Latest Posts

Content

Sunday, November 18, 2018

ఉద్యోగంలో ఉద్వేగం

కేసేదైనా వుంటే సరే! లేకపోతే తెల్లారే లేవడమనేది కల్ల. బద్ధకం పుట్టిన నక్షత్రంలోనే పుట్టుంటాను. అందునా అబ్దుల్ కలాంగారంటే అభిమానముండడం మూలాన ‘కలలు కనడం మానకూడద'ని తెల్లారగట్ట పడుకోవడం, ఆరకంగా ఐసిఐసిఐ బేంకు సాయంలేకుండానే వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం చెయ్యడం అలవాటైపోయాయి. ఆలస్యంగా నిద్రలేవడం గురించి ఎవరూ చెప్పినట్టు వినలేదు. ఎంతసేపూ తెల్లారేలేవడం వలన ఉపయోగాలు చెప్పడంలోనే తెల్లారిపోయింది. “.....సూర్యోదయందాటి నిద్రించువాడు జన్మరాహిత్యంలేక బాధలుపడతాడు!" టీవీలో ఠీవిగా కూర్చుని ప్రవచిస్తున్న ఓస్వామీజీ మాటలకి ఉలిక్కిపడి లేచాను. ఈజన్మ ఇలా వెలిగిపోతోంది...ఇక మరో ఆరుజన్మలు కూడానా? ‘అమ్మో ఎనిమిదీ!' అనుకుంటూ లేచి గబగబా ఫేస్బుక్కూ, వాట్సప్పూ చూసుకుని, ఆతరవాత అరచేతిలో ‘శ్రీరామ' చుట్టుకుని, మంచం దిగాను. హాల్లోకెళ్ళి పేపరు తీసాను. అదేంటో తాజావార్తలన్నీ పాచిమొహంతోనే చదవాలనిపిస్తుంది. ఎన్నో విషయాల్లో కాంప్రమైజైన మేమిద్దరం ఈవిషయంలోమాత్రం ఇంకా పాకిస్తాన్, హిందుస్తానే! వాళ్ళ మేప్ లో కాశ్మీర్ని చూస్తే వచ్చేంత కోపమొస్తుంది మావిడకి నాచేతిలో పేపర్ చూస్తే! బస్సూలారీ ఢీ, ఓటుకు నోటు రూఢీ, రాష్ట్రమంతా వేడి, విదేశాల్లో మోడీ! గొడ్డుమాంసం తిన్నాడని దాడి! హేఁవిటో...దేశాన్ని దోచుకుతిన్న బ్రీఫ్ కేసుల్ని వదిలేసి బీఫ్ కేసుల్ని పట్టుకు వేలాడుతున్నారు. లోకల్ ఎడిషన్లో ఏముందో? “అధికారముందికదా అని మాపై ‘కక్ష్య' సాధింపు చర్యలు చేపడుతున్న ఎమ్మెల్యేని బర్తరఫ్ చెయ్యాలి." కక్ష్యేమిట్రా! నీయ....వద్దులే! బూతులొచ్చేస్తున్నాయి. సినిమా పేజీమొత్తం నిలువుగా చిన్న నిక్కరేసుకుని జాన్సన్ బేబీలా నిలబడ్డ అమీ జాక్సననే అమ్మిని తిట్టుకుని, పిల్లలు చూడకుండా ఆపేజీని దాచేసాను. ఆ పేపరాయన గురించి ‘ఎంతటి రసికుడవో తెలిసెరా!' అని పాడుకుంటూ బాత్రూంలో దూరాను. గబగబా స్నానాదికాలు కానిచ్చేసాను. ఒక్క అంగలో పూజగదిలో దూరి రెండుచేతులూ జోడించి మూడునిమిషాలు కళ్ళుమూసుకుని నాలుగు శ్లోకాలు చదివేసుకుని అయిదునిమిషాల్లో బయటకొచ్చేశాను ఆరిడ్లీలు ఆవిరిమీదే ఆవురావురనిపించేశాను ఏడుకేసులున్నాయి ఇవాళ.. ఎనిమిది దాటిపోయింది అప్పుడే తొమ్మిదికల్లా బయోమెట్రిక్ ఫింగర్ పడాలిట పదికాలాలు ఉద్యోగం చెయ్యాలంటే ఈ పరుగులు తప్పవు! మన జీవితంతో ఎంతలా ముడిపడివుంటుందో....