Latest Posts

Content

Friday, September 16, 2016

వెన్నెల అందాలు


ఇంటికెదురుగా సముద్రం. కెరటాల హోరు చెవులకి వినబడుతూ వుండేది. వంటగది కిటికీలోంచి తెల్లటి పాలనురుగులాంటి అలల్ని అప్పుడప్పుడు చూస్తుండేవాళ్ళం.
డాబామీదకెళితేమాత్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతూ హోరెత్తిపోయే తరంగాలు కనులవిందు చేసేవి.
ఇవన్నీ ఒకెత్తు. రాత్రుళ్ళు పక్కబట్టలు పట్టుకుని మొత్తమందరం పొలోమని డాబామీదకి వెళిపోయి అక్కడే పడుకునేవాళ్ళం.
సముద్రపు హోరు వినబడుతూనే వుండేది. వరసగా అందరం ఒకరిపక్క ఒకరు కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకునేవాళ్ళం.
ఇక వెన్నెల రోజుల్లో ఆనందాల్ని వర్ణించడం అసాధ్యం!
ఆరోజులు గుర్తొచ్చి అయిదంతస్తుల పైనున్న ఏకాంత సామ్రాజ్యానికిప్పుడే ఏతెంచాను.
డాబామొత్తం పరచుకున్న వెన్నెల వరిపిండి ఆరబెట్టినట్టే వుంది.
మింటిపైన తనూ...
ఇంటిపైన నేనూ...
ఇంకెవరూ లేరు. అడ్డదిడ్డంగా కట్టిన బట్టలారేసుకునే వైర్లమీదకూడా పడి వింతగా మెరుస్తోంది వెన్నెల!
ఎవరింట్లోంచో సీరియల్ వినబడుతోంది.
మావీధిలో చంద్రబాబు ఎల్యీడీ లైట్లు వాటి బాబులాంటి చంద్రుడి ముందు వెలతెలాబోతున్నాయి.
ఎవరైనా ఆపేస్తే బావుణ్ణు. లైన్‌మన్ ఎవరికైనా డబ్బిచ్చి ఫ్యూజ్ తీసెయ్యమంటే? లేదా రాయి విసిరేద్దామా?
పున్నమొస్తే చాలు..నాకిలాంటి పిచ్చాలోచనలే వస్తాయి.
పక్షపాతం అస్సలు లేని చంద్రుడికి పక్షాలెందుకో?
అసలలా చంద్రుడికి శాపమివ్వాలని ఎలా అనిపించిందోకదా?
అంత వెలుగునీ సూర్యుణ్ణించి తీసుకుని వేడిమొత్తం తగ్గించేసి మనకి చల్లని వెన్నెల్ని పంచే ఆ చందమామని చూస్తే మీకేఁవనిపిస్తుంది?
నాకైతే వేడివేడిపాలని చల్లారబెట్టి మనచేత ప్రేమగా తాగించిన అమ్మలా కనిపిస్తుంది!
వెన్నెలంటే అమ్మమనసులాంటిది. కష్టాల మబ్బేస్తే నీతో చెప్పదు. కనబడకుండా దాక్కుంటుంది.
ఆనందమొస్తే ఆకాశవీధిలో ఆనందపు విస్తళ్ళేసేసి మబ్బులకీ తారలకీ వెన్నెలవిందు చేస్తుంది.
ఆ సంతర్పణ మనందరికీ కన్నులపండగ!
పల్లెటూళ్ళలో చెరువుతో జతకలిసి నీ చెల్లెళ్ళ ఆటపాటల్ని చిత్రంగా చూస్తుంది.
మీయింటి డాబాలపై కొబ్బరాకుల నీడలలో చేరి ఒంటరిగా వున్న నీతో దోబూచులాడుతుంది
శ్రావణంలో శుభారంభంగా చిరుచలిని తోడు తెచ్చుకుంటుంది.
ఆషాఢాన విరహాగ్నికి ఆజ్యంపోస్తుంది.
భాద్రపదాన ఆ బాధ తొలగిస్తుంది.
ఆశ్వయుజాన దసరాల సరదాలన్నీ వెన్నెల్లో ఆటపాటలుగా మార్చేస్తుంది.
ఇక కార్తీక పున్నానికి అమ్మపెట్టే దీపాల్ని చూసి అసూయపడుతుంది.
మళ్ళీ అంతలోనే తనతప్పు తెలుసుకుని మరింత విర్రవీగే వెలుగుతో లోకాలన్నీ ఏకంచేసేస్తుంది.
గ్రహణాలకీ నీకేకష్టమూ రానివ్వదు. తనబాధేదో తనే పడుతుంది. కనీసం నీకు వేడైనా తగలనివ్వదు!
మరంతలా వినువీధిలో రాత్రంతా మనకోసం విహరించే వెన్నెలరేడు పక్షాలబారిన పడి నెలకొకసారే సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా కనబడితే ఇలాంటి ఆలోచనలే వస్తాయి.
అవును...
ప్రతి పున్నమికీ నాకు పిచ్చెక్కుతుంది.
...........జగదీష్ కొచ్చెర్లకోట

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive