ఇంటికి చుట్టాలొచ్చినపుడు ఎవరైనా బడికెళ్తారా? ఏంటో..ఈ బెద్దవాళ్ళకి చెప్పినా అర్ధంకాదు. పైగా వచ్చింది నరసాపురం తాతయ్యా, బామ్మానూ!
వాళ్ళకి నేనంటే బోల్డిష్టం. ఆవేళ నేనింకా లేవకముందే బొకారో బండిలో దిగి, రిష్చా కట్టించుకుని ఇంటికొచ్చేసారు. నాకు కుంచెం మెళుకువొచ్చింది కానీ మంచందిగలా!
అప్పటికి అమ్మ లేచిందిగానీ పళ్ళు తోంకోలేదు. చేతిలో పళ్ళపొడేసుకుని వేలిలా పెట్టిందోలేదో రిష్చాలోంచి దూకి "రాదా! బాన్నావా తల్లీ? చిక్కిపోయావే?" అంటూ గాఠ్ఠిగా పటేస్కుని నెత్తిమీద ముద్దుపెఠేస్కుంది బామ్మ! చేతిలో పళ్ళపొడి కుంచెం ఒలికిపోయింది కూడానూ!
'అయినా బెద్దవాళ్ళు బెద్దవాళ్ళని ముద్దుపెట్టుకుంటారా? నాలాంటి చిన్నవాణ్ణో, చితకవాణ్ణో ముద్దుపెట్టుకోవాలిగానీ! బామ్మకి ప్రెవేటు చెప్పాలి!' అనేసుకున్నాను. కానీ మళ్ళీ నిద్దరట్టేసింది.
"బురుగూ! తొరగాలేమ్మా! బడికి వేళయిందీ! పష్టుబెల్లు కొఠేసారప్పుడే!" అని అమ్మ అరిచేటప్పటికి హాచెరమేసింది. అదేంటీ, ఎవరేనా చుట్టాలొస్తే బడికెళ్తారా? నాన్న హెల్పు తీసుకోవాలి. హెల్పంటే సాయం. బడికెళ్ళకపోడం గురించి సలహాలు, ఏంచెప్పితే నమ్ముతారో అవి నేర్పించడం..అదీ హెల్పంటే!
"నాకు కడుపునొప్పి కదా!" అన్నాను నిక్కరు తాళ్ళు పైకిలాక్కుంటూ!
"అలాగేం! లేచి బొబ్బపోచుకుని మాదీపలరసాయినం తాగు. చద్దన్నంతినేసి బడికెళిపోతే మజ్జానం నీకు పకోడీలు వేసిపెడతాను!" అంటూ దుప్పటి లాగేసింది.
ఇక తప్పదు. అమ్మింతే! బడిమానేస్తే బడితిపూజే! బడితిపూజంటే కొట్టడం. బామ్మ చేసే పూజకాదు. అమ్మ వంటచేసుకుంటూ పాటపాడేస్తోంది..
"సా....ఆంబశివా అనరే!" అంటూ పాడుతోంది. అంటే నాకుతెలీదు.
బయట నాన్నేమో చేతి అద్దం ఉసిరిచెట్టుకి దాపెట్టి కిందకూచుని గెడ్డంచేసుకుంటున్నాడు. గెడ్డంచేసుకోడం అనాల్ట! బాబాయ్ ష్టైల్ గా సేవింగ్ అంటాడు. అంటేకూడా నాకుతెలీదు. ప్రవేటు మాష్టారికీ తెలీదు. వాడికి ఏబీసీడీలే వచ్చు. నాకు ప్రభవా విభవా కూడా వచ్చు.
"నానా! నాకేమో కడుపులో నెప్పిటకదా!" అన్నాను వెనకాలే నిలబడి.
