"పాడిచ్చే గోవులకు పసుపూకుంకం
పనిచేసే బసవనికి పత్రీపుష్పం!"
సంక్రాంతి రోజుల్లో వీధిలో భోగిమంటా, రేడియోలో ఈపాటా, అమ్మచేతి పిండివంటా...ఇవన్నీ వ్యసనాలు! కోడిపందేలకన్నా ఎక్కువ వ్యసనాలు.
ఇంతకీ ఇంతలా మనల్ని ఆకట్టుకున్న పాట, తెలుగింట ప్రతి గడపకీ పూసిన పసుపు పూత....ఎవరి చలవ ఇదంతా?
అతను మనింట్లోకి తొంగిచూసే మావయ్యలాంటివాడు. మనం తినేతిండినీ, మాటాడే మాటనీ ప్రతి సినిమాలోనూ ప్రతిబింబించిన దర్పణంలాంటివాడు.
అతను వినిపించిన సిరిసిరిమువ్వల సవ్వడి ఇంకా మన లోగిళ్ళలో ఘల్లుమంటూనే వుంది. ఆయనారేసిన సిరివెన్నెల మన డాబాలమీదింకా పరుచుకునేవుంది.
చిత్రాల్లో కళకోసం తపనపడే వాళ్ళుంటారు. కళనే చిత్రాలుగా మలచిన ఆధునిక శిల్పి అతడు! సంగీతమొక కన్ను, నాట్యమింకో కన్ను. వినోదమే మూడోకన్నైన విశ్వనాథుడతడు! ఆచిత్రాలు అత్యంత విచిత్రాలు!
అక్కడ తల్లిచాటు బిడ్డలుంటారు. తండ్రికి భయపడుతూనే పక్కింటి పేదమ్మాయిని పెళ్ళాడతానని తెగెయ్యకుండానే చెప్పేసే కొడుకులుంటారు. ప్రేమించిన పిల్లకోసం అప్పడాలు, వడియాలు అమ్మిపెట్టే మంచబ్బాయిలుంటారు. ఎదిగిన పిల్లలు ఎగిరిపోయినా ఎనలేని ధైర్యంతో తన సంకల్పాన్ని నెరవేర్చుకునే తండ్రులుంటారు
ఆయన సంగీతానికి వెయిటిస్తారు. అందుకే....
వెయిటర్ చేతకూడా సంగీతం పాడిస్తారు.
శాస్త్రీయ సంగీతాన్ని హేళనచేస్తే తిట్టింది శంకరశాస్త్రి కాదు...విశ్వనాథుడే!
భరతనాట్యాన్ని భ్రష్టుపట్టిస్తే ఆ గణపతి ముందు తన ఆవేదనంతా వెళ్ళగక్కిందికూడా ఆయనే!
తల్లినో చెల్లినో అవమానించినట్టు తపనపడిపోయాడు..తల్లడిల్లిపోయాడు!
"నాప్రాణదీపమై నాలోన వెలిగే.....!" ఆతరవాత తెరలుతెరలుగా దగ్గు, పాడాలనివున్నా పాడలేకపోవడం, అదుగో....ఆక్షణం కోట్లాదిమందికి ఒళ్ళు గగుర్పొడిచేలా సుస్వరం వినవస్తుంది. శరీరమంతా ఏదో పులకింత కలిగి ఏడుపు తన్నుకొస్తుంది..ఇది ఏఒక్కసారో కాదు. చూసిన ప్రతిసారీ అలానే అనిపిస్తుంది.
" తపముని కిరణం తామస హరణం
శివుని నయన త్రయలాస్యం......!?!?" అద్భుతంగా నర్తిస్తున్న పాదాలు అచేతనం. ఒక్కసారిగా నిశ్శబ్దం!
.................
చలనంలేని తల్లి శరీరం, చెమర్చడమే మరచిన కన్నులద్వయం.....!
ఒక్కసారిగా "ధిరనధిరననన తకిటతకిటధిమి"
అని విన్నంతనే ఎవరూచూడకుండా ఎక్కెక్కి ఏడ్చేవాళ్ళు ఇప్పటికీ వుంటారు.
ఇది నిజం. తల్లిపాలంతటి నిజం. కల్మషం, కల్తీలేని ఈదృశ్యాలు కళామతల్లి కిరీటంలో పచ్చలూ కెంపులూ!
కళనేకాదు. కళాకారుణ్ణీ గుర్తించాలనే ఈయన 'వేదాంతం' కావాలి ప్రతివారికీ సిద్ధాంతం.
బుర్రకథలు, హరికథలు, కోలాటాలు, తప్పెటగుళ్ళు కనబడతాయి మనకిక్కడ!
గంగిరెద్దుల్ని తిప్పేవాళ్ళచుట్టూ కథంతా తిప్పిన ఘనత ఈకాశీనాధుని విశ్వనాథుడిది!
యాయవారాలు, జోలెపట్టి సంగీతార్చన చెయ్యడాలు.....ఒకటేమిటి, మన సంస్కృతీ సంప్రదాయాల్ని తెరనిండుగా ఆవిష్కరించిన నిజమైన నిర్దేశకుడితడు.
అన్నవరం గుర్తొచ్చినపుడల్లా సత్యనారాయణ స్వామి ప్రసాదం రుచి, శంకరాభరణం తీసిన వీరి అభిరుచి గుర్తొచ్చి తీరతాయి.
నలుగుర్లోకీ బయటికెళ్ళినపుడు మంచి బట్టలేసుకుంటాం.
నలుగురం ఇంట్లోవున్నప్పుడు మంచి సినిమాలేసుకుంటాం.
.......ఇదిగో, ఇతనివే ఆసినిమాలు!
"ఎవరెంతచేసుకుంటే అంతేకాదా దక్కేదీ!" అని ఆరుద్రగారన్నారు నిజమేగానీ.....మనం తక్కువ పుణ్యం చేసుకునీ ఎక్కువ ఫలితం పొందేస్తున్నామనిపిస్తుంది ఇలాంటి సినిమాలు చూస్తే!
ఎనభయ్యేడేళ్ళ క్రితం ఇలకేతెంచిన ఈవజ్రం
ఎనలేని కీర్తిపతాకలనే ఎగరేసింది.
ఎవరైనా ఎవరితడని అడిగితే గర్వంగా చెప్పండి..."అది మనవూరి కోయిలమ్మ!" అని!
విశ్వనాథార్పణం!
.........జగదీష్ కొచ్చెర్లకోట
0 comments:
Post a Comment