పొద్దున్న లేచింది మొదలు...బ్రష్షు, పేస్టు, సబ్బు దగ్గర్నుంచి షాంపూ, పౌడర్, బనియన్ దాకా! కారూ, దాని టైరూ దగ్గర్నుంచి ఉప్పూ ఉప్మారవ్వదాకా!..... ఏంటనుకుంటున్నారు? టాటా కంపెనీయండి బాబూ! వాడిదీ యాపారఁవంటే! మన్లాక్కాదు. తినేవీ తాగేవే కాదు..తొడుక్కునేవీ, కడుక్కునేవీ కూడా తయారుచేసేస్తాడు. సిగరెట్లూ, కేన్సర్ మందులూ కూడా తయారుచేసే తెలివి వాడిది...... ‘మందూ' మజ్జిగా ఒకడే ఇచ్చినట్టు! సరేసరే...టాటాగురించి ఆలోచిస్తూ మావిడకి టాటాచెప్పకుండా వచ్చేసానన్న విషయం మర్చిపోయాను. బండి సర్వీసింగ్ చేయించాలి!’ అని రోజూలాగే అవాళకూడా అనుకుని కిక్కొట్టాను. స్టార్టవ్వకపోతే చోక్ ‘లాగిపెట్టి ఒకటి’ తంతే అప్పుడు స్టార్టయింది. నాబండి హారన్ కి నేనే ఉలిక్కిపడ్డాను. నిన్నటిదాకా బాలమురళి పాటలా బానేవుండేది..ఇప్పుడెందుకో బాలీసాగూలా బెక్కుతోంది. హాస్పిటల్ దగ్గర బయటపెడితే ఇదే బాధ! ఎవడో కెలికాడు. మావూళ్ళో హారనుంటేనే రోడ్డుమీద ఎవడూ తప్పుకోడు. అలాంటిది హారన్ లేకపోతే డైరెక్టుగా పోలీస్టేషనుకెళిపోడం బెటర్! ఎలాగూ మధ్యలో ఎవడితోనో గొడవయ్యే తీరుతుంది. మొత్తానికి మొహమాటంగా మోగుతున్న హారన్ తో మొండిగా బయటికొచ్చేశాను. మావీధి మొదట్లోనే రింగ్‌రోడ్. ఎంచక్కా రోడ్డుకడ్డంగా అన్ని ఫార్మస్యూటికల్ కంపెనీల బస్సులూ ఆపించుకుని ఎంప్లాయిస్ అందరూ దిగి ఒకరితోఒకరు షేక్‌హేండిచ్చుకుని కబుర్లుచెప్పుకుంటూ తాపీగా వెళుతున్నారు. స్కూలుకి పిల్లల్ని బళ్ళమీద వాళ్ళ అమ్మో, నాన్నో మరింత ఎంచక్కా ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకెళుతున్నారు. భావిభారత పౌరులకి ఉగ్గుపాలతోనే అక్రమమార్గాన పయనించడం నేర్పుతున్న వారి బుద్ధికుశలతకి జోహార్లు అర్పించుకుంటూ అక్కడే ఉండిపోయాను....ఆ ఘోరాలు చూళ్ళేక కళ్ళు మూసుకుంటే డ్రైవింగ్‌ చెయ్యడం కష్టమని! మొత్తానికి ఒక పావుగంట వేచియుండగా ఫోన్ మోగింది. “సార్! ఎక్కడున్నారు? మూడుకేసులున్నాయి!” అంటే..ఆ ఏడూ కాకుండా ఇవి మూడు! “ఇక్కడే, హాస్పిటల్ ముందు బండాపుతున్నాను!” అని ఓచిన్న అబద్ధమాడి బయల్దేరాను. ఆరుగురు కుర్రాళ్ళు ‘హ్యాపీడేస్’ సినిమాలోలా ఒకరి భుజాలమీద ఇంకొకరు చేతులేసుకుని రోడ్డంతా నడుస్తున్నారు. మన బాలీసాగూ వాళ్ళనేఁవీ చెయ్యలేకపోయాడు. ఎంత గాఠ్ఠిగా కొట్టినా తప్పుకోరే? ఆఖరికి ‘రాస్కెల్!’ అని అనుకుంటూ ఒకడిని రాస్కెళిపోయాను! “హలో మాస్టారూ! ఏటది?” “నేను హారన్ కొడుతూనే వున్నా తమ్ముడూ!” నాగొంతులో అభ్యర్ధన, ప్రార్ధన, నాబొంద..అన్నీవున్నాయి. మొత్తం అందర్నీ కొరడాతో కొట్టెయ్యాలన్నంత కసిగావున్నా కోమలంగా నవ్వుతూనే చెప్పాను. “ఆఁ! తప్పుకోపోతే? గుద్దేస్తారా?” అలాంటి ప్రశ్నకి విక్రమార్కుడు కూడా సమాధానం చెప్పలేడు. ‘తగువేళరా..తగువేలరా....!’ అంటూ చిత్ర గొంతు పక్కనే వున్న సెలూన్లో ఎఫ్.ఎమ్. రేడియోలోంచి వినబడుతోంది. అంచేత ఏ గొడవా పెట్టుకోకుండా లొకేషన్ ఖాళీచేస్సాను. సూర్య ఐపీఎస్సనుకుంటా ఆపాట! ఇళయరాజా! మహానుభావుడు!! అనుకుంటూ మళ్ళీ చోక్ లాగి, ‘ప్లీజ్ ప్లీజ’ని బతిమాలినా బండిమాత్రం స్టార్ట్ అవ్వలేదు! వెనకనించి ఆ కుర్రాళ్ళలో ఒకడు కాజల్ కీ రకుల్ ప్రీత్ కీ గల తేడాల్ని టేబ్యులార్ ఫామ్ వేసి చెబుతున్నాడు. ఇంకొకడెవడో నాదగ్గరకొచ్చి “ఏటంకుల్? స్టార్టవ్వట్లేదా? తప్పుకోండి!” అని చొరవగా ప్రయత్నం చేశాడు. మొత్తానికి స్టార్ట్ అయింది. వాళ్ళని గుద్దేసినా సాయంచేశారని ఆనందంతో కళ్ళు చెమర్చాయి. చిన్నప్పుడు చదువుకున్న ‘అపకారికినుపకారము’ పద్యం చదువుకుందాఁవని మొదలెట్టానో లేదో ‘నన్ను అమ్మవారిగుడి దగ్గర దింపీండంకుల్!’ అని నాకన్నా ముందే బండెక్కి కూర్చున్నాడు. ‘ఆగిపోయె బండా..నీకు లిఫ్టులెందుకే?’ అని పాడుకుంటూ ఆ కుర్రాడితో కలిసి బయల్దేరాను. శంకరమఠం రోడ్డంతా బ్లాకయిపోయింది. లోపల పెళ్ళికొడుకు తాళికట్టేస్తున్నట్టున్నాడు. బ్యాండుమేళంవాళ్ళు కిర్రెక్కించేలా ‘సీతమ్మ పెళ్ళికూతురాయెనే! మన రామయ్య పనైపోయెనే....’ అంటూ స్పీడుగా వాయించేస్తున్నారు. రోడ్డుకి ఆవైపంతా ఆడపెళ్ళివారి ఇన్నోవాలు, ఈవైపంతా మగపెళ్ళివారి టవేరాలు...మధ్యలో హోండా యాక్టివాలు, సుజుకీ పాసివాలు! మళ్ళీ ఆగాను. హారన్ ఇప్పుడు చాలాబాగా మోగుతోంది. కానీ బ్యాండువాళ్ళు ఏ శబ్దమూ వినబడనివ్వట్లేదు. మొత్తానికి తాళికట్టడం అయ్యాకనే ట్రాఫిక్ క్లియరైంది. ‘తాళికట్టకముందు మేఁవిరుక్కున్నాం, కట్టాక పెళ్ళకొడుకిరుక్కున్నాడు!’ అంతే! అన్నమాట ప్రకారం అమ్మవారి గుడిదగ్గర బండి రన్నింగ్ లో వుండగానే దిగిపోయాడు ఆకుర్రాడు. ఆ వయసులో అలా దిగాలని చాలాసార్లు ప్రయత్నం చేసి దెబ్బలుతిన్న విషయం గుర్తొచ్చి నవ్వొచ్చింది. వాడిచ్చిన థాంక్స్ మోసుకుంటూ ముందుకుసాగిపోయాను. ‘శ్రీదత్త దిగంబర న్యూడుల్స్’ బండి దగ్గర పైన షర్టేసుకోకుండా ‘న్యూడు’ల్స్ చేస్తున్నాడొకడు. యూతంతా అవి షర్ట్ మీద పడకుండా తినడం ప్రాక్టీస్ చేస్తున్నారు. వాటిని నూడుల్సనాలో, న్యూడుల్సనాలో ‘ఆక్స్‌ఫర్డ్’ డిక్షనరీలో చూడాలని చాన్నాళ్ళుగా అనుకుంటున్నాను. కుదరట్లా! తీరా మా హాస్పిటల్‌కి వచ్చేటప్పటికి దారిపొడుగునా బ్లీచింగ్ పౌడరేసేసి హడావుడిగా వుంది. ఎప్పుడూ అడ్డదిడ్డంగా ఆపే ఆటోలు కూడా చక్కహా లైన్లో పెట్టివున్నాయి. ‘మాతాశిశు సంక్షేమ ఆసుపత్రి'.... కొత్తగా పెట్టిన బోర్డు మెరుస్తోంది. బండెక్కడ పెట్టాలి.....? పోర్టికోలో పెడితే లైట్లూ, బ్లింకర్లూ, హారన్లూ ఆరారా వేయించుకోవాల్సొస్తోంది. చెట్టుకింద పెడితే...? మొన్నెవరో ఒకావిడ రెండేళ్ళపిల్లకి నాబండిమీద కూర్చోబెట్టి అన్నం పెడుతోంది. ఆవిణ్ణి నాలుగు దులిపి, అదంతా దులుపుకుని రావల్సొచ్చింది. మాతాశిశు సంక్షేమమే తప్ప మాసంక్షేమం పట్టదెవరికీ! “సర్! పార్కింగ్ లేదని పదేళ్ళుగా చెప్తున్నా ఫలితం లేద్సార్" అని చిన్నకోరిక విన్నవించుకోగానే.. “పేషెంట్కి ఏదేనడ్గండి! ఇస్తం. మీకూ ఫెస్లిటీ అడ్గొద్దు" అన్న మంత్రిగారి మాటలు......మాచెవులు రింగుమని మారుమ్రోగేదాక తలుచుకుంటూనేవుంటాం! మా సెక్యూరిటీ గార్డొకడు నన్ను చూస్తే సి.ఎమ్. వచ్చినంత హంగామా చేస్తాడు. ఒక రెండుకిలోమీటర్ల దారంతా క్లియర్ చేసేస్తాడు. ‘డాట్రగారొస్తన్నారు..తప్పుకోండి తప్పుకోండి!’ అని కర్రతో వీరంగం ఎత్తేస్తాడు. రోజూ అదేతంతు. నాకైతే సిగ్గుగా అనిపిస్తుంది అలా అందరిమధ్యనుంచీ బాషాలా వెళుతోంటే! ఎవరో మినిస్టరొస్తున్నార్ట! అదీ విషయం. మొత్తం నర్సులు, ఏ.ఎన్.ఎమ్ లూ, తెల్లటిబట్టల్లో మెరిసిపోతున్నారు. డాట్రమ్మలందరూ ఇంతపొడుగు ఏప్రాన్లేసేసుకుని ఎడాపెడా తిరిగేస్తున్నారు. “గుడ్మార్నింగ్సార్! ఇవాళేటి..ఎర్లీగా వచ్చీసారు?" ఒక సిస్టర్ ఆత్మీయత! “నమస్తె బాఁవూ!" ఒక దోభీ విధేయత! మేడెక్కి ఒకరూమ్‌దగ్గర ఆగి మళ్ళీ వెనక్కెళిపోతోంటే దాసుగాడడిగాడు..‘సార్! ఎక్కడికి?’ అని! అప్పుడర్ధమైంది అది మా రూమేనని! తె..........