"బాలు, సుశీల పాడిన ఆత్రేయ గీతం వింటారు......"
ఇంతవరకూ యథాలాపంగా విన్నా సంగీతదర్శకుడి పేరు చెప్పేటప్పుడు మాత్రం చెవులురిక్కించి వినేవాళ్ళం....కె.వి.మహదేవనా కాదా అని!
చిన్నతనంలో రేడియోలో అరుదుగా రోజుకొకసారో, రెండుసార్లో వినబడే చిత్రగీతాల్ని మనసారా వినడం, మననం చేసుకోవడం, మరోసారి రావాలని కోరుకోవడం...ఇదే ఆనందం.
'మామ' అంటూ ముద్దుగా పిలుచుకునే మహదేవన్ తెలుగువారందరికీ చక్కనైన బాణీలతో చక్కెరపాకాన్నందించాడు!
పెండ్యాల నాగేశ్వరరావు, సాలూరు రాజేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు, సత్యం, టి.వి.రాజు...ఇలా ఎందరో 'స్టార్' సంగీతదర్శకుల మధ్యలో చంద'మామ'లా వెలిగేవాడు మహదేవన్.
వింటూవుంటే మొదటి రెండుమూడు ధ్వనుల్నిబట్టి చెప్పేయొచ్చు ఇది అతని ట్యూనని! సాకీలు, పల్లవులు తనదైన రీతిలో సాహిత్యానికి ప్రాణప్రతిష్ట చేస్తున్నట్టు చేసేవాడు.
ఇక అప్పట్లో ప్రతిపాటకీ మూడు చరణాలుండేవి. ఇతగాడి ప్రత్యేకత ఏఁవిటంటే మొదటి, మూడోచరణాలు ఒకలాగ, రెండోది మరోలాగ స్వరపరిచేవాడు.
అది నిజంగా కత్తిమీదసామే!
జీవనజ్యోతి చిత్రంలో 'సిన్ని ఓ సిన్నీ!' పాట వినండొకసారి! వీలైతే చూస్తూవినండి. గోదావరిమీద ఆక్విడక్ట్ దగ్గర చిత్రీకరించిన ఈపాటలో శోభన్, వాణిశ్రీల అందం, చలాకీతనం ఒకెత్తైతే, మనోహర దృశ్యాలు మరోఎత్తు. ఇక పాటలో చరణాల విషయానికొస్తే...
కల్లబొల్లి మాటలతో అల్లరిపెడితే...మొదటిది
కొమ్మమీది చిలకమ్మకు కులుకే అందం...రెండోది
పూతరేకుల తీయదనం నీలేత సొగసులో వుందీ...ఆఖరుది
మూడూ మూడు రీతుల్లో వినబడతాయి. చివరికి 'అబ్బా! అప్పుడే అయిపోయిందా పాటా??' అనిపిస్తుంది.
ఆయన మనసున్న మడిసి. అందుకే మనకి దేవుడిలా బోలెడంత మధురామృతాన్ని పంచిచ్చాడు. అది తాగిన మనందరం దైవత్వాన్ని పొందాం. ఆ అమృతధార ఆగిపోయిన మరుక్షణం సంగీతాభిలాష సన్నగిల్లింది. రాక్షసుల్లా మారిపోయాం.
ఇప్పుడేదైనా పాటవింటే.. అనేదాంట్లో అర్ధముండదు. పదాల్లో పర్ధముండదు. పాట వ్యవహారమంతా వ్యర్ధమే!
పారిజాత సుమదళాల పానుపు...
మనకు పరచినాడు చెరకువింటి వేలుపు...
కొండల్లో ప్రతిధ్వనిస్తున్నట్టు వినబడే ఆ మధురస్వరాలను వినండి.
సన్నటి తీగపాకం సుశీలమ్మ గొంతు!
మార్దవానికి మచ్చుతునక మాస్టారి గళం!
దర్శకుడి ఊహాలోక విహారానికి తగిన స్వరాన్ని మామ తప్ప ఇంకెవరందించగలరు? మనల్ని కూడా మనందరికోసం వెలసిన ఆ నవలోకంలో విహరింపజేసేస్తాడు తన స్వరకల్పనా చాతుర్యంతో!
వీరాభిమన్యుడితో పాటు మనమూ ఆ వ్యూహంలో చిక్కుకుంటాం. కానీ చాలాసేపు తిరిగిరాలేం!!
ఇక గోంగూరపచ్చడంటే వెల్లుల్లిపాయ ఎలాగో మహదేవన్ సంగీతానికి ఆత్రేయ రచన అలాగన్నమాట!
తేటతేట తెలుగులా మనలనలరించిన వీరిరువురి జుగల్ బందీకి మన మనసులన్నీ బందీ!
'పాట నువ్ పాడాల...' అని ఆత్రేయా, మామా కలిసి ఘంటసాల మాస్టారికి చెప్పి పడవని వాళ్ళు నడిపేవారు.
ఆదుర్తితో కలిపి ఆ శిష్టచతుష్టయం అందించిన పాటల పందిరిలో మంచమేసుకుని పడుకుంటే మన మనసు మాటలురాక మూగబోతుంది!
ఆక్షణాన మన మూగమనసులకి నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి!!
నీకోసమే వెలిసింది ఈ ప్రేమనగరమంటూ మనందరినీ ఆ సంగీతాంబుధిలో ఈతలు కొట్టించిన వీళ్ళిద్దరూ మన చుప్పనాతి మనసుల్ని బయటపెట్టేసారు. ఉంటే వాళ్ళిద్దరే వుండాలి ప్రతీపాటకీ...అనుకునేంతగా!!😜
నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో! నిజమే! మన కుళ్ళూకుతంత్రాల యంత్రాల బతుకుల్లో మంత్రాలవంటి మాటలతో పాటలు కూర్చి బాపురమణలందించిన అనేక చిత్రాలకు మహదేవనే మహాదేవుడు! అతగాడికే తొలిపూజ!
చందమామని సాక్షిగా పెట్టి ఎవరికివారే ఈలోకం అంటూ బెదిరించారుగానీ..వాళ్ళతోనే మనలోకమనే స్థితికి తీసుకొచ్చేశారు వాళ్ళంతా కలిసి! వాళ్ళందరూ ఓ ముఠా!
బాపు లీడరు. రమణ రైటరు. వాళ్ళిద్దరూ మహదేవన్తో కలిసి మనచేత కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిమీద కొత్తపెళ్ళికూతుర్ని చూపించేసారు. మసకవెలుతురులో, గూటిపడవలో చేసిన ఆప్రయాణం చెప్పిన వూసుల్ని ఎప్పటికీ మర్చిపోలేం!
రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లుకుని, కొత్తకాపురంలో దంపతులిద్దరూ ఇది ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురమంటూ పాడుకుంటున్నారు.
నీవులేక నేనులేను నేనులేక నీవులేవనీ అనేసుకున్నారు....ఇదంతా ఎందుకంటే ఏంచెప్పను?...ఇంతకన్నా ఎలాచెప్పను?
ఈ పల్లవులన్నీ పాడుకోండి. జీవితంలో వత్తిడికాస్తా తీవ్ర వత్తిడికి గురై పారిపోతుంది.
అమ్మలారా! అయ్యలారా!
చచ్చేక దొరికే ఆ రంభకన్నా ఇప్పుడు నచ్చినట్టి నెరజాణే బల్ అన్నులమిన్నా అన్నాడొక బుద్ధిమంతుడు. గుర్తుందిగా?
ఎప్పుడో స్వర్గానికెళ్ళి తుంబురనారదాదుల వీణావాద్యం విందామనుకుంటున్నారేమో?
అంతకంటే మీకు అతిసులువుగా లభ్యమయ్యే సుస్వరవిన్యాసాన్ని సుమనోహరంగా అనుభవించండి.
ఎన్నుకోడానికి ఎన్నని ఎన్నగలమని?
అతడందించిన 'రాగాలనంతాలు! భవరోహతిమిరాన పోకార్చు దీపాలు!!'
ఎన్నో వేలపాటల్లో ఏపాట నేపాడను?
ఏలుకుంటే పాట, మేలుకుంటే పాట! పాడుకుంటే పాట 'మామ'హదేవుడు!
ఏసీమవాడో ఎగిరెగిరివచ్చి మనకు మంచి పాటలందించాడు!
నాపక్కన చోటున్నది ఒక్కరికే...అంటూ తుదిశ్వాస విడిచేదాకా పుహళేందినే నమ్ముకున్నాడు.
నన్నువదలి నీవు పోలేవులే...అనే అనుకున్నాడతను! కానీ....
పోయినోళ్ళందరూ మంచోళ్ళు
ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపిగురుతులంటూ అమూల్యమైన సందేశాన్ని మన మొహాన పడేసి....
సరస్వతీదేవి వీణను శ్రుతి చెయ్యాలో ఏమో...పరుగెత్తి వెళిపోయాడు.
అక్కడ వీళ్ళంతా చేరి ప్రతి ఉగాదికీ మావిచిగురు తినే కోయిళ్ళకి పాటలు నేర్పుతున్నారేమో?
రాయిని ఆడది చేసిన రాముడికి శబరి పాడిన ఊరికే కొలని నీరు ఉలికులికీ పడుతోందనే పాట గుర్తుచేస్తున్నారేమో?
మనల్ని మాత్రం ఆ సీతమ్మతల్లి చెంత కష్టాల్నీ కన్నీళ్ళనీ కలబోసుకొమ్మని చెప్పారు!
పాడాలంటే హృదయం ఉండాలి...
భావం పొంగాలి...రాగం పలకాలి...
రాళ్ళకు నోళ్ళొచ్చి కథలే చెప్పాలి!!!
ఇప్పుడు మాసినిమాల్లో బ్లాకుబస్టర్ల పిడిబాకులు గుచ్చుకుని తెలుగుపాట పరేషానయిపోయింది.
రంగ్ దేలూ, దిల్ ఖుష్ దునియాలు....ఇవన్నీ మా భాషలోకి మిల్లీమీటరైన వదలకుండా చొరబడిపోయాయి.
ఉనికేలేకుండా ఉతికారేస్తున్నారు తెలుగుని!
మామా! నీపాట వింటూ పెరిగాం. నీవులేక వసంతానికీ యవ్వనమెక్కడిదీ? ఈ ఉగాదికి మా మావిచిగురులు తిని కోయిల పలికే సుస్వరగీతాల్లో నిన్నే నిన్నే తలచుకుంటాం!
నిరాశల చీకటిలో, నిరాసక్త కారుచీకటిలో గోరంతదీపాన్ని వెలిగించుకుంటాం. అది కొండంత వెలుగుని ఇస్తుందనే మా నమ్మకం!
మహారాజరాజశ్రీ మహదేవనార్యునికి వందనాలు!
...........జగదీష్ కొచ్చెర్లకోట
0 comments:
Post a Comment