"అవునా బంగారాలూ! ఎవరు చెప్పారమ్మా? మాదీపల రసాయినం తాగావా?" అన్నాడు నాన్న బర్షు గ్లాసులో ముంచి. నాన్న ముకంనిండా తెల్లగా నురుగు. నాన్న చూడకుండా ఒకసారి అలా నురుగంతా ముకానికి రాసుకోవాలని నేను అనుకుంటాను. కానీ నాన్న ఆ గెడ్డంచేసుకునే పెట్టి పైగూట్లో పెడతాడు. నాకందదు.
ఓసారి మంచమ్మీదెక్కి ఆ పెట్టి లాగుతోంటే గుమ్మంలో నిలబడి పక్కింటి పిన్నిగారు 'బులుగూ! మీఅమ్మలేదేంట్రా ఇంటో?' అని ఒక్కసారి అరిచింది. నేను బయంపడిపోయాను.
నాన్న కుంచెం నురుగుతీసి నాముక్కుకి అంటించాడు. "నీకోసం విస్సినాదం కొట్లో కొత్తపలక కొన్నాను! బజార్లో మీ మేష్టారు కనబడ్డాడు...'బులుగుని బడిమానొద్దని చెప్పండీ!' అంటూ ఒకటే ఏడుపు! పద! నీళ్ళోసుకుందువుగాని!" అంటూ రెక్కట్టుకుని నూతిగట్టు దగ్గరికి లాక్కుపోయాడు నాన్న!
బిందిలో వేన్నీళ్ళుమీంచి పొగొస్తోంది. "చెయిపెట్టకు. బావేడిగా వున్నాయి. ఉండు.. చన్నీళ్ళు తొరుపుతాను!" అంటూ నూతిలో నీళ్ళు చేదతో తోడి బిందిలోపోసాడు.
బొబ్బలైపోయాక తువ్వాలతో తుడిచాడు. బాబాయ్ దీన్ని టవలంటాడు. బామ్మ తుండుగుడ్డ అంటుంది. అమ్మానానా తువ్వాలంటారు. అన్నిపేర్లు ఎందుకో నాకుతెలీదు. నన్నుమాత్తరం అందరూ బుడుగనే అంటారు.
ఎడంపళ్ళుదువ్వెనతో తలదువ్వింది అమ్మ. బామ్మ 'తలకాయ్ దువుకో!' అంటుంది. అదేమన్నా కొబ్బరికాయా? పక్కపాపిడి తీస్తుంది అమ్మ ఎప్పుడూ. పాపిడంటే జుట్టు మజ్జలో దారి. తెల్లగా వుంటుంది. నాకు కుడివేపుంటుంది. అమ్మేమో 'వెర్రినాగన్నా అది ఎడంరా!' అంటుంది. కుడీఎడం నాకుతెలీవు.
బామ్మకి జుట్టేలేదు. బాబాయికి పాపిడి కనబడదు. బోల్డు జుట్టుంటుంది మళ్ళీ! నాన తిడతాడు బాబాయిని. 'రేప్పొద్దున్న షవరం చేయించుకోపోతే అచ్చన్నని ఇంటికి పిలుస్తా! ఉసిరిచెట్టు దగ్గిర కూచోబెట్టి చెక్కేస్తాడు!' అంటాడు. చెక్కేడమంటే షవరం. ఇది బాబాయి చెప్పాడు.
జుట్టు లాపోతే సీతకిష్టం వుండదుట. సీతంటే జళ్ళపిల్ల. ఒకటిముందుకీ, రొండోది వెనక్కీ వేసుకుంటుంది. "జుట్టెందుకూ? నువ్వూ జళ్ళేసుకుంటావా బాబాయ్?" అన్నానా..టెంకిజెల్ల కొఠేసాడు. "పోవోయ్! నువ్వూ నన్ననీవాడివే!" అంటూ!
రొండోబెల్లూ అయిపోయింది. "ఎక్కడున్నావురా! మినపరొట్టి చల్లారిపోతుంది. తొరగారా!" అని అమ్మ అరిచింది. ఎలా?
బడి ఎగ్గొట్టడానికి "చద్దన్నం అన్నావా? మినపరొట్టి పెడతావేం?" అని పేచీపెడదామని అనుకున్నాను. కానీ ఎర్రగా, వేడివేడిగా కాలిన రొట్టి చూసి నోరుమూసుకుని కూచున్నాను.
