Latest Posts

Content

Thursday, April 6, 2017

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ...


ఒద్దికగా ఒడిదుడుకుల్లేకుండా సాగిపోతోంది కారు. మారుతీ కంపెనీ సాంకేతికతో, మునిసిపాలిటీ వారి నియమబద్ధతో...రోడ్డు మాత్రం సతీ సుమతి చెల్లెల్లా కారుకేమాత్రం కష్టంరాకుండా చూసుకుంటోంది.

సాగరతీరం...సూర్యోదయ సమయం. ఇంకా రావడానికి మొహమాటపడుతున్న సూర్యుడు మొదటిరోజు క్లాస్‌రూములోకి భయంభయంగా అడుగుపెట్టే విద్యార్ధిలా అనిపిస్తున్నాడు. 

సాగరజల హృదయతలంపై సువర్ణపురాశి పోసినట్టుంది
ప్రసవించే పసిబాలుడికై పసుపువన్నె పక్కపరిచినట్టుంది

ఆలోచనలూ, కారూ రెండూ అరవైలో పరుగెడుతున్నాయి. ప్రభాకరుణ్ణి చూస్తే ప్రతిరోజూ ‘కొత్తా దేవుడండీ!' అని పాడుకోవలసిందే! 

మరి విశ్వానికి నిత్యనూతనమే కదా ప్రతిదినం ప్రభాతసమయం!

ఈ పువ్వు పుట్టినవెంటనే పరిమళిస్తుంది. 
పూర్తిగా వికసించిన సూర్యకాంత పుష్పాన్ని చూసి ఆర్తిగా తిలకిస్తుంది పచ్చిబాలింత..తూరుపుకాంత!

ప్రచండమైన వింతకాంతితో పరుగెత్తి పశ్చిమానికి పారిపోయే పండంటిబిడ్డను పరవశంగానే చూస్తుంది. 

సాయంకాలమైనా ఎంతకూ తిరిగిరాని కుమారుడికోసం రోదించిన ఆతల్లి  కన్నీట తడిసిన నీలాంబరపు చీరతో చలనితల్లిగా మారుతుంది! 

మబ్బులన్నీ చుట్టూచేరి ఊరడించాలని చూస్తాయి.

అటువైపు మారుతల్లి ఇంటిముంగిట వింతపోకడలు పోతున్న బిడ్డను చూసి యశోదలా ఎదురుచూస్తుంది.

కన్నతల్లి హృదయం ఎంత ఆశావహం! మరోరోజు కోసం, మంచికాలం కోసం మధురంగా ఆలోచిస్తూ నిదురపోతుంది.

మళ్ళీ తెలతెలవారుతూండగా కష్టాన్ని మరిచి, కలతనిదుర లేచి, కమ్మటి కలల్ని తలచి, కన్నకొడుకు తిరిగొచ్చాడేమోనని కళ్ళునులుముకుని కిటికీలు తెరుస్తుంది.

అతడికది ఆట! ఆ తల్లికతడు మురిపాల మూట! 

ఆశావహ దృక్పథానికి నిత్యజీవితాన నిజరూప నిదర్శనం సూర్య వృత్తాంతం! 

రేపటికోసం ఎదురుచూడండి. 
ఈరోజు కష్టాన్ని మరువండి.
ఆత్మహత్యల్ని హత్యచెయ్యండి.

ఆశాజీవులుగా అందమైన లోకంలో విహరించండి.

ఇక్కడ...

పరవశాల పసిపాపల నవ్వులున్నాయి
పలు పరిమళాలతో పువ్వులున్నాయి

నీకోసం ఎదురుచూసే కన్నులున్నాయి
నిండైన పున్నముల వెన్నెలలున్నాయి

పచ్చదనాన్ని చుట్టుకున్న ప్రకృతుంది
వెచ్చదనాల అమ్మ ఒడికూడా వుంది

ఎన్నో లక్షల జాలి గుండెలున్నాయి
ఎవరినైనా జోలపుచ్చే పాటలున్నాయి

నీ జీవితం నీ సొంతమేంకాదు. నీతోపాటూ నీడగా నిండైన మనసులూ వుంటాయి. 

నిరూపించుకోలేని నిరాశలో నిరర్ధకమని నీకునువ్వే నిర్ధారించుకుంటావు!

అందమైన రేపటికోసం ఆశాలతల సాంగత్యంలో అల్లుకో జీవితాన్ని!

ఆలంబనకోసం అర్రులుచాస్తే అడుగడుగునా అందుతాయి అవకాశాలు!

శుభోదయం!                     
                               
                    .............జగదీష్ కొచ్చెర్లకోట 


 

3 comments:

  1. అమ్మ,నాన్న ,అక్క,చెల్లి,అన్న,తమ్ముడు,స్నేహితుడు ఇలాంటి అనురాగ బంధాలు ఎన్నో

    వెండి వెలుగుల భాస్కరుడు , నిండు పున్నమి చంద్రుడు ,ఎగసి పడే అలలు , గలగల పారే నదులు ,జల జల జారే జలపాతం ఇలాంటి ప్రకృతి అందాలు ఎన్నో

    ఆవకాయ ఆప్యాయత, గోంగూర మమకారం , ముద్ద పప్పు ముద్దు , సాంబార్ సంబరం, గడ్డ పెరుగు చల్లదనం ఇలాంటి ఎన్నో రుచికరమైన రుచులు

    కృష్ణ శాస్త్రి ఊర్వశి ,శ్రీశ్రీ మహాప్రస్థానం ,సినారే విశ్వంభర,కరుణశ్రీ పుష్ప విలాపం ఇలాంటి ఎన్నో కావ్య కన్నియలు

    త్యాగయ్య కీర్తనలు,సుబ్బులక్ష్మి అమ్మ సుప్రభాతం , మంగళంపల్లి వారి తత్వాలు, బాలు గారి శివాష్టకం
    ఇలాంటివి ఎన్నో స్వర ఝరులు

    మనసును తేలిక పరిచే అన్నయ రచనలు ,తెలియంది వెతుక్కోడానికి గూగుల్ .


    ఇన్ని ఉన్న జీవితం ఒంటరి ఎలా అవగలదు ,

    జీవితపు దారిలో
    ఆశల గుర్రముపై పరిగెడుతూ
    నిరాశల ముళ్ళని ఏరేస్తూ
    ఉత్సాహముతో ముందుకు సాగిపోదాం

    ReplyDelete
  2. Woooooooooowwwwwwwwww.... Verymuch happy to know that u hv startd a blog..😍😍
    చాలా బాగుందన్నయ్యా.. అద్భుతః😍

    ReplyDelete
  3. World health day - antti depression - sandarbhamga mee rachana excellent.

    ReplyDelete

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive