Latest Posts

Content

Friday, April 7, 2017

నాపాట...పంచామృతమేనా?

"బానే పాడుతున్నారు కానీ..."

అలా 'కానీ' అంటోందీ అంటే నేను ఖూనీ చేస్తున్నాననేగా!

ఇన్నేళ్ళనించీ స్నానానికెళ్ళిన ప్రతీసారీ బాత్రూం గడియ బానేవున్నా సరే ఎలుగెత్తి పాడుతూనే వున్నాను.

ఘంటసాల పాటంటే చెవికోసుకుంటాను.
బాలు పాటంటే చెవే కాదు, ఏదైనా కోసేసుకుంటాను.

అసలు చిన్నప్పుడు వినాయకచవితి పందిళ్ళలో పాటలపోటీలు పెట్టిన ప్రతిసారీ సెకండ్‌ప్రైజు తెచ్చుకోబట్టే కదా నాకీ అతి నమ్మకం!

"పదిహేనేళ్ళ లోపు వాళ్ళందరూ ఇటొచ్చెయ్యండ్రా! ఏంపాడతావురా నువ్వు?" గద్దించినట్టు అడిగారు జగ్గారావు మేష్టారు. చూడ్డానికి త్యాగరాజులా వున్నా మనిషి మాత్రం గుమ్మడి కన్నా మంచాయన!

లిస్టులో ఎనభైముగ్గురున్నారు. నేను ఏభైనాలుగోవాణ్ణి. 
అరవైమంది 'శివరంజనీ నవరాగిణీ'యే! 

మనం మాత్రం 'గజ్జె ఘల్లుమంటుంటే!' పాడతాఁవని చెప్పాం. 

"ఇదెందులోదిరా?" అన్నారు మేష్టారు. మొదటిసారి కోపమొచ్చింది ఆయనమీద.

"సిరిసిరిమువ్వ సార్!" అన్నాను విశ్వనాథ్ కన్నా ఎక్కువ బాధగా!

"సర్సర్లే! ఏదోకటేడు!" అని తీసిపడేసారు.

కానీ మనం ఫస్టొచ్చాం. మర్నాడు జార్జిక్లబ్బు దగ్గర కనబడ్డప్పుడు నాన్నగారితో అన్నార్ట..'మీవాడికి సంగీతం నేర్పించండ'ని.

అయిదుగురు పిల్లలతండ్రి లలితకళలేం నేర్పిస్తారు? 'అలానే చూద్దాం' అన్నమాట నాకిరవయ్యేళ్ళు వచ్చేవరకూ అన్నారు.

మెడిసిన్లో చేరాకా మళ్ళీ ఈజ్వరం లక్షణాలు కనబడ్డం మొదలైంది. టూటౌన్ దగ్గర ఐవీయల్ శాస్త్రిగారు సంగీతం నేర్పిస్తారంటే ఇంట్లో చెప్పకండా బయల్దేరాను.

"ఎంబీబియ్యెస్సో, సంగీతఁవో...రెంటిలో ఒహదానిమీదే శ్రద్ధ పెట్టగలవు నువ్వు. నేర్చుకోడానికేఁవుందీ నేర్పేస్తాం. కానీ సాధన చెయ్యాలి!" అనగానే నాకర్ధమైంది...

మ్యూజిక్కుని లైట్ గా తీసుకున్నానని. మళ్ళీ లైట్ మ్యూజిక్కే గతయింది.

అన్నమయ్య కీర్తనలు వింటూ పాడేసేవాణ్ణి. పైస్థాయి స్వరాలు కొంచెం ఇబ్బందయేది.

'బ్రహ్మకడిగిన పాదము' పాడుతోంటే '....తలకక గగనము తన్నిన పాదము..' అన్న దగ్గిర ప్రతిసారీ తన్నేస్తూ వుండేది.

ఇలాక్కాదని పాటలు వినడం బాగా ప్రాక్టీస్ చేసాను. గురుముఖంగా నేర్చుకోకుండా గానకళ అబ్బదన్న అపనమ్మకం పోయింది. 

కాలేజీ వార్షికోత్సవాలకి నన్నడక్కుండానే పేరిచ్చేసేవారు ప్రెసిడెంటు, సెక్రట్రీ. మెడికల్ కాలేజీలో వుండే చాలా చిన్నాఁవదం మొక్కల్లో నేనే కాస్త పెద్దాఁవదం మొక్కని.

అయిదేళ్ళూ ఏదోరకంగా కప్పో, సాసరో తెచ్చుకుంటూనే వుండేవాణ్ణి!

పెళ్ళిచూపులప్పుడు ఒకళ్ళనొకళ్ళు పాటలగురించి  అడుక్కుందాఁవంటే(?#!@😜) నాకసలు పెళ్ళిచూపులే అవ్వలేదు. వదిన చెల్లెల్నే తగులుకు...సారీ....చేసుకున్నాను.

నాకీ 'పాడు'లక్షణాలున్నాయని తనకి తెలుసు. తెలిసీ తెగించేవాళ్ళని ఏఁవంటారో నాకు తెలీదు. పీకమీద స్టెత్తుపెట్టి అడిగాను...'చేసుకుంటావా?' అని.

తనకి గత్యంతరం వున్నా అభ్యంతరం లేకపోడంతో ఒప్పేసుకుంది. అప్పట్నుంచి మా జీవితం ఘంటసాల పాటలా కాకపోయినా ఘంటాడి కృష్ణ పాటలా ఒక మోస్తరుగా సాగిపోతోంది.