తీరా బయిటికి వచ్చాక "బామ్మా! కడుపునొప్పేవ్!" అనేశాను. వేంఠనే గంట దేవుడిబల్ల మీద పడేసి పరేఠుకుంటూ వచ్చేసింది బామ్మ.
"అయ్యో వెర్రినాగన్నా! కడుపునొప్పితో బర్లోకెలా వెళతావ్? ఏఁవే రాదా! నీకు బుద్ధుండక్కర్లా!" అని మా రాదకి ప్రెవేటు చెప్పేసింది. హమ్మయ్య! అందరూ నమ్మేసి నన్నింక బడికి పోవద్దని చెప్పేసారు.
సాయంతరం అమ్మ ఉల్లిపకోడీలు చేసింది. పేద్దప్లేటు నిండా నాకు పెట్టాలా? అమ్మచేసిన పకోడీలు నారాయణ కొట్లో కన్నా బావుంటాయికదా! మరెందుకు పెట్టలేదు?
అన్నీ వాళ్ళ ముగుడుకీ, బామ్మకీ, ఇంటికివచ్చిన నరసాపురం బామకీ, తాతయ్యకీ ఇంకా బాబాయికీ పెట్టింది. ఇంకుంచెం తనూతింది.
నేను హాచెరపడిపోయేశాను. అవమానం వేసి అడిగాను. నాకు కడుపునొప్పని పెట్టద్దని చెప్పిందిట బామ్మ! ఎంతపనయింది! బడిమానేస్తే పకోడీలివ్వరు. పకోడీలు కావాలంటే బడికెళ్ళాలి.
నాకు ఒక అవిడియా వచ్చింది.
"అమ్మా! అన్నం అంటే దేవుడు పెసాదమా?" అని అడిగాను.
"అవును. అన్నం పరబ్రమ్మ సరూపం. పారేకూడదు. అంతా తినాలి." అందికదా!
"మరి పరవాన్నం?" అన్నాను.
"అదీనూ!" అంది అమ్మ.
"చెగోడీలు? పకోడీలు?" అన్నానా? అమ్మకి అవమానం వేసింది. "అవికూడా పెసాదమే! ఏం?" అంది ఖోపంగా.
"చిన్నపిల్లల నెత్తిమీద దేముడుంటాడా అమ్మా?" అన్నాను. ఇది బామ్మ చెప్పింది నాకు.
"పిల్లాడి నోట్టోంచొచ్చింది. కాదనకు. పిల్లల నెత్తిమీద దేఁవుడుండి పలికిస్తాడు!" అని నానతో చెప్పుతుంటే నేను విన్నాను. అందుకే అడిగాను.
"అబ్బబ్బా! ఏంట్రా నీ నస? ఏంకావాలీ?" అంది రీటానూని తలకి రాసుకుంటూ.
"మరే! మరే! పెసాదం దేవుడుకి పెట్టకుండా తినకూడదు కదామరి?" అనేశాను!
"హారి భడవా! నీ తెలివితేటలూ నువ్వూనూ!" అని గాఠిగా కౌలిగించేసుకుని ష్ట్రాంగ్ ముద్దు పెఠేసింది.
అదుగో..అప్పుడే పకోడీలు మళ్ళీ ఇంకోవాయి వేసింది. వాయంటే నాకుతెలీదు. గరిటికి చిల్లులుంటాయి. నూనిలో ఎర్రగా వేగుతున్న పకోడీలు పళ్ళెంలో పెట్టి ఇచ్చేసింది.
హమ్మయ్య! మరి పకోడీలు తినాపోతే యలా? బుడుగా మజాకా?
మళ్ళీ ఉంకోసారి బోల్డు కబుర్లు చెప్పుకుందాం.
ఉంటాను. మీ బుడుగు!
......జగదీష్ కొచ్చెర్లకోట
0 comments:
Post a Comment