ల్లటి దుప్పటి, తెల్లకర్టెన్లు, పువ్వుల్తో గాజుసీసాలు! శోభనంగదుల్లా తయారుచేసారు మొత్తం అన్నిగదుల్నీ! ఘుమఘుమలాడే అగరుపొగల మధ్యనుంచి ధుమధుమలాడుతూ హెడ్ సిస్టరొచ్చింది. ‘ఏట్సార్! మనుషుల్లేకుండా మొత్తఁవన్నీ సర్దించీమంటారు! ఎలగవుతాద్సార్? మీరు సీనియర్ కదా మీరు చెప్పండి!’ ఆవిడిచ్చిన గౌరవానికి కళ్ళలోంచి నీళ్ళొచ్చాయిగానీ నోట్లోంచి మాటరాలేదు. ఎంచేతంటే సీసీ కెమేరాలున్నాయి! మనఁవేం మాటాడినా అప్పడతప్పడ తాండ్రయిపోతుంది తరవాత! ఆర్టాఫ్ లివింగ్ రవిశంకర్లా నవ్వుతూ కుర్చీలో చేరాను. ఆవిడ మాత్రం యూదుల్ని చూసినంత కోపంగా చూస్తోంది నావైపు! మంత్రులొచ్చి వాగ్దానాలు, అభిమానులొచ్చి రక్తదానాలు చేస్తూనే వుంటారు. మనకి మాత్రం శ్రమదానం తప్పదుగా? అందుకే పనిలో పడ్డాను. ఏమున్నది గర్వకారణం? మా రూము దృశ్యం సైతం నరపీడన పరాయణత్వం ఇరుగ్గావున్న డెస్కూ మురిగ్గావున్న ఫ్లాస్కు! అరిటాకుల్లా చిరిగిపోయిన ఆకుపచ్చ బట్టలు, తమలపాకుల్లా అరిగిపోయిన హవాయి చెప్పులు! అంతవరకే నేను! అవేసుకోగానే నారూపం, నామనస్సు, నాభాష, నాటెంపర్మెంటు, టెంపరేచరు....అన్నీ మారిపోతాయి! ఇప్పుడు నేనో కొత్త నేను! ఆపరేషన్లవుతున్నంతసేపూ ఆ పరేషాన్లేవీ గుర్తుకురావు. నిరంతరం “నిరంతరమూ వసంతములే" అంటూ బ్లూటూత్ స్పీకర్లో ఇళయరాజా మోగుతూవుంటాడు. తిరగని ఫేను, దొరకని వెయినూ కామను. పల్సాక్సీమీటర్ అలారాలు, పదకొండింటికి ఫలారాలు, లేడీ డాక్టర్లతో వాడిగా భేటీ, మళ్ళీ వాళ్ళతోనే వేడిగా టీ! అలుపెరుగని శ్రామికుల్లా, అణిగివున్న కార్మికుల్లా అందరంకలిసి ఎందరికో శస్త్రచికిత్సలు చేసేస్తుంటాం! మత్తివ్వడం వెన్నతోపెట్టిన విద్యకాకపోయినా లక్షలాదిమందికి నెప్పంటే తెలీకుండా పదిహేడేళ్ళుగా పురుళ్ళుపోసాం! అనేకమంది చిన్నారుల చిట్టిప్రాణాలు గాల్లోకలిసిపోకుండా ఎల్లైసీ సింబల్లా చేతులడ్డం పెట్టాం! జన్మనిచ్చామని కొందరంటే జనాభా పెంచుతున్నామనేవాళ్ళూ వున్నారు! మధ్యాహ్నందాకా మంత్రిగారొస్తారొస్తారొస్తారని చూసి చూసి ఇళ్ళకి బయల్దేరిపోయాం. మంత్రిగారు రాలేదుగానీ అన్నాలు తినకపోవడం వల్ల తలనొప్పొచ్చింది మావాళ్ళకి! జీతంలేకపోతే జీవితంలేదు.... ఉద్వేగంలేని ఉద్యోగమూలేదు! .........జగదీశ్ కొచ్చెర్లకోట

0 comments:

Post a Comment

Featured Post

అందాల నెలరాజు

నెలనెలా... చంద్రుణ్ణోసారి పలకరించడం.. చల్లదనానికి  పులకరించడం.. అంబరాన సంబరాలు చేసుకునే అందాల నెలరాజుకి నాదైన భావావేశంతో జత బట్...

Search

Popular Posts

Archive