ఇక ఉద్యోగరీత్యా విజయనగరం రావడం ఒక మలుపు. శతాబ్దాలుగా పేరెన్నికగన్న సంగీత సామ్రాజ్యమిది. ఆదిభట్లవారు, పట్రాయని వారు, ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ...ఇంత చరిత్రున్న ఊళ్ళోకొచ్చి పడ్డాకా ఆగడం ఎందుకని ఆగడానికి తలపడ్డాను. 

రెండు వీధులవతల సంగీత పాఠశాలకెళ్ళి 'మృదంగం నేర్పుతారా?' అనడిగాను. మనం రిథమ్ కొడితే తిరుగుండదు. అది స్వతహాగా వచ్చింది. దానికి శాస్త్రాన్ని జోడించాలని అలా అడిగాను. 

మాస్టారు ఒక్కనిముషం నన్ను చూసి 'మీ వాయిస్ చాలాబావుంది. సంగీతంలో జాయినవ్వండి!' అని నిష్కర్షగా చెప్పారు. ఆయన సాధారణంగా ఎవర్నీ మెచ్చుకోరని తరవాత తెలిసింది.

ఆ ప్రశంసని భుజాలమీదేసుకుని బరువుగా గుమ్మంలో అడుగెట్టాను. 'తను' ప్రోత్సహిస్తూనే వున్నా ఆ కల నిజమవడానికి మూడేళ్ళు పట్టింది.

మొత్తానికి నలభయ్యేళ్ళ వయసులో మృదంగం, గాత్రం...రెండింటిలోనూ  చేరాను.

రోజూ సాయంత్రం ఫోను మ్యూట్లో పెట్టేసి క్లాసులో కూర్చునేవాణ్ణి. చుట్టూ ముద్దు ముద్దు పిల్లలు, మధ్యలో ఎద్దులా నేను. స్వాతికిరణంలో ఆఖరు సీనులా వుండేది ఆదృశ్యం!

కొత్తలో కొంచెం సిగ్గనిపించింది. ఆతరవాత మా అఖిల్ గాడి ఆటో వెనకాల రాసిన కొటేషన్ (నేర్చుకొనుటకు చిన్నతనము అవసరము)గుర్తొచ్చి నన్ను నేను సముదాయించుకున్నాను.

చాలా ఉధృతంగా ప్రాక్టీసు చేసాను. 

మృదంగఁవయితే రాత్రి పదకొండింటికి మొదలెడితే 'ఇదేనా అర్ధరాత్రి మద్దెల దరువంటే?' అనడిగేది తను. 

స్కూల్లో మృదంగంలో ఫస్టు, గాత్రంలో సెకండూనూ మనం!

సరళీస్వరాలు, జంటస్వరాలు, అలంకారాలు, గీతాలు, వర్ణాలు, ట్రాన్స్‌ఫర్లు....అర్రె! ఈ చివరిదేంటి ఎప్పుడూ విన్లేదనుకుంటున్నారా?

నాసంగీతానికి ఎవరి దిష్టో తగిలేసింది. నామృదంగానికి ఎవరి వుసురో కొట్టేసింది.
నన్ను తీసికెళ్ళి సంగీతానికీ, సంసారానికీ😜 కూడా పనికిరాని ప్రదేశానికి బదిలీ చేసేశారు.

ఏడిస్తే బాగోదని నాబాధంతా పాటలో కలిపేసాను.
ఎవరిమీదో కోపాన్ని మృదంగమ్మీద చూపించేసాను. అంతే! తెలుగుగంగ లా ఆగిన ఆ ప్రాజెక్టు అలా అసంపూర్ణంగానే వుండిపోయింది.

ఇక లాభంలేదని ఇంట్లోనే సంగీతపాఠశాల పెట్టేసాను. చక్కగా పాడే కుర్రాడొకడు రోజూ ఇంటికొచ్చి సంగీతం నేర్పేవాడు. పదిహేనుమంది దాకా పిల్లలొచ్చి నేర్చుకునేవారు. కొన్నాళ్ళకి అందులో పనికొచ్చే పిక్కలేవో తెలిసిపోయింది.

తల్లిదండ్రులు జబర్దస్తీగా పంపిస్తే వచ్చినవాళ్ళు,  'జబర్దస్త్' చూడ్డం అవట్లేదనేవాళ్ళు మానేసారు. 

మొదట్లో శ్రుతి బాక్స్ వినబడనంతమంది పాడితే కొన్నాళ్ళకి శ్రుతిబద్ధంగా పాడేవాళ్ళు మిగిలారు. 

పంచరత్నాలు, భైరవి అటతాళ వర్ణాలు, అష్టపదులు...సాయంత్రం ఆరింటినించి ఎనిమిదింటిదాకా నారాయణ ఎన్ క్లేవ్ మూడో అంతస్తు నాదనిలయంగా మారిపోయేది. 

ఎందరో మహానుభావులు మనోవాక్కాయకర్మలచే సంగీత సరస్వతికి అంకితమైపోయారు. అకుంఠిత దీక్షతో ఆతల్లి పాదాల్ని తమ రసగంగతో కడిగారు. 

వాటిని నేర్చుకోడానికి నాకు ఈజన్మ సరిపోలేదు. మరుజన్మంటూ వుంటే వీణతీగెగానో, తంబుర తంత్రిగానో పుట్టాలని ఆ సరస్వతికి దండం పెట్టుకుంటాను.

ఈ ఆఖరువాక్యాలు రాస్తోంటే కళ్ళు మసకలు కమ్మేసాయి...నీళ్ళతో!

నా ఉచ్ఛ్వాసం కవనం
నా నిశ్వాసం గానం...అనిపించడంవల్లనేమో?


                                ...........జగదీష్ కొచ్చెర్లకోట 


0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive