూంటారు సైకిలు. అదీ ఎటోచూస్తూ!
అచ్చికిచ! ఇహచూస్కో నాసామిరంగా! నువ్వెంత పుడింగువైనా గుద్దెయ్యకమానవు. ఎలాగోలా అభిమన్యుణ్ణి తలుచుకుంటూ హాస్పిటల్‌కెళ్ళే దారిని ఛేదించాను.
నిత్యం ఆహారంలో సఫోలా నూనె మాత్రమే వాడడంవల్ల నేను మెట్లన్నీ చకచకా ఎక్కేసి మారూముకి వెళిపోయాను.
కోటా నూని వాడే డెబ్భయ్యేళ్ళ ఆయా సత్యవతమ్మ నావెనకాలే ఎక్కుతూ నన్నుదాటి స్పీడుగా వెళిపోయింది.
"సా...ర్! వార్డునుంచి నాలుగు సీజర్లు!"
అని దాసుగాడు ప్రత్యక్షమవగానే
ఆలోచనల్ని పక్కనబెట్టాను
పక్కనబెట్టిన సులోచనాల్ని అందుకున్నాను.
.........జగదీష్ కొచ్చెర్లకోట
0 comments:
Post a Comment