Latest Posts

Content

Friday, April 7, 2017

పగలంతా పగలు...రాత్రయితే వగలు

"ముహూర్తం ఎనిమిదీ పదమూడుకి. మర్చిపోకండి. ఏడింటికల్లా వచ్చేస్తే అందరం కలిసి వెళిపోవచ్చు!"

అది పదోసారి గుర్తుచెయ్యడం. మినిష్టరు పియ్యేలా బుర్రూపానుగానీ అవుతుందో అవదో చెప్పలేదు. నాలుగున్నరకి మొదలైన ఆపరేషన్ ఏడింటికి అయిపోవచ్చు, అవ్వకనూపోవచ్చు. 

అదృష్టవశాత్తూ ఆరోజు పెందరాళే తెమిల్చేసింది సర్జనమ్మ. 

గబగబా ఇంటికివెళ్ళేటప్పటికి కాపర్‌సల్ఫేట్ బ్లూశారీలో కాపరానికొచ్చిన కొత్తల్లోలా మెరిసిపోతోంది... మాలేడీస్! 

"రండ్రండి! త్వరగా మొహంకడుక్కుని బట్టలుమార్చుకోండి. ఈలోగా కాఫీ తెస్తాను!" అంది చెవులకి 'అవేవో' తగిలించుకుంటూ. 

ఖర్మ! ఈనగల పేర్లుకూడా తెలిసి చావ్వు నాకు. చాలాసార్లు తిట్లుకూడా తిన్నాను. ఏనగెక్కడ పెట్టుకుంటారో కూడా తెలీనంత అయోమయం. పాపం, ఆమధ్య చాలాసార్లు సరదాపడింది కట్టువంకీలు కావాలని. 

"కట్టుకున్నవాడికి వంకలుపెట్టడమేనా కట్టువంకీలంటే?" 

అని నేననగానే మరుక్షణం తను ఒక ప్రబలమైన నిర్ణయం తీసుకుంది. 

"బంగారంలాంటి మొగుడమ్మా! ఇంకేంకావాలీ! అని అనిపించుకుంటే సరిపోదు. బంగారం గురించికూడా నీక్కొంచెం తెలియాలి!" 

అని సూతుడు శౌనకాది మహామునులకి ఉపదేశించినట్లు మొదలెట్టింది. మనం మనపద్ధతిలో ఆ మహామునుల్లాగే మజ్జమజ్జలో బోల్డు ప్రశ్నలేశాం. అకస్మాత్తుగా 'కేడిఎమ్ బంగారం' అనేదో అంది. 

''కేడిఎమ్ అంటే?'' అన్నాను. 

"అదోరకం బంగారం. మామూలుగా మనం కొన్న బంగారాన్ని మళ్ళీ అమ్మాలనుకున్నామనుకోండి, చాలావరకూ తరుగు పోతుందికదా! ఇదలాక్కాదన్నమాట. ముందే మంచి క్వాలిటీతో ఉన్నదవడంవల్ల తరుగుండదు." 

అనగానే బోధిచెట్టుకింద కూచోకండానే నాకు జ్ఞానదీపం వెలిగి.. "కే డి ఎమ్...! అంటే కొట్టువాడు దొంగిలించగా మిగిలిన బంగారమన్నమాట! ముందే తీసేసుకుంటాడు కాబట్టి మనకిక తరుగుండదు. యామై కరెక్ట్?" అనడం, "నీబొంద!" అనిపించుకోడం అయ్యాయి. 

మొత్తానికి నాకు తులాలు, కాసులు, కేరెట్లు, బీట్రూట్లు....అంటూ చెప్పి హౌస్సర్జన్సీ దాకా తీసుకొచ్చేసింది. ఇంకాస్త తెలిస్తే డాక్టరేట్ వచ్చేసినట్టే. కానీ ఇది ఎనాటమీ కన్నా డ్రైసబ్జెక్టులా వుంది. గుర్తెట్టుకోవాలంటే రంగారావుగారూ, విజయరామయ్యగారూ దిగొచ్చారు. మధ్యలో వీళ్ళ ఎంట్రీ ఏఁవిటనుకుంటున్నారా? వారిద్దరూ మాతాతలు. (పెటర్నలూ, మెటర్నలూ)😜

ఇప్పటికీ మామధ్య ఈ గోల్డ్‌వార్ జరుగుతూనేవుంది. 

"చిన్నప్పుడు రాసిన పలకపుల్లలు గుర్తుంటాయిగానీ ఇవెందుకు గుర్తుండవూ? వేషంకాకపోతేనూ?" 

అంటూ నగలవిషయంలో సెగలు, పొగలు వెలువడుతూ వుంటాయి అప్పుడప్పుడు.

మళ్ళీ తనే "కోప్మొచ్చిందా? నిన్ను చూస్తే ఒక్కోసారి జాలేస్తుంది. ఇంకోసారి ఒళ్ళుమండుతుంది!" అంటూ సర్దుకుపోతుంది!

సంసారమంటే అదేకదా.....!

పగలంతా 'పగ'లు
రాత్రయితే వగలు!😜 


                             ............జగదీష్ కొచ్చెర్లకోట 

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive