ఆమే అతడి సైన్యం
****************
కౌరవుల్లేని భారతం ఎలా వుంటుంది?
కాంగ్రెస్ లేని పార్లమెంటులా వుంటుంది.
ఏ కృష్ణుడూ రాలేదు. ఏ సాయమూ అందలేదు...అసలక్కర్లేదు.
ఆవిడ ఎన్నాళ్ళో వేచిన ఉదయం..
నిన్న ఎదురయ్యింది.
ఏకాలని నిర్ణయమైతే ముందే చేసుకుంది.
ఏకాకిగానే మొదలెట్టింది. ఇక...
ఏ కాకీ అరవలేకపోయింది.
వేలెత్తిచూపించిన 'చేతు'లన్నీ నవరంధ్రాలూ మూసుకోడంలో బిజీగా వున్నాయి.
ఇష్టులంతా శ్రద్ధగా విన్నారు.
'ఇస్ట్'లంతా దుగ్ధగా వున్నారు.
నిజాలు మాట్లాడుతోంటే 'ఇజా'లన్నీ ఇరుకునపడి, భయపడి "అలా చాయ్ తాగొద్దాంరా భాయ్!" అంటూ పలాయనం చిత్తగించాయి.
కన్నెర్రచేసిన ఎర్రచొక్కాలకి
వెర్రిచూపులే మిగిలాయి.
అధికారముందికదా అని అదుపు తప్పలేదు
'అబలనని అవమానిస్తారా' అని దెప్పలేదు
అప్రస్తుత ప్రసంగానికై ప్రతిక్షణం ప్రతీక్షించే
ప్రతి'పక్షపాతా'నికి పక్షవాతమొచ్చేలా చేసింది.
కమ్యూ'నిష్టా గరిష్టులు' వారి మడిబట్ట ఏ మురికినీళ్ళలో ఆరేసుకుంటున్నారో చెప్పేసింది.
'దేశభక్తనేది దండేనికి వేలాడే చొక్కాకాదు..ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకురాడానికి. అది నీకు సహజసిద్ధంగా లభించిన పరిమళంలాంటిది. నీతోనే పుడుతుంది, నీమరణానంతరమూ ఈ నేలపై వుంటుంది!' అని ఋజువైంది.
తల్లిని తిడితే తప్పుకాదు..కొడితేనే తప్పుకింద వస్తుందనే సింధియాల సంధిప్రేలాపనలు వినికూడా బ్రతికున్న మనకు బ్రతకాలన్న ఆశను ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసింది.
నీదేశాన్ని ప్రేమించడమంటే అదేమీ గొప్ప విషయం కాదు. నీసంతానాన్ని సరైనమార్గంలో పెంచితేచాలు. అదే వారిని దేశంపట్ల ఆకర్షితుల్ని చేస్తుంది.
నీపిల్లలు తాగేనీళ్ళు, పీల్చేగాలి, తినేతిండి ఎలా స్వచ్ఛంగా వుండాలనుకుంటావో చదివే చదువుకూడా అంత స్వచ్ఛంగానూ వుండాలి...!
ఇంతకంటే ఇంకేం చెప్పాలి?
అంచేత...నువ్విలాగే దూసుకెళ్ళు!
నీవెనక మేమున్నామని అనడంకన్నా
మాముందు నువ్వున్నావన్నదే బావుంది.
మొదటిది నీనమ్మకం!
రెండోది మాధైర్యం!!
........జగదీష్ కొచ్చెర్లకోట
0 comments:
Post a Comment