కొండాకోనల్లో పుట్టిపెరిగిన ఆడబిడ్డ. అండాదండాలేని గర్భవతి. గండంలో మాగడప తొక్కింది. కట్టుకున్నోడు వదిలేసినా పుట్టింటోళ్ళు మాత్రం తరిమెయ్యలేకపోయారు. ముంచినా తేల్చినా మాదే భారమని నమ్మింది.
బ్రాహ్మీముహూర్తాన గణగణ మోగిన ఫోను శబ్దానికి ఇంటావిడ లేవకముందే నేను లేచి బయల్దేరాను. బయటికొచ్చిన నన్నుచూసి చంద్రుడు నవ్వాడు. ఆ అరనవ్వే చెబుతోంది ఏ సప్తమో అయుంటుందని!
చల్లనిగాలి తెమ్మెర నన్ను ఒక్కసారి ఆలింగనం చేసుకుని అంతలోనే వదిలేసింది. కారు అన్ లాకింగ్ శబ్దానికి దోమలన్నీ ఉలిక్కిపడి వాచ్ మేన్ని వదిలేసాయి.
శాంతాకారం...భుజగశయనం..అనగానే సంపూర్ణ రామాయణంలో మొదటి తలుపు తెరుచుకున్నట్టు గేటుతీశాడు. కారు స్టార్ట్ చెయ్యగానే 'అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా!' అనందుకున్నాడు శరత్ సంతోష్! ఈపిల్లాడి గొంతులో ఏదోవుంది. ఆర్తనాదం కూడా ఆర్తిగా వినబడే కంఠమది.
ఇరవై వాల్యూమూ, అరవై వేగంతో అయిదునిమిషాల్లో బజార్లోకి ప్రవేశించాను. టీకొట్లోంచి వచ్చే పొగలు రాబోయే సూర్యుడికి ధూపమిస్తున్నట్టున్నాయి. అదేంటో ఇడ్లీప్లేటు మీద కప్పిన వాసినిగుడ్డ కూడా అందంగా కనబడుతుంది ఆ సమయంలో! పగలంతా సెగలతో రగిలిపోయే మొహాలు కూడా ఎంతో పవిత్రంగా కనబడతాయి ఆవేళలో!
గస్తీకాసే పోలీసులు సుస్తీ చేసినవాళ్ళలా వేలాడిపోతున్నారు నిద్రలేక! అంతపొద్దున్నే తలారా స్నానంచేసేసి మంగళవారం కదా, పైడితల్లిని కొలిచేందుకు ఇద్దరు అమ్మణ్ణులు నిర్భయంగా రోడ్డుమీద నడుచుకెళుతున్నారు. రహదారి మధ్యలో అడ్డంగా పడుకున్న ఆవు వాళ్ళ యజమాని నిర్లక్ష్యాన్ని నిర్లిప్తంగా తలుచుకుంటూ నిద్రిస్తోంది.
అపాయంలో వున్నవాళ్ళకి అపరాత్రి కూడా మందులమ్మే అపోలో షాపులోంచి మూడు గురకలు వినబడుతున్నాయి. మా హాస్పిటల్ మలుపులో రోజూ కార్ల వెంటబడే కుక్క క్రీగంటచూసి మళ్ళీ ముడుచుకుని పడుకుంది. అవసరంకంటే ఎక్కువ వంగిన సెక్యూరిటీ గార్డు సలామునందుకుని లోపలికి అడుగెట్టాను.
గిరిపుత్రిక, ఆ పుత్రికను కన్న మాత! జామాత జాడలేదు. ఒగ్గీసెలిపోనాడు! ముచ్చటగా మూడోకాన్పు. వాడేం చేస్తూంటాడని అడగడం అనవసరం. తెలుస్తోందిగా వాడి వుద్యోగమేఁవిటో?😜
చచ్చీచెడీ బతికి బయటికొచ్చాడు గిరిపుత్రుడు. చప్పిడిముక్కు, చురుకైన కళ్ళతో!
ఆ బుల్లిబుల్లి కాళ్ళూచేతులూ ఎన్ని చెట్లెక్కాలో! ఎన్ని కొండలు దాటాలో!!
కష్టాల మైదానాల్లో ఇష్టంగా జీవించే గిరిజనులకు చిటారుకొమ్మలు కూడా అందుతాయి....ఒక్క వైద్యం తప్ప!
అందరికీ శుభోదయం!
0 comments:
Post a Comment